Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

(ఆత్మ) హత్య

$
0
0

హాక్లే బిల్డింగ్‌లో కాక్ టెయిల్‌ని సర్వ్ చేసే లాంజ్‌లో డేల్ బజ్లీ ఓ గ్లాస్‌లోని కాక్‌టెయిల్‌ని తాగుతూ అతన్ని చూసాడు. తెలిసిన మొహం కనిపించడంతో పరిశీలనగా చూస్తే, అతను పూర్వం తనతో కాలేజీలో చదివిన ఫిలిప్ కర్టెండన్‌గా గుర్తించాడు. ఫిలిప్ ఐదేళ్ల క్రితం కంటే లావయ్యాడు. అతను హాక్లే బిల్డింగ్‌లోకి ఎందుకు వచ్చాడో డేల్‌కి అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలో డేల్‌ని చూసి ఫిలిప్ ఆశ్చర్యపోయాడు. అతనివైపు చేతిని చాపి నడిచి వస్తూ ఆనందంగా చెప్పాడు.
‘‘అరె! డేల్ బజ్లీ!!’’
అతనితో కరచాలనం చేస్తూ డేల్ అడిగాడు.
‘‘్ఫల్! నువ్వు ఇక్కడ ఏంచేస్తున్నావు?’’
‘‘నువ్వు చేస్తున్న పనే. తరచూ నేను సాయంత్రాలు ఇక్కడికి కాక్‌టెయిల్స్‌కోసం వస్తుంటాను’’
డేల్ తన మార్టినీని పూర్తిగా తాగి, ఫిలిప్ తాగేది ఏమిటోచూసి బార్ టెండర్ బిల్లీని రమ్మని సైగ చేసి, ఇద్దరికీ మరో రౌండ్ తీసుకురమ్మని చెప్పాడు. తర్వాత అడిగాడు.
‘‘్ఫల్! నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు?’’
‘‘నేను ఓ తయారీ పరిశ్రమలో సేల్స్ రిప్రజెంటేటివ్‌ని. పని కష్టం. జీతం బాగుంటుంది’’. ఫిలిప్ జవాబు చెప్పాడు.
‘‘జీతం ఎక్కువైతే ఏ పనీ కష్టం కాదు.’’ డేల్ నవ్వుతూ చెప్పాడు. బార్ టెండర్ చెరో గ్లాస్ ఇచ్చి వెళ్లింది. డేల్ తన గ్లాసులోంచి ఓ గుక్క తాగి చెప్పాడు.
‘‘నేను కూడా ఇక్కడికి తరచు వస్తూంటాను. మనిద్దరం ఇంతదాకా కలవకపోవడం నాకు వింతగా ఉంది.’’
‘‘అది నాకూ వింతగా ఉంది.’’
‘‘నువ్వు చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటున్నావా ఫిల్?’’ డేల్‌అడిగాడు.
‘‘లేదు. నేను ఈ నగరానికి పశ్చిమవైపు ఉంటున్నాను. నువ్వు?’’
‘‘నేను ఈ భవంతిలోనే ఉంటున్నాను. ఈ బిల్డింగ్ ఐదవ అంతస్తు నుంచి ముప్ఫై ఆరవ అంతస్తు దాకా అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. నేను ఉండేది ఇరవై ఏడవ అంతస్తులో.’’
‘‘ఓ! మంచి చిరునామా.’’ ఫిలిప్ మరోసారి ఆశ్చర్యపోయాడు.
‘‘అవును. మా మామగారు పోయాక నాకు డబ్బుతోపాటు ఈ ఫ్లాట్ కూడా కలిసి వచ్చింది.’’
‘‘పదేళ్ల క్రితం మనం స్టేట్ యూనివర్సిటీలో రూం మేట్స్‌గా ఉన్నప్పుడు ఇద్దరికీ డబ్బు కొరతగా ఉండేది.’’
‘‘అవును. ప్రొఫెసర్ న్యూకోంబ్ గుర్తున్నాడా? మోలీ వేలట్?’’ డేల్ అడిగాడు.
