దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం విద్యారంగంలోనే ఉంది. ఆ విద్యారంగం ఎంత శక్తివంతంగా ఉంటే దేశం అంత పటిష్టంగా ఉంటుంది. చదువన్నది ఉత్త ఉపాధికి మాత్రమే సాధనం కాదు. చదువన్నది వ్యక్తుల ప్రతిభ, వ్యక్తిత్వ వికాసంకోసం మాత్రమే కాదు. చదువు ద్వారా ఏ సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించగలగాలి. ప్రజలు అడగక పోయినప్పటికినీ వారి కన్నీళ్లు తుడిచి పరిష్కారం చూపవలసిన బాధ్యత మాత్రం విద్యారంగం మీదనే ఉంది. అందువల్ల విశ్వవిద్యాలయాలలోని సామాజిక శాస్త్రాలు గానీ, సాంకేతిక విజ్ఞాన శాఖలు గానీ తమకు తాముగా ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ పరిష్కార మార్గాలను చూపాలి. అట్లాంటి పాత్రను మన సాంకేతిక విద్యాలయాలు ఎంతవరకు పోషిస్తున్నాయి. అందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజా ప్రభుత్వాలు పరిశోధనా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతలు ఏమిటి? అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశాల్లో పరిశోధనా రంగం ఎంతో పకడ్బందీగా కొనసాగుతుంది. మనలాంటి పేద దేశాలల్లోని మేధావి వర్గమంతా అమెరికాకే వెళ్లిపోతుంది. అక్కడ ప్రతి విశ్వవిద్యాలయంలో ఐదారుగురికి తగ్గకుండా నోబుల్ లారెడ్స్ ఉంటారు. మన దగ్గర ఇన్ని వందల సాంకేతిక విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలున్నా నోబుల్ లారెడ్స్ అంతగా కనిపించరు. ఇందుకు కారణాలు ఏమిటి? వీటిని పరిగణలోనికి తీసుకుని మన విద్యారంగం కొత్త అడుగులు వేయకపోతే దేశం మరింత దారిద్య్రంలోకి పోవటం ఖాయం.
21వ శతాబ్దంలో అన్నింటికన్నా ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుపైననే ఆసక్తి చూపుతున్నారు. మన రాష్ట్రంలో 3 లక్షల పైన ప్రతి సంవత్సరం 750 మంది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బైటకు వస్తున్నారు. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వీటిలో 10 శాతం మాత్రమే ఉద్యోగానికి అర్హులైన వ్యక్తులని అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇంత డిమాండ్ ఉన్నా కానీ, ఇంతమంది ఉత్పత్తి అయినా కానీ, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను పరిష్కరించే వ్యక్తులు లేకపోవటం విచారకరం. ఈనాడు సమాజం ప్రతి దేశంలో మంచి నీరు కోసమై మొదటి సవాలు ఎదుర్కొంటుంది. నీటి కొరత లేదు. కానీ కోట్లాది మందికి మంచినీటిని వారి ఇంటిలోకి పంపించే టెక్నాలజీ వచ్చింది. నీటిని పరిశుభ్రం చేసే సాంకేతిక జ్ఞానం కనుక్కోబడింది. నీటిలో పురుగులు (కీటకాలు) వున్నాయా? లేవా? వాటిని పరీక్ష చేసే టెక్నాలజీ కూడా ఉన్నది. అనగా డిమాండ్ ఉన్నది కానీ దాహం అని మొత్తుకునే మనుషులే ఎక్కువగా ఉన్నారు. ఇంజనీరింగ్‌కు ఇదే మొదటి సవాలు. 60 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాకు చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరైడ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. కృష్ణానది పక్కనే ఉన్నది కానీ మాకు తాగే నీళ్లెందుకు రావు అని ఆయన పోరాటం చేసి చేసి అలసిపోయాడు. తన జీవితానే్న నీళ్లకోసం ఆవిరి చేసుకున్నాడు. సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఎన్నికల సమయంలో మాత్రం సున్నాలు వేసినట్లు నీటి పైపులను సరిదిద్దటమో, ట్యాంకులను బాగుచేయటమో, లేక హామీలను గుప్పించటమో, చేస్తున్నారు కానీ సమస్యకు మాత్రం పరిష్కారం లేదు. రెండవది మనిషి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అందులో 20 శాఖలున్నాయి. మొదటిది ఆహారానికి సంబంధించిన శాఖ ఉంది. పుష్టికరమైన ఆహారాన్ని ఎలా కొలమానం (సిద్ధం) చేయాలి? చెప్పే కాలేజీ అది. వేలాది మంది ఇంజనీర్ల పిల్లలు కెమికల్ టెక్నాలజీలో చేరుతున్నారు. బైటకు రాగానే ఉపాధి కోసమై పచార్లు చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు ఆకలి హాహాకారాలు చేస్తున్నారు. వీరికి పట్టెడన్నం పెట్టి పౌష్టికాహారం అందించే విజ్ఞానం వీరిదగ్గర ఉంది. ఇంజనీరింగ్ విద్యకు, కెమికల్ ఇంజనీర్లకు ఇది రెండో సవాలు. కెమికల్ ఇంజనీర్లు మందులు సప్లయ్ చేయటం, తక్కువ ధరకు వైద్య సహాయం అందించటం దేశం ముందున్న మూడో సవాలు. మందు తయారుచేయటానికై కెమికల్ ఇంజనీరింగ్ పెట్టుకున్నాం. డ్రగ్ ఇంజనీరింగ్ వచ్చింది. మందులు తయారవుతూ ఉన్నాయి. కానీ ధరలు మాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. గ్రామాల్లో ఉంటూ వీటన్నింటిపై పరిశోధన చేయుటకై వృత్తుల పరిశోధనలపై ఎన్నో కాలేజీలు వచ్చాయి. కానీ అవన్నీ ప్రజలకు అందటానికి బదులుగా మార్కెట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా తయారయ్యాయి. ఇంజనీరింగ్ విద్య కేవలం మనుషులను తయారుచేయటమే కాదు, ఆ విజ్ఞానాన్ని పేద ప్రజల వాకిళ్లముందుకు పోయే యంత్రాంగం కూడా లేకుంటే టెక్నాలజీ కొందరికి సంపదలు సృష్టించేందుకై ఉపయోగపడుతుంది. టెక్నాలజీని అభివృద్ధి చేయడం వరకే చేస్తే కూడా సరిపోదు. ఈ టెక్నాలజీ పేద ప్రజలకు అందించే పనిని కూడా ఇంజనీరింగ్ విద్యే చేయాలి. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యనే అధ్యయనం చేయాల్సి ఉంది. ఇంజనీరింగ్ విద్య పరిధి విస్తృతమవుతున్నది. మనిషి అవసరాలకు తగినట్టు విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలను ఉపయోగించి ముడిపదార్ధాలను టెక్నాలజీతో మానవుని వినియోగవస్తువుగా తయారు చేయడమే కాదు. అవి సామాన్యుని అందుబాటులోకి తీసుకుని వస్తేనే టెక్నాలజీ లక్ష్యం పూర్తయినట్టుగా భావించాలి. ఈనాడు ఇంజనీరింగ్ విద్యకు కొత్తసవాళ్లు ఎదురౌతున్నాయి. విజ్ఞాన ఫలితాలను సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావాలి. కొత్త ఇంజనీరింగ్ కావాలి. కొత్త జ్ఞాన పైప్‌లైన్‌లు వేయాలి. అందుకే చదువుకు సామాజిక దృక్పధం కావాలి. సామాజిక సంకల్పంతో ఇంజనీరింగ్ విద్యను నేను మానవ వినాశనానికి ఉపయోగించననే ప్రతిజ్ఞతో బైటకు రావాలి. అందుకే బ్రిటన్‌లో విజ్ఞాన శాస్తవ్రేత్తలందరూ కలిసి మానవ వినాశనాన్ని కలిగించే ఏ ప్రాజెక్టులో పనిచేయమని ప్రతిజ్ఞ చేశారు. విజ్ఞానంలో మా శ్రమ పేదల జీవనాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడాలని ప్రచారం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యకు సామాజిక దృక్పథమే ప్రధానం. ఈ కాలేజీలు ఉపాధి కోసం కాదు. జీవరాసులను కాపాడడానికి ఏర్పడ్డ సైన్యం ఇది.
దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం విద్యారంగంలోనే ఉంది.
english title:
v
Date:
Thursday, March 28, 2013