ఒంగోలు, మే 8: రాష్టవ్య్రాప్తంగా నెల రోజుల్లో బెల్టుషాపులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని మద్యం వ్యాపారులు కంగుతిన్నారు. బెల్టుషాపుల వ్యాపారం వల్లే మద్యం వ్యాపారులకు భారీస్థాయిలో ఆదాయం వస్తోంది. దీంతో సిఎం నిర్ణయం తమ భారీ ఆదాయానికి గండిపడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 321 మద్యం షాపులు ఉండగా 13 షాపులకు టెండర్లు దాఖలు కాలేదు. వాటి పరిధిలో వేలల్లో మద్యం బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏ వేళైనా మద్యం సులభంగా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో తమ గ్రామాల్లో బెల్టుషాపులు ఎత్తివేయాలని ప్రజలు ఆందోళనలు చేపట్టినా జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 308 మద్యంషాపులకు కోట్ల రూపాయలు వెచ్చించి వ్యాపారులు లైసెన్స్‌లు పొందారు. మద్యం వ్యాపారం మంచి లాభసాటిగా మారింది. దీంతో మద్యంషాపు వచ్చిందంటే ఆ వ్యాపారి లక్షల రూపాయల్లో సంపాదించినట్లే. మద్యంషాపు పరిధిలో సుమారు పదుల సంఖ్యలో బెల్టుషాపులు తెరుస్తున్నారు. దీంతో మద్యం రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ప్రధానంగా జిల్లాలోని జాతీయ రహదారి వెంట అనధికార మద్యంషాపులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. మద్యం సేవించిన డ్రైవర్లు అతి వేగంగా నడపటం వల్ల ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. జాతీయ రహదారిపై కనీసం పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు ఏలాంటి దాడులు చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా త్వరలోనే పంచాయతీ, మునిసిపల్, ఎంపిటిసి, జడ్‌పిటిసిలకు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగనున్నాయి. ప్రస్తుతం వచ్చే ఆదాయానికంటే ఈ ఎన్నికల పుణ్యమా అని మరింత ఆదాయం మద్యం వ్యాపారులకు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టుషాపులను వేలంపాటల ద్వారా కైవసం చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. దీన్నిబట్టిచూస్తే జిల్లాలో మద్యం విక్రయాలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. మొత్తంమీద సిఎం నిర్ణయంతో జిల్లాలోని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతుండగా ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కుబడిగా రైతు చైతన్యయాత్రలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మే 8: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు గత నెల 22 నుండి ఈనెల 8వ తేదీ వరకు రైతు చైతన్యయాత్రలను ఏర్పాటుచేసినప్పటికీ ఆ యాత్రల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొక్కుబడిగానే ఈ రైతు చైతన్యయాత్రలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు చైతన్యయాత్రలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1608 హేబిటేషన్లలో ఈ రైతు చైతన్యయాత్రలు జరిగాయి. ఈ యాత్రల్లో 67,436 మంది రైతులు, 1569 మంది ఆదర్శరైతులు పాల్గొన్నట్లు కాకిలెక్కలను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయ శాఖాధికారులు నివేదికలు పంపినట్లు సమాచారం. ఈ రైతు చైతన్యయాత్రల్లో వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, మార్కెటింగ్, అటవీశాఖ, విద్యుత్, బ్యాంకు అధికారులు పాల్గొనాల్సి ఉంది. కాని ఈయాత్రల్లో అధికారులు మొక్కుబడిగానే పాల్గొన్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి సక్రమంగా ప్రభుత్వ రాయితీలు అందుతున్నాయా లేదా, బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారా లేదా, రైతులకు ఉచిత విద్యుత్ సక్రమంగా అందుతుందా లేదా అన్న అంశాలపై సక్రమంగా చర్చ జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. రైతులు నిత్యం నకిలీ విత్తనాలతో ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు.