నెల్లూరు, మే 8: జిల్లాలో ఎట్టకేలకు కాంగ్రెస్ కమిటీలు కొలువుదీరే ముహర్తం ఆసన్నమవుతోంది. బ్లాక్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్లతో జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆమోదముద్ర లాంఛనప్రాయంగా పడటమే తరువాయి. ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద ఈ జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలాఖరుకే ఈ కమిటీలన్నీ కొలువుదీరుతాయని చెప్పినా ఇంకా నాలుగైదురోజులపైగానే ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. యధాప్రకారం ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరేసి బ్లాక్ అధ్యక్షులుగా నియమించనున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమతమ పరిధిలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు కూడా రేపోమాపో వెల్లడి కానుంది. నిన్నమొన్నటి వరకు బిసిలకు ఈ పదవి కేటాయిస్తారనే ప్రచారం ఉండగా, తాజాగా మారిన ప్రచారంతో ఈ పదవి రెడ్డి సామాజికవర్గానికే దక్కనున్నట్లు తెలుస్తోంది. అందులో మాజీ కార్పొరేటర్ సన్నపరెడ్డి పెంచలరెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఈ పదవీయోగం ఉండనుందని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారంలో అటు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి, ఇటు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి నడుమ కోల్డ్‌వార్ కొనసాగుతున్నట్లు భోగట్టా. వీరిద్దరూ చెరో పేరును ప్రతిపాదిస్తుండటం గమనార్హం. అయితే ఆనంకు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉన్న సన్నిహిత సంబంధాల్ని ఇదే సందర్భంలో ప్రస్తావించుకోవాలి. ఈ నేపథ్యంలో ఆనం మాట నెగ్గేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆనం కుటుంబానికో లేక ఆయనకు అనుకూల వర్గానికో పేరు ఖరారు కానుంది. అనతికాలంలో స్థానిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ పదవికి డిమాండ్ ఏర్పడనుందని చెప్పాలి. జిల్లా అధ్యక్షుడి ద్వారానే అభ్యర్థులకు బిఫారమ్‌లు, ఎన్నికల అధికార్లకు ఏ ఫారమ్‌లు అందడం పరిపాటి. అందువల్ల ఈ పదవిని ఎట్టి పరిస్థితుల్లో తమ ఖాతాలోనే చేర్చుకోవాలని మంత్రి ఆనం భావిస్తున్నారు.
ఇంతేగాక పనబాక మాట నెగ్గితే ఇకపై ఆమె వర్గం అంటూ జిల్లాలో విస్తరించే ప్రమాదం ఉంటుందని కూడా ఆనం అంతర్లీనపుభావనగా కనిపిస్తోంది. మరో పది నెలల్లోగానే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌కు విజయావకాశాలు సందేహాస్పదంగానే ఉన్నాయనేది సర్వత్రా వెల్లడవుతోన్న అభిప్రాయం. ఈక్రమంలో పార్టీ అధ్యక్షుడైనా తమ ‘చే’తిలో లేకపోతే ఎలాగనే పట్టుదల కూడా అమాత్యుని మదిలో కనిపిస్తోందట.
కాంగ్రెస్ సంబరాలు
నెల్లూరుసిటీ, మే 8: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు బుధవారం ఏసి సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటకలో గాలి సోదరులు, బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ గాలికి తట్టుకోలేక పరాయజం పాలైనట్లు నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనం విజయకుమార్‌రెడ్డి, డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు తెలిపారు. బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ఏసి సెంటర్‌లో బాణాసంచాలను కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యకర్తలు ఆనందోత్సవాలను జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీని ప్రజలు గెలిపించారని తెలిపారు. దేశంలో సోనియాగాంధీ పరిపాలన సుభిక్షంగా ఉండటం వల్ల తమ పార్టీకే ప్రజలు మద్దతు పలికారు. అవినీతి గాలి సోదరులు గాలిలో కొట్టుకు పోయినట్లుగా మన రాష్ట్రంలో కూడా ఫ్యాన్‌కి ఇదే గతి పడుతుందని తెలిపారు. కర్ణాటక ప్రజలు మైనింగ్ మాఫియాకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగులు అవినీతి బిజెపిని తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ కన్వీనర్ కె రఘురామ్ ముదిరాజ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ నాయకత్వన రాహుల్ గాంధీ పరిపాలన చూడాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. 2014 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మరలా కాంగ్రెస్ పార్టీని గెలిపించి, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని చేసేదాక ప్రతి కార్యకర్త సైనికుడిగా పోరాడేందుకు కంకణ బద్దుడై ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన అవినీతి ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 9ఏళ్ల అధికారంలో ఉండి అవీనితి ఊబిలో ఉన్న తెలుగుదేశం పార్టీలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపికి పట్టిన గతే ఈ పార్టీలకుపడుతుందని హెచ్చరించారు.
కర్నాటకలో మాపై ప్రేమాగ్రహం: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 8: కర్నాటక ప్రజానీకం తమపై ప్రేమాగ్రహం ప్రదర్శించడం వలనే చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన నెల్లూరు బిజెపి కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లపాటు ఎంతో సమర్ధవంతమైన పరిపాలన అందించిన ఘనత తమ పార్టీదేనన్నారు. అయినప్పటికీ యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు, పార్టీ అంతర్గత కలహాల వలనే ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఏదేమైనా ఈ గుణపాఠంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలనాటికి పరిస్థితి సరిదిద్దుకుని సత్ఫలితాలు సాధించగలమని కర్నాటి ధీమా వ్యక్తం చేశారు. రోజుకో కుంభకోణం బహిర్గతం బయటపడుతున్న యూపిఏ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదని హితవుపలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణల నడుమ సాగుతున్న రాజకీయ యుద్ధంతో పరిపాలన కుంటుపడుతోందన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి హోదాలో గత రెండేళ్లలో 76 పర్యాయాలు ఢిల్లీ పర్యటించాల్సి వచ్చిందని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన సాక్షాత్తు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సిబిఐ చార్జిషీట్‌లో పేరు నమోదైనా పదవికి మాత్రం రాజీనామా చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాజాగా బ్లాక్‌మనీ వ్యవహారంలో విద్యామంత్రి శైలజానాధ్ ప్రమేయం ఉన్న సంగతి మీడియా బహిర్గతం చేసిందని గుర్తు చేశారు. ఇలా నేరారోపణలు ఎదుర్కొనే అమాత్యులు తమ నేత అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలని హితవుపలికారు. గతంలో హవాలా కేసులో తన పేరుందనే సంగతి తెలుసుకుని లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. సచ్చీలురుగా గుర్తింపుపొందే వరకు తిరిగి పదవి పొందలేదన్నారు. ఇదిలాఉంటే లోక్‌సభకు ఎప్పుడు ఎన్నికలొచ్చినా యూపిఏ ఆచూకీ లేకుండాపోతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. రాష్ట్రంలోనూ తమ పార్టీ ఎంతో కీలకశక్తి అవతరిస్తోందన్నారు. తెలంగాణాలో అనూహ్య ఫలితాలు సాధించడం తధ్యమన్నారు. కోస్తాంధ్రలో కూడా తమ పార్టీకి సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. క్రమేపి సమైక్యాంధ్ర నినాదం సన్నగిల్లుతోందని స్పష్టం చేశారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తిన లేచినప్పుడు నెల్లూరుజిల్లాలో దాదాపుఅన్ని రాజకీయ కుటుంబాలు పోరాట బాటలో కొనసాగాయన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో తెలంగాణాలో అయినా, సీమాంధ్రలో అయినా ఒకే మాటతో కొనసాగుతుందన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల్లా పబ్బం గడుపుకునేందుకు ద్వంద్వ విధానం అవలంభించడం లేదని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయనే సంగతి ప్రజలకు తెలుస్తోందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలకు జాతీయ నాయకులు ముప్పవరపువెంకయ్యనాయుడు హాజరవుతారన్నారు. నెల్లూరులో కూడా త్వరలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. తాజాగా ఏర్పడ్డ తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఏభైశాతం బిసిలకు అవకాశం కల్పించారన్నారు. మహిళలకు 33శాతం అవకాశమిచ్చినట్లు తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుడుముల సుధాకర్‌రెడ్డి, నాయకులు మధు, మారుబోయిన శ్రీనివాసులుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో క్రీడా స్టేడియం:కలెక్టర్
నెల్లూరుసిటీ, మే 8: ప్రతి నియోజకవర్గంలో కోటి రూపాయలతో క్రీడా స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నెల్లూరు వారు ఎంపిక చేసిన 23 గ్రామీణ ప్రాంతాలలో, జిల్లా కేంద్రంలోని 23 ప్రాంతాలలో మొత్తం 46 కేంద్రాలలో ఈ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను మొత్తం 21 క్రీడాంశాలలో నిర్వహిస్తున్న తెలిపారు. వీటి నిర్వహణకు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులచే, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు అందుబాటులో ఉన్న క్రీడా శిక్షకులచే ప్రతి క్రీడలోనూ ప్రాథమిక స్థాయి నుండి తర్ఫీదు నిచ్చి మెళుకువలు నేర్పుతామన్నారు. ఈ శిక్షణా శిబిరాలు మే 1నుండి జూన్ 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు. 45రోజులు పాటుగా శిక్షణా శిబిరాలు నిర్వహించినందుకు గాను పిఇటిలు, సీనియర్ క్రీడాకారులకు జిల్లా ప్రాధికార సంస్థ గౌరవ వేతనంగా అందజేస్తారన్నారు. సంబంధిత క్రీడకు చెందిన క్రీడా పరికరాలను క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులకు శిక్షణా శిబిరాలు చివరి రోజైన జూన్ 15న ముఖ్య అతిధుల చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందచేస్తారన్నారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాల అనంతరం ప్రతి విద్యార్థి ప్రావీణ్యతను గుర్తించి వీరిని భవిష్యత్తులో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లాలోని పలు క్రీడా సంఘాల వారు వివిధ వయస్సుల క్యాటగిరిలలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపికలలో పాల్గొనేందుకు వీరికి అవకాశమిస్తారన్నారు. అనంతరం ఎంపికైన క్రీడాజట్లను రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు జిల్లా పరిషత్ నుండి 6లక్షల రూపాయలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు మంజూరుజేసేందుకు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏసి సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్సులో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారునికి ఏసి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉదయం పూట పౌష్టికాహారం, మినరల్ వాటర్ సరఫరా చేయడం ముదావహమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకునిన మంచి క్రీడాకారులుగా ఎదిగేందుకు ఈ శిక్షణ ఎంత అవసరం అన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి, డిఎస్‌డిఓ యతిరాజులు తదితరులు పాల్గొన్నారు.
కప్పరాళ్ల తిప్పలో
పోలీసుల మెరుపుదాడులు
* అదుపులో 27మంది అనుమానితులు
* 14 మోటారుబైక్‌లు స్వాధీనం
బిట్రగుంట, మే 8: బోగోలు మండల కప్పరాళ్ల తిప్పలో బుధవారం తెల్లవారుజాన కావలి డిఎస్పీ ఇందిర నేత్రత్వంలో ముగ్గురు సిఐలు, ఇద్దరు ఎస్సైలు,50మంది కానిస్టేబుళ్లతో నేరస్తుల ఇళ్లపై దాడులు చేయగా 27 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 14 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మెరుపుదాడుల వల్ల కప్పరాళ్ల తిప్పలలో కలకలం రేగింది.కొంత మంది మహిళ పోలీసుస్టేషన్ వద్ద వచ్చి తమ పిల్లలు ఏ నేరం చేయలేదని వారిని విడిపించాలని పోలీసులను వేడుకున్నారు. ఇటీవల జాతీయ రహదారిపై నేరాల సంఖ్య పెరిగిందని వాటిని అదుపు చేసేందుకు ముమ్మర దాడులు చేస్తున్నట్లు కావలి డిఎస్పీ ఇందిర తెలిపారు. అందులో భాగంగా బుధవారం కప్పరాళ్ల తిప్పలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 27 మంది అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నామని వారిలో 6 మంది నేరస్థులు ఉన్నారన్నారు. ఈ దాడుల్లో కావలి పట్టణ, గ్రామీణ, ఉదయగిరి సిఐలు,రాంబాబు,బి ప్రసాద్, కళ్యాణ్ రాజు, జలదంకి, వింజమురు ఎస్సైలు కృష్ణరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధే ధ్యేయం
పొదలకూరు, మే 8: తన చివరి రక్తపుబొట్టు చిందే వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానంటూ ఆ పార్టీ కేంద్ర నిర్వాహక కమిటీ సభ్యులు కాకాణి గోవర్దనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని పొదలకూరు మండలం కొనగలూరు, రామాపురం గ్రామాల్లో దీవెనయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెన్నంటే నడుస్తానంటూ హామీ ఇచ్చారు. తనకు పార్టీలో జగన్ సముచిత స్థానం కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి రక్తం జలగలా పీల్చుతోందని దుయ్యబట్టారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే తనపై బురద జల్లాలని చూసే వారి చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటుకు నోటు అనే సూత్రంతో పనిచేస్తున్న వ్యక్తులకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. సొంత ఖర్చులతో ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా పథకాలను ఎలా కొనసాగించగలరంటూ ప్రశ్నించారు.
