Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆట ‘వెల’ది

$
0
0

‘‘ఆటవెలది’’ అన్నాడు శంకరం. అన్నాడో లేదో-
‘‘కాదు మరీ!పైగా అంతా ఇంతా ‘విలువ’ కాదు. ‘నభూతో న భవిష్యతి’ అనిపించేలా, ఆస్ట్రేలియా వెలవెలబోయేలా, మన దేశ ప్రతిష్ఠ వెలపెంచుతూ, టీమిండియా కుర్రాళ్లు కుమ్మేసారుగా! ఎనభై ఒక్క ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో-కనీ వినీ ఎరుగని సరికొత్త రికార్డు! నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌ను నాలుగో టెస్టును మూడో రోజే ముచ్చటగా ముగిస్తూ, 0-4తో ‘కంగారూ’లకే కంగారెత్తించి, హోలీ ముందే ‘వైట్ వాష్’ చేసి వదిలిపెట్టారు! నాలుగు టెస్టుల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ నెగ్గడం మన వాళ్లకు ఇదే మొదటిసారి! వికెట్లు తీయడంలో కూడా అంతకు ముందు కుంబ్లే రికార్డును బద్దలుకొడుతూ, అశ్విన్ సిరీస్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. భారత్ గడ్డపై ఏ జట్టూ మునుపు ఇన్ని ఓటములు చవి చూడలేదన్నట్టుగా, ఆస్ట్రేలియాకు గొప్ప శృంగభంగమయ్యింది. అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్‌లు ఓడినా, సిరీస్‌ను కైవసం చేసుకున్న తొలి టెస్ట్ కెప్టెన్ ‘ధోనీ’యే! నిజంగానే మొన్నటి ఆట తులలేని వెలది’’ అంటూ సన్యాసి ఉత్సాహంగా గడగడా మాట్లాడసాగాడు.
‘‘నీ గోల నీదే! నీ క్రికెట్‌మోజు సంగతీ, అందుకీనాడు ఆనందదాయకమైన విషయం సంగతీ, నాకు తెలుసుగానీ-నేను ‘ఆటవెలది’ అన్నది-నువ్వంటున్న ఆట గురించీ, దాని విలువ గురించీ కాదు. సాహిత్యంలో, అందునా పద్య కవిత్వంలో, ‘ఆటవెలది’ గురించి నేను ఉద్దేశించింది. ఎలాంటి విషయాన్నయినా ‘ఆటవెలది’ పద్యంలో, సామా న్య పాఠకుడికి కూడా అర్ధమయ్యేంత సరళంగా, అందించడానికి వీలుంది. అందుకే ప్రాచీన కవులే కాదు, ఆధునికులూ అందునా పద్య ప్రియులు, ఆటవెలదిని ఆసరా చేసుకుని, చక్కటి శతకాలు వెలయించారు. అంతెందుకు? ప్రజాకవి వేమన పద్యాలు ఆటవెలదులుగానే-జనం గుండెల్లోకి వెళ్లి, వారి నాల్కలపై నర్తిస్తున్నాయి. ఇప్పటివాళ్లు, నానీలు, రెక్కలు, హైకూలు, వ్యంజకాలు అంటూ లఘుకవితా ప్రక్రియలకు ఎగబడుతున్నారు గానీ, నిజానికి-హాయిగా, అంత సునాయాసంగా, ‘ఆటవెలది’ పద్యాలు-కొంచెం సాధన చేసి, పట్టు సాధిస్తే రాయవచ్చు. ఆటవెలదిలో అవలీలగా అద్భుత భావాలు ప్రకటించవచ్చు. పైగా అవి ధారణకు అనుకూలం. ముక్తక లక్షణాలతో- సూక్తులు, నీతులు, వ్యంగ్యోక్తులు, వ్యాజోక్తులు, శృంగారం, హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం, అనేకానేక సామాజిక రాజకీయ అంశాలూ అభివ్యక్తీకరించడానికి చక్కటి వాహిక ‘ఆటవెలది’. నన్నడిగితే-పాఠశాల దశలోనే పిల్లలకు దీనిమీద అభిరుచినీ, అభినివేశాన్నీ తెలుగు అధ్యాపకులు కలిగిస్తే, మున్ముందు వారిలోనుంచే, మంచి కవులు పుట్టుకు రాగల అవకాశం ఉంది. మన సంప్రదాయాన్ని పరిరక్షించుకున్న వారమూ అవుతాం’’ అన్నాడు శంకరం.
