మనకి అవశ్యం విజయం లభిస్తుంది. నా అస్త్రాలు ఎదుర్కొనడం కన్న దనుజారికి వేరు ఉపాయం ఏముంది కనుక? ఎక్కడ దాగికొని వుండగలడు?
పిమ్మట వానరచమూ నాయకుడు నీలుడిని కనుగొని ‘‘మిక్కిలి చక్కదనం, కడు నిర్మలం, మిక్కిలి స్వాదుజలం కల తావు చూసి పరిపక్వ ఫలాలు, కౌచిషలించిన వృక్షాలుచూసి ఆ తెరువున సేనను నడిపించు. వృక్షములు ఏపుగా, సాంద్రంగా పెరిగితే శత్రువులు కానరాకుండా దాగి వుంటారు. ఏమరుపాటు తగదు’’ అని వాకొన్నాడు. శ్రీరామచంద్రుడి ఆజ్ఞ తలదాల్చి నీలుడు ఆ రీతిగానే సేనల్ని నడిపించమొదలిడ్డాడు.
సుగ్రీవుడు కపిసేనలను వెడలించుట
అప్పుడు కపిరాజు సుగ్రీవుడు వానరులను పిలిచి లంకపై దండుగ వెడల ఆజ్ఞాపించాడు. వానర సైన్యం పటురభసంతో పర్వత గుహలనించి ప్రయాణం అయింది. ఆ కపివీరుల పదఘట్టనలకి పుడమి క్రక్కడలింది. వారి భీకరరావాలకి పర్వత గుహలు ఘూర్జిల్లాయి. వానరవీరుల సింహనాదాలు, హాసాలు, గర్జనలు ఆకసం అంటాయి. వానరులుకొందరు కోపంతో పెనుబొబ్బలు పెట్టారు. మరికొందరు త్రుళ్లింతలాడుతూ శక్తికొలది ఆకాశంలోకి ఎగురుతున్నారు.
మరికొందరు పండిన బదరీనికుంజాలు మూపులమోస్తూ రేగుపండ్లు నమలుతున్నారు. రావణుడితోకూడా రాక్షసుల్ని మేమే చంపుతాం అని అరుస్తున్నారు. కుతూహలులై పైకి దుముకుతున్నారు. అక్కడ నించి భువిమీదికి ఉరుకుతున్నారు. ఇంకొందరు తోకలు విసరికొడుతూ ఆడుతున్నారు. వేగంగా పర్వత శిఖరాలపైకి కొందరు బొబ్బలు పెడుతున్నారు. ఈ మాదిరి వానర వీరులు సర్వులూ చెలరేగి ఆడుతూవుంటే రామ విభుడు పరమానందభరితుడయాడు. కపుల నినాదాలతో దిక్కులు ప్రతిధ్వనులీనుతున్నాయి. భూమి అట్టిట్టు కంపించింది. అద్రులు అదిరాయి.
దిగ్గజాలు మ్రొగ్గతిల్లాయి. శేషుడికి భూమి మోయలేనంతభారంగా తోచింది. కూర్మము తన అవయవాలనులోపలికి ముడుచుకొన్నది.
ఈ విధంగా వానర సైన్యం ఉద్ధతితో నడవగా పైకెగసిన ధూళిపటలం బహువర్ణాలతో మింట అంతటా వ్యాపించింది.
నీలుడు మంగలియై సాగే సేన అత్యుగ్రతుండగా- ఇరుప్రక్కల కదలు కపిబలము ఉద్ధత పక్షాలుగా మధ్య నడతెంచువారు, రామవిభుడు ఆత్మగా సొంపు మీరి, వెన్క కాచి వచ్చు సేన వాలంగా-ఉరగపాశాల కట్టువడనున్న ఇనకుల తిలకుని అవస్థలు తొలగించడం కోసం గరుత్మంతుడు భూస్థలిని నడచు కరణి ఆ మర్కట మహాసేన అలరారింది.
ప్రజంఘుడు, కేసరి, దధీముఖుడు సందడి తొలగ, విరళంగా శ్రీరామ వెల్లువ కదల పరమ సంతోష భరితాత్ములు అవుతూ గవయుడు, తారుడు, గంధమాదనుడు, పనసుడు, హనుమంతుడు, అంగదుడు, శరభుడు, నలుడు జాంబవంతుడు, హరుడు, మైందుడు ఆదిగా గలుగు తరుచర పతులు వడివడిగా వెంబడి ఏతేరగా చనుదెంచి రాముడు సహ్య పర్వతాన లక్ష్మణ సమేతంగా విడిశాడు. అప్పుడు అంతం లేక పెంపొందే వనాల, తటాకాల, విరివియైన ఛాయల, ఇరవైన తావుల విడుదులు కావించుకొని, ఆ సేనలు సుగ్రీవుడి ఆజ్ఞను శిరసావహించి నిలిచాయి. మరునాడు ఎప్పటివలెనే లక్ష్మణుడు, రామవిభుడు, కపిరాజు సుగ్రీవుడు, వానర నాయకులు పయనం సాగించారు. వీరరసంతో పొంగి పొంగి, అంతటా పర్విన ధ్వనులతో రేగి రేగి, శరీర కాంతి తరంగాల తనరారి ఆరి, ఘనమైన మ్రోతతో ఆకసం అంటి అంటి, వనశైలములందు ఒప్పి ఒప్పి, మనువంశ ప్రభువైన శ్రీరామవిభుచే మదిని ఉబ్బి వుబ్బి, ఆ సముద్రం పెంపుని అణచివేయ భాసురమైన వానరసేనా సముద్రం నడచింది.
అంత ధైర్య గుణాఢ్యులైన రామలక్ష్మణులు సూర్యచంద్రుల మాదిరిగా శోభిల్లారు.
-ఇంకాఉంది