మైలవరం, ఫిబ్రవరి 22: మేకల కాపలాకు వెళ్లి అక్కడ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. మైలవరం మండలంలోని కొత్తమంగాపురం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన నక్కనబోయిన శ్రీనివాసరావు (19), నక్కనబోయిన గంగాప్రసాద్ (14) అన్నదమ్ముల పిల్లలు. కొంతకాలంగా ఇద్దరూ కలిసి ప్రతిరోజూ మేకలను తోలుకుని పొలాలకు వెళుతున్నారు. శుక్రవారం కూడా వీరు పొలానికి మేకలు తో లుకెళ్లి సాయంత్రం 3గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న వెలమవాని చెరువులో ఈత నేర్చుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు దిగారు. చెరువులో నీరు తక్కువగానే ఉందనే ధైర్యంతో దిగినప్పటికీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇటీవల అదే చెరువులో గోతులు తవ్వారు. ఈవిషయం తెలియని ఈ బాలురు గోతులలో పడిపోయారు. అందులో నీరు ఎక్కువగా ఉండటం, ఇద్దరికీ ఈత రాకపోవటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బాలుర తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని కన్నీరు, మున్నీరయ్యారు. కాగా సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా తహశీల్దార్ జి వరహాలయ్య సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి వివారాలు సేకరించారు. బాలుర మృతి వార్త తెలిసిన గ్రామం యావత్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
మేకల కాపలాకు వెళ్లి అక్కడ ఈత కొట్టేందుకు చెరువులోకి
english title:
two boys drown
Date:
Saturday, February 23, 2013