Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పెదవి విరుపు బడ్జెట్

$
0
0

ఏలూరు, ఫిబ్రవరి 28 : కేంద్ర బడ్జెట్ వస్తోందంటే అన్ని వర్గాల్లోనూ ఈసారి వరాలు కురుస్తాయా? లేక మోతలు మోగిస్తారా? అన్న విషయంలోనే అటు ఆందోళన, ఇటు ఆశ రెండూ కనిపిస్తాయి. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ ఏ వర్గాన్ని సంతోషపర్చలేని రీతిలో సాగిపోయింది. చివరకు అన్ని వర్గాలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అంతేకాకుండా ఎక్కడా చేయి విదిల్చే ప్రయత్నం చేయకుండానే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంపన్న వర్గాలపై భారం మోపుతున్నట్లు గణాంకాల్లో చూపుతున్న వారికిచ్చే రాయితీలతో పోలిస్తే ఈ మోత అంతంతమాత్రమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రధానంగా ఉద్యోగ వర్గాలతోపాటు వందలాది కుటుంబాలు ఆశించిన ఐటి పరిమితి పెంపు విషయంలో కేంద్రం మిన్నకుండిపోయింది. ప్రస్తుతం వున్న రెండులక్షల రూపాయల ఐటి పరిమితి నుంచి అయిదు లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచవచ్చునని ప్రచారం జరిగినా అది కేంద్రం దృష్టికి మాత్రం చేరినట్లు కనిపించడం లేదు. కేవలం ఐటి పరిమితిని 2.20 లక్షల రూపాయలకు మాత్రమే పెంచుతూ కేంద్ర బడ్జెట్ తీసుకున్న నిర్ణయం ఈ వర్గాలన్నింటినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదే సమయంలో సామాన్యుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వారి జీవనాన్ని ఏ దశలోనూ మెరుగుపరిచే నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవడం పట్ల పార్టీలు, సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సామాన్యులకు సంబంధం లేదన్నట్లుగా రెండు వేల రూపాయల పై చిలుకు విలువ చేసే సెల్‌ఫోన్ల ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది సహజంగానే అత్యధిక శాతం మంది ప్రజలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ కుటుంబాల్లోనూ సెల్‌ఫోన్ వినియోగం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పేద కుటుంబాల్లోనూ సెల్‌ఫోన్ వాడకం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్‌ఫోన్ల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వారిపై భారాన్ని మోపేదేననే చెప్పుకోవాలి. ఇక యధాప్రకారం సిగిరెట్లపై కూడా సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పొగరాయుళ్లకు అసంతృప్తిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే బహిరంగ విమర్శలు వినిపించని ఏకైక మోతగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక అత్యధిక శాతం మంది ఆధారపడి వున్న వ్యవసాయ రంగం విషయంలోనూ కేంద్ర బడ్జెట్ పెద్దగా ఎటువంటి సంక్షేమ చర్యలు లేకుండానే ముగిసిపోయిందని చెప్పవచ్చు. గిట్టుబాటు ధరల విషయంలోనే గతం నుంచి తీవ్రస్థాయిలో పోరాటాలు జరుగుతున్నా అసలు ఆ ప్రసక్తే లేకుండా బడ్జెట్ సాగిపోయింది. అంతేకాకుండా ఎరువుల ధరలు పెరగడానికి అనువుగా తీసుకున్న నిర్ణయాలు రైతు వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఈ విధంగా సాధారణ రంగాలన్నింటిలోనూ ఎటువంటి వృద్ధి నమోదయ్యే అవకాశం లేని నిర్ణయాలను కేంద్రం తీసుకుంటుందని ఇప్పుడు అన్ని పార్టీలు విమర్శలు కురిపిస్తుంటే కనీసం పారిశ్రామిక రంగం అభివృద్ధికైనా చర్యలు వున్నాయా అంటే అది కూడా అనుమానాస్పదంగానే వుందని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే కేంద్ర బడ్జెట్ ఏ వర్గాన్ని సంతృప్తిపర్చలేకపోయిందనే చెప్పుకోవాలి. వివిధ వర్గాల నుంచి బడ్జెట్‌పై వచ్చిన స్పందనలు పరిశీలిస్తే ఇదే అంశం స్పష్టమవుతోంది.
