పెడన, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సహకార సంఘం (ఆప్కో) ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బందరులోని చేనేత జౌళిశాఖ కార్యాలయంలో పోలింగ్ జరగనుంది. జిల్లా నుంచి ఒక్క డైరెక్టర్ పదవి కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. గూడూరు మండలం రాయవరం నుంచి మునగాల నరసింహారావు, పెడన నుంచి పృధ్వీ శంకరరావు నువ్వా.. నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. నరసింహారావును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుండగా శంకరరావును టిడిపి బరిలోకి దించింది. కాంగ్రెస్ విజయం కోసం పెడనకు చెందిన జిల్లా చేనేత సంఘాల సమాఖ్య కన్వీనర్ బళ్ళ గంగాధరరావు, టిడిపి విజయం కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికకు కూడా ఒక అభ్యర్థి తరపున విజయవాడలో శిబిరం నిర్వహించినట్లు తెలిసింది. ఈ నెల 25న హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని చేనేత జౌళిశాఖ జేడీ గంటి బాబూరావు తెలిపారు.
భక్తి, రక్తిని కలిగించిన నాట్య కళోత్సవం
కూచిపూడి, ఫిబ్రవరి 22: నాట్యక్షేత్రం కూచిపూడి అగ్రహారంలో కూచిపూడి యువ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళోత్సవం రెండోరోజైన శుక్రవారం కళాకారులు ప్రదర్శించిన నృత్యాంశాలు, భక్తప్రహ్లాద యక్షగానం ప్రేక్షకులకు రక్తిని, ముక్తిని కలిగించాయి. ముందుగా మద్రాసుకు చెందిన పసుమర్తి నాగమోహినీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ విరచిత జేంజేం తనన అంటూ గణపతి కౌత్వంను ఆరభి రాగం గౌళ తాళంలో ప్రదర్శించింది. అన్నమాచార్య విరచిత అలిమేలుమంగ.. హరి అంతరంగ అంటూ వెంకటేశ్వరస్వామిని కొలుస్తూ నృత్య ప్రదర్శన ఇచ్చింది. బెంగుళూరుకు చెందిన శమా కృష్ణ కెంపగౌడ రచించిన గంగాగౌరి విలాసంలోని ప్రవేశ దరువుగా శంకరుని చూపరే.. మీనాంకునే చూడరే అంటూ శంకరుని భక్త్భివంతో ప్రదర్శించారు. విప్రనారాయణలోని దేవదేవి ప్రవేశ దరువుగా వెడలెనే వయ్యారులు, వెలనాటి వారు అంటూ ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన పసుమర్తి కృష్ణశర్మ మనుమరాలు శేషబాబు కుమార్తె సాయి దీపిక మచ్చరమున మది అంబుదిలోన.. మత్స్యావతార అనే దశావతారాలను రాగమాలిక రాగం ఆదితాళంలో ప్రదర్శించింది. బొక్కా కుమారస్వామి రచించిన కేదార గౌళ థిల్లానాను పివిజి కోరియోగ్రఫీలో ప్రదర్శించింది. చివరి అంశంగా సామవేదం షణ్ముగశర్మ రచించిన చిదంబర రహస్యంలోని శివకామ సుందరీ.. చిదంబర వాహినీ అంటూ చిదంబరేశ్వరుని స్తుతిస్తూ ప్రదర్శించారు. అమెరికాకు చెందిన వేదాంతం వెంకట రామ రాఘవయ్య నృత్యాన్ని సమకూర్చిన భక్తప్రహ్లాద సంక్షిప్త ప్రదర్శనలో కనక కస్యపుడను.. ధనుజేంద్రుడు.. ఘనత చూడ తనదు సభకు వచ్చెన్ అంటూ వెంకట రాఘవయ్య హిరణ్యకశపుడిగా చూపిన హావభావాలు, శౌర్యం ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించాయి. ఈ యక్షగానంలో లీలావతిగా సీతాలక్ష్మి, ప్రహ్లాదుడిగా జి వైష్ణవి, దవ్వారికుడిగా పసుమర్తి మృత్యుంజయ శర్మ, మంత్రిగా తాడేపల్లి సాయికృష్ణ, నరసింహస్వామిగా వెంపటి సత్యవరప్రసాద్ ఆయా పాత్రల్లో జీవించి ప్రాణం పోశారు. కార్యక్రమానికి డిఎస్‌వి శాస్ర్తీ గాత్రం, చింతా రవి బాలకృష్ణ నట్టవాంగం, అనిల్‌కుమార్ వయోలిన్, రాజగోపాల్ మృదంగంతో రక్తికట్టించారు. కళాకారులను, అతిథులను, నాట్యాచార్యులను తాడేపల్లి సత్యనారాయణ శర్మ దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌కు చెందిన పసుమర్తి శేషుబాబు, బెంగుళూరుకు చెందిన లక్ష్మీ రాజామణి, ముంబైకి చెందిన రాజ్యలక్ష్మిని ఘనంగా సత్కరించారు.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి
మచిలీపట్నం , ఫిబ్రవరి 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కాంగ్రెస్ నాయకులు వాలిశెట్టి మల్లి, పివి ఫణికుమార్ కోరారు. శుక్రవారం స్థానిక రామానాయుడుపేటలో సమావేశం నిర్వహించి హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేసి కొంతసేపు వౌనం పాటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ళు దురదృష్టకరమని, ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. న్యాయస్థానంలో విధించిన శిక్షలను ప్రభుత్వాలు ఆసల్యం చేయకుండా వెంటనే అమలు చేస్తే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నందు, థమ్సప్ మూర్తి, శరత్, సంపత్, పాండు, షేక్ బక్షు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
ఉగ్రవాదులు బాంబు దాడులతో 20మందిని పొట్టనపెట్టుకుని, 60మందికి తీవ్ర గాయాలపాలు చేసిన సంఘటనను నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను స్థానిక కోనేరుసెంటరులో బిజెపి ఆధ్వర్యాన గురువారం దగ్ధం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని అణచలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర రాజధాని ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నారు. జిల్లా నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, పంతం గజేంద్రరావు, కంబాల శంకర్‌బాబు, అధ్యక్షులు వైవిఆర్ పాండురంగారావు, మురాల నాగేంద్రం, ఉడత్తు శ్రీనివాసరావు, మోపిదేవి సుబ్బారావు, కొల్లిపర యుగంధర్, నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్, చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, వనె్నంరెడ్డి నాగరాజు పాల్గొన్నారు.
బార్, టిడిపి లీగల్ సెల్ ఖండన
మచిలీపట్నం : హైదరాబాద్‌లో జరిగిన ఉగ్రవాదుల బాంబు దాడులను పట్టణ న్యాయవాదులు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మండల దుర్గాప్రసాద్, కంచర్లపల్లి దేవేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ దాడులు దేశ ప్రజలను దుఃఖ సాగరంలో ముంచాయన్నారు. ఉగ్రవాదుల బాంబు దాడులకు నిరసనగా ఈ నెల 25న సోమవారం పట్టణ న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల బాంబు దాడులను టిడిపి లీగల్ జిల్లా చైర్మన్ లంకిశెట్టి బాలాజీ శుక్రవారం మరో ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో బంద్
అవనిగడ్డ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం జరిగిన బాంబుపేలుళ్ళకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇక్కడ బంద్ నిర్వహించారు. ఈ పేలుళ్ళకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, వారి అసమర్థత వల్లే ఈ పేలుళ్ళు జరిగాయని నాయకులు ఆరోపించారు. అన్ని వ్యాపార సంస్థలు, పాఠశాలలు పాల్గొని పాక్షికంగా విజయవంతం చేశాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్‌లకు రాష్ట్రం అడ్డాగా మారిందని, అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలను ధ్వంసం చేయడానికి తీవ్రవాద సంస్థలు చేస్తున్న కుట్రలను ఇకనైనా అరికట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు దీవి నగరాయులు, దేసు జగన్మోహనరావు, కోలా శ్రీమన్నారాయణ, భూపతి సుబ్రహ్మణ్యం, శంకర్, అవనిగడ్డ వెంకటేశ్వరరావు, చిట్టా ప్రసాద్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కోడూరులో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతన బాబూరావు, శ్రీరామమూర్తి, పరిశే మాధవరావు, శేషగిరిరావు తదితరులు బాంబుపేలుళ్ళ సంఘటనను తీవ్రంగా ఖండించారు.
విద్యార్థుల మానవహారం
చల్లపల్లి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస బాంబుపేలుళ్లను నిరసిస్తూ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు ఈ అమానుష చర్యలకు పాల్పడిన కిరాతకును కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. దారుణ మారణకాండలో అసువులు బాసిన వారికి సంతాప సూచకంగా కొద్దిసేపు వౌనం పాటించారు. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.