నూజివీడు, ఏప్రిల్ 8: జైలులో అందించిన అనధికార సేవలకుగాను 15వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు జైలు సూపరింటెండెంట్‌పై సోమవారం సాయంత్రం దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన చలమలశెట్టి శ్రీనివాసరావు ను అత్యాచార యత్నం కేసులో మార్చి 28న పోలీసులు అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. అతడిని నూజివీడు జైలుకు తరలించారు. శ్రీనివాసరావుకు జైలు తిండి పడక అనారోగ్యం పాలయ్యాడు. యటి నుంచి ఆహారం తెచ్చుకునేలా జైలు సూపరింటెండెంట్ కుటుంబరాజుతో బేరమాడాడు. రెండు పర్యాయాలు 5వేల రూపాయల వంతున ఇచ్చాడు. తరువాత 80 బస్తాల సిమెంట్ కావాలని రాజు ఒత్తిడి చేశాడు. ఈలోగా ఈ నెల 4న శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుండి డబ్బులు కావాలని నిత్యం వేధిస్తుండటంతో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌గా 15వేల రూపాయలు ఇచ్చిపుచ్చుకునేలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈవిషయాన్ని శ్రీనివాసరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సోమవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయం సమీపంలోని గాంధీబొమ్మ వద్ద ఉన్న బడ్డీలో జైలు సూపరింటెండెంట్ కుటుంబరాజు డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నట్లు డిఎస్పీ వివరించారు. ఆయనను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎసిబి అధికారులు నాగరాజు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారిపై అత్యాచారం కేసులో కామాంధుడికి పదేళ్ల జైలు
గుంటూరు , ఏప్రిల్ 8: మూడేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడికి పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జ్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విరూపాక్ష దత్తాత్రేయ గౌడ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గుంటూరు జిల్లా బాపట్లలోని రైలుపేటకు చెందిన ఉయ్యాల దాసు(26)కు అక్కడి రాజీవ్‌గాంధీ కాలనీలో ఓ భవన నిర్మాణ కార్మికుడితో పాత గొడవలున్నాయి. ఈనేపథ్యంలో 2011 అక్టోబర్ 7న కాలనీలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆ కార్మికుడి మూడేళ్ల కుమార్తెను రాత్రి 10గంటల సమయంలో అపహరించుకెళ్లిన దాసు సమీపంలోని దిబ్బల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి ఒంటి గంట సమయంలో చిన్నారి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు వెళ్లగా వారిని చూసి దాసు పరారయ్యాడు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాపట్ల సిఐ ఎండి మహబూబ్ బాషా నిందితుడు దాసుని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. దాసుపై నేరం రుజువుకావడంతో పదేళ్ల జైలుశిక్ష, 7,500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
ప్రత్తిపాడు, ఏప్రిల్ 8: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆక్సిజన్ సిలిండర్లతో బెంగుళూరు నుండి కోల్‌కత్తా వెళుతున్న లారీని డ్రైవర్ నిద్రమత్తులో నడుపుతూ నిర్మాణంలో వున్న వంతెనను అతివేగంగా ఢీకొట్టటంతో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారన్నపేటకు చెందిన 12 మంది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని నాగభట్లవారిపాలేనికి బెల్లం తయారీ కూలి పనుల కోసం వచ్చి స్వగ్రామం వెళ్లడానికి లారీ ఎక్కారు. పిన్నింటి అప్పలనాయుడు(45), సత్తెమ్మ(40) అనే దంపతులు, లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. అల్తి రాము(40) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.