అనుబద్ధేంద్రియ భూత వర్గము యమా ద్యష్టాంగ మంత్రోరు సా
ధన నుచ్చాటన సేసి పాపి గురు సద్వాక్య ప్రకాశోత్తమాం
జన దృష్టిం బరికించి యేర్పరిచి వాంఛం గోరి సాధించి చే
కొను చిన్మూర్తికి గాని భక్తి నిధి గీల్కోదెందు సర్వేశ్వరా !
భావం: సర్వేశ్వరా! యమనియమానసనాది అష్టాంగాలచేత మంత్రాల చేత గాని సాధన చేసి మన వెంట కట్టబడిన ఇంద్రియాలనే భూతాలను ఊడబెరికి పాపి, గురువు యొక్క సద్వాక్యాల తేజస్సునే కాటుకగా పెట్టుకొన్న దృష్టితో చూసి స్పష్టీకరించుకొని, తీవ్ర వాంఛతో కావాలనుకొని, సాధించి గ్రహించి చిన్మూర్తికి కాని భక్తి అనే నిధి లభించదు. యోగానికి ఎనిమిదిఅంగాలున్నాయ. అందుకే దానిని అష్టాంగ యోగం అన్నారు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులన్నవి. సమాధి అన్నది లక్ష్యం. తక్కిన ఏడున్నూ దానికి సాధనాలు. ఈ అష్టాంగయోగాన్ని రాజయోగం అని అంటారు.
సర్వేశ్వర శతకములోని పద్యమిది