ప్రవక్తగా ఎదగక ముందు, మోజెస్ ఒక గురువు వద్ద శిష్యరికం చేస్తుండేవాడు. గురువు నేర్పిన మొదటి ఆధ్యాత్మిక పాఠం వౌనం పాటించడం. గురుశిష్యులిద్దరూ గ్రామ ప్రాంతాల్లో నడుస్తూ వెళ్తున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తూ వెళ్తున్న మోజెస్‌కు ఆట్టే ఆలోచనలు లేనందువల్ల, ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. అందువల్ల వౌనంగానే ఉన్నాడు.
కానీ ఒక నదీ తీరం వద్దకు వచ్చేసరికి అవతలి ఒడ్డున ఒక శిశువు నీట మునుగుతుండటం, నిస్సహాయురాలైన ఆ శిశువు తల్లి ‘రక్షించండని’ ఆర్తనాదాలు చేస్తూ వుండడం చూచి, మోజెస్ ఊరకుండ లేకపోయాడు. ‘గురువుగారూ, ఆ శిశువును రక్షించడానికి మీరేమీ చేయలేరా?’ అన్నాడు. గురువు ఆదుర్దాగా ‘మాట్లాడవద్దు’ అన్నాడు. చేసేదేమీ లేక మోజెస్ నోరు మూసుకున్నాడు. కానీ హృదయం చాలా ఆందోళనకు గురయింది. తన గురువు కఠినుడేమో? లేక ఏ దీనుణ్ణి కూడా రక్షించగల్గిన శక్తి లేని వాడేమో? గురువును గురించి ఇలాంటి సందేహాలు ఉండటం తప్పు అని, అనిపించినప్పటికీ ఆ ఆలోచనలను తోసేయలేక పోయాడు.
గురుశిష్యులిద్దరూ నడుస్తూ నడుస్తూ సముద్ర తీరానికి వచ్చారు. అక్కడ సముద్రాన అల్లంత దూరంలో, ఒక పడవ దానిలో ఉన్నవారితో సహా మునిగిపోతున్నది. ‘గురువుగారూ, అటు చూడండి. మనుషులతో సహా, నీట మునుగుతున్నది’ అన్నాడు. మళ్లీ ఆదుర్దాగా, గురువు, శిష్యుడు మోజెస్‌కు వౌన వ్రతావలంబనం గురించి గుర్తు చేశాడు. చేసేదేమీ లేక మోజెస్ కిమిన్నాస్తిగా ఉండిపోయాడు.
కానీ అతడి హృదయం చాలా కలవరపడ్డది. వెనక్కు వెళ్లిన తర్వాత, ఇక లాభం లేదని ఈ విషయాన్ని భగవంతుడికే నివేదించాడు. అందుకు సమాధానంగా భగవాన్, ‘నీ గురువు మాటే సరయినది. నీటిలో మునిగిపోయిన ఆ శిశువు తన తర్వాతి జీవితంలో రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణమయుండేవాడు. ఆ యుద్ధంలో వేలాది సైనికులు పౌరులు చనిపోయి వుండేవారు. అతడు ఆ శైశవంలోనే మరణించడం లోకానికే మేలు.
ఇక ఆ సముద్రంలో మునిగిన పడవ, అందులోని మనుషులంటావా? వారంతా దోపిడీ దొంగలు. వారు ఆ పడవ వేసుకొని అవతల తీరాన ఉన్న ఒక ఊరిని దోచుకోవడానికి బయలుదేరారు. వారు ఇక్కడ నీట మునగక, ఆ ఊరికే గనక చేరి ఉంటే అక్కడ అపారమైన జన నష్టం ఆస్తినష్టం సంభవించి వుండేది; అక్కడి వూరినంతా తగులబెట్టి బీభత్సం సృష్టించి ఉండేవారు.’
మిత్రశ్రీ వ్యాఖ్యానిస్తూ, ‘్భగవంతుడు, తాను సృష్టించిన ప్రపంచాన్ని, అందులోని జీవరాశిని తనకు చెందిన న్యాయంతో పరిపాలిస్తుంటాడు. అతడి తత్వమెరిగిన మహా రుషులు, మునులు అతణ్ణి ప్రశ్నించలేదు. ఆ లీలలు ‘మనకు దుర్ర్గాహ్యుకుని వదిలేసి, తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగారు.
తపస్సు ద్వారా సాధు పురుషులు కొంత భగవత్ శక్తిని సంపాదించినప్పటికీ, మహా భక్తులైన వారిని ఆ శక్తితో రక్షించారే కానీ, ఎక్కడ అంధుడు కనిపిస్తే వానికి దృష్టి నిచ్చీ, బధిరుడు ఎదురైతే వానికి వినికిడి కలిగించీ, సృష్టిని సంస్కరించబూనుకోలేదు. తన తపోశక్తితో సృష్టికి ప్రతిసృష్టి చేస్తాననుకున్న విశ్వామిత్రుడు భంగపడ్డాడు.
మనిషి భగవంతుడి చర్యల్ని విమర్శించే బదులు, తాను న్యాయంగా ప్రవర్తిస్తున్నాడా, తోటి జీవుల్ని దోపిడీ చేయకుండా ప్రేమతో వ్యవహరిస్తున్నాడా అనేది పరిశీలించుకోవడం ధర్మం.’ *
నీలంరాజు నోట్‌బుక్
english title:
neelam raju
Date:
Sunday, May 5, 2013