ఏవో మాటలు వినబడుతున్నాయి. నీరసమో ఏమిటో తెలియడం లేదు. కళ్లు మూతలు పడుతున్నాయి. లేవడానికి ప్రయత్నించినా కుదరడంలేదు. తడుముకుంటున్న చేతులకి మడతమంచం పట్టి తగిలింది.
మాణిక్యం మామ్మ వాళ్ల రైతు రత్తయ్యతో మాట్లాడుతోంది.
‘‘తేగలు సరిగా ఊరలేదేంటి రత్తయ్యా!’’ అంటోంది. ‘‘ఏం ఊరడమమ్మా పంటల్తేడానో, బావి తేడానో అర్ధం కావడంలేదు తల్లీ! మాయదారి కాలం వచ్చి పడింది’’ అంటున్నాడు రత్తయ్య.
‘‘అవునే్ల అకాల వర్షాలు, అనావృష్టి’’ అన్నీ తలకిందులు వ్యవహారాలయ్యాయి. అన్నట్లు నీ కొడుక్కూతురికి పురుడు వచ్చిందా? ‘‘వచ్చిందమ్మా ఆడపిల్ల. అందుకే కాసు బంగారం పెట్టే దిగిడవాలంటుంది దానత్త. మావాడేమో కాలు సేరుూ కూడేసుకోలేక తనకలాడతాడు. మా గోలేందిలే గానీ ఈ బాబు జోతిగారబ్బాయి గదండమ్మా, ఎటూ కానేల ఇట్టా పడుకున్నారేందీ పానం బాలేదామ్మా?
‘‘ఏంటో రత్తయ్యా! పిల్లాడు ఈ మధ్యన చిక్కిపోతున్నాడు. వాళ్ల అమ్మా, నాన్న అదే గోల చేస్తున్నారు. డాక్టరుకి చూపించి పరీక్షలు చేయించాలనుకుంటున్నారు. ఆ పిల్లా, అతనూ పొద్దున్న పోయిన వాళ్లు ఏడు దాటాక గానీ ఇల్లు చేరలేరు. అతనికేమో ఆఫీస్‌లో ఓవర్‌టైమ్‌లు, ఈ పిల్లకేమో ఆ స్కూల్లో వాగుడు చాలక ప్రైవేట్లు చెప్పడం. పిల్లల భవిష్యత్తుకోసం తప్పదంటుంది. పిల్ల బాగానే చదువుకుంటోందిట. వీడే ఈ మధ్యన చదువులో వెనకబడుతున్నాడు. వచ్చే సంవత్సరం పబ్లిక్ పరీక్షలు కదాని దాని గొడవ. ఎవరి గోడు వాళ్లదనుకో’’
మాణిక్యం మామ్మ అవ్వడానికి మాకు కొంచెం దూరపు చుట్టమయినా మా కుటుంబానికి పెద్ద దిక్కులా ఉంటుంది. ఆవిడ పిల్లలందరు బాగా సెటిల్ అయిన వాళ్లే. తీసుకెళ్దామంటే ఈవిడ ఈ వూరిని వదలలేనంటూ వుంటుంది. వెళ్లినా నెలరోజుల్లోపలే వచ్చేస్తుంది. నేను, చెల్లి మామ్మ దగ్గరికి చనువుగానే వస్తూ వుంటాము.
అమ్మా, నాన్న మా గురించి కష్టపడుతున్నారని చెప్పిన మాటల్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. నాకు చదువుమీద ఆసక్తి తగ్గడానికి నా ఆరోగ్యం బాగుండకపోవడమేనని అమ్మా వాళ్లు అనుకుంటున్నారు. సతీష్‌తో ముదిరిన స్నేహం వల్ల నాలో వచ్చే మార్పులు నాకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ...కానీ...
