హైదరాబాద్, మార్చి 30: ప్రభుత్వంపై
అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను
ధిక్కరించిన 18మంది ఎమ్మెల్యేలకు
అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
శనివారం షోకాజ్ నోటీసులు జారీ
చేశారు. నోటీసులకు 14 రోజుల్లో
వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది
ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినందున,
వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా
కాంగ్రెస్, టిడిపి ఇటీవల స్పీకర్‌కు
ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులపై
స్పందించిన స్పీకర్ శనివారం నోటీసులు
ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: ఆర్
వెంకట సుజయ్ రంగారావు,
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ల కలి
కృష్ణ శ్రీనివాస్, మద్దాల రాజేష్ కుమార్,
జోగి రమేష్, పేర్ని వెంకట రామయ్య,
బుచ్చెపల్లి శివ ప్రసాదరెడ్డి, గొట్టిపాటి
రవికుమార్, పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డిలకు షోకాజ్ నోటీసు
ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యేలు
సముద్రాల వేణుగోపాలాచారి, కొప్పుల
హరీశ్వర్‌రెడ్డి, పిరియ సాయిరాజ్,
తెనే్నటి వనిత, చిన్నం రామకోటయ్య,
వై బాలనాగిరెడ్డి, ఎ వెంకట
ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎన్ అమర్‌నాథ్
రెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావులకు
స్పీకర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు నిర్ణీత
గడువు ప్రకారం అయితే మరో ఏడాదిలో
సాధారణ ఎన్నికలు జరుగుతాయి.
విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై
తక్షణం అనర్హత వేటు వేస్తే ఉప
ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 18
నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
జరగడానికి అవకాశం లేదని ఆయా
పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఇప్పుడు విప్ ధిక్కరించి షోకాజ్ నోటీసు
అందుకున్న సముద్రాల
వేణుగోపాలాచారి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి
తమ రాజీనామా లేఖలను ఏడాది
క్రితమే స్పీకర్‌కు అందజేశారు. ఇక
బాలనాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని
గత ఏడాది టిడిపి స్పీకర్‌కు ఫిర్యాదు
చేసింది. వీటిపై ఎలాంటి నిర్ణయం
వెలువడలేదు. కాంగ్రెస్, టిడిపిల నుంచి
విప్‌ను ధిక్కరించిన 18మంది
ఎమ్మెల్యేల్లో ఒకరు టిఆర్‌ఎస్‌లో చేరగా,
చిన్నం రామకోటయ్య, వేణుగోపాలాచారి
ఏ పార్టీలో చేరలేదు. మిగిలిన
15మంది చాలా రోజుల క్రితమే
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. టిడిపి,
కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి వీరు
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు
14 రోజుల గడువుతో షోకాజ్ నోటీసు
ఇచ్చారు. కొందరు మరింత గడువు కోరే
అవకాశం ఉంది. ఒకవేళ రెండువారాల్లో
వీరు సమాధానం ఇచ్చినా, వీరి
సమాధానంపై ఆయా పార్టీల
అభిప్రాయాన్ని స్పీకర్ కోరుతారు. ఈ
తతంగం అంతా ముగిసే సరికి సాధారణ
ఎన్నికలు సమీపిస్తాయని, ఉప
ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయా
పార్టీల నేతలు భావిస్తున్నారు. అటు
కాంగ్రెస్, ఇటు టిడిపి ప్రస్తుతం ఉప
ఎన్నికలకు సిద్ధంగా లేవు.