Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సూరి (కథ)

$
0
0

సూరి మంచి తెలివైన విద్యార్థి. అయితే తాతగారి గారాబం. తల్లి టివిలో మునిగిపోవడం, నాన్నది ఆర్టీసీలో ఉద్యోగం కావటంతో పట్టించుకునే వారులేక సూరి తెలివి కాస్త మరుగున పడసాగింది. బడికి వెళ్లకుండా కడుపులో నొప్పి అని, ఏవో కారణాలు చెబుతూ తల్లిని చూసి బుల్లితెరకు అతుక్కు పోతుండేవాడు. ఇలా కొంతకాలం ఆటవిడుపుగా సాగింది సూరి తీరు. పరీక్షలు రానేవచ్చాయ్. ప్రోగ్రెస్ రిపోర్టు చేతికిచ్చారు. తల్లికి చూపించి సంతకం పెట్టమన్నాడు సూరి. వందకు పది కూడా దాటని మార్కులు చూసి తల్లి సంతకం చెయ్యనంది. నువ్వు సంతకం పెడితేనే బడికి వెళ్తానని మొరాయించాడు. తాతను బతిమాలాడు. సంతకం పెట్టమన్నాడు. మార్కులు చూసి ‘మీ నాన్నతో పెట్టించుకో, నేను సంతకం మర్చిపోయాన’ని తప్పించుకున్నాడు తాత. చేసేదిలేక సూరి అలిగి పడుకున్నాడు. ‘సూరిబాబూ! టిఫిన్ చెయ్యి’ అంది తల్లి. మాట్లాడలేదు. ‘సరే పాలైనా తాగు’ అంది. మరోవైపు తిరిగి పడుకున్నాడు. తల్లి టివి ఆన్ చేసి మళ్లీ కట్టేసేసరికి భోజన సమయం అయ్యింది. ‘అన్నం పెడుతున్నా రారా బాబూ!’ పిలిచింది తల్లి. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి సంతకం అని సైగ చేశాడు. అదే సైగ భాషలో వీలుపడదని చెప్పింది. రాత్రి 8గంటలకు తండ్రి పొరపాటున తొందరగా ఇల్లు చేరాడు. ఆరోజు అందరూ ఒకేసారి భోజనానికి సిద్ధమయ్యారు. కానీ సూరి మాత్రం టివి చూస్తూనే ఉన్నాడు. ‘రా నాన్నా!’ అని తండ్రి పిలిచాడు. వచ్చి ప్రోగ్రెస్ రిపోర్టుని చూపించాడు. ‘్భజనం చేశాక సంతకం పెడతా, ముందు భోజనం చేద్దాం’ అన్నాడు తండ్రి. ‘నేను భోజనం చెయ్యాలంటే ముందు సంతకం పెట్టు’అన్నాడు. సూరి పరిస్థితి అర్థంగాక ఎగాదిగా చూశాడు తండ్రి. ‘ప్రామిస్ చెయ్యి భోజనం తర్వాత సంతకం పెడతానని’ అన్నాడు సూరి. ‘అలాగే బాబూ!’ అనగానే భోజనానికి కూర్చున్నాడు సూరి. తల్లి కుమారునికి సహాయ పడుతూ ‘బాబూ! ముందు ఈ బాక్స్ తిను, తర్వాత ఇది, ఆతర్వాత ఇది’.. అంటూ ముందుకు తోసి మూతలు తీసింది. సూరి వాటన్నింటినీ పక్కకు తోసేశాడు. ‘ఎందుకు అలా తోసేస్తున్నావ’ని తండ్రి అడిగాడు. ‘అవన్నీ చద్దివి. అందుకే వద్దంటున్నా. వేడివేడిగా ఇదిగో ఇవి వడ్టించు’ అని తల్లితో అన్నాడు. తల్లి అందుకు ఒప్పుకోక ‘అవన్నీ తింటేనే ఇవి పెడతా’నంది. ‘విషయం ఏంట’ని తండ్రి అడిగాడు. సూరి మాట్లాడకపోతే తల్లే కల్పించుకుంది. ‘ఈ బాక్స్ పొద్దున తిన్నాల్సిన టిఫిన్, ఇవి పాలు, ఈ బాక్స్ మధ్యాహ్నం తినాల్సినది. ఇవన్నీ వదిలి ఇప్పుడు మనం తినే వేడి పదార్థాలు పెట్టమంటున్నాడు మీ పుత్రుడు’ అంది. ‘మీకైతే వేడివి, మరినాకు చద్దివా’ అన్నాడు సూరి. ‘మేము ఎప్పటి పదార్థాలు అప్పుడే తినేశాము. మరి నీవు? తినలేదు గనుక ఇప్పుడు తినాల్సిందే’ అని తాత, తండ్రి, తల్లి అనేసరికి మాట్లాడలేక కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి. ‘అర్థమయ్యిందా కన్నా! ఒక్కరోజు నమిగిలిన పదార్థం ఒకేసారి తినాలంటే ఎంత ఇబ్బందిపడ్డావో? నీకు అర్థం కావాలనే ఇలా చేశా! మరి రోజూ పాఠశాలకు వెళ్లకపోతే హోంవర్కూ, ఆరోజు పాఠాలు ఎలా చదవగలవు? ఎలా చెయ్యగలవు? అర్థం చేస్కో’ అంది తల్లి. తలదించుకున్నాడు సూరి. బాధపడుతున్న కుమారుని బుజ్జగించి అన్నం తినిపించింది. ‘సూరి అంటే పండితుడు అని నీకు నామకరణం చేశాంరా!’ అని తాతగారు అనగానే.. ‘నిజం తాతా! ఇక నుంచి నేను నా పేరును నిలబెట్టుకుంటా. ప్రామిస్!’ అనడంతో అందరి గుండెలు చల్లబడ్డాయి.
ఆమాత్రం అవగాహనైతే నేటి విద్యార్థులు సాధించలేనిదంటూ ఏముంటుంది? తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్నిటిని త్యాగం చెయ్యాలి మరి!

