శ్రీశైలం, ఏప్రిల్ 8: శ్రీశైలం దేవస్థానంలో ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9.15 గంటలకు అంకురార్పన, యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. శాస్త్రోత్తంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు భ్రమరాంభికాదేవికి ప్రత్యేక అలంకరణ, రుద్ర, చండీ హోమాలు నిర్వహిస్తారు. ఉదయం వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ నిర్వహించి ఉగాది ఉత్సవాలకు అంకురార్పన గావించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు దేవస్థానం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్నాటకలోని బెల్గాం సంకనట్టికి చెందిన జగత్ జ్యోతి బసవేశ్వర నాట్య సంఘ్ వారిచే బసవేశ్వర చరిత్ర కన్నడ నాటక ప్రదర్శన ఉంటుంది. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు పెద్దసంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. (చిత్రం) శ్రీశైలంలో సోమవారం ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ చేస్తున్న అర్చకులు
శ్రీశైల మల్లన్నకు భృంగివాహన సేవ
ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు విశేష అలంకారాల్లో పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భృంగివాహనంపై ఆశీనులు చేసి ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మహాదుర్గ అలంకారంలో అలరించనున్నారు. మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లకు కైలాసవాహన సేవ నిర్వహిస్తారు.
ప్రవాహంలా మల్లన్న భక్తులు
కర్నూలు, ఏప్రిల్ 8: నల్లమల అటవీమార్గం గుండా మల్లన్న భక్తులు ప్రవాహంలా శ్రీశైలం వైపు తరలివెళ్తున్నారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంబికమాతకు సారె ఇవ్వడానికి కన్నడిగులు పాదయాత్రగా వెళ్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద నల్లమలలోకి అడుగుపెట్టే కన్నడిగులు శ్రీశైలం వరకు అటవీ మార్గంలోనే వెళ్తుంటారు. వారి కోసం మహారాష్టక్రు చెందిన భక్తుల బృందం గత రెండు దశాబ్దాలుగా నాగలూటి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కన్నడ భక్తులకు 3 రోజుల పాటు అన్నదానం చేసేందుకు ఏకంగా 12 టన్నుల బియ్యం, మూడు టన్నుల కందిపప్పు ఖర్చయింది. ఒక్క ఆదివారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సుమారు 1.50 లక్షల విస్తరాకులను వినియోగించినట్లు తెలిపారు. ఇక అల్పాహారంగా సుమారు 7 టన్నుల ఉప్మా రవ్వను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇక ఇతర వంట సరుకులతో పాటు బెల్లం, చక్కెర వంటివి సైతం భారీ ఎత్తున వినియోగించి భక్తులకు అన్నదాన కార్యక్రమంలో ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 3లక్షల మంది కన్నడిగులు ఉండగా మరో మూడు, నాలుగు లక్షల మంది ఉగాది నాటికి శ్రీగిరికి చేరుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, ఏప్రిల్ 8: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనున్నది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుమారు నాలుగుగంటల పాటు కొనసాగుతుంది. ఆనందనిలయం మొదలుకుని ఆలయంలో వున్న ఉపదేవాలయాలన్నీ కూడా ఈ సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి అనుమతించనున్నారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది విజయనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని వేడుకున్నానన్నారు.
శ్రీశైలం దేవస్థానంలో ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలు
english title:
ugadi celebrations
Date:
Tuesday, April 9, 2013