డబ్బున్న వాళ్ల ఇళ్లంటే ఎలా వుంటాయో, వాళ్ల ఇళ్లలోని భోగాలెలా వుంటాయో సతీష్ ఇంట్లోనే నాకు మొదటగా అనుభవంలోకి వచ్చాయి. స్కూల్లో వుండే 4,5 కంప్యూటర్లకోసం ఆ పీరియడ్‌లో యాభైమంది పిల్లల వరకు పోటీ పడడమే నాకు తెలుసు. కంప్యూటర్ దొరికినపుడు ఆనంద పడేలోగా తరవాత వాళ్లు కాచుక్కూర్చునేవారు. అలాంటిది సతీష్‌కి స్వంత కంప్యూటర్ వుందని తెలిసి నాకు ఆశ్చర్యంతోపాటు అసూయ కలిగింది. పాఠాలు బాగా అర్థమయ్యే సిడిలు వాళ్ల నాన్నగారు కొన్నారని తీసుకెళ్లి చూపించాడు. అవన్నీ చూస్తుంటే చదువులో అంతంత మాత్రంగా వుండే సతీష్ దగ్గరకన్నా ఇవి నా దగ్గర వుంటే ఎంత బాగుంటుందోననిపించింది. కానీ అది సాధ్యమయ్యే పని కాదని నాకు తెలుసు. సతీష్‌తో స్నేహం చేయడం మొదలుపెట్టాను. ర్యాంక్ స్టూడెంట్ అయిన నా స్నేహం సతీష్‌కి కూడా నచ్చిందనుకుంటాను. కానీ దాని వెనక వున్న ఉద్దేశం నాకప్పుడు అర్థం కాలేదు.
‘‘పిన్నీ! పిన్నీ!’’ అమ్మ గొంతు వినిపించింది. ‘‘విస్సూ నీ దగ్గర ఉన్నాడా పిన్నీ?’’ అంటోంది. ‘‘ఆ! కంగారు పడకు. అన్నం పెడదామంటే తినేలా లేడని కాసిని పాలు కలిపి పట్టించాను’’. ‘‘ఏంటో పిన్నీ! ఇలా అయిపోతున్నాడు పిల్లాడు. ఒకసారి నీ చేత్తో దిష్టి తీసేద్దూ’’ అర్ధింపుగా అంటోంది అమ్మ. అలాగే అంటూ లేని దిష్టి తీసి కళ్లు నీళ్లతో తుడిచింది. బాగా మెలకువ వచ్చింది. ‘‘అమ్మా! ఇంటికెళ్దామా?’’ అంటూ లేవబోయాను. ‘‘ఉండు విస్సూ! కళ్లు తిరుగుతాయేమో.. నేనూ, రత్తయ్య పట్టుకుంటాం అని నా చేతులు వాళ్ల భుజాలమీద వేసుకుని నడిపించుకుంటూ ఇంటికి తీసుకు వచ్చారు. చెల్లాయి చదువుకుంటోంది. నాన్నగారు అప్పుడే వచ్చినట్లున్నారు. బాత్‌రూమ్‌లో ఉన్నారు. నేను బాగా మెలకువ తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. తేడాగా వుండకూడదని అమ్మ కలిపి తెచ్చిన మజ్జిగన్నం తినేసాను. ‘‘ఎలా ఉందన్నయ్యా?’’ అంటూ చెల్లాయ్ ‘‘ఏమయింది నాన్నా!’’ అంటూ నాన్నగారు ఆప్యాయంగా అడుగుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవి కనపడకుండా పక్కకి తిరుగుతూ బావుంది, పడుకుంటానని చెప్పాను. ‘‘పడుకోనీ జ్యోతీ! వాడ్ని నాలుగు రోజులపాటు చదవమంటూ ఒత్తిడి చేయకు. బాగా అలిసిపోయినట్లున్నాడు’ అంటున్నారు నాన్నగారు. వాళ్లంతా నా గురించి ఇంతలా ఆలోచిస్తూ వుంటూంటే నేనేమిటి ఇలా తయారవుతున్నాను? మళ్లీ ఆలోచనల వలలో చిక్కుకున్నాను.
సతీష్ నాన్నగారు బిజినెస్ పనిమీద ఇంచుమించు ఊళ్లోనే వుండడు. వాళ్ల అమ్మగారికి షాపింగ్, స్నేహితుల ఇళ్లకి కారులో తిరగడం సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో వున్నా మెట్లు ఎక్కలేరని పైకి రారు. పైన సతీష్, అతని మావయ్య ఆనంద్‌కుమార్‌ల గదులు వుంటాయి. వాళ్లిద్దరినీ ఆవిడ ఎపుడూ
మందలించడం గానీ, ఏమైనా చెప్పడం కానీ నేను చూడలేదు.
