Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బెట్టింగ్ జోరు

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
అదే ఊపు..అదే జోరు..పదికి వంద.. వందకి వెయ్యి.. వెయ్యికి పదివేలు..ఇలా ఐపిఎల్ బెట్టింగ్ బూకీలు భలే చురుకుగా సిక్కోల్ నుంచి కోట్లాది రూపాయలు జూదం ఆడేస్తున్నారు. పోలీసులు కన్నుకప్పి - పొలిటికల్ పవర్‌తో కాయ్‌రాజా..కాయ్..అంటూ ఐపిఎల్ బెట్టింగ్ జిల్లాలో జోరందుకుంది. కేవలం మోబైల్‌తో ఒప్పందాలు చేసుకుని అనుకున్నది అనుకున్నట్టు చెప్పిన సమయానికి, చేరాల్సిన స్థలానికి కరెన్సీ కట్టలు చేరిపోతున్న ఐపీఎల్ బెట్టింగ్‌లు సజావుగా సాగిపోతున్నాయి. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై సన్‌రైజర్స్ తరఫున బూకీలు ఇచ్చే భారీ ఆఫర్లకు మునుపెన్నడూలేని విధంగా చాలా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలిసింది. తొలుత మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెందినా, అనంతరం మ్యాచ్ కొనసాగడంతో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. కలిసొచ్చే హోంగ్రౌండ్‌లో సన్‌రైజర్స్ విజయం ఖాయమనుకుని బూకీలు కాయ్ రాజా..కాయ్.. అంటూ బెట్టింగ్‌లు జరిపారు. మంగళవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ రికార్డులపై కట్టిన బెట్టింగ్‌లు సిక్కోల్ బూకీలకు ఎక్కువ మొత్తంలో చేతులుమారితే - సిక్సర్స్, ఫోర్లు, బౌలింగ్‌లపై అంతకంటే ఎక్కువ బెట్టింగ్‌లు సిక్కోల్ జిల్లా పొగొట్టుకుంది. నైట్‌రైడర్స్ పరాజయంతో పొగొట్టుకున్న మొత్తం మళ్లీ దక్కించుకునేందుకు బుధవారం జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌పై భారీగా బూకీలు బెట్టింగ్‌లు జరిపారు. కాగా, ఐపిఎల్ సీజనంతా కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది.

