విశాఖపట్నం, ఏప్రిల్ 9: విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ విపక్షాలు మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది చిన్న,చిన్న సంఘటనలు మినహా నగరంలో అంతటా బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసీకాంప్లెక్స్, జగదాంబ జంక్షన్ల వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను అడ్డుకున్నారు. జాతీయ రహదారి మద్దిలపాలెం, గురుద్వారా, మర్రిపాలెం, ఎన్‌ఏడి జంక్షన్, హనుమంతువాక జంక్షన్, కారుషెడ్, మధురవాడ ప్రాంతాల వద్ద ఆందోళనకారులు రోడ్డుపైన బైఠాయించడం, రాస్తారోకలు జరపడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దుకాణాలు, వాణిజ్యసముదాయాలు చాలాచోట్ల స్వచ్చందంగానే మూడపడ్డాయి.
భారీగా అరెస్టులు
బంద్‌లో పాల్గొన్న వామపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు దాదాపు 400 మందిని పోలీసులు వేర్వేరుచోట్ల అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆ తరువాత వీరందర్ని విడిచిపెట్టారు.
మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు
బంద్ కారణంగా ముందుగానే ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలకు సెలవుప్రకటించారు. సిటీ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు పల్చబడ్డారు. కలెక్టరేట్, కెజిహెచ్, జిల్లాప్రజాపరిషత్, ప్రణాళిక విభాగం, ఈపిడిసిఎల్, పశుసంవర్ధక శాఖ, జిసిసి, డిసిసి బ్యాంకు, ఆర్టీసీ, రవాణాశాఖల్లో పలు విభాగాల్లో ఉద్యోగుల శాతం తగ్గింది. దీంతో ఇవన్నీ ఖాళీకా దర్శనమిచ్చాయి.
మధ్యాహ్నం నుంచి కనిపించని ప్రభావం
మంగళవారం వేకువజాము నుంచి రోడ్డెక్కిన వామపక్షాల నేతలు మధ్యాహ్నాం ఒంటి గంట వరకు బంద్‌ను విజయవంతంగా నిర్వహించగలిగారు. ఆ తరువాత బంద్ ప్రభావం మధ్యాహ్నాం నుంచి ఎక్కడా కనిపించలేదు. సిటీ సర్వీసులు యథావిధిగా నడిచాయి. దుకాణాలు తెరుచుకున్నాయి.
సిపిఐ ఆధ్వర్యంలో
మంగళవారం విశాఖ నగరంలో నిర్వహించిన బంద్ సంపూర్ణమైంది. పలుచోట్ల ప్రదర్శనలు, రాస్తారోకలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకే సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి సారధ్యంలో నాయకులు, కార్యకర్తలు మద్దిలపాలెం బస్ డిపో వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను నిలువరించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఆటోమోటివ్ వరకు వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో సిపిఐ, నాయకులు ఎ.విమల, సిహెచ్.రాఘవేంద్రరావు, పైల ఈశ్వరరావు, జి.వామనమూర్తి, పడాల రమణ, సిపిఎం నాయకులు సిహెచ్, నర్సింగరావు, గంగారావు, కుమార్, బిజెపి నాయకులు ఎమ్.నాగేంద్ర, పివిఎన్ మాధవ్, ఎస్‌యుసిపిఐ నాయకులు సురేష్‌కుమార్, వైఎస్‌ఆర్‌సిపి నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ కార్యాలయం అల్లిపురం నుంచి అల్లిపురం మార్కెట్, సింహాలదేముడు జంక్షన్, లీలామహల్ మీదుగా జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తితో పాటు నాయకులు ఎ.విమల, సిహెచ్.రాఘవేంద్రరావు, కాసులరెడ్డి, కోట సత్తిబాబులు పాల్గొన్నారు. రోడ్డుకిరువైపులా తెరచిన షాపులను మూయించి ఆందోళన నిర్వహించారు. జగదాంబ జంక్షన్‌లో మానవహారం నిర్వహించిన అనంతరం డాబాగార్డెన్స్ మీదుగా ఆర్టీసీకాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీకాంప్లెక్స్ అవుట్‌గేట్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
దీంతో అప్పటికే అక్కడి మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని త్రి టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తితో పాటు ఎ.విమల, జెడి నాయుడు, శివప్రసాద్, ప్రశాంత్, గురుమూర్తి, గురునాధరావు, వెంకటేశ్వరరావు, పిఏ రాజు, ఇబ్రహీమ్, సూరిబాబు, వజ్రం, అప్పన్నలు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు రాష్టవ్య్రాప్తంగా నేడు రాష్ట్ర బంద్ చేస్తుంటే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేయిస్తుందని విమర్శించారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు తమ ఆందోళన ఆగదని, దశలవారీగా వివిధ రూపాల్లో ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. 2013-14 సంవత్సరానికి 6334 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపిందన్నారు. చార్జీల పెంపునకు నియంత్రణ ఉండాలని అది నేడు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంధన సర్ధుబాటు చార్జీలు, కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, పెంచిన విద్యుత్‌చార్జీలు పూర్తిగా రద్దు అయినంతవరకు ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సమస్యలపై కస్తూరిబా విద్యార్థినుల పాదయాత్ర