ఆనంద్‌కుమార్ స్నేహితులు ఆ ఇంటికి రావడం, గంటలకి గంటలు వుండడం మామూలే. వాళ్లు, సతీష్ కలిసి ఒకరోజు ఏదో పంచదార లాంటిది నోట్లో వేసుకోవడం చూసాను. తర్వాత వాళ్ల ప్రవర్తన చిత్రంగా వుంది. ‘‘నీ దోస్తుకి కూడా ఇవ్వరా’’ అని వాళ్ల మావయ్య అనడంతో సతీష్ నాక్కూడా ఇచ్చాడు. అదేమిటో, ఎలా వుంటుందోనని కుతూహలంతో నోట్లో వేసుకున్నాను. అంతే అదోరకం మత్తు, హాయి. ఆ రోజు సాయంత్రం వరకు సతీష్ ఇంట్లోనే వుండిపోవడంవలన పెద్ద ఇబ్బంది అవలేదు. ఇంటికి వెళ్లాక ‘‘మొహం అలా వుందేమిటి కన్నా!’’ అని అమ్మ అడిగినా ‘‘ఏం లేదమ్మా’‘ అంటే పెద్దగా పట్టించుకోలేదు పని హడావుడిలో. తర్వాత మూడు నాలుగుసార్లు వద్దనుకుంటూనే వాళ్లతో పాటు తీసుకున్నాను. అది తప్పని తెలుస్తున్నా ఆ మత్తు, హాయి తమాషాగా అనిపించడంతో వద్దనలేకపోయేవాడ్ని. ఆ మత్తు వదలక స్కూలు ఎగ్గొట్టి సతీష్ ఇంట్లోనే వుండిపోవడం జరిగేది.
ఒకరోజు ఆనంద్‌కుమార్, అతని స్నేహితులు గుమికూడినట్టుగా కూర్చుని కంప్యూటర్‌లో ఏమిటో చూస్తున్నారు. వాళ్లంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నదేమిటో మరి. మేం వచ్చిన అలికిడికి ఆనంద్‌కుమార్ లేచి కంప్యూటర్ ఆపేశాడు. ఆ కాసేపటికి వాళ్లేదో చూడరానిని చూస్తున్నారని మాకు తెలిసింది. ‘‘ఏంటి మావయ్యా? మాకూ చూపించు’’ అని సతీష్ వౌస్ పట్టుకోబోయాడు. ‘‘మీకింకా టైముంది లేరా’’ పెద్దగా నవ్వాడు వినోద్. ‘‘ఏరా సరుకు వచ్చిందా? తియ్యండి. నాలుక పీకేస్తోంది’’ అన్నాడింకోడు. ‘‘ఏం సరుకురా? ఆ అన్వర్‌గాడు రోజురోజుకీ రేటు పెంచేస్తున్నాడు. మనకసలే ఫ్రీ కేసులెక్కువైపోతున్నాయి’’ అన్నాడు ఆనంద్‌కుమార్ నన్ను, తన స్నేహితుడు అజయ్‌ని చూస్తూ. అజయ్ కూడా నాలాగే. వాళ్లిచ్చినది ఫ్రీగా తీసుకోవడం తప్ప ఎంత ఉంటుందనేది కూడా నాకు తెలియదు. నిజమే ఈ సారి నేనూ ఏమైనా డబ్బు తేవాలి. లేకపోతే ఎప్పుడూ వాళ్లే ఇస్తే సిగ్గే కదా అనుకున్నాను. అలా అనుకుని నేను జాగ్రత్తగా దాచుకున్న 50 రూపాయలు తెచ్చి ఆనంద్‌కుమార్ చేతిలో పెట్టాను. ‘‘ఏంట్రా ఇది?’’ ఆనంద్ నిర్లక్ష్యంగా అడిగాడు. అదే సరుకుకి డబ్బులివ్వాలి కదా. నేనూ తెచ్చానంటూ నసిగాను. అంతే అతను పెద్ద భూకంపం వచ్చినట్టు నవ్వాడు. ‘‘ఒరేయ్! మనోడు సరుకు కోసం తెచ్చిన డబ్బు చూడండిరా. నెలరోజులు సరిపోద్ది’’ అంటూ నోటుని పొడుగ్గా పట్టుకుని అందరికీ చూపిస్తూ జజ్జనక, జజ్జనక అన్నట్లు అడుగులు వేసాడు. అందరూ ఒకటే నవ్వులు. ‘‘పాపం! చాక్‌లెట్‌లు కొనుక్కుందాం అనుకున్నాడేమోరా’’ అని కామెంట్స్. అజయ్ ఒక్కడే నా భుజం తట్టాడు. నా మొహం అవమానంతో ఎర్రబడింది. చచ్చినా వీళ్ల దగ్గరికి రాకూడదు అనుకోవడం, మళ్లీ మళ్లీ సతీష్ పిలవగానే కుక్కపిల్లలా వెంట వెళ్లడం మామూలైపోయాయి. సతీష్ తన అసైన్‌మెంట్స్ రాయించుకోవడం, సైన్స్ డయాగ్రమ్స్ వేయించుకోవడం మొదలుపెట్టాడు. నేనూ కాదనలేక పోయేవాడ్ని. సతీష్ ఏ ఉద్దేశంతో నాతో స్నేహం చేసాడో తెలిసింది. చెడులో వుండే ఆకర్షణ ఏమిటో గానీ నేను వాడి దగ్గరికి వెళ్లకుండా వుండలేకపోతున్నాను.
ఇప్పుడు ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే బాధనిపిస్తోంది. మొన్న సతీష్ వాళ్లు బయటకు వెళ్తున్నారని త్వరగా బయటకు వచ్చాను. ఆ మత్తులో ఎక్కడికి వెళ్లాలో తెలియక మాణిక్యం మామ్మ ఇంటికి వెళ్లాను. ఆవిడ జ్వరం వచ్చిందనుకుని పడుకోబెట్టడం, అమ్మ వచ్చి తీసుకురావడం అయ్యాయి. నా చదువు వెనకబడడం, మొహం పీక్కుపోయి వుండడం, అందరూ ననే్న గమనిస్తున్నారేమోనని కంగారు ఎక్కువవుతున్నాయి. రాత్రంతా విపరీతంగా ఆలోచనలు నిద్రలేకుండా చేసేవి. తెల్లవారేసరికి ఫెళ్లుమని జ్వరం వచ్చేసింది. అమ్మ అతి కష్టంమీద సెలవుపెట్టి నా దగ్గరే వుంది. ఒళ్లంతా తడి గుడ్డతో తుడిచి మందులు వేసి నాక్కొంచెం నిద్రపట్టేలా వుండడం చూసి వంట చేసుకు వస్తానని వెళ్లింది. మెలకువ వచ్చేసరికి అమ్మ, పక్కింటి ఆంటీల మాటలు వినపడుతున్నాయి.
‘‘చిన్న పిల్ల చూడండి జ్యోతిగారూ! వాడికి చేతులెలా వచ్చాయో చంపడానికి’’ అంటున్నారు ఆంటీ. ‘‘అవునండీ పాపం పిల్ల నానమ్మని కూడా చంపేసాడంటున్నారు కదా? నిన్న నేను పేపరు చూడలేదు’’ అంటోంది అమ్మ. ‘‘ఇవాల్టి పేపరు చూడండి మా పిల్లాడు అలాంటి వాడు కాదంటూ వాళ్ల అమ్మ చెప్తోంది’’ ఈసడింపు. ‘‘నిజంగా అలాంటి వాడంటే నమ్మేలా లేదు ఇతని మొహం’’ అపనమ్మకం.