- వివి సత్యనారాయణ, అవనిగడ్డ, సెల్: 9885396202

పుస్తక పరిచయం

నిజాయితీకి నిలువుటద్దం!

హనీయుల జీవిత చరిత్రలు ఎప్పుడూ పఠనీయమే. జీవిత చరిత్రలు రాసేటప్పుడు పాఠకులకు తాము ఏమి చెప్పదలచుకున్నామో అనే విషయంపై దృష్టి పెట్టాలి. తమ జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలను గుదిగుచ్చి పాఠకులు ఏమాత్రం విసుగుచెందకుండా చెప్పటమనేది కత్తి మీద సాము లాంటిదే. తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనల ఉపయోగం సమాజానికి ఏమిటనే విచక్షణా అవసరం. నా ఇష్టం అనుకున్నా, ఎవరైతే నాకేంటి అనుకున్నా కేవలం రచయితకు, ముద్రాపకునికి ఉపయోగమేతప్ప సమాజానికి ఒరిగేదేమీ వుండదు. కొందరి జీవితం ఒకరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. అభూత కల్పనలతో నిండి వుంటుంది. కొందరి జీవిత చరిత్రలు మాత్రం తెరచిన అద్దంలా వుంటాయి. నిజాలు చెప్పటానికి, వాటిని జనం ముందు వుంచటానికి అందరూ మహాత్ములు కారు. కొందరి జీవితాలు జాతికి ఆదర్శంగా నిలుస్తాయి. అటువంటి వాటిలో డా.బాబూ రాజేంద్రప్రసాద్ జీవిత చరిత్ర ఒకటి. మనదేశ తొలి రాష్టప్రతిగా ఆయన ఎనలేని ఖ్యాతి గడించారు. అతి సామాన్యుడిగా జన్మించిన ఆయన దేశ ప్రథమ పౌరుడు కాగలిగిన మహోన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభ ఏ ఆకాశంలో నుంచో ఊడిపడలేదు.
వారసత్వ రాజకీయాల ఊసే లేదు. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయటానికి నిరంతరం పోరాడిన కృషీవలుడాయన. నిజాయితీకి నిలువుటద్దం ఆయన జీవితం. సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటంలో మడమతిప్పని వీరయోధుడాయన. మరి ఆయన జీవితం జాతికి ఆదర్శం కాకుండా వుంటుందా? స్వాతంత్య్ర పోరాటంలోని అనేకానేక సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆయా సంఘటనల్లో సమ్మిళితమైన జీవితం ఆయనది. భావితరాలకు స్వాతంత్య్ర పోరాటంలోని అనేక ఘట్టాలను ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తుంది. గాంధీమార్గం, గోఖలే మార్గదర్శకత్వం, స్వరాజ్య పార్టీ స్థాపన, బెంగాల్ మారణకాండ, మహాత్ముని ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, దేశ విభజన, 1947 నాటి తాత్కాలిక ప్రభుత్వం.. ఇలా అనేక జాతీయ పోరాట ఘట్టాలను చదువరుల కళ్లకు కట్టారు. హిందీ భాషలో వచ్చిన బాబూ రాజేంద్రప్రసాద్ ఆత్మకథ తెలుగు అనువాదపు హక్కులను సాహిత్య అకాడమీ వారు నగరానికి చెందిన ఛాయేశ్వర్‌కు అందించారు.
దాదాపు ఎనిమిది వందల పుటలకు పైగా ఉన్న ఈ గ్రంథం అతి తక్కువ ధరకే లభిస్తోంది.