టిడిపి నుంచి 30 మంది చేరిక
కొనగలూరు గ్రామంలో టిడిపికి చెందిన 30 కుటుంబాలు కాకాణి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. కాకాణి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్‌సి స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, బి శ్రీనివాసులురెడ్డి, తుమ్మల కిషోర్, వి హర్షవర్ధనరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక డిఎస్సీ కష్టమే!
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 8: జిల్లాలో ఇకపై డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం ప్రక్రియకు భారీస్థాయిలో గండి పడుతోంది. విద్యార్థుల, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం జిల్లాలో రేషనలైజేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో 426 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు విద్యాశాఖ నిర్థారించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన డిఎస్సీలో మాదిరిగా వేలకు వేలు పోస్టులైతే ఉండబోవని సమాచారం అందులో సెకండరీ గ్రేడు టీచర్ల ఆశలు దాదాపు ఆవిరైనట్లే, బీఈడి అసిస్టెంట్లకు సంబంధించి వివిధ సబ్జెక్టులలో పదవీ విరమణ పొందే ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఇకపై భర్తీకి నోచుకుంటాయి. జిల్లాలో రేషనలైజేషన్ ద్వారా మిగిలిన 426 మంది వివరాలు ఇలా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు 289 మంది, భాషా పండితులు 79 మంది, బీయడ్ అసిస్టెంట్‌లు 58 మంది ఉన్నారు. కాగా జిల్లాలో 251 పోస్టులు కౌనె్సలింగ్ ద్వారా భర్తీచేసేందుకు అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇవి ఇలావుంటే బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల జాబితా తయారు చేసే కసరత్తులో విద్యాశాఖ యంత్రాంగం మునిగిపోయింది. ఈ జాబితా గురువారం అయితే కొలిక్కి రావచ్చని అధికారులు చెబుతున్నారు.
తాగునీటి కోసం గ్రామస్థుల నిరసన
వరికుంటపాడు, మే 8: మండల పరిధిలోని కనియంపాడు గ్రామస్థులు తాగునీటి కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి తాగునీరు అందించే రెండు రక్షిత నీటి మోటార్లు చెడిపాయాయని ఫిర్యాదు చేయటానికి వచ్చిన గ్రామస్థులకు తహశీల్దార్ రవిబాబు కార్యాలయంలో లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు బైఠాయించి నిరసన తెలిపారు. మండతున్న ఎండలకు కరెంట్ కోతలు తోడవడంతో గుక్కెడు మంచి నీటి కోసం వ్యయప్రయాసాలకు ఓర్చి తెచ్చుకుంటున్నామని గ్రామంలో చెడిపోయిన మోటార్లు మరమ్మతులు చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జూనియర్ అసిస్టెంట్ కేశవులు వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామ తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై కళాజాత
వింజమూరు, మే 8: రాష్ట్ర సాంఘిక సంక్షేమ సాంస్కృతిక శాఖల నేతృత్వంలో స్థానిక ఎస్సీ వసతి గృహ సంరక్షకులు ఎన్ భాస్కరరావు ఆధ్వర్యంలో మండలంలో కళాజాత నిర్వహించారు. అందులో భాగంగానే బుధవారం రోజు సిద్ధార్థనగర్ అరుంధతీవాడ జిబికెఆర్ గిరిజన కాలనీ, మాధవనగర్ కాలనీల్లో నెల్లూరు మాస్టర్ దేవదానం బృందం కళాజాత నిర్వహించింది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై గేయాలు, పలు ముఖ్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఆత్మకూరులో ముగిసిన రైతుచైతన్య యాత్రలు
ఆత్మకూరు రూరల్, మే 8: గత నెల 22న ప్రారంభమైన రైతుచైతన్య యాత్ర ఈనెల 8న బుధవారం జరిగిన గ్రామసభతో ముగిసింది.
ప్రతి చోట వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలతో ఎట్టకేలకు గ్రామసభలు ముగిశాయి. ఆత్మకూరు, నాగులపాడు, నబ్బీనగరం గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. సదస్సుకు స్పందన పెద్దగా లేకపోయినా అధికారులు మాత్రం 9 శాఖల అధికారులు వారి శాఖాపరంగా సూచనలు, సలహాలు గ్రామసభల్లో రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
వింజమూరులో
వింజమూరు : గత నెల 22న ప్రారంభమైన రైతుచైతన్య యాత్రలు ఈనెల 8తో ముగిశాయి. చివరి రోజైన బుధవారం బొమ్మరాజు చెరువు, వింజమూరు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగానే ఏఓ బి సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుతం సాగులోవున్న వేరుశనగ, ప్రత్తి పంటల్లో యాజమాన్య పద్ధతులు అనుసరించి అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరించారు. ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పంట నష్టపోయిన మామిడితోటల రైతులు నష్ట పరిహారం చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెటనరి డాక్టర్ వంశీ, ఉద్యానవన, అటవీ, మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రదీప్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, ఏఇఓ సుధీర్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
వరికుంటపాడులో:
వరికుంటపాడు : మండలంలో గత 15 రోజులుగా జరుగుతున్న రైతుచైతన్య యాత్రలు బుధవారంతో ముగిశాయి. గువ్వాడి, కాన్‌చెరువు గ్రామసభలలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ పాల్గొని రైతులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి నాగుల్‌మీరా, వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, నారాయణ, ఆదర్శరైతులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
విడవలూరులో ముగిసిన రైతు చైతన్యయాత్ర
విడవలూరు, మే 8: మండలంలో గత నెల 22 నుంచి మొదలైన రైతు చైతన్యయాత్రలు బుధవారం విడవలూరుతో ముగిశాయి. స్థానిక గ్రామపంచామతీ కార్యాలయంలో జరిగిన రైతు చైతన్యయాత్రలో మండల వ్యవసాయ అధికారి మేరీ కమల మాట్లాడుతూ యంత్రలక్ష్మి పథకం ద్వారా రాయితీపై యంత్రాలు ఇస్తారని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూసారపరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం కింద రైతాంగం విత్తనాలను తయారు చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌కో ఏఇ మదన్‌మోహన్ మాట్లాడుతూ మండలంలో ఫిల్టర్ పాయింట్ గల రైతాంగం రెండో పంట సాగు చేస్తున్నారని విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలన్నారు. దశలవారిగా ఏడు గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తున్నామన్నారు. ఈకార్యక్రమాల్లో విఆర్‌ఓ సర్వేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి మస్తాన్‌ఖాన్, వ్యవసాయ విస్తరణ అధికారులు మోహన్, ఆదిశేషులు పాల్గొన్నారు.
కొడవలూరులో
-----------
మండల కేంద్రమైన కొడవలూరులో బుధవారం రైతు చైతన్యయాత్రలు ముగింపు సందర్భంగా గ్రామ పంచాయితీకార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ 15రోజులుగా రైతుచైతన్యయాత్రలు మండలంలో జరిగాయని ఈసందర్భంగా రైతులకు వివిధ రకాల పంటలపై రాయితీలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పశువైద్య అధికారి చంద్రమోహన్ మాట్లాడుతూ వేసవిలో పశు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఏఓ విజయకుమార్, ఆదర్శరైతులు పాల్గొన్నారు.
ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
విడవలూరు, మే 8: గత నెలలో ఎస్‌సి ఎస్‌టి ఉపప్రణాళిక గ్రామసభలు విజయవంతం చేయడంలో విఫలమైన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు మండల ప్రత్యేక అధికారి సుధాకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అన్నారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి పరదేశయ్య, చౌకచర్ల కార్యదర్శి డేవిడ్, పార్లపల్లి కార్యదర్శి విజయ్‌కుమార్‌కు మండల ప్రత్యేక అధికారి అయిన బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్ ఆయాగ్రామాలలో సక్రమంగా జరగకపోవడంతో అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
టిడిపి నేతలను పరామర్శించిన కరణం బలరాం
కొండాపురం, మే 8: మండలంలోని పార్లపల్లి గ్రామంలో బుధవారం టిడిపి నేత శ్రీరాం మాల్యాద్రి తల్లి అనంతమ్మ మృతిచెందడంతోపాటు అదే గ్రామానికి చెందిన పుల్లపునాయుడు కుటుంబాన్ని మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కరణం బలరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరి మృతి చెందడం పార్టీకి తీరని నష్టం అభిప్రాయపడ్డారు. ఆయనతోపాటు పార్టీనాయకులు కాకి ప్రసాద్, కవితా ప్రసాద్, చెరుకూరి మాలకొండయ్య, గంట నరసింహులు, పోలినేని మాలకొండయ్య తదితరులు వున్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయంపై కావలిలో సంబరాలు
కావలి రూరల్, మే 8: కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించడంపై బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కావలిలో పెండెం సెంటర్‌లో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాల విడుదలపై పలు టెలివిజిన్ ప్రసారాలను వీక్షించిన అభిమాన నాయకులు ఆ సెంటర్‌కు చేరుకుని స్వీట్లు పంచిపెట్టడంతోపాటు పెద్దఎత్తున బాణా సంచాపేల్చి తమ అనందాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా మాజీ ఏఎంసి చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి మాట్లాడుతూ కర్నాటకలో అవినీతి పార్టీలకు చెంపపెట్టుగా ఈఫలితాలు వెలువడేలా ఆరాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. సోనియా గాందీ సారద్యంలో రాహుల్ గాంధీని 2014లో ప్రధానిగాచేయాలనే ఆకాంక్ష ప్రజల్లో విశ్వాసం వున్నట్లు ఈ ఏన్నిక తొలి మెట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో వుంచుకొని వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారి అదరాభిమానాలు పొందుతుందని చెప్పారు. అలాగే ఆంధ్రరాష్ట్రంలో వివిధ పార్టీలు ఎన్ని పాదయాత్రలు చేపట్టి కలబొల్లి మాటలు చెప్పినా నమ్మేపరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృతంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని చేపడుతున్న నూతన పథకాలు పేద వర్గాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేజిక్కించుకోవడం తధ్యమని ధీమా వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కనమర్ల పూడి నారాయణ, కలికి శ్రీనివాసులురెడ్డి, రాజశేఖర్, ఆర్యవైశ్య ప్రముఖులు తన్నీరు మాల్యాద్రి, అనమల శెట్టి శివకుమార్, అమరా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్లిఖార్జునరెడ్డి, దస్తగిరి, కరిముల్లా, ఆస్లాం, శ్రీను, హరి తదితరులు సంబరాలు జరుపుకున్న వారిలో వున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైరు చోరీ చేసే ముఠా అరెస్ట్
