అంత రావణడు తన అగ్రనందనుణ్ణి ఇంద్రజిత్తుణ్ణి కాంచి, ధైర్యస్ఫూర్తితో ఈ పగిడి వాకొన్నాడు.
‘‘కుమారా! ఇంద్రజితుడా! నువ్వు కన్నులు తెరచీ తెరవకుండానే ‘ఇంద్రజితుడ’వయావు. నిజంగా మహేంద్రుణ్ణి జయించి, చిరకాలం చెరబెట్టి వుంచావు. మాయా సంగరంలో నిన్ను మించగలవాడు అరిది. బలపరాక్రమాలలో తండ్రినయిన నన్ను మించిన పుత్రుడివి. నిఖిలలోకాలలో నీకు ఎదురు ఎవ్వరు? అయినా ఆ వానరుణ్ణి చులకనగా కొనక, ఏమరుపాటు చెందక, నీకు సహజంగా అబ్బిన శౌర్యంతో నానా విధ దివ్య బాణ ప్రభావాలు చూపి జయలక్ష్మిని కైవసం చేసుకో- పోయిరా!’’ అని దీవించి పంపాడు.
అనిలో తనవిజయాన్ని ఆకాక్షించిన తండ్రి రావణుని ఆ మేఘనాథుడు వీడ్కొన్నాడు. అగ్నివలె, ఆదిత్యుడి భంగి వెలిగే తేరు ఎక్కాడు. అగణ్యమైన తన ధనుర్జ్యా ఘోషం కావించాడు. ఆ ఘోషకి దిగ్గజాల కర్ణపుటాలు పగిలాయి. లోకాలన్నీ బెదరాయి. దిక్చక్రబంధాలు సడలాయి. సురలోక భీకరంగా ఏతెంచి పవన నందనుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అమరులు, దేవాయుధులు, వాసవాది దిక్పాలురు, కిన్నరులు దివిని డాగి వీక్షించసాగారు. రావణుడి అగ్రతనయుడు ఇంద్రజిత్తు విజృంభించి మారుతి దేహం ఆవంత అయినా కనపడనీకుండా అపూర్వంగా, అద్భుతంగా నిశాతవిశిఖాలు వర్షించాడు. పావని ఆరావణి అస్తమ్రులను తన భీకరవాలంతో చితకబాదుతూ తప్పించుకొంటూ శరవేగ లక్ష్యానికి గోచరుడు కాకుండా అద్భుత శౌర్యంతో కయ్యం సలిపాడు. అంత నిర్జితఐ రావణి రావణి పావని అసమాన బల వేగాతి శయానికి వేగాతిశయానికి నివ్వెరపోయాడు. కొంతసేపు అతడికి చేయాడలేదు. మరల దివ్యాస్త్రాలు గురి తప్పకుండా ప్రయోగించాడు. అంజనాతనయుడు ఆ అస్త్రాలను తుత్తునియలు కావించాడు. ఇంద్రజితుడిని తరువులతో, గిరులతో కొట్టి బాధించాడు. కొన్ని తరువుల్ని రావణసుతుడు శరాలతో జర్జరితాలు చేశాడు. అపుడు ఆంజనేయుడు అలిగి ఆ రావణ జ్యేష్ఠ తనయుణ్ణి అవలీలగా తన్ని రథరథ్యాలను నుగ్గు నుగ్గు కావించాడు. విరథుడైన ఇంద్రజిత్తు హనుమంతుడి విక్రమానికి, లావుకి మెచ్చి ఉగ్రమైన వాయువీర్యాస్త్రం ప్రయోగించాడు. వాయుకుమారుడు కావడంవల్ల కపినాథుడు ఆ అస్త్రానికి కించిత్తయినా చలించలేదు. ఇంద్రజిత్తు తాను అరుదుగా ప్రయోగించే రౌద్రాస్త్రం వదలాడు. కాని పవనపుత్రుడు రుద్రబీజం అవడం కారణంగా కదలక మెదలక నిలుచున్నాడు. అపుడు రావణ తనయుడు మిక్కిలీరుష్టుడు అయాడు. అమరులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు చూసి, దూషిస్తూ వుండగా అంజనా నందనుడి మీద దుర్జయం అయిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మహాస్త్ర రాజము మన్ను మిన్ను ఏకం అయే రీతిగా నిప్పులు చిమ్ముతూ వాయుసుతుడి మీదకి వచ్చి తాకింది. బ్రహ్మాస్త్రంవల్ల తనకు ప్రాణభీతి లేకుండా బ్రహ్మవరం పొందడంవల్ల ఆ అస్త్రానికి వెరవక, బ్రహ్మ మంత్రాలు పఠించగా ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడిని బంధించి, కుదించి, నేల మీద పడవేసింది. పుడమిమీద ఒరిగిపోయిన ఆంజనేయుడిని కని రక్కసులందరూ ‘‘పట్టండి, కట్టండి, కొట్టండి పొడవండి’’ అంటూ కర్కశాలైన త్రాళ్ళతో గట్టిగా కట్టివేశారు.
హనుమంతుడు అవశుడై వుండడం కాంచి, ఇంద్రజితుడు అతడి చెంతకి శీఘ్రంగా ఏతెంచి బ్రహ్మాస్త్రం చేత చావక ఈ విధంగా బంధింపబడినప్పుడే ‘‘ఈ వానరుడెవ్వడో? అనిలో ఇతడిని చంపకూడ’’దని నిశ్చయించి, పట్టి తెచ్చి తన తండ్రి రావణాధిపుడి ముందర మారుతిని నిలబెట్టాడు.
అంత రావణుడు, అతని అమాత్యులు ఇంద్రజిత్తు పరాక్రమానికి మిక్కిలి సంతోషించారు. మారుతాత్మజుని కనుగొనగానే రావణుడి కనుదోయి ప్రళయాగ్ని కణాలు రాల్చ హనుమంతుణ్ణి కని రాక్షసరాజు ఈగతి పలికాడు. ‘‘ఓరీ! వానరాధముడా! ఎవడవురా? నా నగరంలోపలకి ఒంటరివాడవై ఏలాగు ప్రవేశించావు? నీ పేరేమిటి? ఏ వెరవుతో ఈ జలధిదాటి వచ్చావు?
-ఇంకాఉంది