Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కలసిన తనువులలో కలవని తలపులు

$
0
0

కొందరికి అయినవారితో కాక కొత్తవారితో కబుర్లాడాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. పాత రోతగాను కొత్తవింతగాను అనిపిస్తుంటుంది. ఈ కొత్త ఆపోజిట్ జెండర్ అయితే మరికొంత కిక్ ఇస్తుంది. మనసుకి మజా అనిపించి శరీరాన్ని మసాజ్ చేసి ప్రపంచం రంగునే మార్చేస్తుంది. మోజుపడ్డ లోకం వాకిళ్లు తెరుచుకుంటాయి. కట్టుకున్నవారు, కన్నవారు, కన్నపిల్లలు సైతం కళ్లలో కదలాడరు. కొత్త ఒక్కటే కనులలో కాపురముంటుంది. అప్పటిదాకా సాగించిన కాపురమూ కనుసన్నలనుండి కనుమరుగవుతుంది.
కొత్తతో కళ్లు బరువెక్కుతుంటే పాత బంధాలన్నీ భారమే అనిపిస్తుంటాయి. కొత్త పరిచయాలను ఎవరూ కాదనుకోరు. కొత్తగా స్నేహితుల్ని ఎవరూ వద్దనుకోరు. స్వేచ్ఛగా ఉండాలనుకోవడమూ తప్పుకాదు. సహజీవనంలో స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడమే వేసిన ఏడడుగుల్ని ఏటిపాలు చేయడం అవుతుంది. కొత్తను పాతతో పోల్చుకుని కుంగిపోవడం అర్థం లేని పని.
పోలిక అనేది సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించాలి...కంపారిజన్‌తో మనలోని నెగిటివ్ షేడ్స్‌లో వున్న తెరలను తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి...శక్తి సంపన్నులం కావాలి. ‘థ్రిల్ ఆఫ్ బీయింగ్ విత్ సమ్‌బడీ’, ‘థ్రిల్ ఆఫ్ పార్టిసిపేటింగ్’ అన్నవి బంధాలను కాదనుకుని కాదు...కొత్తగా అనిపించే థ్రిల్ కూడా బంధమే అయి ఒకనాటికి పాతబడుతుంది...రోత అవుతుంది. ఈ ఆలోచన సాగనంత కాలం కొత్త మోజు మనసును మోసం చేస్తూనే ఉంటుంది...ప్రేమను కాటు వేస్తూనే ఉంటుంది...బంధాన్ని బలహీన పరుస్తూనే ఉంటుంది.. పక్క చూపులతో వయసు వేడెక్కుతుంటే రక్తసంబంధం, భాగస్వామితో అనుబంధం పలచబడుతూనే ఉంటుంది.
భార్యాభర్తలే అని కాదు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన విశ్వసనీయత లోపించినా బలహీనతలే మెట్లెక్కుతుంటాయి. మనసు మురిసిపోతుంటుందే తప్ప గతంలోని మురిపాలేవీ వర్తమానాన్ని తాకవు. శాశ్వతత్వం మన చుట్టూ పరుచుకున్న ఏ ప్రకృతిలోనూ లేనట్లే చివరికి మన పుట్టుకలోనూ లేదు. కొత్తగా అనిపించిన ప్రతీదీ పాతబడక మానదు. థ్రిల్ అనిపించింది సైతం కాలంలో కిల్ కాక తప్పదు. సామీప్యతల స్థానంలో ఈ మరణ మృదంగాలు వినిపించడంతో దూరాలు పెరిగిపోతుంటాయి. ఇద్దరు ఒక్కటిగా సహజీవనం ప్రారంభించి మళ్లీ ఇద్దరుగా చీలిపోవడంతో విడాకుల పర్వానికి శ్రీకారం జరుగుతుంది. TRUST IS SOMETHING THAT YOU HAVE TO BUILD UP WITH TIME, AND IF YOU ARE DISHONEST EVEN JUST ONCE, IT WILL TAKE FOREVER TO GET PEOPLE TO TRUST YOU AGAIN అనేది. రెండు జీవితాల మధ్య విడాకులు, ఎండుటాకులు, పండుటాకులు పరుచుకోవలసిందేనా?!
