Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

క్రీడకు చీడ!

$
0
0

అంతర్జాతీయ షడ్యంత్రంలో భారత శ్రీలంక సంబంధాలు చిక్కుబడిపోయాయి. జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలిలో అమెరికా నడిపించిన శ్రీలంక వ్యతిరేక క్రీడలో మన ప్రభుత్వం పావుగా మారిన నేపథ్యంలో కొనసాగుతున్న విపరిణామ క్రమం మన దక్షిణ సరిహద్దులను బలహీన పరుస్తున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ వారు సరికొత్తగా సృష్టించిన సంక్షోభం భారత లంకల మధ్య సరికొత్త వైరుధ్యానికి అంకురార్పణం చేసింది. మదరాసులోని తమ దౌత్య కార్యాలయాన్ని - డిప్యూటీ హైకమిషన్- మూసివేయడానికి సింహళ ప్రభుత్వం సకల సన్నాహాలు పూర్తి చేయడం మన ప్రభుత్వానికి ఆందోళన కలిగించవలసిన అంశం! శ్రీలంకనుండి వస్తున్న పర్యాటకులను అడ్డుకొనడంతో మొదలైన ద్రవిడ పార్టీల నాటకం ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ క్రికెట్ నుంచి లంక క్రీడాకారుల బహిషర్కరణతో ఉత్కంఠ ఘట్టానికి చేరుకుంది. ఇంత జరిగిపోతున్నప్పటికీ మన ప్రభుత్వం పరిస్థితులు విషమించకుండా నిరోధించడానికి తీవ్రమైన చర్యలు పూనుకోకపోవడం మన అంతర్గత సంకీర్ణ రాజకీయాలు సృష్టించిన వైపరీత్యం. చెన్నైలో జరుగుతున్న ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ వారి పది ఆటలనుంచి శ్రీలంక క్రీడాకారును తప్పించడం ద్వారా ‘నిర్వాహకులు’ చేతులు దులుపుకుంటున్నారు. కానీ ‘దులుపుడు’నకు గురైన దుమ్ము పడి మన దౌత్య నయనాలు మసకబారుతున్నాయి. ‘ఐపిఎల్’ వారి అన్యాయమైన నిర్ణయానికి ద్రవిడ పార్టీల ఒత్తడి కారణం కావచ్చు. తమిళనాడు ప్రభుత్వం సైతం శ్రీలంక క్రీడాకారులను మనదేశంలోకి అడుగుపెట్టనివ్వనని నిరసన వ్యూహానికి మద్దతునిస్తూ ఉండవచ్చు. అందువల్ల విధిలేని పరిస్థితుల్లో చెన్నై ఆటలకు దూరంగా ఉండమని ‘ఐపిఎల్’ కోరి ఉండవచ్చు! కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?? మదరాసులో జరిగే క్రీడల నుంచి లంక ఆటగాళ్ళను తప్పించడమొక్కటే మార్చరాదు. ఆటలను చైన్నైనుంచి బయడకు తరలించి ఉండవచ్చు. ఇలా మార్చలవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ‘ఐపిఎల్’ నిర్వాహకులకు సలహా ఇవ్వలేదు. ‘ఐపిఎల్’ నిర్వాహకులకు తోచలేదు! తమ రాష్ట్రంలో జరిగే క్రీడలో లంక ఆటగాళ్ళు పాల్గొనడం వల్ల ఇప్పటికే ఉద్రిక్తవంతమై ఉన్న వాతావరణం మరింతగా జ్వలించి పోతుందని, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఉత్తరం కూడా వ్రాశారట! అందువల్ల శ్రీలంక క్రీడాకారులను తప్పించకుండా క్రీడాస్థలిని ఇతర చోట్లకు బదిలీ చేసి ఉన్నట్లయితే ద్రవిడ రాజకీయ పార్టీలు కోర్కె నెరవేరేది. శ్రీలంక క్రీడాకారులు తమ రాష్ట్రానికి రాకూడదని మాత్రమే ద్రవిడ పార్టీల కోర్కె. అలా క్రీడా వేదికను ఐపిఎల్ వారు తరలించి ఉండినట్టయితే ఈ కోరిక నెరవేరేది. శ్రీలంకతో మన సంబంధాల మరింత క్షీణించకుండా నిరోధించినట్టయ్యేది. చివరి నిముషంలో ఎలా తరలించాలి? చైన్నై క్రీడల నిర్వాహకులకు, వ్యాపారులకు ప్రేక్షకులకు అసౌకర్యం ఏర్పడుతుంది కదా! వంటి వాటికి సమాధానం చెప్పేపని లేదు. కేంద్రం చిత్తశుద్ధితో దృఢచిత్తంతో పూనుకొని ఉంటే ఇది జరిగి ఉండేది.
