భర్తృహరి సుభాషితాలలో ‘‘యఃప్రీణయేత్సుచరితై’’ అనే శ్లోకంలో ఆనందాన్ని కలిగించే పుత్రుడు, హితాన్ని ఒనగూర్చే భార్య, సుఖదుఃఖాలలో సమానంగా వ్యవహరించే మిత్రుడు ఈ లోకంలో పుణ్యవంతుడికే లభ్యపడతాయని చెప్పాడు. ‘‘పున్నామో నరకత్రాయత ఇతి పుత్రః’’ పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడని వేదాలు పేర్కొనడంవల్ల, శక్తి సన్నగిల్లిపోయిన సమయంలో, తనకు గల బాధ్యతలన్నింటినీ తీసుకుని నెరవేర్చడంవల్ల తన కుటుంబ పోషణ భారం వహించడంవల్ల, తనకు ఉత్తరక్రియలు జరపడంవల్ల కొడుకు వారసుడవుతున్నాడు.
ఇలా కొడుకు బాధ్యతలకు, ఆస్తిపాస్తులకు వారసుడిగా వుండడమన్నది భారతీయ సంప్రదాయంగా వస్తున్నది. కష్టనష్టాలనెదుర్కొని పిల్లల పెంపకాన్ని భారంగా భావించని తండ్రికి కొడుకు చేయగలిగిన ప్రత్యుపకారం తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవడమే. ఇది బాధ్యత కాదు. ధర్మం. బాధ్యత నిర్బంధమైతే ధర్మం స్వచ్ఛందం. ఇష్టపూర్వకంగా అనుసరించే పని తప్పితే కష్టంగా చేసేపని ఏ మాత్రమూకాదు. తనను పెంచడంలో కష్టాలను కలిగించే కొడుకుగానీ, సరి అయిన సమయంలో తండ్రికి అండగా నిలబడని కొడుకుగానీ నిష్ప్రయోజకుడు అవుతాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా గిట్టినా ఒకటే. పుట్టలోని చెదలు పుట్టినట్లు గిట్టినట్లు అంతే అంటాడు వేమన.
జన్మతః ఏర్పడిన బంధంతో సంబంధం లేకుండా పరాయి ఇంటినుండి వచ్చిన వ్యక్తి జీవితంలో భాగస్వామిగా నిలిచి జీవితాంతం తోడు నీడగా నిలిచే భార్య స్థానం అనిర్వచనీయమైనది. ఒక పక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, మరోపక్క సేవలందిస్తూ ధర్మనిర్వహణలో తన వెంట నుండి నడిపిస్తూ నడిచివచ్చే తోడు అర్థాంగి. భార్యాభర్తల బంధం అలౌకిక బంధంగా, ఏడు జన్మల బంధంగా కొనియాడబడింది. అన్నివిధాలా తగిన, అనుకూలవతి అయిన భాగస్వామి దొరకడమన్నది స్ర్తిలకైనా, పురుషులకైనా ఒక వరమేనని చెప్పాలి.
భార్య అనుకూలవతి కాకపోయినా, తన కుటుంబంలో ఇమడకపోయినా, సహకరించకపోయినా, జీవితం అధోగతి అవుతుంది. జీవితంలో ఎక్కువ కాలం కలిసి బ్రతుకవలసి వున్న భార్య యోగ్యురాలైతే ఆ పురుషుని జన్మ ధన్యమే అవుతుంది. మనిషి తన సగటు జీవితంలో ఇంట్లో కంటె ఎక్కువ కాలం సమాజంలోని ఇతరులతో కలిసి వుంటాడు. ఆ క్రమంలో స్నేహాలు ఏర్పడతాయి. స్నేహం వ్యక్తులపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి స్నేహితులు వుండేవారు తాముకూడా మంచిగా వుంటూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు. చెడు సావాసాలు మనిషిని దిగజారేలా చేస్తాయి.
వ్యసనపరులు, నీతిహీనులైనవారితో స్నేహం చేయడానికి ఎవరైనా వెనుకాడతారు. స్నేహం కాలక్షేపానికి కాకుండా ఇతరులలోని మంచి లక్షణాలను అలవరచుకోవడానికి తోడ్పడేలా ఉండాలి. వారిని కూడా ప్రోత్సహిస్తూ వారిలోని మంచి గుణాలను పొగుడుతూ వారిలోని లోపాలను సరిదిద్దుతూ, అవసరమైన సమయంలో సహాయం చేసేందుకు సిద్ధంగా వుండాలి. అటువంటివాడే నిజమైన స్నేహితుడు.
ఈ విధంగా మంచి పుత్రుడు, భార్య, మిత్రుడు లభించడమంటే భర్తృహరి చెప్పినట్లు నిజంగా పూర్వజన్మ సుకృతఫలమే. ఈ మూడు ఒనగూడినవాడికి జీవితంలో లోపం లేనట్లే. అతడి సుఖజీవితానికి ఏ మాత్రమూ ఆటంకం లేనట్లే. అన్ని పురుషార్థాలు సిద్ధించినట్లే.
మంచిమాట
english title:
m
Date:
Thursday, March 28, 2013