సామాజిక అస్త్రానికి బొత్స పదును
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి బొత్స కుటుంబీకులు అడుగుపెడుతున్నట్టు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీలక్ష్మీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, రాజాం శాసనసభ నియోజకవర్గాల్లో కుటుంబీకులను రంగప్రవేశం చేయించాలన్న నిర్ణయానికి సత్తిబాబు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి తన సమీప బంధువుకు 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సిక్కోలు రాజకీయాలతో విడదీయలేని బంధాన్ని పెనవెసుకున్న బొత్స అధిష్ఠానం అండదండలతో కొన్ని పనుల్లో తన పవర్‌ను చాటుకుంటున్నారు.
పునర్విభజనకు ముందు బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఓటమి చూసి, మూడోసారి పడాల అరుణపై విజయం సాధించిన బొత్స అప్పటినుంచి సిక్కోల్ కాంగ్రెస్ రాజకీయాల్లో పట్టుసాధించేందుకు సామాజిక అస్త్రాన్ని కూడా సంధించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మీ ఎంపి కావడం, ఆ పార్లమెంటు నియోజకవర్గంలో రాజాం, ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాలు ఉండడంతో మరింత పట్టు సాధించారని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గాలకు చెందిన కేడర్ ఏ పనికావాలన్న శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ, విజయనగరం జిల్లాలో కేరాఫ్ ‘సమీప బంధువు’ అంటూ బొత్స వారసత్వం మార్కును ప్రకటించారు. ఇది కాస్తా టికెట్ వరకూ నడిచేలా కన్పిస్తోంది. గడచిన ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో నీలకంఠంనాయుడును తెరపైకి తెచ్చి శాసనసభలో అడుగుపెట్టేలా బొత్సే వ్యూహం రచించారన్న ప్రచారం ఉండనేవుంది. నేడు పనితీరు బాగులేదన్న నెపంతో ఆయనను పక్కన పెట్టి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఆ బంధువుకు అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదిలా ఉండగా, లక్ష్మీపేట ఘటనలో రాజాం నియోజకవర్గం కాపు సామాజికవర్గానికి అధికార పార్టీ దూరమైందన్న అపవాదుతోపాటు, సెంట్రల్‌బ్యాంకు సీటు దక్కలేదన్న చింతతోవున్న మరో అనుచరుడు ఎచ్చెర్ల టికెట్ ఇచ్చే జాబితాలో రెండవ వ్యక్తిగా ప్రకటిస్తున్నట్టు సమాచారం. పొరుగు జిల్లా నాయకుడైన కేరాఫ్ పాలవలసగా సిక్కోల్ యువజన కాంగ్రెస్ నేతగా చెలామణి అయిన ఓ మద్యం వ్యాపారి కూడా ఎచ్చెర్ల కుర్చీని అందిపుచ్చుకునేందుకు అర్హుడేనంటూ బొత్స వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొత్స కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలకు నియోజకవర్గం మార్పుపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో శృంగవరపుకోటలో పాగావేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఏ చిన్న పనినైనా ఆ నియోజకవర్గం నుంచే ఆరంభించి అక్కడ నుంచే బొత్స ప్రాతినిధ్యం వహిస్తారన్న సంకేతాన్ని ఇరుగుపొరుగు జిల్లాల కాంగ్రెస్ కేడర్‌లోకి ఇప్పటికే పంపారు. అయితే, పొరుగు జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల సీట్లు ఖాళీలు లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలపై బొత్స కుటుంబీకులకు దృష్టిపడిందన్న వాదన లేకపోలేదు.

రేపటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం (టౌన్), మే 8: జిల్లాలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నుండి ఇంజనీరింగ్‌కు 4513మంది, మెడికల్ విభాగంలో 1545 మంది మొత్తం 6058 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జిల్లా ఎంసెట్ పరీక్షల కన్వీనర్ బమ్మిడి పోలీసు బుధవారం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 11 కేంద్రాలు, మెడికల్ విద్యార్ధులకు నాలుగు కేంద్రాలు కేటాయించారు. ఉదయం పది గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష మొదలుకానుంది, కాగా మెడికల్‌కు సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానున్నట్లు ఆయన చెప్పారు. పరీక్ష సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదని ఆయన తెలిపారు. యధావిధిగా ఒక్కనిముషం సమయం నిబంధన కొనసాగుతుందన్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష హాల్‌లోకి విద్యార్ధులను విడిచిపెడతామని, అందరూ ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షకు వచ్చినపుడు బాల్‌పాయింట్‌పెన్, అట్ట మాత్రమే తీసుకురావాలని, మరే ఇతర వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు. విద్యార్ధులు హాల్ టిక్కెట్లను ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని హాల్‌టిక్కెట్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తును గజిటెడ్ అధికారితో అటెస్టుచేసి తీసుకురావాలని సూచించారు.

క్రీడారంగంలో సిక్కోలు ఖ్యాతి
గార, మే 8: సిక్కోలు జిల్లాకు క్రీడా రంగంలో అరుదైన గుర్తింపు లభించింది. వికలాంగ క్రికెట్ పోటీల జాతీయ జట్టుకు దేశం తరుఫున ఆడటానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన ముగ్గురిలో జిల్లాలోని గార మండలం కె. మత్య్సలేశం గ్రామానికి చెందిన మైలపల్లి వేణుబాబు (24) ఉన్నారు. ఈ మేరకు సెలక్టర్లు అతనికి సమాచారం అందించారు. గడచిన ఏప్రిల్ 1న బెంగుళూరులో జరిగిన మూడు రోజుల అంతర్ రాష్ట్ర వికలాంగ క్రికెట్ పోటీల్లో వేణుబాబు ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సెలక్టర్లు జాతీయ జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు సంబంధిత టీమ్ కెప్టెన్ కూడా ఇక్కడకు సమాచారం అందించినట్లు కుటుంబీకులు తెలిపారు. వేణు ఎంపికపట్ల విశ్రాంత నేవీ ఉద్యోగి అయిన వేణు తండ్రి సూర్యనారాయణ, తల్లి పాపమ్మలతో పాటు కుటుంబీకులు, గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

