జగ్గయ్యపేట, ఫిబ్రవరి 22: జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నర్శింహరావు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎంపి లగడపాటి రాజగోపాల్ చేతుల మీదుగా ఇంటూరి చిన్నా ఈ నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇంటూరి చిన్నా మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో జిల్లా పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించిన ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా వారి వెంట ఉండి నడుస్తానని అన్నారు. ఈ నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నర్శింహరావుతో పాటు పిసిసి నేత చెరుకూరి సీతారామయ్య, కెడిసిసి డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి బలప్రదర్శన పోటీల్లో రమాదేవి ఎడ్లజత ఫస్ట్
మాచవరం, ఫిబ్రవరి 22: గుంటూరు జిల్లా మాచవరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలను పురస్కరించుకుని మోర్జంపాడుగ్రామంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండోరోజు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. ఈపోటీల్లో పాలపళ్ళసైజువిభాగంలో 15 ఎడ్లజతలు పాల్గొనగా, కృష్ణాజిల్లా మువ్వాడ మండలం క్రోసూరుకు గ్రామానికి చెందిన బడ్లమూడి సుధీర్, నాదెండ్ల మండలం ఇర్లపాడుకు చెందిన మంగు రమాదేవికి చెందిన ఎడ్లజత 4400 అడుగుల దూరం బండనులాగి మొదటి బహుమతిని, కాటం పెద్దిరెడ్డి, ఆవుల వెంకట సుబ్బయ్యకు చెందిన ఎడ్లజత 4065 అడుగుల దూరం బండనులాగి ద్వితీయ బహుమతిని, పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావుఎడ్లజత 4002అడుగుల దూరం బండనులాగి తృతీయ బహుమతిని, మంగళగిరి మండలం నవులూరి గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు ఎడ్లజత 3869అడుగుల దూరం బండనులాగి చతుర్థ బహుమతి, నల్గొండ జిల్లా మేళ్ళచెరువుమండలం గుడి మల్కాపురంకు చెందిన మార్తల నాగిరెడ్డి ఎడ్లజత 3800 అడుగుల దూరం బండనులాగి ఐదో బహుమతిని గెలుచుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులను అందజేసినట్లు కమిటీ నిర్వాహకులు రాధాకృష్ణప్రసాద్ తెలిపారు.
కూచిపూడి నాట్యాన్ని అంకితభావంతో నేర్చుకోవాలి
కూచిపూడి, ఫిబ్రవరి 22: కూచిపూడి శాస్త్ర, సంప్రదాయ పునాదులపై పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం నృత్య రూపకాలను ఉత్తమ సాహిత్యం, అత్యుత్తమ సంగీతం ద్వారా రూపొందించటం వల్లనే కూచిపూడి నాట్యం జగత్ ప్రసిద్ధమైందని వక్తలు అన్నారు. నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళోత్సవాల సందర్భంగా రెండోరోజైన శుక్రవారం ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం వెంకట రామ రాఘవయ్య, ప్రముఖ గాత్ర సంగీత కళాకారుడు సిఎస్‌వి శాస్ర్తీ ప్రదర్శనా పూర్వక ప్రసంగాలు చేశారు. నాట్యం నేర్చుకునే విద్యార్థులు, నాట్యాచార్యులు ఈ కళ పట్ల అంకితభావంతో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. నిర్వాహకులు తాడేపల్లి సత్యనారాయణ శర్మ, పసుమర్తి రామలింగశాస్ర్తీ, కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం, చింతా రవి బాలకృష్ణ, పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు కృషి
* దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్
జగ్గయ్యపేట , ఫిబ్రవరి 22: దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్ తెలిపారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని ముక్త్యాల సమీపంలో గల శ్రీ కోటిలింగాల హరిహర మహాశైవక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ ఇఒ ధూళిపాళ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వారికి పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పంచ ముఖ అమృతలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ముఖ్య కార్యదర్శి స్వయంగా అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం పరిశీలన చేసిన ఆయన ఇఒకు పలు సూచనలు చేశారు. ఆయన కోరిక మేరకు ఇటీవలే పిడుగు పాటు వల్ల దెబ్బతిన్న విజయ గణపతి ఆలయం పునః నిర్మాణానికి ప్రతిపాదనలు పంపమని సూచించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కోటి లింగాల క్షేత్రం చాలా విశిష్ఠత కల్గి ఉందని, భవిష్యత్తులో మంచి దైవ క్షేత్రంగా విరాజిల్లుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇదే తరహాలో ఉన్న శివాలయంలో తాను ప్రతిష్ఠలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కుదరలేదని, త్వరలో కోటి లింగాల క్షేత్రాన్ని మరొక సారి దర్శించి ఇక్కడి పద్ధతి ప్రకారం రూ.699లు చెల్లించి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తానని అన్నారు. కొత్తగా నెల రోజుల కిందట బాధ్యతలు చేపట్టిన తాను గుంటూరు జిల్లా మాదిపాడులో ఉన్న భారతీతీర్థ మహస్వామివారిని సందర్శించుకొని ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని విలేఖరులు అడిగిన ప్రశ్నలతో పాటు అక్కడ నియమితులైన అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న స్థానికుల ఆరోపణలపై ప్రస్తావించగా వీటిపై పూర్తిగా అవగాహన ఏర్పడిన తరువాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆయన వివరించారు.