తిరుపతి, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ పార్టీని ఉపేక్షిస్తే దేశానికే ప్రమాదమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు, శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన యువ తరంగం ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీది దొంగల రాజ్యమని, దోపిడీ పాలన అని నిప్పులు చెరిగారు. ఇక కాంగ్రెస్‌ను ఉపేక్షిస్తే దేశం, రాష్ట్రం అథోగతిపాలు కావడం ఖాయమన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత చేపట్టిన సంస్కరణ ఫలాలను తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దోచుకున్నారన్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం చేస్తానని ఒకాయన ఎక్కడాలేని అర్భాటం చేసి ఇదే తిరుపతిని వేదికగా చేసుకుని పార్టీని పెట్టారన్నారు. రెండేళ్లుకూడా తిరక్కముందే సామాజిక న్యాయాన్ని అటకెక్కించి సొంత న్యాయాన్ని చూసుకుని అవినీతి కాంగ్రెస్‌లో కలిసి పోయారన్నారు. ఎన్‌టిఆర్ టిడిపిని ఏర్పాటు చేసి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచి నేడు దేశానికి, రాష్ట్రానికి తిరుగులేని తెలుగుదేశం పార్టీని అందించారన్నారు. ఓదార్పు పేరుతో జగన్ రాష్ట్రం అంతా తిరుగుతున్నాడన్నారు. ఆయనను జనమే ఓదార్చే పరిస్థితులు దగ్గరపడ్డాయన్నారు.
కాగా ప్రపంచంలో ఎక్కడాలేని యువశక్తి ఒక భారతదేశంలోనే ఉందన్నారు. సింగపూర్, మలేషియా, థాయ్‌ల్యాండ్ దేశాలు యువశక్తిని ఉపయోగించుకుని అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని చక్కని కుటుంబ వ్యవస్థ దేశంలో ఉందన్నారు. యువత అండగా నిలిస్తే తాను అద్భుతాలు సృష్టిస్తానని, చరిత్ర తిరగ రాస్తానన్నారు. ఎన్‌టిఆర్ మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించారన్నారు.
స్థానిక సంస్థల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. అలనాడు ఎన్‌టిఆర్ ప్రవేశపెట్టిన విధంగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జలయజ్ఞం పేరుతో 8 సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలతో ధనయజం చేసి, ఒక్క చుక్క నీరు అందించలేకపోయారన్నారు. రాష్ట్రంలో మాఫియాల పాలన సాగుతోందన్నారు. గాంధీ వారసులాంతా నేడు బ్రాందీ వారసులుగా మారిపోయారని నిప్పులు చెరిగారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు 31 మద్యం షాపులు ఎలా ఇస్తారని, ఇది ఎక్సైజ్ నిబంధనలను తుంగలో తొక్కడమేనన్నారు. మద్యం ముడుపుల విషయంలో ఒకొక్కరు బయట పడుతున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మోపిదేవి వెంకటరమణను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యువతరంగం సదస్సుకు ముందు తిరుపతి నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా బుల్లెట్ మోటార్‌సైకిల్ నడిపారు. తన విద్యార్థి దశలోని అనుభవాలు గుర్తుకు వచ్చాయన్నారు. ఇటీవల కుప్పంలో నడిపిన బుల్లెట్ వాహనానే్న ఈ సారి కూడా చంద్రబాబు వినియోగించారు.
* తిరుపతి ‘యువ తరంగం’లో చంద్రబాబు
english title:
t
Date:
Saturday, February 11, 2012