* ఆర్డీవోకు బాలికల వినతి
నర్సీపట్నం, ఏప్రిల్ 9: ప్రతి రోజు సమస్యలు ఎదుర్కొంటున్న వసతి గృహ విద్యార్థినులు చివరకు పోరుబాట పట్టారు. ప్రతిరోజు తాము తింటున్న అన్నంలో పురుగులున్నా ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం, సరైన భోజనం పెట్టకపోవడంతో కస్తూరిబా విద్యార్థినులు చివరకు సుమారు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆర్డీవోకు సమస్యను వివరించి పరిష్కరించాలని కన్నీళ్ళతో వేడుకున్నారు. మండలంలోని వేములపూడిలో కస్తూరిబా పాఠశాల ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు సుమారు 70 మంది విద్యార్థినులు నిద్ర లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలనే లక్ష్యంతో అందరూ ఒక్కమాటిపైకి వచ్చి నడక ప్రారంభించారు. ఈ విషయం స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మికి తెలియడంతో ఆమె అప్రమత్తమైంది. దారిలో కనిపించిన విద్యార్థులను తిరిగి కస్తూరిబా పాఠశాలకు పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికీ కొందరు విద్యార్థినులు మొండికేసి శ్రీరాంపురం, దుగ్గాడ, బైపురెడ్డిపాలెం మీదుగా బలిఘట్టం చేరుకున్నారు. దారిపొడవునా తమకు జరుగుతున్న అన్యాయాలను నినాదాల చేసుకుంటూ వచ్చారు. బలిఘట్టంలో సి.పి.ఐ. నాయకులు రుత్తల బుజ్జి, గ్రామ నాయకుడు గవిరెడ్డి రమణ విద్యార్థునులను ఎక్కడకు వెళ్తున్నారని ప్రశ్నించగా, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నామని విద్యార్థ్ధినులు చెప్పారు. అక్కడ వారిద్దరూ వ్యాన్‌ను పురమాయించి విద్యార్థినులను ఆర్డీవో వసంతరాయుడు వద్దకు తీసుకువచ్చారు. ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థినులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతూ నినాదాలు చేశారు. చివరకు ఆర్డీవో బయటకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. తాము రోజూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అన్నంలో పురుగులు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మీరైనా మాకు న్యాయం చేయాలని విద్యార్థినులు ఆర్డీవోను కన్నీళ్ళతో వేడుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రత్యేకాధికారి విజయలక్ష్మిని ఆర్డీవో విద్యార్థినుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మందలించారు. వారి సమస్యలు ఎదుర్కొకపోతే ఇంత దూరం నడుచుకుంటూ ఎందుకు వస్తారని విజయలక్ష్మిని నిలదీశారు. అనంతరం ఆర్డీవో విద్యార్థినులతో మాట్లాడుతూ తాను కస్తూరిబా పాఠశాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం విద్యార్థినులను స్కూల్‌కు తీసుకువెళ్ళమని ఆర్డీవో ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత
* మంత్రి బాలరాజు
కోటవురట్ల, ఏప్రిల్ 9: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు మొట్టమొదట చట్టబద్దత కల్పించారని గిరిజన సంక్షేమశాఖా మంత్రి పసుపులేటి బాలరాజు స్పష్టం చేశారు. సబ్‌ప్లాన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన కళాజాత బృందం సా ంస్కృతిక ప్రదర్శనను మంగళవారం మండలం పాములవాక ఎస్సీ కాలనీలో మంత్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి బాలరాజు మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ 1975 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ప్రవేశపెట్టారన్నారు. అప్పటి నుంచి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు, పాలకులు ఉప ప్రణాళికను పట్టించుకోకుండా నిర్లక్ష్య ం చేస్తూ వచ్చాయన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. వారి కోసం కేటాయించిన నిధులు దారిమళ్ళేవన్నారు. ఈ లోపాలు సరిదిద్ది వారికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేసే విధంగా ముఖ్యమంత్రి సబ్‌ప్లాన్‌పై చట్టబద్దత చేశారన్నారు. చట్టం వలన బడ్జెట్‌లో 22 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయిస్తారన్నారు. ఈనిధులతో ఎస్సీ. ఎస్టీ అవాసిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం కోసం నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ డి.వి.ఎస్.రాజు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి 1,250 కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తారన్నారు. సబ్‌ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ఎస్సీ, ఎస్టీల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు తొలిసారి మండలంలో నిర్వహిస్తారన్నారు. ప్రతిపక్ష పార్టీలు సబ్‌ప్లాన్ చట్టబద్దతను వ్యతిరేకించడం విచారకరమన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు, నర్సీపట్నం ఆర్డీవో వసంతరాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రామారావు, ఎడీవో కృష్ణారావు, తహశీల్దార్ లక్ష్మణమూర్తి, ఐ.సి.డి. ఎస్.పి. ఓ. అనంతలక్ష్మి, మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాస్, కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