- వేలూరి కౌండిన్య, విజయవాడ, సెల్:9392101586

కార్డుముక్క కతలు..

మా అమ్మ శాపాలైనా దీవెనలే!
తమ్ముడి మీద ప్రేమతో నోటి దురుసున్నదని తెలిసినా మేనకోడల్ని కోడలిగా చేసుకుంది జానకమ్మ.
కాలం వేగంగా కదిలిపోయింది.
మనవడు, మనవరాలి చదువులు పూర్తయ్యాయి.
కోపం వచ్చి నోరు పారేసుంది అత్తగారి మీద శ్రద్ధ.
అలిగిక్కూర్చున్న తల్లి దగ్గర చేరి
- ‘కోడలిని శపించమ్మా’ అన్నాడు ప్రద్యుమ్న నవ్వుతూ.
‘దాని కూతురి పెళ్లయిపోవాలి. కొడుక్కి ఉద్యోగం దొరకాలి’ అంది కసిగా!
‘ఇవేం శాపాలు’ అన్నాడు ప్రద్యుమ్న.
‘పెళ్లయితే కూతురు, ఉద్యోగం వస్తే కొడుకు దూరంగా పోతారుగా.. పిల్లలు దూరమైతే తల్లికి బాధ కాదా’ అంది చిరుకోపంగా.
‘అమ్మా.. నీకు కోసం వచ్చినా మంచిమాటలే. నీ శాపాలు కూడా దీవెనలేనమ్మా!’.. అన్నాడు పసివాడిలా తల్లి ఒడిలో పడుకుంటూ నడివయసు కొడుకు ప్రద్యుమ్న.

- కోట సావిత్రి, విజయవాడ

చల్ మోహనరంగా!
‘మా పేరెంట్స్ మన ఇద్దరికీ పెళ్లిచేయాలని నిశ్చయించుకున్నారు. నిన్ను మినిష్టర్ని చేయాలని మా నాన్న కోరుకున్నారు. మినిస్టరయితే అవినీతికి అలవాటు పడతావు. నాకది నచ్చదు. మనం ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకుని
మంచిగా బతుకుదాం’ అంది రంగవల్లి.
‘మా నాన్నకి నేను ఒక్కడినే.. నీతో వచ్చేస్తే వాళ్లు బతకరు’ బాధగా అన్నాడు మోహన్.
జాలి కలిగి దగ్గరగా వచ్చిన ఆమెను కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. షాక్ తింది రంగవల్లి.
‘నువ్విలా... నాకు పెళ్లికి ముందు ఇలా నచ్చదని చెప్పేను. కానీ ఇప్పుడెలా? ఇంకొకర్ని చేసుకున్నా నన్నీ సంఘటన వెంటాడుతుంది. నినే్న పెళ్లాడుతా.. కానీ శరీరం నీది. మనసు మాత్రం నీదికాదు’ కోపంగా అంది రంగవల్లి.
సూటిగా చూశాడామెని. చట్టుక్కున వెనుతిరిగేడు.
‘ఎక్కడికి వెడుతున్నావు?’ కంగారుగా అడిగింది.
‘నువ్వు శరీరాన్ని ఇస్తానన్నావు. మరి నాకొక మంచి మనసు కావాలి అందుకే’...
‘అవినీతే కాకుండా ఇలా కూడా పతనవౌతావా’?
‘వీల్లేదు, నేనొప్పుకోను. నా మనసు కూడా నీకే..’ అంటూ కౌగిలించుకుంది.
‘డబ్బూ, అధికారం కావాలి. నాకు నువ్వూ కావాలి. పిచ్చి రంగా..’ మనసులోనే అనుకున్నాడు మోహన్.