రూ.474 కోట్ల లింకేజీ రుణాల లక్ష్యం
* స్ర్తినిధి జి.ఎం శ్రీనివాస్
ఎచ్చెర్ల, మే 8: ఈ ఆర్థిక సంవత్సరంలో 474 కోట్లు లింకేజీని సంఘాలకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు స్ర్తినిధి జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎ.జి.ఎం హేమంత్ తెలిపారు. స్థానిక టిటిడిసిలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింకేజీ లక్ష్యాలు 19,423 సంఘాలకు అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. స్ర్తినిధి లావాదేవీలు ఆటోడేటా కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా తిరిగి చెల్లింపులు ఈ పద్ధతిలో కొనసాగించాలన్నారు. శతశాతం వడ్డీలేని రుణాలు సంఘాలకు అందేలా సిబ్బంది సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎ.ఒ. జగన్నాధంనాయుడు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గున్నమ్మ, డి.పి.ఎం సి.హెచ్.రామ్మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణాలు కార్యక్రమం అమలుపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చెట్టుపట్ట పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసి నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీపథకంలో ఆదుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానించారు.
పకడ్భందీగా పచ్చతోరణం
* డ్వామా పి.డి కల్యాణచక్రవర్తి
ఎచ్చెర్ల, మే 8: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పచ్చతోరణం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కల్యాణచక్రవర్తి తెలిపారు. డిఆర్‌డిఏ సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రం ఆడిటోరియంలో నీటియాజమాన్య సిబ్బందితో బుధవారం ఉపాధిహామీ లక్ష్యాలు- పచ్చతోరణం అమలుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ పనులు వేగవంతంగా పూర్తిచేసి లక్ష్యాలు అధిగమించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఓ వరం వంటిందన్నారు. ప్రతీ కుటుంబం 200 మొక్కలు పెంచినట్లయితే ఒక్కో మొక్కకు 15 రూపాయలు వంతున నెలకు మూడువేల రూపాయలు ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, రెవెన్యూ సామాజిక భూముల్లో మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఐదేళ్లపాటు ఈ పథకం ఆయా కుటుంబాలకు ఆదాయం ఇస్తుందని కేతెలిపారు. ఈయనతోపాటు నీటియజమాన్య సిబ్బంది ఉన్నారు.
ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
* రీజనల్ కోఆర్డినేటర్ తులసీరావు
ఎచ్చెర్ల, మే 8: ఈ విద్యాసంవత్సరంలో ఎం.బి.ఏ, ఎం.సి.ఏ అడ్మిషన్ల కోసం ఈ నెల 17న ఐసెట్‌ను నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.తులసీరావు స్పష్టంచేసారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పురుషుల, మహిళల డిగ్రీ కళాశాలలతోపాటు పాలిటెక్నిక్ మెన్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1440 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఉదయం పదిగంటల నుంచి 12.30 గంటలవరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. హాల్‌టిక్కెట్లను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోఆర్డినేటర్ సూచించారు.
ఆటోబోల్తా:ముగ్గురికి గాయాలు
నరసన్నపేట, మే 8: మండల కేంద్రంలో ఆర్టీసి కాంప్లెక్సు వద్ద బుధవారం జరిగిన ఆటోబోల్తాలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వేకువజామున ఆరు గంటల సమయంలో ఆమదాలవలస నుండి నరసన్నపేట వస్తున్న ఆటో మనిషిని తప్పించబోయి బోల్తాపడిందని, ఈ ప్రమాదంలో మండవిల్లి అప్పన్న, ఎ.రాంబాబు, దుప్పట్ల రమేష్‌లు గాయపడ్డారన్నారు. వీరిలో రాంబాబుకు తీవ్రగాయాలవ్వడంతో రిమ్స్‌కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రణస్థలంలో ట్రెజరీ?