‘‘నువ్వన్న మాట బాగుందోయ్ శంకరం! మహిత సూక్తికీ, చతురోక్తికీ అనుకూలమైన నాలుగు పాదాల్లో సమగ్ర భావాన్ని గర్భీకరించుకునే ఫారసీ ఉర్దూ భాషలలోని విశిష్ట కవితా ముక్తక ప్రక్రియ ‘రుబాయీ’ కూడా-‘ఆటవెలది’ బాటలోదే అనచ్చు. నిజానికి ‘ఆటవెలది’లో శతకం వెలయించినపుడు, నాలుగో పాదం మకుటంగా స్థిరమై, మిగతా మూడు పాదాల్లోనే కవిత్వ ప్రతిభ అంతా దృగ్గోచరమవుతుంది. ‘ఆటవెలది ద్విపదకత్తగారు’ అని సరదాగా శ్రీశ్రీ అన్నాడు. ‘ద్విపద’ అంటే రెండు పాదాలు మాత్రమే. ‘ఆటవెలది’ నాలుగు పాదాలది. యతి, ప్రాస కూడా గొప్ప అనుకూల సంవిధానంలోనివే. ఆటవెలదుల్లో శతకాలు వెలయించిన ఎందరో కవులు, మూడు పాదాల్లోనే ముచ్చట గొలిపే కవిత్వం చెప్పారు’’ అన్నాడు రాంబాబు.
‘‘కానీ ఇవాళ వచన కవిత్వానికి వున్న ఆదరణ పద్య కవితకు ఏదీ? వచన కవిత్వంలో కూడా-శంకరం అన్నట్లు, లఘు రూపాలు ‘నానీలు’ వంటివి ఎక్కువై, అసలు ‘కవిత్వం’, ‘కవి’ అన్న విశిష్టతనే నేలబారు స్థాయికి తెచ్చేసాయి. నిజానికి ఆ లఘు ప్రక్రియలకూ పాదాలు, మాత్రలు, అక్షరాలు అంటూ నియమాలు, పరిమితులు ఉన్నాయి. అటువంటప్పుడు ‘ఛందం’ మటుకు అడ్డేమిటి? ఆటవెలది గణాలనూ, నియమాలనూ ఆకళింపు చేసుకుని, ‘ధారణ’ యోగ్యంగా, వౌఖిక ప్రచార సౌలభ్యంతో, సామాజిక స్పృహతో కూడా, అందమైన, ప్రయోజనం గల కవిత్వం రాయవచ్చు. ఆ దిశగా కొత్తతరం కవులు శ్రద్ధ పెడితే, నిజంగా బానే ఉంటుందనుకుంటాను. అసలు ఇటీవల పద్య శతకాలు రాస్తున్నవారున్నారా?’’ అన్నాడు సన్యాసి.
‘‘పద్యానిది వెయ్యేళ్ల వారసత్వం! సాహిత్య చరిత్రలో దాని స్థానం సుస్థిరం. అదేమీ అంతరించిపోయేది కాదు. నిజమైన కవిత్వ ప్రతిభకు, ప్రక్రియలేవీ అవరోధాలు కావు. కానీ-కవి ప్రతిభా పాటవాలకు ‘పద్యం’ నికషోఫలం! అంతెందుకు? ఇటీవలే ‘నది’ మాసపత్రిక అగ్రిగోల్డ్ సంస్థవారు లక్షలాది రూపాయల బహుమతులతో, ‘ప్రబంధ కావ్య రచన’ పోటీని నిర్వహించారు. ఎందరో పద్యకవులు అందులో పాల్గొన్నారు. ఈ మార్చిలోనే ఆ బహుమతి ప్రదాన సభ కూడా-రవీంద్ర భారతిలో ‘అద్భుతంగా’ జరిగింది. అంచేత-పద్యం చచ్చిపోయిందనీ, చచ్చిపోతుందనీ అనడం తప్పు. వచన కవితలు, నానీలు, వెలయించినా- పద్యంమీద పట్టుతో, అభిమానంతో మిత్రుడు కన్నోజు లక్ష్మీకాంతం ఇటీవలే ‘డమరుకం’ అని 516 ఆటవెలదులతో పంచ(చ్)శతి రచించాడు. ఐఎఎస్ ఆఫీసరైవుండి, పద్యంమీద అభిమానంతో, పద్య కవిత్వంపై డాక్టరేట్ సిద్ధాంతం రచించిన కె.వి.రమణాచారిగారికి తన ‘డమరుకం’ అంకితం ఇవ్వడం కూడా ఔచిత్యంగా ఉంది. ‘‘కల్లగాదు లక్ష్మీకాంతం మాట’ అంటూ-సమకాలీన సమాజంలోని అనేక అంశాలను ముఖ్యంగా-మానవీయ విలువల పరిరక్షణ ధ్యేయంగా, సులభంగా అర్ధమయ్యే రీతిలో రచన చేయడం అభినందనీయం! ఏమయినా-తెలుగు సాహిత్యంలో, కవిత్వంలో, పద్య పద్మాలు సహస్ర దళాలతో వికసించాలనీ, భావి తరానికి తెలుగు భాషా సాహిత్యాల పరీమళాలు పరివ్యాప్తం చేయాలనీ, ఆకాంక్షిద్దాం’’ అంటూ సుందరయ్య నలుగురితో కరచాలనం చేశాడు.

సంసారాలు
english title: 
samsaaralu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles