ఏలూరు, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో పేరుపొందిన ఏలూరు పడమరవీధి శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవార్లు, పోతురాజు బాబుల జాతరకు భక్తజనావళి పొటెత్తుతోంది. గత ఏడాది నవంబరు 17న ప్రారంభమైన అమ్మవార్ల జాతర ముగింపునకు రావటంతో ఏలూరు నగరం పూర్తిస్ధాయి ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ముఖ్యంగా ఒన్‌టౌన్ ప్రాంతంలోని ప్రతి ఇంట పండుగవాతావరణం కన్పిస్తోంది. ఆ ప్రాంత ప్రజలతోపాటు టుటౌన్ ప్రాంతంలోని కొంతమంది జాతరను జరుపుకుంటున్నారు. గతంలో 11 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవాన్ని ఈసారి ఏడేళ్లకే జరపుతున్నారు. దాదాపు నాలుగునెలలపాటు నగరమంతా అమ్మవార్ల నామస్మరణతో భక్తిపారవశ్య వాతావరణం నెలకొంది. జాతర ఆచారం ప్రకారం నాలుగునెలలపాటు పురప్రజలు ఎటువంటి శుభకార్యాలను నిర్వర్తించలేదు. అమ్మవార్లకు ముడుపులు కట్టిన నాటి నుండి జాతర ముగిసేవరకు తమ ఇళ్లలో అమ్మవారి పూజ తప్ప మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదన్న నియమాన్ని భక్తులు పాటిస్తూ వచ్చారు. నవంబరు 17న ప్రారంభమైన జాతర ఈనెల 13న అమ్మవార్లను వైభవంగా సాగనంపడంతో ముగియనుంది. జాతరలో ప్రధానఘట్టమైన అమ్మవార్లకు మహాకుంభం పోసే ప్రక్రియ ఆదివారం తెల్లవారుఝామున 3.10గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు, ఆ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు శనివారం మధ్యాహ్నం నుంచి ఏలూరు నగరం జనంతో పొటెత్తింది. అమ్మవార్లకు గారెలు, పెరుగు అన్నం, ఇతర పిండివంటలతో కుంభం పోసి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని జాతర చివరిరోజు రాత్రి వీధుల్లో పొలికేకలు పెడుతూ ఇళ్లపై చల్లుతారు. ఈకారణంగా అంటువ్యాధులు, పిశాచ పీడలు ఉండవని ఒక నమ్మకం. కాగా ఇప్పటివరకు పంబల జాతి పురుషునకు అమ్మవారి వేషం వేసి కొర్లబండిలో ఊరేగించి ఊరి శివారులలో విడిచిపెట్టడం చేస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం పంబల వృత్తిని చేసుకునే మహిళ లభ్యం కావటంతో ఆమెను కొర్లబండిలో ఊరేగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జాతర కమిటీ నిర్వాహకులు తెలిపారు.
జాతరలో భాగంగా శనివారం ఉదయం నుంచి స్ధానిక పడమరవీధిలో అమ్మవార్ల మేడల వద్ద భక్తజనం పొటెత్తారు. అమ్మవార్లకు కుంకుమ, పసుపు, ఎర్రగాజులు, ఎర్రచీరలను మొక్కుబడులుగా సమర్పించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. ప్రతి ఇంట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. జాతర మహోత్సవానికి బంధువులు, మిత్రులను ఆహ్వానించటంతో శనివారం ఉదయం నుంచి వారి రాక ప్రారంభమైంది. జాతర చివరి ఘట్టాలు ప్రారంభం కావటంతో నగరం అంతా భక్తజనంతో నిండిపోయింది. ఏ ప్రాంతంలో చూసినా అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనమే దర్శనమిచ్చారు. పురవీధుల్లో వేప తోరణాలు, జాతర కోసం రూపొందించిన ప్రత్యేక తోరణాలతో అలంకరించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు భారీఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఒన్‌టౌన్ ప్రాంతంలోని ప్రతి ఇంటి వద్ద షామియానులు ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు సరఫరా చేసేందుకు చలివేంద్రాలను పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ మూడు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుచేసింది. స్ధానిక పడమరవీధిలోను, అంబికా ధియేటర్ వద్ద, శనగపప్పు బజారు వద్ద ఈ శిబిరాలను ఏర్పాటుచేశారు. ఎవరికైనా అత్యవసర వైద్యసేవలు అవసరమవుతే వాటిని అందించేందుకు ఇక్కడ ప్రత్యేక వైద్యబృందాలను నియమించారు. నగరపాలకసంస్ధ సిబ్బంది కూడా పారిశుద్య నిర్వహణ విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. శనివారం రాత్రి నగరంలోని బట్టలు దుకాణాలన్నీ కిటకిటలాడిపోయాయి. ఆడబిడ్డలను ఇంటికి పిలిచి బట్టలు పెట్టే సంప్రదాయం జాతర సందర్భంగా చోటుచేసుకోవటంతో వేల రూపాయలను ఖర్చు చేసి వస్త్రాలను కొనుగోలు చేశారు. మొత్తంమీద నగరంలో ఎక్కడ చూసినా అమ్మవార్ల జాతర సందడి కన్పిస్తోంది. ఎప్పుడు లేనివిధంగా ఈసారి భక్తులు తమ ఇళ్ల ముందు జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేయటం విశేషం. అదేవిధంగా ఆలయాల పరిసర ప్రాంతాలలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు భారీ స్వాగతద్వారాలను ఏర్పాటుచేశారు. సోమవారం అమ్మవార్ల సాగనంపు కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు జాతర కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. దీనిలోభాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కళాబృందాలను తీసుకువచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన శక్తివేషాలు, అంగరభేరి మేళం, వీరంగమేళం, కనకడప్పులు, గరగల నృత్యం, కోయడ్యాన్సులు, నాగిని, నీగ్రో, రాజారాణి, గుర్రాల డ్యాన్సులు, తాటకి, ఆంజనేయ స్వామి తదితర చిత్రవిచిత్ర వేషాలతో అమ్మవార్ల ఊరేగింపు సాగనుంది. స్ధానిక పడమరవీధి అమ్మవార్ల మేడల నుంచి సోమవారం ఉదయం ప్రారంభమయ్యే ఊరేగింపు కుండీ సెంటరు, గడియారస్తంభం, మెయిన్‌బజారు, బిర్లాభవన్, వైఎంహెచ్‌ఎ, పేరయ్యకోనేరు, కస్తూరిబా ఉన్నతపాఠశాల, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, జూట్‌మిల్లు, కేసరి ధియేటర్, వసంతమహల్, పాతబస్టాండు, ఎఎస్‌ఆర్ స్టేడియం, మార్కెట్‌యార్డుల మీదుగా ఆశ్రం ఆసుపత్రి వరకు కొనసాగుతుంది. అక్కడ కొర్లబండిలో కూర్చొపెట్టిన పంబలమ్మను వదిలివేసి భక్తులు వెనుదిరుగుతారు. పంబలమ్మ పూజలు చేసిన అనంతరం వెనక్కి వస్తుంది. 120 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన ఈ జాతర మహోత్సవాన్ని వీక్షించేందుకు ఆది, సోమవారాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు పదిలక్షల మంది భక్తజనం హాజరవుతారని భావిస్తున్నారు.
* నేడు మహాకుంభం* రేపు కొర్లబండిలో సాగనంపు* పోటెత్తుతున్న భక్తజనం* విస్తృతమైన ఏర్పాట్లు* నగరం అంతటా సందడే..సందడి
english title:
A
Date:
Sunday, February 12, 2012