పొందూరు, మే 8: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా రణస్థల మండల కేంద్రంలో సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకానున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటివరకు పొందూరు సబ్‌ట్రెజరీ కార్యాలయం ద్వారా పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాలకు సేవలందుతున్నాయి. తాజాగా లావేరు, రణస్థలం మండలాలకు సంబంధించి రణస్థలంలో కొత్తగా సబ్‌ట్రెజరీ కార్యాలయంకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారంరోజుల లోపు అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రణస్థలంలో సబ్‌ట్రెజరీ కార్యాలయం రణస్థలం, లావేరు మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఐదు మండలాలకు సేవలందించేందుకు స్థానిక సబ్‌ట్రెజరీ అధికారులు అధిక పనిభారాన్ని మోస్తున్నారు. జిల్లాకు చివరి మండలంగా ఉన్న లావేరు, రణస్థలం మండలాల నుంచి ప్రతీ విషయానికి పొందూరు సబ్‌ట్రెజరీకి రావడానికి ప్రజలు ఆర్థికంగా, మానసికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల ద్వారా సి.ఎం కిరణ్‌కుమార్, ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డిలపై ఒత్తిడి తేవడంతో రణస్థలంలో ట్రెజరీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పొందూరు సబ్‌ట్రెజరీ నుంచి లావేరు సంఘానికి సంబంధించి 637, రణస్థలం మండలం నుంచి 565 ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాలు బదిలీ కానున్నాయి. రెండు మండలాలకు చెందిన 450 పింఛన్లు, అదేవిధంగా 58 పంచాయతీ ఖాతాలు, రెవెన్యూ శాఖ సిబ్బందికి 146 ఖాతాలు, రణస్థలం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఖాతా సబ్‌ట్రెజరీ కార్యాలయానికి చేరనున్నాయి. ఇక్కడ ట్రెజరీలో ఉన్న ఇద్దరు అధికారుల్లో ఒకరు రణస్థలం సబ్‌ట్రెజరీ అధికారిగా నియామకం కానున్నారు. మిగిలిన కార్యాలయాల సిబ్బందిని జిల్లాలో వివిధ సబ్‌ట్రెజరీ కార్యాలయాల నుండి నియమించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్థానిక సబ్‌ట్రెజరీ అధికారి ఎ.వి.ఎస్.రమణమూర్తి వద్ద ప్రస్తావించగా రణస్థలంలో కొత్త సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేసే విషయం వాస్తవమేనన్నారు.