లక్ష్యానికి చేరువలో తాండవ క్రషింగ్
పాయకరావుపేట, ఏప్రిల్ 9: 2012-13 క్రషింగ్ సీజనుకు తాండవ చక్కెర కర్మాగారంలో మంగళవా రం నాటికి 1,50,920 ట న్నులు చెరకు క్రషింగ్ జరిగినట్లు మేనేజింగ్ డైరక్టర్ వి.ఎస్.నాయుడు తెలిపా రు. దీనిద్వారా 1,40,600 క్వింటాళ్ల పంచదార బ స్తాలు ఉత్పత్తి సాధించామన్నారు. 9.61 శాతం రికవరీ సాధించామన్నారు. ఈ ఏడాది రెండు లక్షల టన్నులు చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, లక్ష్యానికి చేరువలో ఉన్నామన్నారు. మార్చి నెలాఖరు నాటికి చెరకు రవాణా చేసిన రైతులకు టన్నుకు 1,832.60 రూపాయలు చొప్పున 10.11 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. వచ్చే సీజనుకు ఇప్పటికే 2,731 హెక్టార్లలో చెరకు నాట్లు జరిగాయని మేనేజింగ్ డైరెక్టర్ నాయుడు తెలిపారు.
గిరిజన యువతిపై అత్యాచారం
పాడేరు, ఏప్రిల్ 9: గిరిజన యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుని ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు పోలీసుల కధనం ప్రకారం పెదబయలు మండలం లింగేటి పంచాయతీ మఠంవీధికి చెందిన 20 ఏళ్ళ యువతి పాతపాడేరులో నివాసం ఉంటున్న తన మామగారి ఇంటికి ఇటీవల వచ్చింది. బావ గోపాలకృష్ణ గతనెల 22వ తేదీన మీ అక్క రమ్మంటున్నదంటూ చెప్పి ఆమెను ఆటోలో తీసుకువెళ్లాడు. పాతపాడేరు నుంచి బంట్రోతుపుట్టు గ్రామానికి ఆమెను తీసుకువెళ్లిన ప్రబుద్ధుడు ఒక ఇంటిలో ఆమెను బందించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపుతానని బెదిరించడంతో బాధిత యువతి చాలారోజులు తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఈవిషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 8వతేదీ సోమవారం రాత్రి పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అపహరణ, అత్యాచారం నేరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. జి.అప్పన్న మంగళవారం రాత్రి విలేఖరులకు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.
ఎఎన్‌ఎంకు లైంగిక వేధింపులు
పాడేరు, ఏప్రిల్ 9: తనను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎం. పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఎన్ .ప్రకాశరావు కిందిస్థాయి ఉద్యోగి చెండా చంద్రమ్మ అనే ఎఎన్‌ఎం.ను గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. తన దారికి రాకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేసి ఉద్యోగం చేయకుండా చేస్తానంటూ తనను బెదిరిస్తున్నట్టు చంద్రమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె పోలీసులను అభ్యర్థించింది. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ. జి.అప్పన్న మంగళవారం విలేఖరులకు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టు
సీలేరు, ఏప్రిల్ 9: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ అక్కిరాజు అలియాస్ హరిగోపాల్‌కు గన్‌మాన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌మాడి అలియాస్ రాజు మంగళవారం మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ విలేఖరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లా మోటు పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిపురానికి చెందిన సందీప్‌మాడి బలిమెల ఏరియా కమిటీ కార్యదర్శి అశోక్‌ద్వారా 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 2007లో జిల్లాలో కోరుకొండ ఏరియా కమిటీ మావోయిస్టు దళంలో శిక్షణ పొందాడు. 2008లో నయాగడ్ ఆయుధకర్మాగారంపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకుపోయిన సంఘటన, ఉదయగిరి జైల్‌పై దాడి, కలిమెల,పోడుగెట్ట ఎదురుకాల్పులు ఘటనలో కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో చింతపల్లి, పెదబయలు, ముంచింగ్‌పుట్ ప్రాంతాల్లో కోరుకొండ ఏరియాతో కలిసి అనేక విధ్వంసాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. సందీప్ కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వారు అనారోగ్యంతో ఉండడంతో వారి ఒత్తిడి మేరకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం కీలక నేత రామకృష్ణ గన్‌మెన్‌గా వ్యవహరిస్తున్నాడని, ఈయన గన్‌మెన్‌గా వ్యవహరించడానికి ప్రత్యేక శిక్షణ పొందాడని ఎస్పీ తెలిపారు.