సాత్త్విక, రాజస, తామస పూజా విధానములే త్రివిధ పూజావిధానములుగా అంటారు. శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, విష్ణువు, ఆదిత్యుడు... ఈ ఆరుగురు దేవుళ్ళను భక్తిపూర్వకంగా పూజించే విధానమే సాత్త్విక పూజా విధానం. ప్రతిరోజూ శివుని భక్తి పూర్వకంగా పూజించుట, మాస శివరాత్రి, మహాశివరాత్రి.. ఇత్యాది పర్వదినాలలో సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్ష, జాగరణతో కూడిన శివనామస్మరణ చేయుటవలన తరించి, లింగోద్భవ కాలంలో పరమ శివుని రూపాన్ని తనివితీరా చూస్తూ పులకించి అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకొనుటలో అంతర్లీనమై ఉన్న పూజా విధానాన్ని అణువణువు పరికించగలిగితే ఇది సాత్త్విక పూజా విధానం.
సాత్త్విక పూజా విధానంలో వాడబడుతున్న ద్రవ్యములు అత్యంత పవిత్రమైనవి. పుష్పములు, గంధము, కుంకుమ, క్షీరము, ఘృతము, పెరుగు, తేనె, చక్కెర, బెల్లం, తమలపాకులు, వక్కలు, బియ్యం, పసుపు, అగరుబత్తులు, దీపపు ఒత్తులు, ఉదకం, పంచపాత్ర, ఉద్ధరిణి, మామిడాకులు, అరటి ఆకులు, అరటిపండ్లు, కొబ్బరికాయ, పన్నీరు, కర్పూరం.. తదితర పూజా సామగ్రిని పరికించి చూస్తే ప్రతి యొక్క ద్రవ్యమూ సత్త్వగుణానికి ప్రతీకగా ఉంటూ సాత్త్విక పూజావిధానము యొక్క విశిష్టతనుచెబుతాయ.
అట్టహాసంగా చేసే పూజావిధానమే రాజసపూజావిధానమని చెప్పవచ్చు.ఈ విధానంలో భారీఎత్తున పూజకు పుష్పాలు, అందరినీ ఆకట్టుకునేలా మంత్రోచ్చారణ ఇత్యాదులు ఉండేవి అన్నింటినీ రాజసపూజలుకానే చెప్పవచ్చు.
ఇక మూడవది, అత్యంత ప్రమాదకరమైన పూజా విధానం, ఆచరణయోగ్యం కాని తామస పూజా విధానం. క్షుద్రశక్తులను పూజించుట, చేతబడి, బాణామతి, ఇవన్నీ తామస పూజా విధానానికి చెందినవి. ఎదుటి వ్యక్తి యొక్క నాశనాన్ని తద్వారా తన ఉన్నతిని కోరుతూ, ఆ కోరికలు నెరవేరాలన్న దురుద్దేశ్యంతో ఆచరింపబడుతున్న పరమ నీచమైన విధానమే తామస పూజా విధానం. ఇటువంటి పూజా విధానం ఆచరించుటవలన ఎదుటి వ్యక్తి నాశనం అవుతాడనో లేక శాశ్వతంగా దూరమై (మృత్యుదేవత కౌగిలిలోనికి వెళ్లి) తన పదవికి లేదా వ్యాపారానికి అడ్డు తొలగుతాడని ఆశించడం కేవలం భ్రమ. ఏ వ్యకె్తైతే ఈ తామస పూజా విధానాన్ని ఆచరిస్తాడో, ఏ వ్యకె్తైతే తోటి వ్యక్తిలో నిక్షిప్తమై ఉన్న దైవాన్ని గుర్తించలేక ఆ వ్యక్తిని నాశనం చేయాలని మనసులో అనుకుంటాడో.. అటువంటి వ్యక్తి (తామస పూజను ఆచరించిన వ్యక్తి) భగవంతుని ఆగ్రహానికి గురై కొలది కాలంలోనే జీవితంలో పతనమవుతాడు.
కోటానుకోట్ల ప్రాణుల క్షేమాన్ని కోరి చేయబడేటటువంటి సాత్త్విక పూజ పరమ పవిత్రమైనది. అందుకే సాత్త్విక పూజా విధానం అత్యంత విశిష్టమైనది. కుల దేవతలను లేదా గ్రామ దేవతలను కొలిచే రాజస పూజా విధానం, సాత్త్విక పూజా విధానమంతటి విశిష్టత కలిగియుండకపోయినప్పటికీ, ఆచరణయోగ్యమైనదిగా పెద్దలచే నిర్దేశింపబడినది. ఇక మూడవ పూజా విధానంగా పరిగణింపబడుతున్న తామస పూజావిధానం అత్యంత ప్రమాదకరమైనది. పాపాలను మూట కట్టుకుని నరకయాతనను అనుభవించాల్సి వస్తుంది కనుక దీనిని ఆచరించకపోవడమే ఉత్తమమని పెద్దలు చెప్తారు.
===========================
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
===========================
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003
సాత్త్విక, రాజస, తామస పూజా విధానములే త్రివిధ పూజావిధానములుగా
english title:
pooja vidhanaalu
Date:
Tuesday, April 9, 2013