మనం చిన్నతనంలోనే పెద్దరికాన్ని వహించకపోయినా అప్పుడప్పుడూ పెద్ద మనుషుల చేష్టలను అనుకరించి ఉంటాం. అలాగే నిజంగానే పెద్దయ్యాక కూడా అప్పుడప్పుడు పిల్ల చేష్టలతో జీవిస్తుంటాం. చిన్నప్పుడు పార్కుల్లో కొత్త పిల్లలతో జారుడుబల్లనెక్కి జారడం బాగానే ఉంటుంది. కానీ పెద్దయ్యాక వెంటపడ్డ వారితో పార్కుల వెంటబడి దిగజారడం ఎంతవరకు సబబు?!
కొత్తవారి దృష్టి మనపై పడాలనుకోవడం, వారి స్నేహాన్ని కోరుకోవడం మనసుకు నచ్చే విషయమే అయినా అది ‘ఎమోషనల్ ఇన్‌ఫిడిలిటీ’ అయితే మనం ‘డేంజర్ జోన్’లో ఉన్నట్టే! సీత మాటను కాదనలేక రాముడికోసం బయలుదేరుతూ లక్ష్మణుడు గీసిన ‘రేఖ’ లక్ష్మణరేఖగా విఖ్యాతమే అయినా అది ‘రక్షణరేఖ’ అని అర్థం చేసుకోవడానికి మనసులు ఇంకా పదునెక్కడం లేదు. ఆ రేఖను దాటిన సీత ప్రమాదంలో పడలేదూ! మనం కూడా అంతే...కుటుంబ పరంగాను, సమాజ పరంగాను, వైవాహిక వ్యవస్థలోను కొన్ని రక్షణ రేఖల మధ్యనే జీవితాన్ని కొనసాగించాలి..అలా మనసు ‘పరిధు’లను దాటనంత కాలం ప్రేమ పుష్పిస్తూనే ఉంటుంది.
ఎమోషనల్ ఇన్‌ఫిడిలిటీ అనేది కూడా చక్రబంధం వంటిదే! అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసినంతగా చక్రబంధంనుండి బయటపడడం తెలీదు... అందుకే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. భావోద్రేకం అనేది కూడా చక్రవ్యూహం లాంటిదే. ఆ వ్యూహంలోకి అడుగుపెడితే చాలు ఎటు చూసినా భావోద్వేగాలే! అంతటా ఉద్రేకపూరిత వాతావరణమే! ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏమాత్రం కొరవడినా కుటుంబం కురుక్షేత్రమే అవుతుంది. సంసార క్షేత్రంలో వాత్సాయనుడు పలకరిస్తుంటాడు...ప్రశ్నిస్తుంటాడు...నిలదీస్తుంటాడు. దీనే్న EMOTIONAL INFIDELITY HAPPENS WHEN YOU ALLOW SOMEONE OF THE OPPOSITE SEX TO FULFILL EMOTIONAL NEEDS THAT SHOULD BE MET BY YOUR PARTNER, CREATING AN INTIMACY THAT LEADS TO AN EMOTIONAL ATTACHMENT THAT THEN FREQUENTLY CULMINATES IN SEX అని విశే్లషిస్తాఠు సైకాలజిస్టులు.
భావోద్వేగ తీవ్రతతో మొదట స్నేహంగా ప్రారంభమై, ఆకర్షణగా మారి, శారీరక సాన్నిహిత్యం దాకా ఎగబాకుతుంది. ఆలోచనలు ఆ సాన్నిహిత్యం చుట్టూ పరిభ్రమిస్తుండడం వల్ల కాలుగాలిన పిల్లిలా తచ్చాడడం జరుగుతుంది. ఏకాగ్రత కొరవడి అస్థిమితంగా మసలటం ప్రారంభమవుతుంది. అవతలి వ్యక్తిని ఆకర్షించడానికి తలనుండి గోటిదాకా ముస్తాబవడం జరుగుతుంది. సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఆ కొత్త వ్యక్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో ఇంటిలోని వారు కఠిన శిలలనిపిస్తారు...నిన్నటివరకు ఆత్మీయులైన వారు ఈనాడు శత్రువులవుతారు. ఇంటి వాతావరణం నరకాన్ని తలపిస్తుంటుంది. చివరికి భాగస్వామి మాటలు ఏమాత్రం చెవులను తాకవు. పైగా భాగస్వామి మాట, చేత ఎలర్జిటిక్ అవుతుంది. అంతకాలం ఎనర్జటిక్ పర్సనాలిటీ అనిపించిన పార్ట్‌నర్ ఒక్కసారిగా ఎలర్జటిక్ అయిపోతారు. రహస్యాలు, దాపరికాలు మానసిక రంగ ప్రవేశం చేస్తాయి. తిరస్కరణలు, తీక్షణతలు అరంగేట్రం చేస్తాయి...కంపారిజన్‌తో తనువులు వేరయి దాంపత్యంలో ఉండాల్సిన కెమిస్ట్రీ దెబ్బతింటుంది.