గత ఏడాది ఐక్య ప్రగతి కూటమి వారికి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే ప్రధాన లక్ష్యమైంది. ఈ లక్ష్యం కేంద్ర బిందువుగా రూపొందిన విదేశాంగ విధానం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి నాయకత్వంలోని ‘ద్రవిడ మునే్నట్ర కజగం’ కూటమి ముందు మోకరిల్లింది. ప్రభుత్వాన్ని డిఎంకె కూల్చివేస్తుందన్న భయం, శ్రీలంక పూర్తిగా మనకు వ్యతిరేకంగా మారుతుందన్న మరో భయం పరస్పరం విరుద్ధమైనవి. ఈ వైరుధ్యాల మధ్య కేంద్ర ప్రభుత్వం అడకత్తెరలో పోక వలె మారింది. ప్రభుత్వం ఒకవేళ కూలిపోయినప్పటికీ జెనీవాలో అమెరికా కూటమి వారు ప్రస్తావించిన శ్రీలంక వ్యతిరేక తీర్మానాన్ని మన ప్రభుత్వం వ్యతిరేకించవలసి ఉంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం చైనాతో జట్టు కట్టకుండా నిరోధించడం అనివార్యం! ద్రవిడ పార్టీల ఒత్తడికి లొంగి గత ఏడాది, ఈ ఏడాది కూడ మన ప్రభుత్వం అమెరికా తీర్మానాన్ని సమర్ధించింది. ఫలితంగా తీర్మానాన్ని వ్యతిరేకించిన చైనా శ్రీలంకకు దగ్గరైంది. శ్రీలంకను చైనా చంకనెక్కించడం మినహా మన ప్రభుత్వం చేసింది శూన్యం. 2009లో ముగిసిన సమరంలో శ్రీలంక ప్రభుత్వం ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల’ -ఎల్‌టిటిఇ-ను నిర్మూలించింది. ఈ నిర్మూలన కార్యక్రమంలో శ్రీలంక ప్రభుత్వం మానవ అధికారాలను ఉల్లంఘించిందన్నది అమెరికా తీర్మానం ఇతివృత్తం.
మానవ అధికారాలను శ్రీలంక ప్రభుత్వం ఉల్లంఘించిందన్న విషయమై ఇప్పటికీ స్పష్టత ఏర్పడలేదు. శ్రీలంక ప్రభుత్వం యుద్ధం సందర్భంగా ఉల్లంఘించగలిగింది, ఎల్‌టిటిఇ అధికారాలను మాత్రమే. యుద్ధక్షేత్రం నుండి సామాన్య తమిళులను సురక్షిత శిబిరాలకు తరలించిన తరువాత మాత్రమే శ్రీలంక ప్రభుత్వం ఎల్‌టిటిఇపై దాడులను మొదలుపెట్టింది. కానీ లంక ప్రభుత్వం తమిళ ప్రజల హక్కులను ఉల్లంఘించిందని, జాతి నిర్మూలనకు పాల్పడిందని తమిళనాడులోని ద్రవిడ పార్టీలు యుద్ధానికి ముందునుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. ఎల్‌టిటిఇపై దాడులను తమిళ ప్రజలపై దాడులుగా చిత్రీకరించడానికి ద్రవిడ పార్టీలు చేసిన, చేస్తున్న ప్రయత్నం మొత్తం సమస్యకు మూలకారణం. ఇరవై ఎనిమిదిన్నర వేల శ్రీలంక శరణార్ధులు ఇప్పటికీ తమిళనాడులో ఉన్నారు. వీరిని మళ్ళీ శ్రీలంకకు పంపడానికి జరిగిన యత్నం విఫలమైంది. అందుకు కారణం వీరందరూ భారతీయ పౌరసత్వం కోరడం. కానీ ఈ శరణార్ధులందరూ 2005వ సంవత్సరానికి పూర్వం మన దేశానికి వచ్చినవారు. శ్రీలంక ప్రభుత్వ దళాలకు ‘ఎల్‌టిటిఇ’ బీభత్స కారులకు మధ్య జరిగిన పోరాటంలో చిక్కుపడకుండా వీరు మనదేశానికి వచ్చారు. కానీ 2008-09 సంవత్సరాలలో జరిగిన యుద్ధం సందర్భంగా సామాన్య తమిళులెవ్వరూ ఇలా చిక్కుపడలేదు. ఎందుకంటె శ్రీలంక ప్రభుత్వం నిర్యుద్ధ మండలాలను ఏర్పాటు చేసింది. యుద్ధక్షేత్రం నుండి నిర్యుద్ధ మండలాలకు సామాన్య తమిళులను తరలించింది. కానీ సామాన్య తమిళులలో కలిసిపోయిన ‘ఎల్‌టిటిఇ’ బీభత్సకారులు నిర్యుద్ధ మండలాలనుంచి ప్రభుత్వ దళాలపై దాడులు మొదలు పెట్టారు అందువల్ల లంక ప్రభుత్వం నిర్యుద్ధ మండలాలలోని సామాన్య ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించింది. అందువల్ల 2008-09 సంవత్సరాల్లో యుద్ధం జరిగినప్పుడు కాని, యుద్ధం ముగిసిన తరువాత కాని, శ్రీలంక తమిళులెవ్వరూ శరణార్ధులై మనదేశానికి రాలేదు. శరణార్ధులై తమిళులు మనదేశానికి పరిగెత్తి రాకపోవడమే శ్రీలంక ప్రభుత్వం వారిని అణచివేయలేదన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం. తమిళనాడులోని ద్రవిడ పార్టీల రాజకీయ అవకాశవాద నాటకాన్ని శ్రీలంక తమిళులు సైతం అసహ్యించుకుంటున్నారు. మన ప్రభుత్వం మాత్రం డిఎంకె ఒత్తడికి లొంగి లంక ప్రభుత్వాన్ని దూరం చేసుకుంది. డిఎంకె కూడ చివరికి దూరమైంది. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ విధానం ఇలా ఉభయ భ్రష్టుత్వం పాలైంది!

అంతర్జాతీయ షడ్యంత్రంలో భారత శ్రీలంక సంబంధాలు చిక్కుబడిపోయాయి.
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>