(గత వారం తరువాయ)
నెయ్యిలో కల్తీ పదార్థాలు
ఈ రోజుల్లో మనకు అసలైన నెయ్యి దొరకడం కష్టమైపోతోంది. మనలో ఆరోగ్య స్పృహ తగ్గిపోతున్న కొద్దీ వీటి సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. పాలు, పాలు కావు-నెయ్యి, నెయ్యి కాదు. ప్రకృతి సిద్ధంగా వుత్పత్తి అయ్యేవి కృత్రిమం అయిపోతున్నాయి. కల్తీదారులు ఇంతగా బరి తెగించడానికి మనలో పెరిగిపోతున్న వ్యామోహాలు కొంత వరకు కారణమవుతున్నాయి.నెయ్యిలో కల్తీ చేయడం సర్వసాధారణమైపోతోంది. సాధారణంగా కొబ్బరి నూనెను గానీ, జంతువుల కొవ్వును గానీ, లేదా అరటిపళ్ల గుజ్జును కానీ నెయ్యికి కల్తీగా కలుపుతున్నారు. నెయ్యికి ప్రత్యామ్నాయంగా నెయ్యిలాగ కనిపించే వనస్పతిని (డాల్డా) ఈనాడు ఎక్కువగా వాడుతున్నారు. ద్రవ రూపంలో వుండే నూనెలను రసాయన పద్ధతుల ద్వారా ముద్దగా చేయడంవల్ల వనస్పతి తయారవుతుంది. ఈ మార్పులో అసలు నూనె తాలూకు వాసన రంగు మారిపోతాయి. వాసన, రంగులేని కొవ్వు పదార్థంగా ఈ వనస్పతి తయారవుతుంది. దీన్ని బాగా గట్టిగా, ముద్దగా, చిక్కగా తయారుచేసి నెయ్యిగా చెలామణి చేస్తున్నారు. రంగులోను, ఆకృతిలోను ఈ వనస్పతి సరిగ్గా నేతిలాగే కనిపిస్తుంది. దీనికి నేతి వాసన రావడానికి కృత్రిమమైన వాసనలు కూడా చేరుస్తారు. ఇలా తయారైన కృత్రిమ నేతిని దుంపనెయ్యి అంటారు. వనస్పతిని మాత్రమే కాకుండా వేరుసెనగ, కొబ్బరి, పత్తి గింజల నూనెలను ముడి స్థితిలో నేతిలో కలగలుపుతున్నారు. వనస్పతి మన దేశంలో ఎక్కువగా తయారవుతుంది. అలాగే విదేశాల నుంచి కూడా దిగుమతి అవుతుంది. వనస్పతి వాడకం ఈనాడు మారుమూల గ్రామాల్లో సైతం పెరిగిపోయింది. ఈ వనస్పతిని నూటికి తొంభై శాతం నేతిని కల్తీ చేయడానికే ఉపయోగిస్తున్నారు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది.
కాచిన పాలలో తోడు పెట్టక ముందు కొంత వనస్పతిని కలుపుతారు. అలాంటి పాలు తోడుకున్న తర్వాత పెరుగుగా తయారవుతుంది. ఈ పెరుగును చిలికితే మామూలు సందర్భంకంటే ఎక్కువ వెన్న వస్తుంది. ఈ వెన్నను వేడి చేస్తే నెయ్యి తయారవుతుంది. అయితే ఇలా తయారైన నెయ్యిలో కల్తీ కలిపారన్న సంగతి కొమ్ములు తిరిగిన శాస్తవ్రేత్తలు కూడా తెలుసుకోలేరు. అతి శక్తివంతమైన యంత్రాలు కూడా ఇలాంటి కల్తీని కనిపెట్టలేవు. అందుకే సాధ్యమైనంత వరకు నేతిని ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది. కొన్ని దేశాల్లో వెన్నను కల్తీ చేయకుండా కఠినమైన శాసనాలున్నాయి. మన దేశంలో ఇలాంటివేవీ లేవు. ఉన్నా అమల్లో లేనట్టే వుంటాయి.
నెయ్యికి ప్రత్యామ్నాయంగా వనస్పతిని వాడుకోవడాన్ని మానెయ్యాలి. వీలైతే సాధ్యమైతే అసలైన నెయ్యినే వాడుకోవాలి. ఎందుకంటే వనస్పతి అంటే ఒక విషం. వనస్పతి నెయ్యి ఎప్పటికీ కాలేదు. అమూల్యమైన పాలలోని కొవ్వు పదార్థం నెయ్యి. నూనెలనుంచి తయారుచేసిన వనస్పతికి నెయ్యి పేరు తగిలించి అమ్మడం దేశాన్ని మోసం చేయడమే. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఎలుకలకు వనస్పతిని ఆహారంగా పెట్టి వీటిపై పరిశోధనలు జరిపారు శాస్తవ్రేత్తలు. కొద్దిరోజుల్లో ఎలుకల్లో కొన్ని స్వశక్తిని కోల్పోయి కృశించిపోయి, క్షీణించి చివరకు చనిపోయాయి. మిగిలిన వాటికి పుట్టుకతోనే మరణం ప్రాప్తించింది. ఈ వనస్పతి తిన్న ఎలుకల్లో వంశోత్పత్తిని కలిగించే శక్తి కూడా పోయిందని అధ్యయనంలో తేలింది. ఎలుకలాంటి చిన్న వాటిమీద వనస్పతి ఇంత దుష్ప్రభావం చూపించినపుడు మనుషుల్లో ప్రభావం ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోవచ్చు.