ఎంతటి ఖరీదైన సంగీత పరికరాన్నయినా శృతి చేసుకోగలిగితేనే స్వర సంగమం సాధ్యమవుతుంది. అంతేకానీ కాస్ట్‌లీ ఇన్‌స్ట్రుమెంట్ కాబట్టి ముట్టుకుంటే చాలు సరిగమలు పలుకుతాయనుకుంటే ఎలా? మనం ఎంతటి విద్వాంసులమయినా కామన్‌సెన్స్‌తో వ్యవహరించకపోతే విధ్వంసం తప్పదు. పార్కులో మెట్లెక్కుతూ జారుడు బల్లను చేరుకుంది మనమే! ఎంత ఎత్తుకు చేరుకున్నామో తెలుసు. అంత ఎత్తునుండీ జారక తప్పదు. చిన్నతనంలో అది ఆట. వయసు పరవళ్లలో అది ‘స్లిప్పింగ్ ఇన్ టు ది డేంజర్ జోన్’. ఇక ‘జారుతాం’ అనుకున్నప్పుడు జాగ్రత్త పడకపోతే ఆకర్షణ డేంజర్ జోన్‌లో పడుతుంది. ఇంటిమసీ ఏ అనర్థాలకో దారితీసి జీవితానిది కుంటిబతుకు అవుతుంది.
ఇంతకీ ఈ డేంజర్ జోన్‌నుండి బయటపడడం ఎలా? వివాహ బంధంలో ఈ దిగజారడం అవసరమా? ఆకర్షణ పురివిప్పుతున్న తొలినాళ్లలోనే దూరంగానో, జాగ్రత్తగానో ఉండవచ్చు కదా! మనకు మనంగా ఒక రక్షణ రేఖను గీసుకోలేకపోతే మనం మోసం చేస్తున్నది భాగస్వామిని కాదు..మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. ఆకర్షణ అయస్కాంతం వంటిదని తెలిసీ ఆ వలయంలోకి చేరడం ఎందుకు? గుప్పెడో గంపెడో సమస్యలు లేని సంసారం ఉండదు..చిన్నవో, పెద్దవో మానవ బలహీనతలు భార్యా భర్తల మధ్య ఉండకపోవు. ఇటువంటి ‘ఇంటి తెర’ను ‘మల్టీప్లెక్స్’గా ఊహించుకుంటే కష్టం మనకే! నష్టపోయేది జీవితమే! బుల్లి స్క్రీన్‌కైనా వైడ్ స్క్రీన్‌కైనా తయారయ్యే ఇమేజ్ ఒక్కటే! ప్రొజెక్ట్ కావటంలోనే చిన్నా,పెద్దా?!
పర్సనల్ లైఫ్‌లోనే కాదు..దాంపత్య జీవనంలోను ఎక్స్‌పక్టేషన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంటాయి. పదహారేళ్ల ప్రాయంలో మనసు గీసుకునే దాంపత్య చిత్రం ఒకటయితే భాగస్వామితో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టాక మారే చిత్రం మరొకటి. పాతికేళ్లనుండి జీవితం ఏ నలభైకో, యాభైకో చేరేప్పటికి కోరుకునే దాంపత్య సుఖం వేరు. ఇలా ఆశించటాలు మారుతున్నంత మాత్రాన భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తరిగితే ఎలా? మనసులలో ఎవరికి వారు గోడ కట్టుకుని నిజ జీవితంలో ఎడమొహం పెడమొహం అయితే ఎలా? మనసు విప్పందే ఎవరి జీవితమూ పరుచుకోదు. దాంపత్య జీవనం సురభిళం కావాలన్నా మనసు విప్పాల్సిందే!..మనసు పరవశించాల్సిందే! లేనినాడు కలసిన తనువులతో కలవని తలపులు గడియపడని తలుపులు అవుతాయి.

కొందరికి అయినవారితో కాక కొత్తవారితో కబుర్లాడాలంటే
english title: 
vinu naa maata
author: 
-డా.వాసిలి వసంతకుమార్ 939393 3946 -drvaasili@yahoo.co.in

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>