విశాఖపట్నం, మే 8: మండు వేసవి.. ఏడాదికోసారి దర్శన మిచ్చే సింహాద్రి అప్పన్న నిజ రూపం కళ్ళారా చూడాలని ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు సింహాచలం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు ఉండవు.. సాధారణ భక్తుల కన్నా.. విఐపిలు, వివిఐపిలు, రాజకీయ నాయకులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులే దేవస్థానం అధికారులకు మేరువు. వీరి వెంట వందలాది మంది గర్భగుడిలోకి వెళ్లినా నోరు మెదపరు ఈ అధికారులు. భద్రత నెపంతో వచ్చిన పోలీసు సిబ్బంది కూడా వందలాది మందిని గాలి గోపుర మార్గం నుంచి పంపిస్తున్నా, దేవాదాయశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుంటారు. నెలల పిల్లలను చంకనెత్తుకుని.. మండుటెండలో నిలబడినా, అధికారులకు కనికరం ఉండదు. ఇలా చేయడం వలన ప్రతి ఏటా చందనోత్సవం రోజున సింహ గిరి హింస గిరిగా మారిపోతోంది. ఏటా కొత్త కొత్త లోపాలు వెలుగు చూస్తున్నా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా దాదాపూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈనెల 13న జరగనున్న చందనోత్సవాన్ని సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తపన పడుతున్నా, రాజకీయ వత్తిడులు, దేవాదాయశాఖ అధికారుల వైఖరి, ఇందుకు మోకాలడ్డుపడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చందనోత్సవంలో భక్తులు ఆహాకారాలు పెట్టారు. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సింహాద్రి కాస్తా హింసాద్రిగా మారింది. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులపై విచారణ కూడా జరపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ఐఎఫ్‌ఎస్ అధికారి ఓ.వి.ఆర్.రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఆ చందనోత్సవంలో జరిగిన లోపాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఆయన, ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా ఒక నివేదిక కూడా రెడ్డి ప్రభుత్వానికి అందచేశారు. ఈ నివేదికలో ఎన్ని సూచనలను ఈ చందనోత్సవంలో అమలు చేస్తున్నారు?
విఐపిలు, వివిఐపిలకు దర్శనానికి ఇచ్చే పాస్‌లను 5000లకు పరిమితం చేయాలని సూచించారు. అలాగే వారికి ఒక సమయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. ఆ పాస్‌లు డూప్లికేట్ కాకుండా బార్ కోడ్‌ను కూడా దానిపై ముద్రించాలని సూచించారు. చందనోత్సవ నిర్వహణకు విధిగా దేవాదాయశాఖ అధికారిని నియమించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని సూచించారు. ఈ ఉత్సవ నిర్వహణకు వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని నియమించాలని సిఫార్సు చేశారు. వారికి ఆయా ఉత్సవాల్లో పాల్గొన్న అనుభవం ఉంటుంది కనుక, వారిని వినియోగించాలని సూచించారు. మొత్తం సిబ్బందిలో 10 శాతం మందిని రిజర్వ్‌లో ఉంచుకోవాలని సూచించారు. వీటిలో కొన్నింటిని అధికారులు అమలు చేస్తున్నారు.
కానీ రాజకీయ నేతల వత్తిడుల నుంచి వీరు బయట పడలేకపోతున్నారు. ఈ ఏడాది కూడా యథావిధిగా ఒక్కో విఐపి వెంట పదుల సంఖ్యలోనే అనుచరులు లోనికి వెళ్లేట్టు కనిపిస్తున్నారు. వివిఐపి, విఐపి పాస్‌లు ఎవరికి ఎనె్నన్ని ముట్టచెపుతున్నారు? ఎన్ని సామాన్య జనానికి అందాయన్నది కలెక్టర్ పరీశీలించాల్సిన అవసరం ఉంది. అతిథులకు ఆతిథ్యాన్ని కాస్తంత తగ్గిస్తే కానీ, అప్పన్న నిజ రూపాన్ని సామాన్య భక్తులు చూడలేరు.
మీడియాకు ఆంక్షలు
చందనోత్సవం రోజున జరిగే వివిధ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు మీడియా సిద్ధంగా ఉంది. అయితే మీడియాపై సింహాచలం దేవస్థానం, ప్రజా ప్రతినిధులు ఆంక్షలు విధిస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఆనంద గజపతిరాజు, ఆ తరువాత వచ్చే కొద్దిపాటి విఐపిల రాకను చిత్రీకరించడానికి కూడా మీడియాను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఏటా పోలీస్, రెవెన్యూ, దేవాదాయశాఖ ఇతర శాఖల అధికారుల కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చిన రీతిలో దర్శనానికి పంపించడం వలనే వచ్చే ఇబ్బందులన్నీ పక్కన పెట్టి, కొద్ది మంది ఆన్ డ్యూటీ మిడియా సిబ్బందిని విడిచి పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఈ అంశంపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది.
అదే పరిస్థితి కాంగ్రెస్‌లోనూ ఉంటుంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కార్యకర్తల మనోభీష్టానికి విదుద్ధంగా ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కీలకనేత కొణతాల రామకృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై బుధవారం నాడిక్కడ ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ కొణతాల క్యాడర్ స్పందించిన తీరును ఆయన ఉదహరిస్తూ ఏరాజకీయ పార్టీలోనైనా ఇటువంటి పరిణామాలు సహజమని పేర్కొన్నారు. కొణతాల కాంగ్రెస్ పార్టీలో చేరికపై జరుగుతున్న చర్చలు ఊహాగానాలుగా కొట్టి పారేశారు. అయితే కొణతాల రాకకు సంబంధించ తన అభిప్రాయాలను పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో చర్చించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొణతాల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితులు తలెత్తినప్పుడు కార్యకర్తల మనోభీష్టం మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు. దాడి వీరభద్రరావును కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు మీరు ప్రయత్నించారుకదాని ప్రశ్నించగా, రాజకీయ పార్టీల్లో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. పార్టీని వదిలివెళ్లిన వారు ఎవరైనా తిరిగి ఇదే గూటికి చేరుకోవాలని మంత్రి పి బాలరాజు అన్నారు. కొణతాల విషయమై మాట్లాడాలని మీడియా కోరగా మంత్రి స్పందించారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చని, అయితే ఈవిషయాలన్నీ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో పార్టీ సత్తా చాటిందన్నారు. బిజెపి, మోడి ప్రభావం కర్ణాటకలో పనిచేయలేదన్నారు. భవిష్యత్‌లో దేశానికి రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీయే దిశానిర్దేశం చేస్తుందన్నారు.
అందుబాటులో
కార్బైడ్ రహిత మామిడి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కార్బైడ్ రహిత మామిడి పళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి మేళా 2013ను రాష్ట్ర మంత్రులు పి బాలరాజు, గంటా శ్రీనివాస రావు బుధవారం ప్రారంభించారు. ఎంవిపి రైతు బజార్లో బుధవారం నుంచి వారం రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన సుమారు 150 మంది మామిడి రైతులు మేళాలో పాల్గొంటున్నారు. సుమారు 15 రకాల మధురమైన మామిడి పళ్లను ప్రదర్శనలో ఉంచారు. రకాన్ని బట్టి కిలో 30 నుంచి 70 రూపాయల వరకూ వీటిని విక్రయిస్తున్నారు. మామిడి మేళాలో సుమారు 150 మెట్రిక్ టన్నుల మామిడి పళ్లను విక్రయించేందుకు సిద్ధం చేశారు. నిర్ణీత ధరలకు ఇక్కడ మామిడి పళ్లను విక్రయిస్తారు. ప్రదర్శనలో పాల్గొన్న మామిడి రైతులకు ఉద్యానశాఖ పలు రాయితీలను ప్రకటించిది. వీరికి అవసరమైన నిల్వ సదుపాయాన్ని కల్పించారు. అలాగే మామిడి పళ్ల రవాణాలోను, అందుకు అవసరమైన ప్యాకింగ్ తదితర అంశాల్లో 50 శాతం రాయితీని వర్తింపచేశారు. ఎటువంటి హాని కలిగించని కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయాలను ప్రోత్సహించే క్రమంలో ఉద్యాన శాఖ రాష్ట్రంలో తొలిసారిగా మామిడి మేళా పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల పాటు జరిగే ఈమేళాలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ మామిడి పళ్ల విక్రయం జరుగుతుందని ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు.
మేళాను ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుర ఫలం మామిడి అంటే అందరికీ ఇష్టమే. అయితే రసాయన ప్రక్రియ ద్వారా మామిడి పళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా అనేక శారీరక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖలు సమన్వయంతో మామిడి రైతుకు న్యాయం చేసేందుకు ఇటువంటి మేళాలు ఉపకరిస్తాయని అన్నారు.
మరో మంత్రి పి బాలరాజు మాట్లాడుతూ వినియోగదారునిక, రైతుకు ఉపకరించే విధంగా మామిడి మేళాను నిర్వహించేందుకు ఉద్యానశాఖ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి శేషాద్రి, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ అధికారలు పాల్గొన్నారు.
కోస్ట్‌గార్డులో చేరనున్న మరో నౌక
రాణి అవంతిబాయి నేడు జలప్రవేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: ఇండియన్ కోస్ట్‌గార్డుకు మరో ఆన్‌షోర్ షిప్ సమకూరనుంది. హిందుస్థాన్ షిప్‌యార్డు సారథ్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రాణి అవంతిబాయి నేడు జలప్రవేశం చేయనుంది. రక్షణశాఖ సహాయ మంత్రి జితేంత్ర సింగ్ చేతుల మీదుగా అవంతిబాయి జలప్రవేశం చేయనుంది. కోస్ట్‌గార్డులో చేరిన అవంతిబాయి పూర్తి అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచార వ్యవస్థ కలిగిన నౌక. 31.5 నాటికల్ మైళ్ల వేగంతో నడిచే ఈ అత్యాధునికి షిప్ ఏకధాటిగా 1500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జి విధానం, ఇంటిగ్రేటెడ్ మెషినరీ కంట్రోల్ సిస్టంతో పాటు అత్యాధునిక అగ్నిప్రమాద నియంత్రణ విధానం ఈ అవంతిబాయి షిప్ ప్రత్యేకతలు. విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ బృందాల కోసం రెండు ఆధునిక బోట్లతో పాటు సముద్ర గస్తీలో రాణి అవంతిబాయి కీలక సేవలు అందించనుంది. షిప్ జలప్రవేశ ఈకార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు ఇండియన్ కోస్ట్‌గార్డు డైరెక్టర్ జనరల్ అనురాగ్ జి తప్ల్యాల్, ఇనస్పెక్టర్ జనరల్ ఎస్‌పి శర్మ తదితరలు పాల్గొంటారు.
నేడు గంధం అమావాస్య : భారీగా వస్తున్న గ్రామీణ భక్తులు
సింహాచలం, మే 8: శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో గురువారం గంధం అమావాస్య వేడుక జరగనుంది. ప్రతి సంవత్సరం చందనోత్సవానికి ముందు వచ్చే చైత్రబహుళ అమావాస్యను గంధం మూలవిరాట్‌కి శీతలాభిషేకాలు చేస్తారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు అమావాస్య యాత్రకు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే భజన బృందాలు, గరిడలు, కోడెదూడలను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రానికి భక్తులు భారీగా సింహాచలం తరలివచ్చారు. తెల్లవారుజామునే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో మెట్లమార్గంలో సింహాగిరికి చేరుకుంటారు. కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి గంగధారలో స్నానాలు చేసి సింహాచలేశుని దర్శనం చేసుకుంటారు. అంతకు ముందు భక్తులు కొండదిగువ అటవీ ప్రాంతంలో వున్న భైరవస్వామిని, అడివివరం గ్రామదేవత పైడితల్లమ్మని దర్శించుకుంటారు. అమావాస్య సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయమని ఇఓ కె.రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పుష్కరిణి వద్ద ప్రమాదాలు జరుగకుండా లోతట్టు ప్రాంతానికి స్నానాల కోసం భక్తులు వెళ్ళకుండా చెరువులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇఓ సూచించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి పది సెక్యూరిటీగార్డులను చెరువు వద్ద ఉంచాలని ఇఓ ఆదేశించారు. తాగునీటి కోసం 50 వేల ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని ఆయన సూచించారు.
