నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 10: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ సంక్షోభంలో పడ్డాయని వైఎస్సార్‌సి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో శుక్రవారం జడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తరువాత రాపూరు మండలం వేపినాపి, సిద్ధవరంల్లో వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు సంక్షేమ పథకాలను అటకెక్కిస్తున్నారన్నారు.
జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, వస్తవ్య్రాపారులు, ఇలా వివిధ వర్గాలు ఆందోళన బాటలో నడుస్తున్నా వారి న్యాయమైన సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. జూనియర్ డాక్టర్లు గత పక్షం రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా స్పందించకపోవడం అమానుషమన్నారు. అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామంటున్నా రాష్ట్ర పాలకులు దున్నపోతుపై వర్షం పడ్డ చందంలా వ్యవహరిస్తున్నారన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజానీకం మేలు కాంక్షిస్తూ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కించాలనే ధ్యేయంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందదన్నారు. ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న 108 అంబులెన్స్, 104 సర్వీసుల్ని ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారన్నారు. వ్యాట్‌ను వ్యతిరేకిస్తూ తొమ్మిది రోజులపాటు వస్తవ్య్రాపారులు సమ్మె నిర్వహించినా రాష్ట్ర సర్కార్ స్పందించకపోవడం దారుణమన్నారు. జనమంతా వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం ఇవేమీ పట్టని రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల నడ్డివిరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పంటల సాగుకు కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియక రైతులు అయోమయంలో పడుతున్నారన్నారు. ఎంతో కష్టపడి పంట పండించినా చివరికి గిట్టుబాటు ధర కూడా పొందలేని దుస్థితిలో బతుకుతున్నారన్నారు. అదే మహానేత వైఎస్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ధ్యేయంగా పరిపాలించారన్నారు. పనిచేసే నాయకుడు అంటూ రాష్ట్రంలో ఎవరూ లేకుండా పోయారన్నారు. పనిచేసే నాయకుడు చనిపోయినా మనందరి గుండెల్లో బతికే ఉన్నాడన్నారు. ఆయన మరణించి రెండున్నర సంవత్సరాలైనా ఇంకా అందరి గుండెల్లో బతికి ఉన్నాడనేందుకు తన పట్ల జనం చూపిస్తున్న ఆదరాభిమానాలే నిదర్శనమన్నారు. సిద్ధవరం నుండి డక్కిలి, వెంకటగిరి, ఏర్పేడు, రేణిగుంట మీదుగా కడప జిల్లాకు తరలివెళ్లారు. జగన్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ పర్యటనలో జగన్ వెంట నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తదితరులున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్
english title:
j
Date:
Saturday, February 11, 2012