‘‘మోలీ వేలట్‌ని నేను మర్చిపోలేదు. ఆ రోజుల్లో నువ్వు నన్ను పెద్దగా ఇష్టపడేవాడివి కాదు కదా?’’ ఫిలిప్ అడిగాడు.
డేల్ ఆశ్చర్యంగా చూశాడు.
‘‘అదే నిజమైతే మనం రూంమేట్స్‌గా ఎలా కొనసాగేవాళ్లం?’’
‘‘నిజమే. ఆ రోజుల్లో నువ్వు నాకంటే అన్నిటా అధికుడివి. ఆటల్లో, మార్కుల్లో, అందంలో, నీ కారు కూడా నా కారు కన్నా ఖరీదైంది. చాలామంది అమ్మాయిలని నేను నీకు పరిచయం చేయగానే వారు నీవారైపోతుండేవాళ్లు.’’ ఫిలిప్ చెప్పాడు.
‘‘అవుననుకుంటాను.’’ డేల్ నవ్వాడు.
‘‘అందరూ ఒక ఎత్తు. జేబ్స్ మరో ఎత్తు. ఆమె ఎలా ఉంది?’’ ఫిలిప్ తన చేతికి వున్న చవక ఉంగరాన్ని అటు ఇటు తిప్పుతూ అడిగాడు.
‘‘నువ్వు ఇంతదాకా ఈ ప్రశ్న అడగకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది.’’ డేల్ చెప్పాడు.
‘‘నాకు ఆమెకి ఎంగేజ్‌మెంట్ కూడా అయింది కాబట్టి?’’ ఫిలిప్ ప్రశ్నించాడు.
‘‘అవును’’
‘‘నా నుంచి నువ్వు దొంగిలించిన వాటిల్లో ఆమె విలువైంది.’’
‘‘ఇది జరిగి అప్పుడే ఆరేడేళ్లు కాలా?’’ డేల్ ప్రశ్నించాడు.
‘‘ఏడేళ్లు. ఆరేళ్ల క్రితం మీ ఇద్దరికీ పెళ్లయింది. మీ పెళ్లిరోజు నీకు గుర్తుందా? మరిచిపోయావా?’’ ఫిల్ అడిగాడు.
‘‘కొందరికి పుట్టుకతోనే ఇతరులని దెప్పి పొడవడం అలవాటనుకుంటా.’’ డేల్ చిరుకోపంగా చెప్పాడు.
‘‘అవును. బేబ్స్ ఎలా ఉంది?’’
డేల్ బార్ టెండర్‌కి మరో రౌండ్ తీసుకురమ్మని సైగ చేశాడు. తర్వాత నిశ్శబ్దంగా ఫిలిప్ కళ్లలోకి చూస్తూ అడిగాడు.
‘‘నీకు తెలీదా?’’
‘‘మీరు విడాకులు తీసుకున్నారా?’’ ఫిలిప్ అడిగాడు.
‘‘బేబ్స్ రెండేళ్ల క్రితం మరణించింది’’ డేల్ విచారంగా చెప్పాడు.
‘‘ఓ! నేనది వినలేదు.’’
‘‘ఆత్మహత్య’’
ఫిలిప్ డేల్ మొహం వంక నిశితంగా చూశాడు. డేల్ ముఖంలోని చిరునవ్వు చెదరలేదు.
‘‘నీనుంచి ఆమెను వేరు చేయాలనే ఆమెని పెళ్లి చేసుకున్నా. ఆమెకి ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య గురించే ఆలోచించేది. మూడేళ్లపాటు ఆమె డిప్రెషన్‌కి మందులు వాడింది. మూడుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి రక్షింపబడింది. నాలుగోసారి నేనక్కడ లేను.’’
‘‘అది నమ్మలేను. ఆమె చాలా ఉత్సాహంగా ఉండేది.’’
