తిరుపతి, మార్చి 30: దేశంలోనే
తొలిసారిగా ‘మీ డబ్బులు మీ చేతికి’
అనే ఆధార్ ఆధారిత నగదు బదిలీ
పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి జైరాం రమేష్ శనివారం చిత్తూరు
జిల్లా చంద్రగిరిలో ప్రారంభించారు.
చంద్రగిరి మార్కెట్ యార్డులో ఏర్పాటు
చేసిన భారీ బహిరంగ సభలో లక్ష్మి అనే
వితంతువుకు, శకుంతల అనే
వికలాంగురాలికి, మేరీ అనే ఉపాధి
కూలీకి కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌రెడ్డి నగదు అందించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర
మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేద,
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి
నగదు రూపంలో అందించే వివిధ రకాల
ఫలాలు లబ్ధిదారులకు నేరుగా
అందించడమే పథకం లక్ష్యమన్నారు.
అందుబాటులో ఉన్న సాంకేతిక
పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి పథకం
అమలుకు యూపీఏ చైర్‌పర్సన్
సోనియాగాంధీ నేతృత్వంలో ప్రధాని
మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం నడుం
బిగించిందన్నారు. దేశవ్యాప్తంగా పథకం
అమలు సాధ్యమా? అన్న
అనుమానాలను అధిగమించి పటిష్ఠంగా
అమలు చేస్తున్నట్టు చెప్పారు.
ఆధార్‌కార్డు నెంబర్‌ను బుల్లి
సెల్‌ఫోన్‌లాంటి పరికరంలో నమోదు చేసి
మీ వేలిముద్రను తీసుకుని 20
సెకన్లలో మీ డబ్బులు మీ చేతికి
అందుతాయన్నారు.
వేలిముద్రవేయగానే మీకు అందాల్సిన
లబ్ధికి సంబంధించిన రికార్డులు అంతా
ముందుగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ
నుంచి బెంగుళూరు ఆధార్ కేంద్రానికి
చేరి తిరిగి హైదరాబాద్‌కు యాక్సెస్
అవుతుందన్నారు. పోస్ట్ఫాసులు,
బ్యాంకర్ల ద్వారా ఈ నగదు లబ్ధిదారులకు
చేరుతుందన్నారు. ఇది సాంకేతిక
విప్లవానికి నిదర్శనమన్నారు.
దేశంలోనే తొలిసారిగా తిరుమల
వెంకన్న పాదాల సన్నిధిలోని చంద్రగిరి
నుంచి పథకాన్ని ప్రారంభించడం తమకు
సంతోషంగా ఉందన్నారు. పథకం
అమలుకు సంబంధించి స్వయం
సహాయక సంఘాలకు 2 శాతం
కమీషన్‌ను కూడా అందించేందుకు
చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లావ్యాప్తంగా
అమలు చేస్తున్న పథకాన్ని జూలై
1నాటికి నిజామాబాద్, నల్గొండ,
తూర్పు గోదావరి, శ్రీకాకుళం,
గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో
అమలు చేస్తామన్నారు. సెప్టెంబర్
మాసాంతానికి రాష్టవ్య్రాప్తంగా 23
జిల్లాలో అమలయ్యేలా చర్యలు
తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి,
కేంద్ర ఐటి సహాయ శాఖా మంత్రి కిల్లి
కృపారాణి, రాష్ట్ర మంత్రులు సునీతా
లక్ష్మారెడ్డి, గల్లా అరుణకుమారి,
పార్థసారథి, చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్
శివప్రసాద్, తిరుపతి ఎంపి డాక్టర్
చింతామోహన్ తదితరులు
పాల్గొన్నారు. (చిత్రం) నగదు బదిలీ
పథకం కింద లబ్ధిదారులకు నగదు
అందిస్తున్న కేంద్రమంత్రి జైరాం రమేష్,
సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి