పుణే, ఏప్రిల్ 7: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో పుణే వారియర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఈ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులకు పరిమితంకాగా, కింగ్స్ ఎలెవెన్ 12.2 ఓవర్లలో, రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో ప్రవీణ్ కుమార్, అజర్ మహమూద్ రాణించి చెరి రెండు వికెట్లు పడగొట్టగా, బ్యాటింగ్‌లో మానన్ వోరా రాణించి కింగ్స్ ఎలెవెన్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌తోనే ఐపిఎల్‌లో అరం గేట్రం చేసిన వోరా చక్కటి ఆటతో అభిమాను లను ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచిన పుణే వారియర్స్ బ్యాటింగ్‌ను ఎంచుకొని, ఒక పరుగు స్కోరువద్ద తొలి వికెట్‌ను మనీష్ పాండే (0) రూపంలో కోల్పోయింది. ప్రవీణ్ కుమార్ ఈ వికెట్‌ను సాధించి పుణేను తొలి దెబ్బతీశాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వికెట్ల పతనం కొనసాగింది. తిరుమలశెట్టి సుమన్ 6 పరుగులు చేసి అజర్ మహమూద్ బౌలింగ్‌లో ప్రవీణ్ కుమార్‌కు చిక్కగా, మార్లొన్ సామ్యూల్స్ మూడు పరుగులు చేసి రనౌటయ్యాడు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప కొంత సేపు కింగ్స్ ఎలెవెన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, 23 బంతుల్లో, రెండు ఫోర్లతో 19 పరుగులు చేసి, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, నాలుగు పరుగులు చేసి, పర్వీందర్ ఆవానా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ సులువైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. రాస్ టేలర్ 19 బంతుల్లో 15 పరుగులు చేసి, ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో లాంగ్ లెగ్‌లో గుర్‌కీరత్ సింగ్ అద్భుతమైన క్యాచ్ అందుకోగా వెనుదిరగడంతో పుణే వారియర్స్ 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి, ఐపిఎల్ టోర్నీలోనే అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచే ప్రమాదంలో పడింది. ఈ దశలో అభిషేక్ నాయర్, మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 25 పరుగులు జోడించడంతో, పుణే జట్టుకు అత్యల్ప స్కోరు ప్రమాదం తప్పింది. 15 పరుగులు చేసిన మార్ష్‌ను హారిస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. భువనేశ్వర్ కుమార్ 8 పరుగులు చేసి అజర్ మహమూద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతిలో రాహుల్ శర్మ (1) రనౌటయ్యాడు. పుణే తొమ్మిది వికెట్లకు 99 పరుగులు చేయగా, నాయర్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కేవలం వంద పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ 21 పరుగుల స్కోరువద్ద కెప్టెన్ గిల్‌క్రిస్ట్ వికెట్‌ను కోల్పోయింది. అతను 10 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసి, మాథ్యూస్ బౌలింగ్‌లో సామ్యూల్స్‌కు చిక్కాడు. ఆతర్వాత మన్దీప్ సింగ్‌తో కలిసి ఓపెనర్ వోరా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో కింగ్స్ ఎలెవెన్ లక్ష్యానికి చేరువైంది. 26 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసిన మన్దీప్ సింగ్‌ను రాహుల్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం డేవిడ్ హస్సీ (నాటౌట్ 8)తో కలిసి వోరా మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అతను 28 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లతో 43 పరుగులు సాధించి, కింగ్స్ ఎలెవెన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సంక్షిప్తంగా స్కోర్లు
పుణే వారియర్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 (ఉతప్ప 19, నాయర్ 25 నాటౌట్, ప్రవీణ్ కుమార్ 2/31, అజర్ మహమూద్ 2/19).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 12.2 ఓవర్లలో రెండు వికెట్లకు 100 (మన్దీప్ సింగ్ 31, మానన్ వోరా నాటౌట్ 43, మాథ్యూస్ 1/12, రాహుల్ శర్మ 1/20).