చిన్న పరిశ్రమలకు అన్యాయం:అంబికా
కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చిన్న తరహా పరిశ్రమలకు తీరని అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ వాణిజ్య సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు విరుగుడు కనుక్కోకపోవడం ప్రజల దౌర్భాగ్యమని తెలిపారు. ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్టల్రకు పారిశ్రామిక కారిడార్‌లను మంజూరు చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించిందన్నారు.
ఇది సంపన్నుల బడ్జెట్:సిఐటియు
పార్లమెంటులో ప్రవేశపెట్టిన జనరల్ బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలను నిరుత్సాహానికి గురిచేసేదిగాను, సంపన్నులను ఉత్సాహపరిచేదిగాను ఉందని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె రాజారామ్మోహన్‌రాయ్, చింతకాయల బాబూరావులు పేర్కొన్నారు.
ధరల నియంత్రణ ప్రస్తావన లేదు : డేగా
బడ్జెట్‌లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ప్రస్తావన లేదని సిపి ఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. సామాన్యులకు, పేదలకు వార్షిక బడ్జెట్ నిరాశనే మిగిల్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడమే కాకుండా నిధుల కేటాయింపు కూడా లేదని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవన్నారు.
వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం
కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి కేవలం 1.62 శాతం మాత్రమే నిధులు కేటాయించి తీవ్ర నిర్లక్ష్యం చేశారని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉండవల్లి కృష్ణారావు, బి బలరామ్‌లు పేర్కొన్నారు. గత ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 1.35 శాతం నిధులు కేటాయిస్తే ఈ ఏడాది 1.62 శాతం మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.
ఐటి పరిమితిలో అన్యాయం
బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితికి సంబంధించి ఉద్యోగులకు అన్యాయం జరిగిందని యుటి ఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ శ్రీకాంత్, షేక్ సాబ్జీలు తెలిపారు. ఆదాయపన్ను పరిమితిని రెండు లక్షల నుంచి కేవలం 2.20 లక్షలకు మాత్రమే పరిమితం చేయడం అన్యాయమని వారు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ పట్ల హర్షం
అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరపడం హర్షదాయకమని కాంగ్రెస్ నేత రాజనాల రామ్మోహనరావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలోనూ రైతులకు మేలు చేసే విధానాలకు బడ్జెట్‌లో స్థానం కల్పించడం అభినందనీయమన్నారు.

ఆప్కాబ్ ఉపాధ్యక్షునిగా రత్నం
ఏకగ్రీవంగా ఎన్నిక - 25 ఏళ్ల తర్వాత జిల్లాకు అవకాశం - రైతులకు మరింత ‘సహకారం’
ఆకివీడు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) ఉపాధ్యక్షునిగా డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లో ఈ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలవడంతో రత్నం ఎన్నిక ఏకగ్రీవమైంది. మనే్న సత్యనారాయణ తరువాత ఆప్కాబ్ ఉపాధ్యక్షులుగా రత్నం మాత్రమే ఎన్నికకావడం విశేషం. హైదరాబాద్‌లో డిసిఒ ఎన్నిక నియామక పత్రాన్ని రత్నానికి అందజేశారు.
జిల్లాకు గర్వకారణం:పితాని
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాకు పాతికేళ్ల తరువాత ఆప్కాబ్ ఉపాధ్యక్ష పదవి వరించడం జిల్లాకే గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. హైదరాబాదులో గురువారం సాయంత్రం ఆప్కాబ్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పశ్చిమగోదావరి జిల్లా డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం)ను మంత్రి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం అప్పటి డిసిసిబి ఛైర్మన్ మనే్న సత్యనారాయణ బాబుకు ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ పదవి లభించిందని, తిరిగి ఇప్పుడు ముత్యాల రత్నంను ఆ పదవి వరించడంతో పశ్చిమ రైతాంగానికి అవసరమైన అదనపు రుణాలను పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆప్కాబ్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ముత్యాల రత్నం విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతీ రైతు ఆనందంగా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తామని చెప్పారు. మార్చి 6వ తేదీన ఏలూరు లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి, వివిధ అంశాలపై ఒక అవగాహనతో కొన్ని విధాన నిర్ణయాలు చేయనున్నామన్నారు.
