హైదరాబాద్, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలో కరవు ప్రాంతాల్లో రైతులకు చేయూత ఇచ్చేందుకు, సహాయక పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే కేంద్రం నిధులు వచ్చిన తర్వాత అవసరమైన నిధులు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వద్ద ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తాజాగా కేంద్రం నుండి అధికారిక బృందం వచ్చి పరిస్థితి పరిశీలించి వెళ్లిపోయిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. 2011-12 సంవత్సరానికి ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిఆర్‌ఎఫ్/ఎస్‌డిఆర్‌ఎఫ్) కింద రాష్ట్రానికి 534.28 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. దేశంలో రాజస్థాన్ తర్వాత ఎస్‌డిఆర్‌ఎఫ్ నుండి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరైన రాష్ట్రం మనదే కావడం గమనార్హం. నియమావళి ప్రకారం మంజూరు చేసిన మొత్తంలో 75 శాతం చెల్లించాల్సిన కేంద్రం 2011 చివరి అర్ధ్భాగంలో 200 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండురోజుల క్రితం మరో 200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో భారీవర్షాలు-వరదలతో పాటు కరవుపీడిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర నియమావళికన్నా 467 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది. అంటే ప్రకృతి వైపరీత్యాల ఖాతాలో 467 కోట్ల రూపాయలు లోటు ఏర్పడిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవును జాతీయ విపత్తుగా పరిగణించి ఉదారంగా కేంద్రం సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సిఆర్‌ఎఫ్/ఎస్‌డిఆర్‌ఎఫ్ (2012-13 సంవత్సరానికి సంబంధించి) నుండి అడ్వాన్సుగా ఇవ్వకుండా జాతీయ విపత్తు నిధి (ఎన్‌సిసిఎఫ్/ఎన్‌డిఆర్‌ఎఫ్) నుండి గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, హోంశాఖ మంత్రి చిదంబరం, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌లకు ముఖ్యమంత్రి లేఖలు రాశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల చివరివరకైనా కేంద్రం నిధులు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నిధులు ఎంత మేరకు ఇచ్చినా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా చెల్లించాల్సిన మొత్తం 1886.36 కోట్ల రూపాయలుగా తేల్చారు. తాగునీరు తదితర కార్యక్రమాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని ఎట్టిపరిస్థితిలోనూ తగ్గించేందుకు వీలుకాదని ఈ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఇందుకోసం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ తన ఖజానానుండి ఈ మేరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
200 కోట్లు విడుదల, 467 కోట్ల లోటు
english title:
k
Date:
Saturday, February 11, 2012