భారతదేశంలో ఆర్థిక నేరస్థులకు సరైన శిక్షలు లేవు. ఆర్థిక నేరం టెర్రరిజం కంటే ప్రమాదకరం. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే పెద్దమనుషులు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంపదను తాము దోపిడీ చేస్తూ, తమ అనుచరులను పురికొల్పడం జరిగింది. ఈ రాజకీయ దొంగలను విచారించే దానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటుచేసి, సరైన శిక్షలు అమలుచేయాలి. రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు వారి ఆస్తులెంత? ఇప్పుడు ఆస్తులెంత? వందల, వేల, లక్షల కోట్లు ఏ విధంగా వచ్చాయి? ఆర్థిక నేరస్థులకు యావజ్జీవ కారాగార శిక్షలతోపాటు, వారు దోచిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి రాబట్టి, ప్రభుత్వ ఖజానాలో జమచేయాలి. తమకున్న అధికారాలను అక్రమ పద్ధతులకు వాడుకుంటున్నారు. ప్రజలను అమాయకులనుకొని తమ యిష్టంవచ్చినట్లు ఆడిస్తున్నారు. అవినీతికి మద్దతిచ్చే ప్రభుత్వ అధికారులకు కూడ అదే శిక్షలు కావాలి. పాలకుల్లో నీతిమంతులు లేకపోలేదు. శిక్షలులేకపోతే దోపిడీని అరికట్టలేమని పాలకులు, న్యాయస్థానాలు గ్రహించాలి. డబ్బులు తీసుకొని ఓట్లువేసే ప్రజలున్నంతవరకు, మనకేంకాదని, రాజకీయ దొంగలు భావిస్తున్నారు. ప్రజలు అవినీతిపై పోరాడాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
నేరాలు తగ్గాలంటే..
మన దేశంలో ఆర్థిక నేరాలు, అవినీతి తగ్గాలంటే అత్యున్నత స్థితిలో ఉన్నవారెవరైనా సరే వారిని నిష్పక్షపాతంగా విచారించి శిక్షించాలి. దీనికి ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పరచాలి. ప్రముఖులెవరైనాసరే వారిని విచారించే స్వేచ్ఛ, అధికారం దీనికి వుండాలి. దోషులని రుజువైన పక్షంలో నిష్పక్షపాతంతో శిక్షవేయాలి. అలాగే స్ర్తిలపై అత్యాచారాలు చేసిన ప్రముఖుల సంతానమైనాసరే, బంధువులెవరైనా సరే వారిని బహిరంగంగా శిక్షించాలి. అధికారం, డబ్బు, పలుకుబడి వున్నా శిక్షనుండి తప్పించుకొనలేరు అని జన సామాన్యానికి తెలిసేలా శిక్ష వేయాలి. భయంవల్లనే నేరాల తగ్గుతాయి.
- ఇవటూరి రాజాబిల్వకేశ్వర్, హైదరాబాద్
ధరలతో బతుకులు దుర్భరం
నూతన పి.ఆర్.సి వెయ్యమని ఉద్యోగులనుండి డిమాండ్ మొదలైంది. ధరలు పెరిగాయి, జీతాలు పెంచమని ఉద్యోగులూ, జీతాలు పెరిగాయని ధరలు పెంచుతూ వ్యాపారులు ఒకరితోఒకరు పోటీపడుతున్నారు. కానీ సామాన్యుల గురించి పట్టించుకోవడం లేదు. ఆకాశాన్నంటే ధరలతో సామాన్యుల జీవితం దుర్భరంగా అయింది. ఉద్యోగులైనా, సామాన్యులైనా కోరుకునేది కనీసావసరాలు తీరాలనే కదా! ధరలు కంట్రోల్ చెయ్యండి. కనీసావసరాలు తీరేలా చెయ్యండి.
- గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె
నాయకుల తీరు విచిత్రం
ప్రజాసేవే పరమార్థంగా రాజకీయాలలోకి వచ్చిన మన నాయకుల సరళి కడు విచిత్రంగా వుంటుంది. చట్టసభలలో ప్రజాసమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారానికి కృషిచేయడం మానేసి, అనునిత్యం పదవులకోసం పైరవీలు, ఇతర పార్టీ నాయకులను ఘాటు పదజాలంతో విమర్శించడం, అర్ధంపర్థంలేని సవాళ్లు విసురుకుంటూ కాలయాపన చేస్తున్నారు. పతి నాయకుడు చిత్తశుద్ధి కనబరిచి వుంటే అపరిష్కృతంగా వున్న ఎన్నో ప్రజల సమస్యలు తీరేవి. రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి సాధించి వుండేదన్నది నిర్వివాదాంశం.
- ఎం.కనకదుర్గ, తెనాలి
స్ఫూర్తిని దెబ్బతీయొద్దు
సామాన్యుని చేతిలో పాశుపతాస్త్రంవంటి సమాచార హక్కు స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరం. ఇటీవల నియమించిన నలుగురు సమాచార కమిషనర్లు రాజకీయ పైరవీల ఆధారంగానే పదవులు సాధించారన్నది నిర్వివాదాంశం. అర్హతలు, అనుభవంతో సంబంధంలేకుండా వెనుకదారినుండి పదవులు చేపట్టేవారి వలన ప్రజలకు ఏం మేలుచేకూరుతుంది? ఇకనైనా ప్రభుత్వం పైరవీలు, సిఫార్సులు ఆధారంగా నియామకాలు చేపట్టడం ఆపితే రాష్ట్ర శ్రేయస్సుకు శ్రేయోదాయకంగా వుంటుంది. రాష్ట్ర గవర్నర్ తక్షణం ఈ నియామకాలను రద్దుచేసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
భారతదేశంలో ఆర్థిక నేరస్థులకు సరైన శిక్షలు లేవు.
english title:
a
Date:
Thursday, March 28, 2013