సినిమా పేరులో వున్న ‘జై, శ్రీ’ అన్న అక్షరాలు విజయానికి గుర్తులని, అదే విధంగా విజయనామ సంవత్సరంలో తొలిసారిగా సోలో చిత్రంగా విడుదలవుతున్న ‘జై శ్రీరామ్’ చిత్రం అందరికీ విజయాన్ని అందించాలని, బ్లాక్‌బస్టర్‌లా కాకుండా నిండు కుండలా ప్రేక్షకాదరణ పొందుతూ సిరులు కురిపించాలని, నిర్మాతలు మళ్లీమళ్లీ ఇలాంటి చిత్రాలు నిర్మించాలని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. ఫైవ్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలాజీ ఎన్. సాయి దర్శకత్వంలో తేళ్ల రమేష్, ఎన్. సిహెచ్.రాజేష్ నిర్మించిన ‘జైశ్రీరామ్’ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు దాసరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుందని, మంచి మంచి టెక్నీషియన్లు, నటులు వస్తున్నారని, వీరందరూ వారికి లభించిన అవకాశాలను నిలబెట్టుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 287 థియేటర్లలో ఈ ఉగాదికి విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మల్టీ మీడియా సంస్థ పంపిణీ చేస్తోందని, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు సహకరిస్తేనే చిన్న సినిమాలు విజయం పొందుతాయని ఆయన అన్నారు. బాలాజీ గతంలో మంచి చిత్రాలను తీశాడని, ఈ చిత్రం కూడా అదే విధంగా తీసి ఉంటాడన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఈ ఉగాదికి కొత్త ఉదయ్‌కిరణ్ మళ్లీ పుడుతున్నాడని, లవ్ ఫీల్‌లో హోలీగా చూపే హీరో గా కనిపిస్తాడని, మళ్లీ ఓ కెరీర్ అతని జీవితంలో ప్రారంభమైందని, ఈ చిత్ర నిర్మాతలు కొత్త కొత్త చిత్రాలను ఇంకా నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఉగాదికి కొత్త కెరీర్ ప్రారంభిస్తున్న తాను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలని, ఒకటి శ్రీరామరక్షగా నాకు వెన్నంటి ఉండే శక్తి ఒకటి అయితే పదేళ్ల క్రితం విడుదలైన శ్రీరామ్ ఎంత పేరు తెచ్చిందో ఈ చిత్రం మరలా అంత పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రతి నటుడు తన కెరీర్‌లో డిఫరెంట్ క్యారక్టర్స్ చేయాల్సిన అవసరం తప్పక వస్తుందని, ఈ చిత్ర దర్శకుడికి ఉన్న విజన్ పోస్టర్స్‌లోనే తెలుస్తుందని తెలిపారు. ఉగాది రోజు ఈ చిత్రం విడుదలవటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. చిత్ర దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని, తమ యూనిట్‌కు అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని ఆకాంక్షించారు. నటులందరూ చక్కగా నటించడంతో ఈ చిత్రం అందరికీ నచ్చే విధంగా రూపొందిందని, విజయ నామ సంవత్సరంలో విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని నిర్మాత రాజేష్ కోరుకున్నారు. కార్యక్రమంలో మల్టీ డైమన్షన్ వాసు, కొడాలి వెంకటేశ్వరరావు, రేష్మ, సంగీత దర్శకుడు డాకె తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. కార్యక్రమంలో నిరంజన్, అక్కినేని వెంకట్, సంధ్యారవి తదితరులు పాల్గొన్నారు.
‘జైశ్రీరామ్’ ప్లాటినమ్ డిస్క్‌లో దాసరి
english title:
p
Date:
Thursday, April 11, 2013