‘‘నిజమే. కానీ మా పెళ్లయ్యే దాకానే. తర్వాత మిమ్మల్ని ఎందుకు విడదీసానా అని నేను చింతించిన సందర్భాలు కూడా ఉన్నాయి.’’
ఫిలిప్‌కి ఏం మాట్లాడాలో తోచలేదు. గ్లాస్‌తో వచ్చిన బార్ టెండర్‌కి డేల్ వౌనంగా ఇరవై డాలర్ల నోటుని ఇచ్చాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య నిశ్శబ్దం. కుర్చీకి తగిలించిన కోటుని అందుకుని తొడుక్కుంటూ చెప్పాడు డేల్.
‘‘నా అపార్ట్‌మెంట్ నంబర్ 2742. మొదటి లిఫ్ట్ పదవ అంతస్తు దాకానే. రెండోది ఉపయోగించు. నీకు తీరిక ఉన్నప్పుడు రా. మళ్లీ కలుద్దాం ఫిలిప్.’’
దారిలో డేల్ బార్ టెండర్ బిల్లీ దగ్గర ఆగి అడిగాడు.
‘‘అతన్ని నువ్వు ఇక్కడ ఎప్పుడైనా చూసావా?’’
‘‘లేదు. ఇదే మొదటిసారి.’’
‘‘కానీ తరచు ఇక్కడికి వస్తుంటానని చెప్పాడే?’’
‘‘బహుశా ఈ బిల్డింగ్‌కి వస్తూండచ్చు. ఈ కాక్‌టెయిల్ లాంజ్‌కి కాదు. నేను సాయంత్రం మూడునుంచి అర్ధరాత్రి దాకా ఇక్కడ పనిచేస్తాను. అతన్ని చూడడం ఇదే మొదటిసారి. ఎందుకలా అడిగారు? బిల్లీ ప్రశ్నించాడు.
‘‘ఏం లేదు. అతను నా పాత మిత్రుడు.’’
డేల్ లాబీలోని లిఫ్ట్ దగ్గరికి వెళ్లి ఓ దాని బటన్‌ని నొక్కాడు.
అందులో ఎక్కి ఇరవై మూడో అంతస్తులో దిగి తన అపార్టుమెంట్‌లోకి వెళ్లాడు. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ ఏర్పాటు చేస్తున్న బేబ్స్ చెప్పింది.
‘‘కూర్చోండి. ఐస్‌డ్ టీ కలిపి తెస్తాను’’
డేల్ ఆమె వంక చూస్తూ సరే అన్నట్టుగా తల వూపాడు. ఆమె తన పనిని పూర్తి చేస్తుండగా డేల్‌కి, ఫిలిప్ ఇప్పటికే ఈ అపార్టుమెంటులోకి తను లేనప్పుడు వచ్చి వెళ్తుండవచ్చని అనిపించింది. లేదా మరే ఆఫీస్‌కో, అపార్టుమెంట్‌కో వచ్చి వెళ్తున్నా త్వరలోనే బేబ్స్ గురించి అతనికి తెలియవచ్చు అని కూడా అనుకున్నాడు. మాస్టర్ బెడ్‌రూంలోని హాఫ్ బాత్‌లోకి వెళ్లి చేతులు కడుక్కున్నాడు. కుర్చీలో బేబ్స్ ఎదురుగా కూర్చుని అనేక విషయాలు మాట్లాడుతూ భోజనం చేయసాగాడు.
‘‘సూప్ ఎలా ఉంది? జపనీస్ సీ వీడ్ సూప్‌ని చేసాను.’’ బేబ్స్ అడిగింది.
‘‘బావుంది. ఫిలిప్ కర్టెండన్ నీకు గుర్తున్నాడా?’’ డేల్ ఫోర్క్‌తో స్టేక్‌లోంచి చిన్న మాంసపు ఖండాన్ని తీసుకుంటూ అడిగాడు.
వెంటనే ఆమె కళ్లల్లో వెలుగు కనిపించింది.
‘‘ఎందుకు గుర్తులేదు? అతన్ని నేను చూసి ఎంత కాలం అయిందబ్బా?’’
‘‘కనీసం అయిదారేళ్లు అయి ఉండొచ్చు.’’ డేల్ చెప్పాడు.
ఐస్‌డ్ టీ గ్లాస్‌ని అందుకుంటుంటే ఆమె చెయ్యి స్వల్పంగా వణుకుతుండడం,ముఖం పాలిపోయి వుండడం డేల్ గమనించాడు.
‘‘అతను మీకు ఇప్పుడెందుకు గుర్తు వచ్చాడు?’’ అడిగింది.
‘‘అతను మరణించాడు. నువ్వు రేడియోలో ఆ వార్త విని ఉండవచ్చు. నేను వస్తూంటే మన ఇంటికి కొద్ది దూరంలో మూగిన జనం, పోలీసులు కనిపించారు. ఫోర్టీన్ అండ్ బ్రంట్ స్ట్రీట్ కార్నర్‌లో ముప్పై మూడేళ్ల ఫిలిప్ కర్టెండన్ రోడ్డు క్రాస్ చేస్తుంటే ఓ కారు వచ్చి అతన్ని గుద్దింది. అతన్ని ఆ కారు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. పోలీసులు రోడ్డుమీది రక్తంమీద రంపం పొడిని చల్లారు..’’
బేబ్స్ తన ఫోర్క్‌తో శబ్దం అయ్యేలా చెక్కతో చేసిన సూప్ బౌల్‌మీద కొడుతుండడంతో డేల్ చెప్పేది ఆపేసాడు. తన చెయ్యి చేసే పని ఆమె గ్రహించినట్టుగా లేదు. ఆమె మొహం పాలిపోయి ఉంది.
‘‘అతను మన ఫిలిప్ కర్టెండనే అయి ఉంటాడంటారా? అతనికి మన చిరునామా తెలియదుగా? మరి ఇటువైపు ఎందుకు వచ్చినట్టు?’’ బేబ్స్ ఐస్‌డ్ టీ గ్లాసుని పైకి ఎత్తబోయింది. కాని అది ఆమె చేతుల్లోంచి జారిపోయి కార్పెట్ మీదకి కారిపోయింది.
డేల్ లేచి ఆమె దగ్గరికి వెళ్లి భుజాలమీద తడుతూ సానుభూతిగా చెప్పాడు.
‘‘ఈ వార్త నిన్ను ఇంతగా కృంగదీస్తుందని అనుకోలేదు. నేను వెంటనే మందుల షాపుకి వెళ్లి నీ డిప్రెషన్ మందుని తెస్తాను. ఈలోగా ఆత్మహత్య లాంటి ఆలోచన చేయకు. నేను సాధ్యమైనంత త్వరగా వస్తాను.’’
కోటు తొడుక్కుని డేల్ బయటికి నడిచాడు. లిఫ్ట్‌లో కిందికి వెళ్లి దిగి మందుల షాప్‌కి వెళ్లలేదు. బదులుగా కాక్‌టెయిల్ లాంజ్‌లోకి వెళ్లాడు. బిల్లీ అతని దగ్గరికి రాగానే మార్టినీని ఆర్డర్ చేసాడు. దాదాపు పది నిముషాల తర్వాత లాబీలోని ఓ యువతి పెద్దగా అరవడం, తర్వాత ఓ వ్యక్తి ‘ఓ మై గాడ్’ అని అరవడం వినిపించింది. డేల్ వౌనంగా కూర్చుని తన మార్టినీని శాంతంగా తాగసాగాడు.
‘‘ఎవరో పైనుంచి పడ్డారుట...అమ్మాయట’’
డేల్ చిన్నగా నవ్వాడు. ఈసారి ఫిలిప్ కర్టెండన్‌ని మళ్లీ లాంజ్‌లో కలిసినప్పుడు తను ఏం మాట్లాడుతాడో ఊహించుకుంటే వచ్చిన నవ్వది.
(జాన్ లట్జ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది మిరియాలు
english title: 
malladi miriyalu
author: 
మల్లాది వెంకట కృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>