మంచిని అభినయించడం మంచిని ఆచరించడం కాదు. అభినయించే వారిలో ఆచరించే వారు ఉండవచ్చుగాక, లేకపోవచ్చుగాక!!
పాకిస్తాన్ బీభత్స వ్యవస్థతో ఇప్పటికైనా తెగతెంపులు చేసుకోవాలా? వద్దా? అన్న విషయమై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతుందని భావించిన వారికి మరోసారి నిరాశ మిగిలింది! ఈ చర్చకు బదులు సంజయ్‌దత్ అనే హిందీ చలనచిత్ర నటునికి సుప్రీంకోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలా! వద్దా? అన్న మీమాంస మొదలు కావడం జాతీయ వైపరీత్యం. సంజయ్‌దత్ అనే వాడు దావూద్ ఇబ్రహీం ముఠాతో కలిసి విందులారగించడం, 1990వ దశకం ఆరంభం నాటి కథ! అందువల్ల అతగాడికి జైలుశిక్ష విధించిన న్యాయస్థానాలు ఆలస్యంగానైనా న్యాయాన్ని నిలబెట్టాయి. 1993 నాటి ముంబయి వరస పేలుళ్లలో హతులైన మూడు వందల పదిహేడు మంది ఆత్మలకు ఇప్పటికైనా కొంత ఉపశమనం కలిగింది! కానీ వెంటనే మార్కండేయ కట్జు వంటి న్యాయ కోవిదులు, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ వంటి రాజకీయ జీవులూ రంగంలోకి దిగిపోయి సంజయ్‌దత్‌ను జైలుకు పంపడం ఘోరమైన అన్యాయమని ఘోషించడం మొదలుపెట్టారు!! ఎందుకు అన్యాయమన్న ప్రశ్న మా ధ్యమాలలో పెద్దగా వినపడడంలేదు. సంజయ్‌దత్ ఇప్పటికే చాలా వ్యథలకు, మానసిక క్షోభకు, కుటుంబం వారి ఎడబాటునకు, వృత్తిపరమైన కుంటితనానికి గురి అయిపోయాడట! ఈ మాటలను కన్నీళ్లను అభినయిస్తున్న ఆయన, ఆయన బంధువులు ప్రధానంగా ఆయన సోదరి ప్రియాదత్త ప్రచారం చేస్తున్నారు. రాజకీయవేత్తలు, ఇతరులు, అభిమానులు కూడ ప్రచారం చేస్తున్నారు. ‘‘అదేంటయ్యా నేరాలు చేసినవారు ఎవరైనా శిక్షలు అనుభవించాలి కదా, శిక్షలు అనుభవించే సమయంలో కష్టపడడం సర్వసాధారణం! సంజయ్‌దత్‌కు మాత్రమే ప్రపంచంలో ఈ బాధ సంభవించలేదు కదా..’’ అని అడిగేవారు కూడ అరుదుగా మాత్రమే నోళ్లు విప్పుతున్నారు. చేసిన ఘోరాలు, నేరాలవల్ల లభించే ఫలితమే కష్టం, నష్టం, చిత్తక్షోభ, వ్య థ, కుటుంబనుంచి, మిత్రులనుంచి, సాటి నేరస్తులనుంచి దూరంగా వుండడం... దీన్నం తా కలిపితేనే శిక్ష అని అంటారు!! న్యాయమూర్తిగా పనిచేసిన మార్కండేయ కట్జూకు ఇదంతా తెలియని విషయం కాదు. సంజయ్ దత్‌కు మాత్రమే శిక్ష అనుభవించడం కష్టం కాదు. యాకూబ్ మెమన్‌కు మరింత కష్టం! 1993లో ముంబయిలో భయంకర పేలుళ్లు జరిపి అమాయకులను హత్య చేసిన నేరస్థులందరికీ ‘శిక్ష’ అనుభవించడం కష్టమే! అది కష్ట్భూయిష్టం, వ్యథా భరితం కాకపోతే దాన్ని ‘శిక్ష’ అని అనరాదు!!
పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’-ఐఎస్‌ఐ-వారు 1993 మార్చి పనె్నండున పదమూడు పేలుళ్లు జరిపించారు. ఈ ఘోరాన్ని చేసిన నేరానికి యాకూబ్ మెమన్‌కు మరో పదిమందికి ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ నెల 21న సుప్రీంకోర్టు పదిమంది మరణశిక్షలు రద్దు చేయడం వారికి జీవిత నిర్బంధ శిక్ష విధించడం వారి అదృష్టం! సంజయ్‌దత్ మరింత అదృష్టవంతుడు! అతగాడికి పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు ఋజువు కాలేదు. అభియోగమే లేదు. అక్రమంగా ఆయుధాలను ఇంట్లో దాచి వుంచిన నేరానికి అతగాడికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలో సైతం ఒక సంవత్సరం మేర సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆరేళ్ల నిర్బంధం ఐదేళ్లకు తగ్గిపోయింది. అక్రమ ఆయుధ నియంత్రణ చట్టం ప్రకారం సంజయ్‌దత్ చేసిన పనికిగాను ఆయనకు గరిష్ఠంగా పదేళ్లు జైలు శిక్ష విధించవచ్చు. ఐదేళ్లకు తగ్గిపోవడం అతగాడి అదృష్టం! కింది న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఇరవై మూడు మంది ‘పేలుళ్ల’ నేరస్థులకు శిక్షలో ఎలాంటి మినహాయింపు లభించలేదు. వీరిలో యాకుబ్ మెమన్ కుటుంబ సభ్యులు కూడ ఉన్నారు. వీరంతా సంజయ్‌దత్ అంతటి అదృష్టవంతులు కారు. మరణశిక్షకు గురి కాకుండా తప్పించుకున్నారు. ‘‘నేను ఘోరమైన నేరం చేశాను, అయినప్పటికీ క్షమించండి’’ అని సంజయ్‌దత్ పశ్చాత్తాపం ప్రకటించినట్టయితే అది వేరే సంగతి! తప్పు సంగతి గురించి ప్రస్తావించడమే లేదు! అంతేకాదు, సుప్రీంకోర్టు నేరస్థుడుగా నిర్ధారించిన తరువాత కూడ సంజయ్‌దత్ తాను నిజంగానే దావూద్ ఇబ్రహీం ముఠా వారికి సహాయం చేసినట్టు అంగీకరించడంలేదు! ఈ సహకరించడంలో భాగంగానే ‘ఎకె-56’ రకం మర తుపాకిని తన ఇంట్లో దాచి ఉంచాడు! దావూద్ ఇబ్ర హీం ముఠా వారు 1993లో ముంబయిలో భయంకర హత్యాకాండకు పాలుపడతారని తనకు తెలియదని, అమాయకంగా ఆ ముఠా తో చేతులు కలిపానని కూడ సంజయ్‌దత్ ప్రకటించడంలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడ ‘‘నేను ఏ తప్పూ చేయలేదు...’’ అని సంజయ్‌దత్ బుకాయించడం న్యాయ వ్యవస్థపట్ల అతడికి అవిశ్వాసానికి నిదర్శనం!