రేపు ఔషధ దుకాణాల బంద్
శ్రీకాకుళం (టౌన్), మే 8: ఆలిండియా ఔషధ వర్తకులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఈ నెల 10వ తేదీన మెడికల్ దుకాణదారులు బంద్ పాటించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు బరాటం నాగభూషణం తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1984లో నిర్ధేశించిన ట్రేడ్ డ్రగ్ మార్జిన్‌ను కొనసాగిస్తూ, 2013 నూతన డ్రగ్ పాలసీలో ప్రతిపాదించిన ట్రేడ్ మార్జిన్లను తగ్గించరాదని కోరారు. ఫార్మాసిస్టుల సమస్యలు పరిష్కరించాలని, బహుళజాతి వ్యాపార సంస్థలకు ఔషధ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించరాదని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10న పట్టణంలో మెడికల్ దుఖాణాలు మూసివేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. అనంతరం బంద్ గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్, టౌన్ సంఘం అధ్యక్షుడు బరాటం ఈశ్వరరావు, కార్యదర్శి కె.రవికృష్ణ పాల్గొన్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
* డిసిసి అధ్యక్షుడు నర్తు
శ్రీకాకుళం (టౌన్), మే 8: రాష్ట్రంలో రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఎఐసిసి ఉపాధ్యక్షునిగా నియమితులైన మొదటిసారి నిర్వహించిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచార హోరుకు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కొనియాడారు. బిజెపి ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడి ప్రజలు విశ్వసించలేదని, గుర్తుచేస్తూ, రాష్ట్రంలో వై ఎస్సార్ పార్టీకి కవల సోదరులుగా ఉన్న బిఎస్‌ఆర్ పార్టీ మూట సర్దేసిందని ఎద్దేవా చేశారు. దక్షిణ భారత దేశంలో బావ, బాష వ్యక్తీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరి సంబంధాలున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో తప్పక ఉంటుందని, ఈ ఫలితాలతో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా విజయపథంలో నడుస్తుందనడానికి నిదర్శనమన్నారు. సమావేశంలో డిసిసి అధికార ప్రతినిధులు రత్నాల నర్శింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్, సలీంఖాన్, టి.మోహిని, పాలిశెట్టి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యయత్నం

కంచిలి, మే 8: బూరగాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త తులసమ్మ పోలీసుస్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం 2005లో తన భర్త కూర్మారావు గ్రామం కోసం విద్యుత్తు పని చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురవగా, అప్పటి పెద్దలు భర్తకు వైద్యపరీక్షలు చేయిస్తామని విశాఖ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో డబ్బులు అందక వైద్యం చేయించలేక 2006లో భర్త కూర్మారావు మరణించాడని, ఆ డబ్బులు అడిగినందుకు అప్పటి నుంచి తనను గ్రామబహిష్కరణ చేసారని, ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వెల్లడించింది. ఆదివారం కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేసానని, బుధవారం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా సరైన న్యాయం జరగదని భావించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. తన అత్తమామ కూడా తన భర్త ఆస్తి తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయమై సోంపేట సి ఐ జి.వి.రమణకు వివరణ కోరగా, ఫిర్యాదు అందిన తర్వాత గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలు, గ్రామస్థులను విచారించామని, ఈమెకు గ్రామబహిష్కరణ జరగలేదని, ఈమె నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రానికి గ్రామంలోని పిల్లలు వెళ్తున్నారని, గ్రామబహిష్కరణ విషయంలో ఏదైనా రుజువైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసు స్టేషన్ నుంచి
ఇద్దరు బంగ్లాదేశ్ మత్య్సకారుల పరారీ
ఇచ్ఛాపురం, మే 8: రూరల్ పోలీసు స్టేషన్‌లో ఉన్న 15 మంది బంగ్లాదేశ్ మత్య్సకారుల్లో ఇద్దరు బుధవారం రాత్రి పరారయ్యారు. 2012 జనవరిలో మండలంలోని డొంకూరు సమీపంలో 19 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు వేట కోసం వచ్చి పట్టుపడ్డారు. వీరిలో నలుగురుని విడిచిపెట్టారు. మిగతా 15 మంది అప్పటి నుంచి పోలీసు స్టేషన్‌లోనే ఉన్నారు. గత కొంత కాలం క్రితం ఇద్దరు మత్య్సకారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. మళ్లీ మహ్మద్ ఇలియా(25), మహ్మద్ దోబే(22), ఫరూర్, ఖాదర్ ఈ నలుగురు తప్పించుకునేందుకునేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న డి ఎస్పీ దేవాప్రసాద్, సీ ఐ రవికుమార్, రూరల్ ఎస్ ఐ రాములను టీంలు ఏర్పాటుచేసి గాలింపు చర్చలు చేపట్టగా ఫరూర్, ఖాదర్ పట్టుబడ్డారు. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.

అదే ఊపు..అదే జోరు..పదికి వంద..
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>