హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, ఇటీవల నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఆరు లక్షల 50 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో 1.25 లక్షల కోట్ల రూపాయల వివిధ పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన ఐటి, పారిశ్రామిక విధానాలకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ రీజనల్ ఇంటిగ్రేషన్ ఈవెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగానికి సంబంధించి త్వరలో ఆరు, ఏడు యూనిట్లను నెలకొల్పే అవకాశాలున్నాయన్నారు. ఇందులో భాగంగా 25వేల కోట్ల పెట్టుబడులకు అనుమతులు మంజూరు చేశామని, పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఈ సందర్భంగా సిఎం కోరారు. ఇదిలావుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ రకాల ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందుకెళ్తున్నామన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం సుమారు లక్షా 16వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ యువ కిరణాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు.
పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపు
english title:
p
Date:
Saturday, February 11, 2012