హంతకులు బీభత్సకారులు సంజయ్‌దత్ వంటి ఖల్‌నాయకులు నేరాలను ఒప్పుకోరు! యాకూబ్ మెమన్ అనేవాడు ఇబ్రహీం ముస్తాక్ టైగర్ మెమన్ తమ్ముడు. వీరిద్దరూ మాత్రమే కాదు ఆ కుటుంబంలోని దాదాపు అందరూ దావూద్ ఇబ్రహీం ముఠాలోని వారే. 1993 నాటి ముంబయి పేలుళ్లను జరిపించింది ఈ ముఠా వారే. ఇబ్రహీం పారిపోయి పాకిస్తాన్‌లో నక్కి ఉన్నాడు. మెమన్ కుటుంబంలోని అనేకమందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. కానీ యాకూబ్ మెమన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను నిర్దోషి అని చెప్పాడు. ఇతగాడు 1993 పేలుళ్ల తరువాత ‘బ్యాంగ్‌కాక్’కు థాయ్‌లాండ్‌నుండి పాకిస్తాన్‌కు పారిపోయాడు! పాకిస్తాన్ ప్రభుత్వం ఇతగాడికి రక్షణ శాఖ అధికారులు, సైనిక అధికారులు నివసించే ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసి పోషించింది. వ్యాపారం పెట్టించింది! ఇదం తా తనకు తెలియకుండానే జరిగిపోయిందని ఒక దృశ్య మాధ్యమ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో యాకుబ్ చెప్పాడు. కన్నీళ్లు కూడ పెట్టుకుని తన అన్న టైగర్ మెమన్, ఐఎస్‌ఐ, పాకిస్తాన్ ప్రభుత్వం తనను ఘోరంగా వంచించినట్టు చెప్పుకొచ్చాడు!! సంజయ్‌దత్‌కంటే మిన్నగా అతగాడు అభినయించాడు. ‘అభినయం’ ప్రాతిపదికగా ప్రభావితం అయినట్టయితే సంజయ్‌దత్‌కంటే ముందు యాకూబ్ మెమన్‌ను క్షమించాలి!
సంజయ్‌దత్ ప్రముఖుడయినంత మాత్రా న అతడు నేరాలు ఘోరాలు చేస్తే క్షమించడం ఎందుకు?? ఇతగాడు వేసిన నాయక పాత్రను చూసి మురిసిపోతున్న జనం నిజ జీవితంలో ఇతడు పోషించే దుష్ట భూమిక సంగతిని పట్టించుకోవడంలేదు! చలనచిత్ర మాధ్య మం ప్రజలను అంత గొప్పగా ప్రభావితం చేస్తోంది!! వాస్తవ జీవన ఆచరణ కాక కాల్పనిక జగత్తులోని అభినయం యువజనులను మత్తెక్కించి వేసింది. నిజ జీవితంలో వారు ‘ఈ మత్తులోనే జీవిస్తున్నారు!! వాస్తవం మరుగున పడి వంచన పెరుగుతున్నది కూడ అభినయ మాధ్యమం వల్ల మాత్రమే!! మహాభ్రాంతి ప్రజలను ఆవహించింది. అందువల్లనే సంజయ్‌దత్ ప్రాధాన్యం ఇలా పెరిగింది!!
మరో వైపరీత్యం కూడ ఉంది! కొన్ని మంచి పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న అభినయవేత్త ఆతరువాత దుష్టపాత్రలను పోషించి వాటిని ఉదాత్తీకరించడానికి యత్నిస్తాడు!! ప్రేక్షకులు ఇలాంటి వాటిని కూడ అంగీకరించే స్థితికి దిగజారిపోవడం ఆచరణకంటే అభినయానికి పెరిగిన ప్రాధాన్యానికి కొనసాగుతున్న సాక్ష్యం! హీరోగారు వ్యభిచారి కావచ్చు, వ్యసనపరుడు కావచ్చు, దొంగ కావచ్చు, లైంగిక బీభత్సకారుడు కావచ్చు... జనానికి ఆయా పాత్రలు ఆదర్శవంతమైపోతున్నాయి. ‘చోలీకే పీచే క్యాహై?’ అంటూ సంజయ్‌దత్ వంటి వారు గాడిద గొంతుతో పాడినా అదంతా ‘ఉదాత్తమైనదే’! ఈ కృత్రిమ ఉదాత్తత ఖలనాయకుడిని నాయకుడిగా మా ర్చివేస్తోంది!