నెయ్యి పేర్లలో దాగున్న రహస్యాలు
నెయ్యికి అనేక పర్యాయ పదాలున్నాయి. వీటిని లోతుగా పరిశీలిస్తే నెయ్యి తాలూకు గొప్పతనం అర్థమవుతుంది. ఉదాహరణకు ‘ఘృతము’ అంటే ‘కరిగేది’ అని అర్థం. అంటే గడ్డకట్టిన కొవ్వు పదార్థాలను ఇది కరిగిస్తుంది. అలాగే ‘అద్యము’ అంటే అన్నము మొదలైన వాటిలో పోసుకుని తినదగింది అని అర్థం. ఇక ‘అవిః’ అంటే అగ్నిని ప్రజ్వలింపచేసేదని అర్థం. ‘సర్పిః’ అంటే సర్పంలాగ వ్యాపించే గుణం కలిగిందని. ఇక ‘పురోదన’ అంటే శాంతికీ, పౌష్టికాది క్రియలకు ముందు ఉండేది అని. ‘పవిత్రం’ అంటే నెయ్యిని తీసుకోవడం ద్వారా పవిత్రత కలుగుతుందని భావం. ‘నవనీతకం’ అంటే కొత్తగా పెరుగునుంచి తీసిన వెన్న వలన తయారయ్యేదని అర్థం. ‘ఆజ్యం’ అంటే రోగాలని రూపుమాపేది అని అర్థం. ‘తోయదం’ అంటే శరీరాన్ని రక్షించేది అని అర్థం. ‘అగ్ని భోజ్యం’ అంటే అగ్నిచేత భుజంపబడేదని, దీనితో ఆకలి పెరుగుతుందని భావం. ‘అమృతము’ అంటే మరణము లేకుండా చేసేది అని అర్థం. ‘ఆయుః’ అంటే ఆయువును వృద్ధి చెందించేది. ‘తేజసం’ అంటే ప్రకాశానిచ్చేది అని. ‘జీవనీయం’ అంటే జీవించడానికి ముఖ్యమైనదని. ‘్భజనార్హం’ అంటే భోజనం చేయడానికి ఉపయోగపడేదని నెయ్యి అని అర్థం.
నూనె, నెయ్యిల్లో ఏది మంచిది?
నూనె కంటే నెయ్యి మంచిదని గ్రహించాలి. కాయలనుంచి గానుగాడి తీసిన చమురులో పిప్పి పదార్థాలుండవు. అలాగే లవణాలుండవు. మాంసకృత్తులను కూడా తొలగిస్తారు. కాబట్టి ఇలాంటి చమురు జీర్ణమవడం చాలా కష్టంగా వుంటుంది. జంతు సంబంధమైనది నెయ్యి కాబట్టి పాలు, పెరుగు, మీగడ, జున్ను ఇలాంటి పదార్థాలు నీళ్లతో కలిసి వుంటాయి కాబట్టి నూనెల కంటే నెయ్యి బాగా జీర్ణమవుతుంది. మన దేశం లాంటి వేడి ఎక్కువగా వుండే ప్రదేశాలలో నూనెలకంటే నెయ్యి తేలికగా జీర్ణమవుతుంది.
అగ్నికి ఆజ్యం అంటాం కదా. నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే అగ్ని పెరుగుతుంది. అలాగే ఆకలి అనే అగ్ని కూడా నెయ్యివల్ల ప్రజ్వరిల్లుతుంది. కాగా నూనె జీర్ణశక్తిని తగ్గిస్తుంది. నేతికీ, నూనెకీ ఈ తేడాని ఆయా ద్రవ్యాల ప్రభావంగా చెప్తారు ఆయుర్వేద శాస్తక్రారులు. నెయ్యినీ నూనెను ఒకేరకంగా చూడకూడదు. నెయ్యి ఆకలిని పెంచితే నూనె జీర్ణశక్తిని తగ్గిస్తుంది. నెయ్యి పేగులను ఆరోగ్యంగా మారిస్తే నూనె పేగులకు హాని చేస్తుంది. నెయ్యి చలవ చేస్తుంది. నూనె వేడి చేస్తుంది. నెయ్యి, వాత పిత్త కఫ ధాతువులను సమస్థితిలో వుంచుతుంది. నూనె ఈ మూడింటినీ దెబ్బతీసి అనేక వాత వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. నేతిని తక్కువ మొత్తాల్లో వినియోగిస్తే సరిపోతుంది. నూనెను ఎక్కువ మొత్తాల్లో వినియోగించాల్సి ఉంటుంది.
అన్ని చమురు పదార్థాల్లోనూ ఉత్తమమైనది నెయ్యి
ఆయుర్వేదంలో చమురు పదార్థాలను నాలుగు విధాలుగా వర్గీకరించారు. ఘృతం, తైలం, జంతువుల శరీరాల్లో వుండే కొవ్వు (వస), ఎముకల మూలగలో వుండే మూలక (మజ్జ). వీటిల్లో మొదటి స్థానం నెయ్యిదే. ఎందుకంటే ఈ నెయ్యిని తయారుచేయాలంటే జీవహింస అవసరం వుండదు. భోజనం చేసే సమయంలో కొన్ని రకాలైన వస్తువుల్ని కలిపి తినడం అనేది సాధారణం. ఎ,డి,కె అనే విటమిన్లు శరీరంలో విలీనం అవ్వాలంటే కొవ్వు పదార్థాలు అవసరం అవుతాయి. కొవ్వుకోసం నెయ్యిని వాడుకోవడం ఉత్తమం.
మీ సమస్యలు, సందేహాలు పంపించాల్సిన చిరునామా:
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, యూసఫ్‌గుడ, మెయన్ రోడ్,
అమీర్‌పేట, హైదరాబాద్.
ఫోన్ నెం. 924 657 5510