రైలు, బస్సుకన్నా విమాన ప్రయాణంలో సుఖం ఉందనుకుంటాం. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించేప్పుడు. కాని కొందరి అనుభవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాలిఫోర్నియాకి చెందిన జోన్ ఆమె భర్త రాబర్ట్‌లు నెవార్క్ నించి బేకర్స్ ఫీల్డ్‌కి విమానంలో తమ 16 ఏళ్ల కొడుకు బెడెతో ప్రయాణమయ్యారు. విమానంలో ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లని కొన్నారు. ఎందుకంటే బెడెకి ఆ అనుభవం ఎలా ఉంటుందో రుచి చూపించాలని. బెడెకి డౌన్స్ సిండ్రోమ్ ఉంది. ఓ అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి వాళ్లని పక్కకి పిలిచి ‘పైలట్ మీ అబ్బాయిని చూశాడు. అతను ఫ్లయిట్‌లో ప్రమాదకారి కావచ్చు కాబట్టి మీ అబ్బాయిని విమానంలోకి ఎక్కించుకోవడం లేదు’ అని చెప్పారు. వెంటనే జోన్ జరిగేది మొత్తాన్ని వీడియో తీసింది. వారు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌లో బేకర్స్ ఫీల్డ్‌కి చేరుకున్నారు.
మరో సందర్భంలో తమ 14 వారాల కవల పిల్లలతో ఓ విమానంలో ప్రయాణించే తల్లిదండ్రులు తోటి ప్రయాణీకులకి ఓ ప్రింటవుట్‌ని ఇచ్చారు. అందులో ఇలా ఉంది. ‘హలో.. మా వయసు 14 వారాలు. మేము మొదటిసారి విమాన ప్రయాణం చేసే కవల సోదరులం. మేం సాధ్యమైనంతగా అల్లరి చేయకుండా ఉంటాం. ఒకవేళ చేస్తే ముందుగా మీకు క్షమాపణలు. మీ చెవులకి నొప్పి కలిగినా, భయపడ్డా పెద్దగా ఏడుస్తాం. మా అమ్మ (పోర్టబుల్ మిల్క్ మెషీన్) మా నాన్న (డయాపర్ ఛేంజర్) దగ్గర ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. కావాలంటే ఇస్తారు. మేమంతా 20ఇ, 20ఎఫ్ సీట్లలో కూర్చుంటాం. మీ విమాన ప్రయాణం సుఖంగా సాగాలని కోరుతున్నాం.’
సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ క్యూలోని మేక్ బ్రీడ్‌లవ్ అనే 16 ఏళ్ల టీనేజర్ క్యూలో వెనక నిలబడక మధ్యలో దూరాడు. ఇది గమనించిన విమాన కంపెనీ ఉద్యోగస్థులు పిఏ సిస్టంలో అతని చేత తన క్షమాపణని చెప్పించారు. వారు రాసిచ్చింది ఇలా చదివాడు. ‘నా పేరు మేక్ బ్రీడ్‌లవ్. విమానం ఎక్కే క్యూలో నేను మధ్యలో దూరాను. నేను నాకున్న తెలివికన్నా ఎక్కువ తెలివిగలవాడినని అనుకునే టీనేజర్ని. దయచేసి హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. మీ విమాన ప్రయాణం ఆనందకరంగా సాగుతుందని ఆశిస్తున్నాను’.
ఓ తల్లి న్యూజెర్సీలో పుట్టి పెరిగి సంతానవతైంది. ఆమె తన 18 నెలల కూతురితో 2012లో ఫోర్డ్ లోడర్ డేల్‌లో జెట్ బ్లూ విమానం ఎక్కడానికి వెళ్తే ఆ 18 నెలల పాప పేరు ‘నో ఫ్లై’ లిస్ట్‌లో ఉంది కాబట్టి తమ విమానంలో ప్రయాణించకూడదని ఎయిర్‌లైన్స్ ఉద్యోగస్థులు తల్లికి చెప్పారు. కారణం వారు ముస్లింలు!
పెన్సిల్వేనియాకి చెందిన రొనాల్డ్ డఫి బ్రెజిల్‌లోని సాల్వెడార్‌కి మియామి నించి విమానంలో బయలుదేరాడు. ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే తనకి నిద్ర పట్టడం లేదని, ఆ పాప ఏడవకుండా చూడమని రొనాల్డ్ ఆ పాప తల్లిదండ్రులతో చెప్పాడు. వారు తమ కూతుర్ని ఓదార్చలేక పోయారు. దాంతో రొనాల్డ్ తన చేతిలోని గ్లాసుడు మంచినీళ్లని ఆ పాప మీదకి పోశాడు. విమానం గమ్యం చేరాక అతని వీసాని రద్దుచేసి పోలీసులు అతణ్ణి అరెస్టు చేశారు. ఆ ఎయిర్‌లైన్స్ అతన్ని తిరిగి మియామికి తమ విమానంలో తీసుకెళ్లడానికి నిరాకరించారు.
అనమియలె అనే రెండేళ్ల పాప న్యూరెన్‌బెర్గర్ విమానాశ్రయంలో తన తల్లిదండ్రుల నించి విడిపోయి ఈజిప్ట్‌కి వెళ్లే విమానం ఎక్కింది. టునీషియాకి వెళ్లాల్సిన ఆ తల్లిదండ్రులు జరిగింది ఆలస్యంగా గుర్తించారు. విమానాశ్రయంలో ఎక్కడా ఆ పాప కనపడకపోవడంతో అక్కడ నించి బయలుదేరి అన్ని విమానాల పైలట్లని సంప్రదిస్తే ఈజిప్ట్ విమానంలో అనమియలె ఉందని తెలిసింది. బోస్టన్‌కి వెళ్లే విమానంలో రెండేళ్ల నటాలి అల్లరి చేస్తుండటంతో జెట్ బ్లూ ఫ్లైట్ సిబ్బంది ఆ పాప తల్లి డాక్టర్ కోలెట్‌ని ఆ పాపతో సహా విమానం దించేశారు.
ఒంటరిగా ప్రయాణించే 9 ఏళ్ల కైరన్ కెర్షాని డెల్టా సిబ్బంది మిన్నియా పోలిస్‌లో విమానం మారేప్పుడు బోస్టన్ విమానంలో పంపే బదులు క్లీల్‌లేండ్ విమానంలో ఎక్కించారు. వాషింగ్టన్‌లోని స్పోకెన్ నించి తన తాతయ్య, నానమ్మల దగ్గరకి ఒంటరిగా వాడిని తల్లిదండ్రులు విమానంలో పంపినప్పుడు ఇది జరిగింది.
సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం లాస్‌వెగాస్ నించి సేక్రమెంట్‌కి బయలుదేరేప్పుడు విమానంలోని ఓ సన్నపాటి ప్రయాణీకురాలిని దింపేశారు. కారణం ఆమె పక్క సీటు ఖాళీగా ఉండటం. ఆ రెండు సీట్లని బాగా లావుగా ఉన్న 14 ఏళ్ల పిల్లవాడికి కేటాయించి పంపారు!
రైలు, బస్సుకన్నా విమాన ప్రయాణంలో సుఖం ఉందనుకుంటాం
english title:
flight
Date:
Sunday, May 5, 2013