ఒకప్పుడు సమాజంలోని సౌశీల్య వంతు లు స్పూర్తిదాయకులుగా ఉండేవారు. బ్రిటిష్‌వారి పాలన ఫలితంగా రాజకీయవేత్తలు స్ఫూర్తి దాయకులయ్యారు. నడుస్తున్న చరిత్రలో అభినయ వేత్తలు, క్రీడాకారులు మాత్రమే స్ఫూర్తి దాయకులు!! అందుకే నిజ జీవితంలో నేరాలు చేస్తున్న సంజయ్‌దత్ వంటి వారు ఇంకా ఎందరో కాల్పనిక జగత్తులో గొప్పవారు...అయితే అయ్యారు కానీ ఈ కాల్పనిక జగత్తు వాస్తవ జగత్తును ఆవహించి దిశను మార్చివేస్తోంది! అభినయవేత్తలలోను, క్రీడాకారులలోను ఆచరణ శీలురు ఉన్నట్టయితే వారిని స్పూర్తి ప్రదాతలుగా భావించవచ్చు! వారెక్కడున్నారో మాత్రం ఎవరికీ పట్టని అంశం!! అందువల్ల అల్లసానిపెద్దన మనుచరిత్ర ప్రబంధ కావ్యంలో ఐదువందల ఏళ్లకు పూర్వం చెప్పినట్టుగా ‘‘నట విట గాయక గణికా కుటిల వచస్సీ ధురసము’’ను ఆస్వాదించే చెవులున్నవారు కనులున్నవారు బుద్ధి ఉన్నవారు పెరుగుతున్నారు. హిట్లర్, చంగిజ్‌ఖాన్, గ్రీకువీరుడు వంటి బీభత్సకారులను గొప్పవారుగా జనం భావించాలన్న ‘దృశ్య మాధ్యమ షడ్యంత్రం’ ప్రజలను ప్రభావితం చేస్తోంది!! ఇలా ప్రభావితం అవుతున్న జనానికి సంజయ్‌దత్ నేరాలు కనిపించడంలేదు!! ఆరేళ్ల పాపచేత సినిమాలలోని అశ్లీల గీతాలను అసభ్య శృంగార వికృత విన్యాసాలను ఆలపింపచేస్తున్న, అభినయింపచేస్తున్న దృశ్య మాధ్యమం సమాజంలో మనం బందీలం.
మధురాంతకం రాజారాం గారు 1987లో ‘అర్హత’ అన్న కథ రాశారు. అందులో ‘నవయుగ హీరో చైతన్య ప్రదీప్’ గురించి వరదరాజ పంతులు ఇలా వెక్కిరించాడు. ‘‘...రంగభూమి సినిమాలో షావుకార్లనుంచి దోచుకున్న డబ్బును హెలికాప్టరులో మంచీ నిరుపేదల వాడల్లో చల్లిందెవరు? మృగరాజు సినిమాలో ఒక అబలను రక్షించడం కోసం పాతికమంది గూండాలతో నిస్సహాయంగా పోరాడిందెవరు? సర్కస్ డేరా చిత్రంలో పులినోట్లో తల దూర్చిందెవరు? అదంతా నటనే గదా అని కొందరు పనికిమాలిన వాళ్లు అనుకోవచ్చు..’’
‘‘నేను మహా కవి కాళిదాసును కాగలనా??....నటన!’’ అని అక్కినేని నాగేశ్వరరావు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అభినయానికీ ఆచరణకూ మధ్యగల తేడా గురించి ఇలా విచక్షణ పెరిగితే ‘సంజయ్’ను జైలుకు పంపవద్దని చెప్పేవారు నోళ్లు మూసుకుంటారు! పెరగడంలేదు...
మంచిని అభినయించడం మంచిని ఆచరించడం కాదు.
english title:
nadata
Date:
Thursday, March 28, 2013