- వేమూరి రాధాకృష్ణ, విజయవాడ

నివాళి

సాహితీ తపనుడు బస నాగయ్య

కొందరు ఒక ప్రత్యేక సిద్ధి కోసం కారణజన్ములుగా పుడతారు. వారిలో ధూపం బస నాగయ్య ఒకరు. సాహితీ లోకంలో ఈయన పేరు కొద్దిమందికే తెలుసు. కృషి తప్ప ప్రచారం కోరుకోని మహోన్నతుడు. నిజాయితీకి నిలువుటద్దం. ఎంత సేవ చేసినా ‘నేనెంత?’ అనుకునే సాహితీ కృషీవలుడు. శైవ సాహిత్యానికి అండగా నిలిచిన నాగయ్య సాహితీ తపస్వి. పాల్కురికి సోమన, బండారు తమ్మయ్య వంటివారి రచనల్ని సొంత ఖర్చుతో పునర్ముద్రించి సాహిత్య సేవ చేసిన నిస్వార్థ భాషా సేవకులు. సాహితీ శిఖరం బండారు తమ్మయ్యతో సన్నిహిత పరిచయం గల బస నాగయ్య ‘బసవ కృప’ అనే శైవ సాహిత్య మాస పత్రికను నడిపారు. అపూర్వమైన శైవసాహిత్య విశేషాలకు ఈ పత్రిక ప్రతీక. బస నాగయ్య ‘ఓం నమశ్శివాయ సాహితీ సాంస్కృతిక పరిషత్తు’ను స్థాపించారు. వీర శైవ సమాజ పునరుద్ధరణ, ఆధ్యాత్మిక ధార్మిక రంగాల అభ్యున్నతి, శివశరణుల సంస్కృతి పరిరక్షణ ఈ సంస్థ ఆశయాలు. సి.పి.బ్రౌన్, నాగేశ్వరరావు పంతులు, చిదిరె మఠం వీరభద్రశర్మ, బండారు తమ్మయ్య వంటి వారి స్ఫూర్తితో నాగయ్య శైవ సాహిత్య ప్రచురణను చేపట్టారు. శివ కవి యుగానికి నాయకుడు, దేశి సాహితీ ప్రక్రియలకి ఆద్యుడు, వీర శైవ కవి, తెలుగు భాషాభిమాని పాల్కురికి సోమన రచనలను బస నాగయ్య పునర్ముద్రించి వెలుగులోకి తెచ్చారు. ఈయన దాదాపు ఇరవై గ్రంథాలకు పైగా ముద్రించారు. వాటిల్లో వృషాధిపశతకం - పాల్కురికి సోమన (తొలి శతకం), చతుర్వేద సారం, అనుభవసారం, బసవ పురాణం, అక్క మహాదేవి సమగ్ర వచనాలు, పాల్కురికి సోమన సాహితీ వైజయంతి, చెన్నమల్లు సీసాలు వంటివి ముఖ్యమైనవి. శైవ సాహిత్యం కోసం, పాల్కురికి సోమన కోసం తపిస్తూ అజ్ఞాతంగావున్న, అనాదరంగా పడివున్న, అలభ్యంగా వున్న రచనల్ని తెలుగువారికి అందించిన సాహితీ కృషీవలుడు బస నాగయ్య. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించి రెవిన్యూ శాఖలో ఎండిఓగా పనిచేసి 80వ ఏట 19-3-2013న తన స్వస్థలంలో పరమపదించారు.