* 3 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
* ఐదుగురు అరెస్ట్
గూడూరు, మే 8: గూడూరు పరిసర ప్రాంతాల్లో తోటల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో ఉన్న కాపర్, అల్యూమినియం వైరును అపహరించే ముఠాను గూడూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు లక్షల రూపాయల విలువ చేసే కాపర్, అల్యూమినియం వైరుతో పాటు ఈ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణి కందుల చౌడేశ్వరీ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గత కొంత కాలంగా గూడూరు మండలంలోని చెన్నూరు, తిరువెంగళాయపల్లి, తిప్పవరపాడు, కందలి, కాండ్ర, చెమిర్తి గ్రామ పొలాల్లో ఏర్పాటు చేసివున్న విద్యుత్ ట్రాన్సఫార్మర్లను కొంతమంది గుర్తు తెలియని దుండగలు ట్రాన్సఫార్మర్లను పగుల గొట్టి అందులో ఉన్న కాపర్, అల్యూమినియం వైరును అపహరించుకుని పోతున్నట్టు ఫిర్యాదులు రావడంతో గూడూరు గ్రామీణ సిఐ కె వేమారెడ్డి సదరు నిందితులను పట్టుకునే సంకల్పంతో తమ సిబ్బందితో వల పన్ని పట్టుకున్నారన్నారు. పట్టుబడిన వారిలో గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పోకూరి శివ ఇతను సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రీషన్‌గా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వ్యక్తితో పాటు చెన్నూరు గమళ్లపాళెంకు చెందిన ఓరేపల్లి అంకయ్య, చెన్నూరు తూర్పువీధికి చెందిన నాప శివప్రసాద్, గూడూరు మండలం తిప్పారుపాడు గ్రామానికి చెందిన వెందొటి శివ, చెన్నూరు పాటిమిట్ట ప్రాంతానికి చెందిన షేక్ సైదులు ఉన్నట్టు డిఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి 665 కిలోల కాపర్, 10 కిలోల అల్యూమినియం వైరు స్వాధీనం చేసుకున్నట్టు, వీటి విలువ 3 లక్షల రూపాయల పైచిలుకు ఉంటుందన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన సిఐ వేమారెడ్డి, మనుబోలు, చిల్లకూరు ఎస్సైలు మారుతీకృష్ణ, దశరథరామారావు, సిబ్బందిని అమె ప్రత్యేకంగా అభినందించి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ సిఐ కె వేమారెడ్డి, చిల్లకూరు, మనుబోలు ఎస్సైలు దశరథరామారావు, మారుతీకృష్ణ పాల్గొన్నారు.
‘ఆర్టీసీ పరిరక్షణ బాధ్యత కార్మికులదే’
వాకాడు, మే 8: ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత సంస్థలో పనిచేస్తున్న కార్మికులదేనని ఆర్‌ఎం రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి కార్మికులకు పనితీరును పరిశీలించారు. కార్మికులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ మనుగడ సాధించాలంటే కార్మికులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల పరిరక్షణ పేరుతో ప్రయివేటు వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను తెలియచేస్తూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించే విధంగా కార్మికులు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మరికొందరు బురద చల్లడం విచారకరమన్నారు. ఇది మంచి పద్దతి కాదని, పనిచేసే వారిని ప్రోత్సహించాలే కాని కించపరచడం తగదన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పది డిపోలలో 27 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఈ నష్టం బాధ్యత సంస్థలో పనిచేస్తున్న 5500 మంది కార్మికులదేనని అన్నారు. సంస్థ అభివృద్ధి చెందితే లాభాలు పొందేంది మేము, కాపాడుకోవాల్సిన బాధ్యత తమదేను, ఎవరో వచ్చి అక్రమ వాహనాలు అడ్డుకుంటారని ఆశించడం హాస్యాస్పదమేనని అన్నారు. ఇటీవల కాలంలో ఆదాయాలు గణనీయంగా పడి పోయాయనన్నారు. జిల్లాకు 52 నూతన బస్సులు రానున్నట్టు తెలిపారు. ఆర్‌ఎం వెంట సిఐ లక్ష్మీ, ట్రాఫిక్ సిఐ మధురెడ్డి, ఎన్‌ఎంయు కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం రెడ్డి, పసల చంద్ర తదితరులున్నారు.
8-వాకాడు-1 కార్మికులకు సూచనలిస్తున్న ఆర్‌ఎం