‘దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే ప్రాజెక్టులకు ప్రతిపాదన’
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ నగరాభివృద్ధి సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, ప్రణాళికలు అమలు చేయాలని వైస్ చైర్మన్ ఎన్ యువరాజ్ అన్నారు. ప్రణాళికాబద్దమైన ప్రగతి సాధనలో వుడా మార్గదర్శకంగా పనిచేయాలని ఆయన సూచించారు. వుడా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా వుడా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో ప్రతి అంశాన్ని ముందుగానే ఖరారు చేసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్మాణాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ సరికొత్త ఒరవడిని సృష్టించాలన్నారు. విధానపరమైన జాప్యం కారణంగా వుడా చేపడుతున్న ప్రాజెక్టుల్లో విపరీతమైన ఆలస్యం చోటుచేసుకుంటోందన్న వాస్తవాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు ముందుగానే ఖరారు చేసుకోవాలన్నారు. వుడా ప్రధాన కార్యాలయం, వాణిజ్య సముదాయాలు, ఇతర పర్యాటక కేంద్రాల్లో విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలన్నారు. ప్రతిపాదిత సౌర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో భాగంగా వైఎస్సార్ పార్కు, చిల్డ్రన్స్ ఎరీనా, మాస్టర్‌ప్లాన్ రహదారులు, హరిత హౌసింగ్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంశాలపై విసి ఇంజనీర్లతో చర్చించారు. చీఫ్ ఇంజనీర్ ఐ విశ్వనాధరావు, ఇఇలు వి భవానీ శంకర్, డివి వర్మ, ఎం బలరామరాజు, ఎం అప్పన్న, క్వాలిటీ కంట్రోల్ డిఇఇ దేవీప్రసాద్ పాత్రో, ఎలక్ట్రికల్ డిఇఇ బి శేసోశేఖర్ సమావేశంలో పాల్గొన్నారు.
‘్భక్తులకు ఇబ్బంది కలగకుండా
చందనోత్సవం నిర్వహించండి’
సీతంపేట, మే 8: ప్రొటోకాల్ నిబంధనలను పాటిస్తూ ముఖ్యులకు సింహాచలేసుని దర్శనం కల్గించడమే కాకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చందనోత్సవం నిర్వహించాలని మంత్రి గంటా తెలిపారు. బుధవారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిధి గృహంలో ఈనెల 13న నిర్వహించబోవు చందనోత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు జరగకుండ ప్రోటోకాల్ ద్వారా ఇవ్వవలసిన అతిముఖ్యుల దర్శన సమయాలను ఉదయం 4.30గంటల నుండి నుండి 5.30గంటల వరకు, సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరక కేటాయించాలని, ముఖ్యుల కొరకు ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు, మధ్యాహ్నం 12గంటల నుండి 2గంటల వరకు, సాయంత్రం 7గంటల నుండి 8గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుంటుందని అధికార్లకు గంటా సూచించారు. గురువారం ఉదయం సింహాచలేశుని దర్శనం సజావుగా జరిగేలా సింహాచలం దేవస్థానానికి వెళ్ళి గంటా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
భక్తిశ్రద్ధలతో
కొనసాగుతున్న గంధం తీత
సింహాచలం, మే 8: సింహాచలం క్షేత్రంలో గంధం అరగదీత ప్రక్రియ భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. మూడు రోజులకుగాను సుమారు 85 కిలోల శ్రీ గంధాన్ని ఉద్యోగులు సిద్ధం చేశారు. ఏ రోజు కారోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి దేవాలయ వైదిక పెద్దలు స్వాధీనం చేసుకుంటున్నారు. తొలివిడత సమర్పణకు సంబంధించి మరో 40 కిలోల గంధం అరగదీయాల్సి ఉంది.