‘‘జ్యోతీ’’ మాణిక్యం మామ్మ పిలుపు. ‘‘అయ్యో! నువ్వే వచ్చేవా పిన్నీ! అమ్మ ఎదురెళ్లింది. ‘‘పిల్లాడెలా ఉన్నాడే?’’ అంటూ వచ్చింది. నేను కళ్లు తెరిచాను. చొక్కా పైకెత్తి పొట్టమీద చేయి వేసి చూసింది. కొంగున పొట్లం కట్టుకుని వచ్చిన ఆంజనేయస్వామి సింధూరం నుదుటున పెట్టి మెటికలు విరిచింది. ‘‘పాలేమైనా తాగుతావా నాన్నా!’’ అమ్మ అడిగింది. ‘‘వాడిష్టపడితే మజ్జిగలో నిమ్మరసం, ఉప్పువేసి ఇవ్వు. అది మంచిది’’ నేనూ తాగుతానన్నట్టు తలూపడంతో అమ్మ మజ్జిగ తెచ్చి నాకు, మామ్మకు ఇచ్చింది. ‘‘నాకెందుకే ఇప్పుడు?’’ అంటూ తీసుకుంది మామ్మ. మీకు కాఫీ తెస్తానుండండి అని వెళ్లబోయిన అమ్మను రమగారు ఆపేసారు ఇప్పుడేం వద్దు కూర్చోండంటూ. నా నాలికనుంచి గొంతులోకి జారుతున్న మజ్జిగా చల్లగా పుల్లగా వుండి హాయినిస్తోంది.
మళ్లీ అమెరికాలో హత్యల గురించి మాటలు మొదలయ్యాయి. ‘‘మా అబ్బాయి బోలెడు సంపాదిస్తున్నాడు. ఇలాంటి పని చెయ్యడంటోంది పాపం ఆవిడ‘‘ అమ్మ అంది. ‘‘ఎంత వెధవైనా తల్లి కదా ఏం చేస్తుందిక’’ ఆంటీ అన్నారు. ‘‘ఇవేమీ కాదురా ఆ పిల్లాడు చెడు సావాసాలతో చెడిపోయాడు. తెలివిగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని పైకి వచ్చాడు కానీ చెడు అలవాట్లకి బానిసైపోయాడు. అలాంటి వాటికి ఎంత సంపాదిస్తే సరిపోతుంది. చంపాలని లేకపోయినా డబ్బు ఎలాగైనా దక్కించుకోవాలనే తొందరలో దారుణమైన హత్యలు చేసేసాడు. ఇప్పుడు ఎంత పశ్చాత్తాప పడినా పోయిన ప్రాణాలు రావు. అతని తల్లికూడా ఈ విషయం జీర్ణించుకోలేకపోతోంది. ఎన్నో ఉన్నతాశయాలతో పెంచిన కొడుకు అలా అయిపోయాడంటే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లిపోయి వుంటుందో పాపం! అందుకే అంటారు మన తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్లని భగవంతుడు ప్రసాదిస్తాడు. కానీ స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ మనకిచ్చాడు. దానిని తెలివిగా ఉపయోగించకపోతే ఇంతే. పండండి జీవితాలు బుగ్గిపాలవుతాయి.
మామ్మ చెప్పింది వింటుంటే ఎంత నిజం! అనిపించింది. నేను కూడా ఇలాగే చేస్తూ పోతే అతనిలాగానే తయారవుతానేమో? ఆ పాపని చూస్తే చిన్నప్పుడు చెల్లిని చూసినట్లే వుంది. అలా డబ్బుకోసం నేను కూడా...అమ్మో! ఆ ఆలోచనకే వెన్ను జలదరించింది. పూలు కట్టిన దారానికి కూడా సువాసన అబ్బినట్లు మంచివాళ్లతో చేసిన స్నేహం మనకి కూడా మంచి చేస్తుందని తెలుగుమాస్టారు చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. అవును నాలో వచ్చిన ఈ పరివర్తన శాశ్వతం కావాలి ఒట్టుపెట్టుకుంటున్నట్టు అనుకున్నాను. గుండెల మీద బరువు దిగిపోయినట్లయింది. ఎన్నో రోజుల నుంచి నన్ను వేధిస్తున్న తప్పు చేస్తున్న భావన తొలగిపోయి ప్రశాంతంగా ఉంది.
===========
తాడిమేటి శ్రీదేవి W/o టి.విద్యాశంకర్
27-103, కోటిపల్లివారి వీధి, చెరుకువాడ
పెనుగొండ, ప.గో. జిల్లా - 534 320
9912607227. 08819 246715