భీమవరం, ఫిబ్రవరి 11: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రార్ధనామందిరం తొలగింపు వివాదంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును అరెస్టుచేసి భీమవరం సర్కిల్ పోలీస్టేషన్‌కు శనివారం తెల్లవారుఝామున తరలించారు. ఈ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్టేషన్ బయట బైఠాయించారు. ఆయనతోపాటు రాష్టప్రార్టీ నాయకులు మెంటే పార్ధసారధి, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), మాజీ జడ్పీటీసీ గేదెల జాన్ కూడా బైఠాయించారు. ప్రార్ధనామందిరం వివాదంలో హైకోర్టు ఉత్తర్వులను చూపించమని అడిగిన తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్యే శివ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఈ ప్రార్ధనామందిరం వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎమ్మెల్యే శివ అరెస్టుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భీమవరం సర్కిల్ పోలీస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శివరామరాజు అరెస్టుకు నిరసనగా ఉండి నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్రప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు చలమలశెట్టి రామాంజనేయులు, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి తోట భోగయ్య, వీరవాసరం మాజీ జడ్పీటీసీ పోలిశెట్టి దాసు, మైలాబత్తుల ఐజాక్‌బాబు, సతివాడ హరిబాబు, లంకి చిన్ని తదితరులు పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు. భారీఎత్తున పార్టీశ్రేణులు అక్కడకు చేరుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. లాఠీలతో పోలీస్టేషన్ వద్దకు వారుకూడా చేరుకున్నారు. ఒకానొక పరిస్థితిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, పార్టీశ్రేణుల మధ్య వివాదం చోటుచేసుకోబోతున్న తరుణంలో నరసాపురం ఆర్డీవో వెంకటసుబ్బయ్య, నరసాపురం డిఎస్పీ రఘువీరారెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే పార్టీశ్రేణులతో మాట్లాడి ఎమ్మెల్యే శివతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తదితరులతో చర్చలు జరిపారు. దీంతో చర్చలు కూడా గంటల తరబడి జరిగాయి. ఇంతలో మరి కొంతమంది పార్టీకార్యకర్తలు స్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేశారు. ఇంతలో మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు (అబ్బాయిరాజు), సీనియర్ నాయకులు కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రార్థనామందిరం తొలగింపు విషయంలో ఆర్డరుకాపీ చూపించమని కోరగా అరెస్టు చేశారని ఎమ్మెల్యే శివరామరాజు పోలీసుల ముందు పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తమపని తాము చేసుకున్నామని అధికారులు చెప్పారు. ప్రార్థనామందిరాన్ని తిరిగి ఏర్పాటుచేయాలని, దాని నిర్మాణానికి పూనుకున్నవారిని విడుదల చేయాలని ఎమ్మెల్యే శివరామరాజు అధికారులను డిమాండ్ చేశారు. దీంతో ఉన్నతాధికారులతో చర్చించిన తరువాత వేరే ప్రాంతంలో ప్రార్థనామందిరం నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు సమకూర్చుతామని అధికారులు హామీ ఇవ్వడంతో శివరామరాజు నిరసన విరమించారు. ఈ విషయం తెలియగానే పార్టీశ్రేణులు, కార్యకర్తలు సంతోషంతో ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తదితరులను పూలదండలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే శివ నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన కఠినంగా వ్యతిరేకించారు.
గూడెంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
దళితసంఘాలు, రాజకీయపార్టీల ఆందోళన
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి11: తాడేపల్లిగూడెంలో తాలూకాఫీసుసెంటరులో శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసంచేసిన సంఘటన తీవ్రసంచలనాన్ని కలిగించింది. స్ధానిక సర్కిల్ పోలీసుస్టేషన్ కార్యాలయానికి సమీపంలో, తాలూకాఫీసు ప్రాంగణం ఆనుకుని ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహతలభాగాన్ని గుర్తుతెలియనివ్యక్తులు ధ్వంసంచేశారు. శనివారం ఉదయం అంబేద్కర్ విగ్రహం తలధ్వంసం అయిన విషయాన్ని ప్రజలు గుర్తించి, ఆందోళన చెందారు. ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం 4గంటలవరకు దళితసంఘాలు, రాజకీయపార్టీలు నేతృత్వంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఒకదశలో ఎమ్మెల్యే ఈలినానిపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఈలినాని ఉదయం 10గంటలనుండి సాయంత్రం 4గంటలవరకు రాజకీయపార్టీలు, దళితనాయకులతో సామరస్యంగా వ్యవహరించడంతో సమస్య తీవ్రత సద్దుమణిగింది. అంబేద్కర్ విగ్రహం దాడి తెలిసిన వెంటనే పోలీసు రెవిన్యూ ఉన్నతాధికారులు హుటాహుటిన గూడెం చేరుకున్నారు. అదనపు పోలీసుబలగాలను గూడెంకు తరలించినా, వాటిని ఆందోళనకారుల వద్దకు తీసుకురాకుండా ఎమ్మెల్యే నిలిపివేసి, సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా ప్రయత్నించారు. జిల్లాలో సిద్ధాంతంలో అంబేద్కర్ విగ్రహదాడి మొదటిది కాగా తాడేపల్లిగూడెంలో సంఘటన రెండోది. కులమతాలకు అతీతంగా సమైక్యంగా ఉండే తాడేపల్లిగూడెంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం పట్టణప్రజల్లో తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. ఆందోళనకారులు చేస్తున్న ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎయంసి చైర్మన్ పోతుల అన్నవరం ముందుగా సంఘీభావం తెలిపి వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన ఎమ్మెల్యే ఈలినాని చివరివరకు ఉండి సమస్య పరిష్కారానికి రెవిన్యూ, పోలీసుఅధికారులు ఆందోళనకారులతో చర్చించి సానుకూలంగా స్పందించారు. నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటామని, అంబేద్కర్ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఈలినాని, ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఎంవి శేషగిరిబాబులు హామీయివ్వడంతో నిరసనను, ధర్నాను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరకువాడ రంగనాధరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముళ్లపూడి బాపిరాజు, ఎయంసి మాజీచైర్మన్ తోట గోపి, సిపియం కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సి పి ఐ కార్యదర్శి మండెల్ల నాగేశ్వరరావు, కెవిపియస్ నాయకులు నీలం అశోక్‌కుమార్, కళింగ లక్ష్మణరావు, మాలమహానాడు నాయకులు చీకటిమిల్లి మంగరాజు, దేవాబత్తుల వెంకన్నబాబు, నాచు సూర్యారావు, మిద్దే రత్నరాజు, ఎం ఆర్‌పియస్ నాయకులు కానేటి సంజయ్‌ఖాన్, బొల్లిపో రత్నాజీ, మెరిపో నాగరాజు, శీలి వెంకటాచలం, బియస్‌పి నాయకులు గుంపుల సత్యకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, చుక్కా పెంటయ్య, అంబటి విజయ్‌కుమార్, మూలినివాసి సంఘనాయకులు సుబ్బయ్య, డి ప్రదీప్‌కుమార్, ఎం ప్రభాకర్, హెచ్ ఆర్‌యఫ్ నాయకులు తానేటి ఆనందరావు, మెరిపో జాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదవోలులో పోరంబోకు భూముల ఆక్రమణ
దేవరపల్లి, ఫిబ్రవరి 11: దేవరపల్లి మండలం యాదవోలులో పంచాయతీ పోరంబోకు గ్రామకంఠం ఖాళీస్థలాల్లో యాదవోలు గ్రామ ప్రజలు ఇళ్ళు నిర్మించుకోవటానికి ఆక్రమించుకుని కర్రలు పాతారు. శుక్రవారం అర్థరాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు యాదవోలు గ్రామంలో ఖాళీస్థలంలో కర్రలు పాతారు. గత కొంత కాలంగా యాదవోలు గ్రామంలో స్వామి అయ్యప్ప ఆలయాన్ని నిర్మించేందుకు ఒక పార్టీకి చెందిన నాయకుడు కొంతమంది గ్రామస్థుల సహకారంతో స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. మరో పార్టీ నేత గ్రామ సర్పంచ్ సహకారంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వచ్చాడు. ఈ వివాదం కొనసాగుతుండగా, శుక్రవారం అర్థరాత్రి యాదవోలు గ్రామానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఖాళీ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకునేందుకు కర్రలు పాతారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఖాళీ స్థలంలో ఈ కర్రలు దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ మమీ, డిప్యూటీ తహసీల్దార్, విఆర్‌వోలు శనివారం సాయంత్రం యాదవోలు గ్రామంలో పర్యటించి పాతిన కర్రలను తొలగించాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ మధుసూదనరావు, విఆర్‌వోలు రాజు, జగదీశ్వర్‌రావులు దేవరపల్లి పోలీసుల సహకారంతో పాతిన కర్రలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం యాదవోలు గ్రామం ప్రశాంతంగా ఉన్నా, ఇరువురు నేతల ఆధిపత్య పోరులో భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదవోలు గ్రామంలో గత 18 సంవత్సరాలుగా కాంగ్రెస్, టిడిపి పార్టీల మధ్య ఈ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీకి మాజీ సర్పంచ్ లింగంకుంట లక్ష్మి, పోలా సత్యనారాయణలు నాయకత్వం వహిస్తుండగా, తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపిపి ఉపాధ్యక్షుడు అనిశెట్టి ప్రభాకర్‌రావు నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఆధిపత్య పోరులో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని గ్రామంలోని తటస్థ వర్గానికి చెందిన ప్రజలు కోరుతున్నారు.
* అరెస్టుకు నిరసనగా కార్యకర్తల ఆందోళన* ఎమ్మెల్యే అరెస్టు, విడుదల
english title:
P
Date:
Sunday, February 12, 2012