షిప్‌యార్డును సందర్శించనున్న రక్షణ మంత్రి
ఆహ్వానించిన టిఎస్సార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం నగరానికి రానున్నారు. తన పర్యటనలో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డును జితేంద్ర సింగ్ సందర్శించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ చైర్మన్ టి సుబ్బరామి రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన షిప్‌యార్డును సందర్శించి యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. నష్టాల్లో కూరుకున్న షిప్ యార్డుకు ఆర్ధికంగా చేయూతన నిచ్చేందుకు రక్షణ శాఖ ఆర్డర్ ఇవ్వాలని టిఎస్సార్ కేంద్ర మంత్రిని కోరారు. సుమారు 25వేల కోట్ల రూపాయల మేర రక్షణశాఖ ఆర్డర్లను షిప్‌యార్డుకు మళ్లించడం ద్వారా తిరిగి పూర్వవైభనాన్ని తీసుకురావచ్చని ఆయన సూచించారు. రక్షణ మంత్రి తన పర్యటనలో షిప్‌యార్డుకు అనుకూలంగా ప్రకటన చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో గురువారం సమవేశం కానున్న టిఎస్సార్ నేరుగా విశాఖ వచ్చి రక్షణ మంత్రి కార్యక్రమంలో పాల్గొంటారని టిఎస్సార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ నేతల విజయోత్సవం
గాజువాక, మే 8: కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలను నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి వారణాశి దినేష్‌రాజ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఎమ్మెల్యే చింతలపూడి కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో నడిచిందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా కర్ణాటకలో ప్రచారం చేయడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రజల మంచి తీర్పును అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గుడివాడ అమ్మన్న, కరణం కనకారావు, సోడిపిల్లి తాతారావు, యర్రా నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, గోపిశెట్టి గోపి, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాష, సాహిత్యాలకు వరం ఘంటసాల స్వరం
విశాఖపట్నం (కల్చరల్), మే 8: తెలుగు భాష, సాహిత్యాలకు ఘంటసాల స్వరం జీవం పోసిందని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఘంటసాల సంగీత కళాశాల, వైశాఖి జలఉద్యానవనం సంయుక్త ఆధ్వర్యంలో పాటకు పల్లవి ప్రాణం పేరిట మూడు రోజుల పాటు నిర్వహించే ఘంటసాల గానామృత కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఘంటసాల లేనిదే తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు, గౌరవం దక్కేవికావన్నారు. అమృతప్రాయమైన ఆయన స్వరం పాటలు అజరామరమని అన్నారు. ఘంటసాల పాటకు మరోసారి జీవం పోసి మైమరపించిన శరత్‌చంద్రను ఆయన అభినందించారు. మిధునం సినీ నిర్మాత మొయిద ఆనందరావు మాట్లాడుతూ ఘంటసాల పాటలు తెలుగు సినిమా విలువల్ని పతాకస్థాయికి తీసుకువెళ్లాయన్నారు. తరాలు మారినా ఘంటసాల పాటలు వనె్నతగ్గవని, తెలుగువారు ఉన్నప్రతిచోటా ఆయన స్వరం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. సిఎంఆర్ సంస్థల ఆధినేత వెంకటరమణ మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖలో ఘంటసాల స్వరారాధన పేరిట ఆయన పాడిన పాటలను అందిస్తున్న శరత్‌చంద్రను అభినందించాలని అన్నారు. పాటకు పల్లవి ప్రాణం పేరిట నిర్వహించిన ఈసంగీతారాధన కార్యక్రమంలో శరత్‌చంద్ర, ఆయన సోదరుడు గోవింద్ ఘంటసాల పాడిన పలు పాటలను మధురంగా ఆలపించారు. శరత్‌చంద్ర నేతృత్వంలో నడుస్తున్న ఘంటసాల సంగీత కళాశాల విద్యార్థులు పాటకుపల్లవి ప్రాణం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలకు చెందిన గాయకులు పద్యాలు, ఏకగళ గీతాలు, యుగళగీతాలు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు, పిఎల్‌ఎన్ రాజు, వంకాయల తాతాజీ, వైశాఖి జల ఉద్యానవనం ఎండి ఉరిటి నాగభూషణం, పలువురు ఔత్సాహిక గాయకులు పాల్గొన్నారు.