తనకు ఆప్కాబ్ ఉపాధ్యక్ష పదవి లభించడానికి సహకరించిన ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ వీరారెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలకు రత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎర్రకాలువ జలాశయం ఎడమ కాలువకు గండి
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 28: ఎర్రకాల్వ జలాశయం ఎడమ కాలువకు మండలంలోని గురవాయిగూడెం, నాగులగూడెం గ్రామాల మధ్య గురువారం గండి పడింది. ఎడమ కాలువ 5వ కి.మీ. వద్ద అండర్ టనె్నల్‌కు కొద్దిపాటి రంధ్రం నీటి ఉద్ధృతికి పెద్దది కావడంతో గురువారం వున్నట్టుండి పంట పొలాల్లోకి నీరు చేరింది. రైతుల ఫిర్యాదు మేరకు జలాశయం అసిస్టెంట్ ఇంజనీర్ సిహెచ్ భాస్కరరావు రైతుల సహకారంతో ఇసుక బస్తాలు అడ్డువేసి గండిని అదుపుచేశారు. దీనివల్ల రైతులకు ఎటువంటి నష్టం జరగలేదని ఎఇ తెలిపారు.

ఏడు నెలలుగా జీతం లేని మున్సిపల్ ఇంజనీర్!
మనస్తాపంతో సెలవుపై వెళ్లాలని నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 28: మున్సిపల్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుండి నేటి వరకూ సుమారు ఏడు నెలలుగా జీతం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాడేపల్లిగూడెం ఎంఇ కె వేణుగోపాలరావు సెలవుపై వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో తనను కలిసిన విలేఖరులకు ఆయన మనోవేదనను తెలిపారు. విశాఖపట్నం కార్పోరేషన్ నుండి తాడేపల్లిగూడెం మున్సిపాల్టీకి బదిలీపై వచ్చిన తాను నేటి వరకూ జీతం అందుకోలేకపోయానన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కోటగిరి మోహనరావు, అనంతరం రవికృష్ణంరాజు, గాజుల విజయకుమార్, మనె్నబాబు పనిచేశారన్నారు. వీరందరికీ పబ్లిక్‌హెల్త్ ఇఇలుగా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో జీతాలు ఇచ్చినపుడు, తనకు 7 నెలలుగా జీతం ఆపడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. మనె్న బాబు విజయనగరం బదిలీ కావడంతో ఆయన స్థానంలో వేణుగోపాలరావు జాయిన్ అయ్యారు. మనె్న బాబు జీతం పబ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి డిటివో కార్యాలయం ద్వారా పొందేవారు. ఇదేవిధంగా వేణుగోపాలరావు కూడా జీతం పొందటానికి ఎల్‌పిసి, డ్యూటీ సర్ట్ఫికెట్, ఎంప్లాయి డేటాను ఏలూరు పబ్లిక్‌హెల్త్ ఇఇ పిఎల్‌ఎన్ కార్తీక్‌కు పంపించారు. దీనిపై ఫిబ్రవరి 5న పబ్లిక్‌హెల్త్ ఇఇ మున్సిపల్ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో పబ్లిక్‌హెల్త్‌లో ఒక ఇఇ పోస్టు మాత్రమే మంజూరయ్యిందని, మున్సిపల్ సిబ్బంది జీతాలు ట్రెజరీ ద్వారా మీరే చెల్లించాలని తెలిపారు. దీనిపై 22న డిటివోకు మున్సిపల్ కమిషనర్ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో అక్టోబర్ 2007 వరకే మున్సిపల్ ఇంజనీర్ జీతాలను డ్రా చేశామని, అనంతరం 2012 జూలై 11 వరకూ తాడేపల్లిగూడెం మున్సిపల్ ఇంజనీర్ జీతాలు ఏలూరు పబ్లిక్‌హెల్త్ ఇఇ ద్వారా డ్రా చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కె వేణుగోపాలరావుకు డిడివో కోడ్ ఇవ్వాలని కోరారు. దీనిపై వేణుగోపాలరావు స్పందిస్తూ ఇప్పటివరకూ పబ్లిక్‌హెల్త్ ద్వారా మున్సిపల్ ఇంజనీర్ జీతాలు ఇచ్చి, కావాలనే తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. తాడేపల్లిగూడెం ట్రెజరీలో ఇఇ కోడ్ లేకపోవడం, ఏలూరు ట్రెజరీలో ఇఇ కోడ్ ఉన్నా పబ్లిక్‌హెల్త్ శాఖ ఇఇ పోస్ట్ శాంక్షన్ లేదని చెప్పడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేవిధంగా మున్సిపాల్టీలో డిఇగా 2013 జనవరి 1న విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చిన వి సోమశేఖర్‌కు కూడా ట్రెజరీలో కోడ్ లేకపోవడంతో జీతం బిల్లులు చేసే పరిస్థితి లేదని ఎంఇ పేర్కొన్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్శింహారావు ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారని ఎంఇ వేణుగోపాలరావు తెలిపారు.

బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
కొడమంచిలి ఎస్‌బిఐ శాఖ లోనికి ప్రవేశించిన దొంగలు - సురక్షితంగా నగదు, నగలు
ఆచంట, ఫిబ్రవరి 28: కొడమంచిలి స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలో దోపిడీకి విఫలయత్నం జరిగింది.. బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఆగంతకులు దోపిడీకి ప్రయత్నించారు. గురువారం బ్యాంకు విధులకు ముందుగా హాజరైన ఎకౌంటెంట్ నర్సింహమూర్తి బ్యాంకు మెయిన్ డోర్ తీసి, బంగారం అప్పులు ఇచ్చే గదికి వెళ్తుండగా అప్పటికే స్ట్రాంగ్‌రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంలో హుటాహుటిన పోడూరు ఎస్సై బి విశ్వం సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, క్లూస్ టీమ్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లో బంగారం, నగదు ఉన్న ఇనుప బీరువాను తెరిపించారు. నగదుతో ఉన్న బీరువా తెరుచుకోగా, బంగారు ఆభరణాల బీరువా లోపల లాక్ పడిపోవడంతో తెరుచుకోలేదు. దీంతో బీరువాను తెరిచేందుకు గోద్రేజ్ కంపెనీ వారికి సమాచారం అందించారు. సిసి కెమెరా కళ్లు కప్పి బ్యాంకు సింహద్వారం నుండి కాకుండా దక్షిణం వైపు ఉన్న కిటికీని పగులగొట్టి ఆగంతకులు లోపలికి ప్రవేశించి, కిటికీ పక్కన ఉన్న సిసి కెమెరాపై కిటికీ కర్టెన్ క్లాత్‌ను కప్పివేశారు. దీంతో సిసి కెమెరా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం అలారం సైతం మోగలేదు. బ్యాంకులో అత్యవసర అలారం పాడైపోయి చాలా రోజులైనప్పటికీ బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల నగదును, పెద్ద మొత్తంలో ఉన్న బంగారం ఉన్న బ్యాంకులకు కనీసం రాత్రివేళల్లో కాపలా కాసేందుకు సిబ్బంది కూడా లేకపోవడం దురదృష్టకరమని ఖాతాదారులు వాపోతున్నారు. బ్యాంకులో దొంగతనం జరిగిందన్న విషయం తెలియగానే ఖాతాదారులు పెద్దఎత్తున బ్యాంకు వద్ద గుమిగూడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్ కె ప్రకాష్‌రావు ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, భీమవరం సిఐ జగన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. బుధవారం రాత్రి గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం విశేషం.