- ద్వానాశాస్ర్తీ, సెల్: 9849293376

మనోగీతికలు

క్రికెట్ దేవుడా!
సచిన్నోడా! సచిన్నోడా!
క్రికెట్ సంచలనాల రేడా
శతశతకాల యోధుడా
ప్రపంచ క్రికెట్‌కు దేవుడా!
నీ పేరు తలిస్తే అభిమానులకు పులకరింత
మైదానంలో నువు కనిపిస్తే
ధైర్యమొస్తుంది కొండంత
ఈ విశ్వక్రీడకు దేవదేవుడవు
కోట్లాది అభిమానుల గుండెల్లో
నిలిచిపోయిన విజేతవు!
మాస్టర్ బ్లాస్టర్ అన్నా
బ్యాటింగ్ మాంత్రికుడన్నా
పరుగుల యంత్రం అన్నా
అభినవ బ్రాడ్‌మన్ అన్నా
క్రికెట్ లెజెండ్ అన్నా
నీకివి పూర్తి కొలమానం కావేమో..
కొన్నాళ్లు మిడిలార్డర్‌లో వీరవిహారం
మరికొన్నాళ్లు ఓపెనర్‌గా పరుగుల వీరంగం
వనే్డ క్రికెట్‌కిచ్చావు సరికొత్త నిర్వచనం!
స్క్వేర్ కట్‌లతో అలరించినా
కవర్ డ్రైవ్‌లతో మురిపించినా
పుల్ షాట్లతో బ్యాట్ ఝుళిపించినా
నీ మార్క్ ఆట నీకే సొంతం
ఆటలో ఆత్మవిశ్వాసం నీకనంతం!
అక్రమ్, వాల్ష్, వార్న్, డొనాల్డ్
ఎవరైనా నీ బాధితులే
నీ సొగసైన ఆటతీరుకు మంత్రముగ్దులే
దిగ్గజ బౌలర్లకూ నిద్రలేని రాత్రులే
నీ వికెట్ కోసం ఎల్లవేళలా వ్యూహరచనలే..
నువ్వు బరిలోకి దిగగానే
క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుంటుంది
నువ్వు అవుటవగానే
ప్రపంచమంతా టీవీల్ని స్విచ్చాఫ్ చేస్తుంది!
ఒంటిచేత్తో నువ్వందించిన విజయాలెన్నో
అలుపెరగని పోరాటంతో
ఓటమి నుంచి కాపాడిన మ్యాచ్‌లెనె్నన్నో
విమర్శలన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం
తరగని నీ పరుగుల దాహంతోనే
విమర్శకుల నోటికి తాళం
ఆటలోనే కాదు నువ్వసలు జంటిల్మన్‌వి
వ్యక్తిత్వంలోనూ సూపర్‌మేన్‌వి
వేలకొద్దీ పరుగులు చేసినా
ఏమాత్రం కానరాదు గర్వం
అంపైర్లు పొరపాట్లు చేసినా
నోటరాదు పల్లెత్తు మాట
డ్రస్సింగ్ రూమ్‌లో నీ సాహచర్యం
క్రికెట్ లోకానికే ఆదర్శం!
అవార్డులెన్నో కోరివచ్చాయి
రివార్డులెన్నో నీకోసం పరితపించాయి
వివాద రహితం నీ కెరీర్ సమస్తం
క్రికెట్ ఉన్నంతకాలం నీ నామం సుస్థిరం
నీ అజేయ రికార్డులు క్రికెట్ చరిత్రలో పదిలం
నీ క్రీడాస్ఫూర్తి ప్రపంచ క్రికెట్‌కు ప్రమాణం
ఎందరో అనాథలకు సేవలతో
అందిస్తున్నావు ఆపన్న హస్తం
మరెన్నో నీ సేవలతో పులకిస్తోంది భారతదేశం
నీ రిటైర్మెంట్‌తో వనే్డ క్రికెట్ మూగబోయింది
క్రికెట్ ప్రపంచం దిగాలు పడుతోంది
జై సచిన్.. జైజై సచిన్
శతాయుష్మాన్‌భవ సచిన్
దీర్ఘాయుష్మాన్‌భవ సచిన్!!

- మద్ది పుల్లారావు, టీచర్
నందిగామ, సెల్: 9951287113

మట్టి..
మట్టి కేవలం
రెండక్షరాలు
దాని మహిమలు మాత్రం
అక్షయాలు
మట్టి లేకపోతే
‘మనీ’ లేదు- ‘షీ’ లేదు
అసలు మనిషే లేడు!
మట్టి సర్వ ప్రగతికీ పునాది
అది అనాది
మట్టిలేని లోకాన్ని
ఊహించలేను

ఆ ఊహలో జీవించలేను!
మట్టిని కబ్జా చేసినా
చివరికి వాడి శవాన్ని
తల్లిలా లాలిస్తుంది
తనలోకి కలుపుకుంటూ...
మట్టి పురాతనం
మట్టి పరిమళం
నిత్య నూతనం
మట్టి ప్రపంచ
ప్రకృతి స్వభావం
మట్టి చిరంజీవం!

- డా. రామడుగు వెంకటేశ్వరశర్మ, గుంటూరు. సెల్: 9866944287

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. పజీౄళూఖఔఖబఘౄజ.ష్యౄ

సూరి మంచి తెలివైన విద్యార్థి. అయితే తాతగారి గారాబం. తల్లి టివిలో మునిగిపోవడం,
english title: 
story
author: 
- వివి సత్యనారాయణ-9885396202

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>