కొణతాలను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తాం
- జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్
పాయకరావుపేట, మే 8: మాజీమంత్రి, వైఎస్సార్ సిపి నాయకుడు కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తారని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్ అన్నారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీ ఎంతో బలపడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. కొణతాల నాయకత్వంలో జిల్లాలో ఉన్న పార్టీ కేడర్ పనిచేయడానికి ధృడసంకల్పంతో ఉన్నారని తెలిపారు. పి.సి.సి. అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాల మేరకు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, నీలం తుపాను కారణంగా తాండవ నదిపై నిర్మించిన ముఠాకాలువ వద్ద, మండలంలోని పలుచోట్ల పంట కాలువలు మరమ్మత్తులు చేరుకున్నాయని, వీటికి తాత్కాలిక మరమ్మత్తులు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను కో రగా ఆయన 32 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. మరో నెలరోజు ల్లో పనులు పూర్తవుతాయని తోటనగేష్ తెలిపారు. ఈ సమావేశంలో గూటూరు శ్రీనివాసరావు, కొప్పిశెట్టి వెంకటేష్, పేకేటి రాజారావు పాల్గొన్నారు.
గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికల ప్రచారం
చోడవరం, మే 8: గోవాడ సహకార చక్కెర కర్మాగారం పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు సభ్యరైతులకు విజ్ఞప్తిచేశారు. వైఎస్సార్ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మండలం లక్కవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కుంగికృశించిపోయిన సహకార వ్యవస్థకు పునరుజ్జీవ నం కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. గతంలో సహకార చక్కెర కర్మాగారాలను ప్రైవేటుపరం చేయాలని అప్పటి ప్రభుత్వాలు ఆలోచన చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సహకార వ్యవస్థ ను పటిష్ఠపరచి ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడారన్నారు. గోవాడ సుగర్స్‌కు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా సభ్యరైతులు విజ్ఞతతో వ్యవహరించి పార్టీ మద్దతు అభ్యర్థులకు ఓటువేసి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నా యకులు వెంపలి ఆనందీశ్వరరావు, డాక్టర్ బండారు సత్యనారాయణ, కాం డ్రేగుల డేవిడ్, అల్లం రామఅప్పారావు, నాగులాపల్లి రాంబాబు, భూపతిరాజు సన్యాశిరాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
పురుగు మందు తాగి ప్రేమికుల ఆత్మహత్యయత్నం
* ప్రియురాలు మృతి, ప్రేమికుడి పరిస్థితి విషమం
నర్సీపట్నం(రూరల్),మే 8: ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చివరకు అమ్మాయి మృతి చెందగా, అబ్బాయి చావుబ్రతుకుల మధ్య విశాఖ కె.జి.హెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. పట్టణంలోని పెదబొడ్డేపల్లి బ్రాహ్మణవీధికి చెందిన ఆర్.ఎం.పి. వైద్యుడైన శ్రీకాకుళపు నాగేశ్వరరావుకు ఉదయలక్ష్మి(25) అనే కుమార్తె ఉంది. విజయనగరం జిల్లా దత్తిరాజూరు మండలం దత్తిగ్రామానికి చెందిన బూరిశెట్టి రాంజీ, ఉదయలక్ష్మి పట్టణంలోని ఆంధ్రా మెడికల్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 8వతేదీన వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగింది. అప్పటినుండి రాంజీ పెదబొడ్డేపల్లిలోని ఉదయలక్ష్మి ఇంటికి వెళ్తుండేవాడు. మంగళవారం వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని ఆ రాత్రి వీరిద్దరూ పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరిన వీరిని బంధువులు గుర్తించి హుటాహుటినా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. విశాఖ కె.జి.హెచ్.లో ఉదయలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాంజీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడి వెంట వెళ్లేది ఆ నలుగురేనా..?
కశింకోట, మే 1: మారుతున్న రాజకీయ సమీకరణాల్లో మాజీమంత్రి దాడి వీరభద్రరావు వెంట వెళ్లేది కశింకోట నుండి ఆ నలుగురేనా? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరున్న కశింకోట మండలంలో దాడి వీరభద్రరావుకు మంచి పట్టుఉంది. ఏ ఎన్నికలు వచ్చినా టిడిపి అభ్యర్థులే విజయం సాధించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎంపిపి, జెడ్‌పిటిసిలు, వార్డుమెంబర్లు, ఎంపిటిసిలు టిడిపి కైవసం చేసుకోవడంలో ముందుండేది. దాడిని పలువురు మాస్టారుగా పిలుచుకునేవారు. మాస్టార్ వచ్చినా, ఆయన తనయుడు రత్నాకర్ వచ్చినా కశింకోటలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికేవారు.
మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో దాడి వీరభద్రరావు పేరు చెబితే ప్రతి ఒక్క కార్యకర్తకు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. బత్తిన వీరభద్రరావు(ఆటోభద్రం) ఈయన చిన్నప్పటి నుండి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషిచేసేవారు. ప్రస్తుతం దాడి, రత్నాకర్ పేరు చెపితే నానా దుర్భాషలు ఆడుతున్నారు. అలాగే పెంటకోట రాము, చిటికిరెడ్డి చిట్టిబాబు, పి కళ్యాణి, వేగి వెంకట్రావు, పెంటకోట సత్యనారాయణ, కొంతం ఆదినారాయణ, గొంతినలోవ అప్పారావు, మాజీ ఎంపిపి నిమ్మదల త్రినాధరావు, మాజీ జడ్‌పిటిసి పొన్నగంటి నూకరాజు, పలువురు మాజీ ఎంపిటిసిలు, మాజీ వార్డుమెంబర్లు, నాయకులు, కార్యకర్తలు వీరంతా దాడి పార్టీ మార్పుపై చిర్రుబుర్రులాడుతున్నారు. దాడి వెంట కేవలం బావబామర్ధులైన దొడ్డి బుద్దసత్యనారాయణ, వేగి దొరబాబు, ఆడారి నర్శింగరావు ఉండగా, తటస్థంగా మాజీ వైస్‌ఎంపిపి వేగి గోపికృష్ణ వ్యవహరిస్తున్నారు. దాడి, ఆయన కుటుంబ సభ్యులు అంటే అందరికీ మక్కువే. అలాగే తెలుగుదేశం పార్టీ అన్నా మక్కువే. కాని పార్టీ ఫిరాయింపుతో దాడి, ఆతని తనయుడుకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారని పలువురు కార్యకర్తలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి నాయకత్వం బాగున్నా పార్టీ ఫిరాయింపుతో ఆయన వెంట వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు రాజధాని నుండి అనకాపల్లికి వస్తుండటంతో ఎయిర్‌పోర్టు నుండి ఘనస్వాగతం పలికేందుకు భారీస్థాయిలో కార్యకర్తలను సమీకరించాలని ప్రస్తుత వైకాపా నాయకులు దొరబాబు, నర్శింగరావు నానా అవస్థలు పడుతున్నారు. దాడి రాకతో వైఎస్సార్ కాంగ్రెస్‌కి కొత్తగా నాయకులు, కార్యకర్తలు ఎంతమంది తయారవుతారో వేచిచూడాల్సిందే.
అంతర్రాష్ట్ర దారిదోపిడీ హంతకుల ముఠా అరెస్టు
అనకాపల్లి టౌన్, మే 8: అంతర్రాష్ట్ర దారిదోపిడి హంతకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పర్లాకిమిడికి చెందిన అర్జున బోస్లే(21), రాజుబోస్లే (23) అనే ఇద్దరు అన్నదమ్ములు గత ఏడాది మేనెల 7వ తేదీన అర్ధరాత్రి వీరు అనకాపల్లి బైపాస్ రోడ్‌లో నిలిపి ఉంచి లారీలో నిద్రపోతున్న డ్రైవర్ ఉప్పాడ శ్రీను(23) వద్ద నుండి ఆరువేల రూపాయలు బలవంతంగా లాక్కొని అతన్ని కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. వీరికోసం పోలీసులు వెతుకుతుండగా మంగళవారం ఉమ్మలాడ బైపాస్ జంక్షన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అటుగా వెళుతున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వీరుచేసిన హత్యలు, దారిదోపిడీలు బయటపడ్డాయి. అందులో అనకాపల్లిలో చేసిన హత్య కూడా ఉండడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి బుధవారం కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌కు విదించింది. పట్టణ సిఐ పి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు అప్పలనాయుడు, రాంబాబు, భాస్కరరావు కేసును ఛేదించారని డిఎస్పీ విఎస్‌ఆర్ మూర్తి బుధవారం విలేఖరులకు తెలియజేశారు.