సాగు, తాగు నీటి సరఫరాలో విఫలమైతే చర్యలు
సమీక్షా సమావేశంలో అధికార్లకు కలెక్టర్ వాణీమోహన్ హెచ్చరిక
ఏలూరు, ఫిబ్రవరి 28 : జిల్లాలో రబీ పంటకు సాగునీరు, వేసవిలో ప్రజలకు తాగునీటి సరఫరా చేసే విషయంలో విఫలమైతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో సాగు, తాగునీటి సరఫరా, ఎల్ ఇసి కార్డులు, వివిధ రెవిన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరు వరకూ రబీ పంటకు సాగునీరు అందించే అత్యంత కీలకమైన సమయంలో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యు ఎస్, మత్స్యశాఖాధికారులను సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. గోదావరిలో నీటి లభ్యత రోజురోజుకూ తగ్గిపోతున్న దృష్ట్యా ఉన్న నీటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై మైక్రో లెవెల్ ప్లానింగ్‌ను అనుసరించి ప్రతీ అధికారి వ్యవహరించాలని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో చేపల చెరువులకు ఒక్క చుక్క నీరు కూడా మళ్లించడానికి వీలు లేదని ఎక్కడైనా రాత్రికి రాత్రి అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి ఎవరైనా నీరు మళ్లిస్తుంటే ఆయా మండల అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. కాల్వగట్టులపై రాత్రి వేళ గస్తీ కూడా నిర్వహించాలన్నారు. రబీ పంటకు సాగునీరు అందించే విషయంలో 225 క్రాస్‌బండ్స్ వేయవలసి ఉండగా ఇంత వరకూ 150 పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరితగతిన ఏర్పాటయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా రబీ పంటకు సక్రమంగా నీరు అందించేందుకు అదనంగా లస్కర్లతో పాటు ఇద్దరు రిటైర్డు ఎస్‌ఇలను కూడా నియమించారన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై అత్యంత బాధ్యత తీసుకోవాలని ఏప్రిల్ 15 తర్వాత కాలువలు మూసివేసే దృష్ట్యా ఎప్పటికప్పుడు తాగునీటి చెరువులను నీటితో నింపి ఉంచాలన్నారు. బోర్లకు, మోటార్లకు పైపులైన్లు తలెత్తే మరమ్మతులను యుద్ధప్రాతిపదికపై చేపట్టేందుకు ముందస్తుగానే సంబంధిత విడి పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఎంపిడివోలను ఆదేశించామన్నారు. తాగునీటి సరఫరా విషయంపై తహసీల్దార్లు, ఎంపిడివోలు సంయుక్త సమావేశాలు నిర్వహించాలన్నారు. అనధికార చెరువులను నిరోధించి నిబంధనలు మేరకు చెరువులు క్రమబద్దీకరణ చేసే విషయంలో తహసీల్దార్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రామం, చెరువు వారీ సర్వే నెంబర్లతో జాబితాను రూపొందించాలన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించే ప్రక్రియను పూర్తి చేసేలా తహశీల్దార్లు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాది జిల్లాకు చెందిన అధికారులు రెడ్‌క్రాస్ అవార్డులు పొందారని, ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఈ ఏడాది కూడా రెడ్‌క్రాస్‌కు విరాళాల సేకరణ, సభ్యత్వపు నమోదులో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ డైరెక్టర్ టి బాబూరావునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం మోహనరాజు, డి ఎస్‌వో లక్ష్మీనారాయణ, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, జె వసంతరావు, సత్యనారాయణ, సూర్యారావు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

ముగిసిన 24 గంటల నిరంతర జాతీయ గీతాలాపన
ఏలూరు, ఫిబ్రవరి 28 : స్థానిక శ్రీశ్రీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటలు నిరంతర జాతీయ గీతాలాపన గురువారం ముగిసింది. బుధవారం ఉదయం ఉపాధ్యాయుడు శివశంకర్, శ్రీశ్రీ విద్యార్ధులు కలిసి ప్రారంభించిన నిరంతర జాతీయ గీతాలాపన కార్యక్రమం గురువారం ఉదయం 11.55 నిమిషాల వరకు నిర్విరామంగా కొనసాగించారు. జాతీయ గీతాన్ని ఏలూరు రేంజ్ డి ఐజి జి సూర్యప్రకాశరావు గానంతో మేళవించిన అనంతరం ముగించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు రేంజ్ డి ఐజి జి సూర్యప్రకాశరావు సమక్షంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున జాతీయ అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి అధికారికంగా కార్యక్రమం రికార్డుగా నిలిచిందని ప్రకటించారు. ఉపాధ్యాయుడు నారాయణ శివశంకర్‌కు సంస్థ తరఫున అవార్డు, మెమెంటోను బహూకరించారు. జాతీయ గీతాలాపనలో పాల్గొన్న 15 మంది శ్రీశ్రీ విద్యార్ధినీ విద్యార్ధులకు, విద్యాసంస్థల యాజమాన్యానికి వ్యక్తిగతంగా ధ్రువపత్రాలను అందజేయనున్నామని ఆయన పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డి ఐజి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జాతీయ సమగ్రతతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి చొరవ తీసుకున్న శ్రీశ్రీ విద్యాసంస్థల అధినేత ఎంబి ఎస్ శర్మను అభినందిస్తున్నానన్నారు. జాతీయత, దేశభక్తి మననం చేసుకుంటూ జన్మభూమికి గుర్తింపు తీసుకురావాలని, ఆ దిశగా విద్యార్ధులు పయనించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యతోపాటు సత్ప్రవర్తన, నైతిక విలువలు విద్యార్ధులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమానికి రూపకల్పన చేసి జాతీయ భావాన్ని పెంచడంతోపాటు అవార్డును సాధించిన శివశంకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డి ఎంహెచ్ ఓ డాక్టర్ టి శకుంతల, నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ, డివై ఇవో ఎస్ జోగేశ్వరరావు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రాంతీయ సలహాదారు డాక్టర్ సాయిశ్రీ, యుటి ఎఫ్ నాయకులు షేక్ సాబ్జీ, డాక్టర్ పల్లంపాటి శ్రీ్ధర్, ఆర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

9 నుండి జిల్లాలో బాబు పాదయాత్ర
నల్లజర్ల, ఫిబ్రవరి 28: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 9వ తేదీ నుండి జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు గరికపాటి మోహనరావు వెల్లడించారు. నల్లజర్లలోని టిడిపి నేత బూరుగుపల్లి వేణు నివాసం వద్ద జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి గరికపాటి ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌ను వివరించారు. ఆకివీడు మండలం ఉప్పుటేరు వంతెన వద్ద చంద్రబాబు జిల్లాలో ప్రవేశిస్తారని, రెండు రోజులపాటు ఉండి నియోజకవర్గంలో సుమారు 35 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, తరువాత భీమవరం నియోజకవర్గంలో ప్రవేశిస్తారన్నారు. రెండు రోజులపాటు 28 కిలోమీటర్లు పాదయాత్ర సాగించి, పాలకొల్లు నియోజకవర్గంలో రెండు రోజులు బాబు పర్యటిస్తారని చెప్పారు. తరువాత ఆచంట నియోజకవర్గంలో ఒకరోజు పాదయాత్ర, తణుకు నియోజకవర్గంలో ఒకరోజు, ఉంగుటూరు నియోజకవర్గంలో మూడు గ్రామాలు పాదయాత్ర చేస్తారన్నారు. తరువాత తాడేపల్లిగూడెంలో మూడు రోజులపాటు, నిడదవోలులో రెండు రోజులపాటు, కొవ్వూరులో రెండు రోజులపాటు పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. మొత్తం 13 రోజులు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం రెండు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరుగుతాయని, సుమారు వెయ్యి మంది కార్యకర్తలు సమీక్షల్లో పాల్గొంటారన్నారు. పాదయాత్ర మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సినీ నటుడు, టిడిపి నేత మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిర్విరామంగా నేటికి 149 రోజులు పాదయాత్ర సాగించారని చెప్పారు. ఆరవై ఏళ్లు దాటిన బాబు సుదీర్ఘ పాదయాత్ర సాగించడం ఆయన సామర్ధ్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాగంటి మురళీమోహన్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పాలకొల్లు ఇన్‌చార్జి డాక్టర్ బాబ్జి, ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి గొడవర్తి శ్రీరాములు, పోలవరం ఇన్‌ఛార్జి మొడియం శ్రీను, తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి ముళ్లపూడి బాపిరాజు, నల్లజర్ల మండల పార్టీ అధ్యక్షుడు షేక్ మీరాసాహెబ్, కార్యదర్శి కూచిపూడి ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి 50 ఆధార్ కేంద్రాలు ప్రారంభం:కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 28 : జిల్లాలో మార్చి 1వ తేదీ నుండి 50 ఆధార్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఆధార్ కార్డుల జారీ తీరుపై కలెక్టరు సంబంధిత సంస్థలతో సమీక్షించారు. జిల్లాలో 40 లక్షల మంది జనాభాకు ప్రస్తుతం 29 లక్షల మందికి ఆధార్‌కార్డులు జారీ చేయడం జరిగిందని, మిగిలిన 11 లక్షల మందికి మార్చి నెలాఖరులోగా ఆధార్‌కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని 4జి ఇన్‌ఫోర్, టెక్స్‌మార్ట్ సంస్థలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రతీ పౌరుడికి ఆధార్‌కార్డు అందించి తీరాలని, దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు ఎన్నో ఉపయోగాలున్నాయని ప్రభుత్వమందించే సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయడం వల్ల ఆధార్‌కార్డు ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 12 మండలాల్లో 100 ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మార్చి 1వ తేదీ నుండి 8 మండలాల్లో కొత్తగా 50 ఆధార్ కేంద్రాలు ప్రారంభిస్తామని, ముఖ్యంగా ఇరగవరం, పెనుమంట్ర, పెరవలి, తాళ్లపూడి, దేవరపల్లి, కామవరపుకోట, పెదపాడు, గణపవరంలలో ఈ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు. లింగపాలెం, నిడమర్రు, పెదవేగి, భీమడోలు, ఉంగుటూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలాల్లో త్వరలో ఆధార్‌కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఆధార్‌కార్డులు కోసం ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదని ప్రతీ ఒక్కరికీ విధిగా అందించి తీరుతామని చెప్పారు. ఏలూరు, తణుకు ప్రాంతాలలో జనాభాకన్నా ఎక్కువ మందికి ఆధార్‌కార్డులు జారీ చేశారని, ఏలూరులో 21523 మందికి అదనంగా ఆధార్‌కార్డులు జారీ చేయగా తణుకులో 16,163 మందికి ఆధార్‌కార్డులు ఇచ్చారన్నారు. ఈ ఆధార్‌కార్డులు దేశంలో ఎక్కడైనా, ఎవరైనా పొందవచ్చునని అయితే నిర్ధేశించిన ధ్రువపత్రాలను చూపించాల్సి వుంటుందని కలెక్టర్ చెప్పారు. ఆధార్‌కేంద్రాల వద్ద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఏ సమయంలో ఎప్పుడు డేటా స్వీకరిస్తారో ప్రజలకు ముందుగా తెలియజేయడం వల్ల వారిలో అవగాహన కలిగి అందుకు అనుగుణంగా వ్యవహరించగలుగుతారన్నారు. సరైన సమాచారం ఇవ్వకపోతే గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని, అటువంటి పరిస్థితికి ఎక్కడాకూడా ఆస్కారం కల్పించవద్దని కలెక్టర్ హితవు పలికారు. సమావేశంలో జెసి డాక్టర్ టి బాబూరావునాయుడు, నిక్‌నెట్ సైంటిస్టు గంగాధరరావు, 4జి ఇన్‌ఫోర్ ఆధార్ జిల్లా మేనేజరు శంకర్, టెక్స్‌మార్ట్ సంస్థ ప్రతినిధి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పొగాకు రైతులను ఆదుకోవాలని మురళీమోహన్‌కు వినతి
గోపాలపురం, ఫిబ్రవరి 28: మెట్టప్రాంతంలోని వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ టిడిపి నేత మురళీమోహన్‌ను గురువారం కోరారు. మండలంలోని వేళచింతలగూడెం వచ్చిన మురళీమోహన్‌ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యలను విన్నవించారు. ఈ ఏడాది ఆది నుండీ వర్జీనియా పొగాకు రైతులు ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. పొగాకు నాట్లువేసే సమయంలో నీలం తుపాను వచ్చి తోటలు ధ్వంసమయ్యాయని, అనంతరం అష్టకష్టాలు పడి మళ్లీ పొగాకు నాట్లువేసి వేలాది రూపాయలు వెచ్చించి పంటకు మందులు పిచికారీ చేశామన్నారు. ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాలకు పొగాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఫలితంగా రైతులు నష్టపోయారన్నారు. కురిసిన వర్షాలకు చెట్ల ఆకులపై ఉన్న జిడ్డు (జిగురు) వంటి పదార్థాము కొట్టుకుపోయి దిగుబడి తగ్గి నాణ్యత లోపించిందన్నారు. గతంలో నాణ్యమైన రంగు వస్తుండగా, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులకు తోటలు పచ్చబడి ఆకులు పచ్చబడిపోయాయన్నారు. ప్రస్తుతం తీవ్రంగా కాస్తున్న ఎండలకు చెట్లనున్న ఆకులు పండిపోయి, ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వర్జీనియా పోగాకు రైతులు మురళీమోహన్‌ను కోరారు. ఈ సందర్భంగా మురళీమోహన్ వర్జీనియా పోగాకు గ్రేడింగ్ చేస్తున్న సమయంలో అక్కడకు వెళ్లి పొగాకును పరిశీలించారు. కార్యక్రమంలో రైతులు కొర్లపాటి రాము, ఈలి శరత్‌బాబు, చదలవాడ ప్రసాద్, గండ్రోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఊరింపే తప్ప విదిలింపు లేదు - వేతన జీవులకు లేదు ఊరట - వ్యవ‘సాయం’ నో
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>