న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాని పదవిని చేపట్టటానికి కావలసిన అన్ని అర్హతలున్నాయని పార్టీ అధ్యక్షుడు గడ్కారీ చేసిన వ్యాఖ్యలు బిజెపిలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గడ్కారీ వ్యవహార శైలి, పనితీరుపై గుర్రుగా ఉన్న అనేక మంది సీనియర్లు ఇప్పుడీ వ్యాఖ్యలపై మరింత మండిపడుతున్నారు. ఎన్నికలు జరగటానికి మరో రెండేళ్ళ వ్యవధి ఉండగా ఇప్పటినుంచే గడ్కారీ ప్రధాని పదవికి మోడీ అన్నివిధాలా తగినవాడని ఎలాంటి వ్యూహం లేకుండా పదే పదే చెప్పరని ఒక వర్గం భావిస్తోంది. 2014 నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం. అద్వానీ అన్యాపదేశంగా తాను రేసులో ఉన్నానన్న సంకేతాలు ఇస్తున్నారు. రెండోతరం నాయకత్వం నుంచి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఒక దశలో మోడీ పేరు బాగా వినపడినప్పుడు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచినవారినే ప్రధాని పదవికి ఎంపిక చేస్తామని గడ్కారీ అనేశారు. అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి మొహమాటం కోసమే తప్పించి తనకు సీనియర్ నాయకుల నుంచి సహకారం అందటం లేదన్న విషయాన్ని గడ్కారీ ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో కూడా గతంలోమాదిరి సీనియర్ నాయకుల మాట కంటే సంఘ్ ఆధిపత్యమే చెల్లుబాటైంది. సీనియర్ నాయకుడు అద్వానీ గతంలో మాదిరికాక అతి తక్కువ స్థాయిలో ప్రచారం చేశారు. సుష్మా స్వరాజ్ ఆరోగ్యం సహకరించకపోవటంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అరుణ్ జైట్లీ పంజాబ్‌కే పరిమితమయ్యారు. నరేంద్ర మోడీని యూపి ప్రచారానికి దించితే ముస్లిమ్ ఓట్లు పడవేమోనన్న భయంతో పార్టీ నాయకులున్నారు. మోడీ కూడా తనకు ఊపిరాడని పనులున్నాయని చెప్పి ప్రచారం పట్ల విముఖత చూపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు జరిగే గుజరాత్ విధానసభ ఎన్నికల ఫలితాలపై మోడీ భవితవ్యంతో పాటు పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉన్న నేపధ్యంలో గడ్కారీ తొందరపాటుగా వ్యవహరిస్తున్నారని మరో వర్గం ఆందోళన చెందుతోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాని పదవిని
english title:
n
Date:
Saturday, February 11, 2012