నెల్లూరు, మే 9: జిల్లాలో వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద ఓడరేవుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. గురువారం ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసినట్లుగా మీడియాలో ప్రచారం జరగ్గానే స్థానికుల్లో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. దుగరాజపట్నంకు ఓడరేవురావడంలో తిరుపతి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విస్తృతంగా కృషి చేశారు. తొలుత అక్కడ ఓడరేవుఏర్పాటుకు సాధ్యపడదని, షార్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయంటూ తొలుత అటకెక్కించారు. దీని వెనుక కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కుటిలంగా వ్యవహరిస్తోందని గమనించిన ఎంపి చింతా మోహన్ వ్యూహాత్మకంగా మసలుకున్నారు. నెల్లూరుజిల్లాలోనే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటై గత ఐదేళ్లగా భారీ స్థాయిలో వ్యాపారం చేస్తుండటం తెలిసిందే. ఇదే జిల్లా పరిధిలో కృష్ణపట్నంకు సమీపంలోనే మరో ఓడరేవువస్తుండటంతోనే అడ్డంకులు ఏర్పడబోయాయి. దీనిని అత్యంత ఛాణ్యకంగా చింతామోహన్ తిప్పిగొట్టారు. కేంద్రం వద్ద తనకున్న పలుకుబడితో ఈ ఓడరేవుసాధించుకురాగలిగారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతంలో వైఎస్ కడపకు తీసుకెళ్లబోతే దానిని కూడా చింతామోహన్ అప్పట్లో అడ్డుకుని తన నియోజకవర్గానికే మంజూరయ్యేలా కృషి సల్పారు. వెంకటగిరిలో భెల్ భారీ ప్రాజెక్ట్‌ను ఆరువేల కోట్ల రూపాయలతో నిర్మించడంలోనూ చింతా మోహన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అప్పట్లో రాజస్థాన్‌కు, మహారాష్టక్రు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు జరిగాయి. నెల్లూరులో చిన్నపిల్లల ఆసుపత్రి బాగోకపోవడంతో ఏడుకోట్ల రూపాయల నిధులు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చేలా కృషి చేశారు. రేణిగుంట నుంచి రాపూరుకు, నాయుడుపేటకు నాలుగు లైన్ల రహదారి 12వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.
జూన్ 12న పిఎస్‌ఎల్‌వి సి-22 ప్రయోగం
షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం
సూళ్లూరుపేట, మే 9: పిఎస్‌ఎల్‌వి-సి 22 ప్రయోగం పై షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్‌లో గురువారం మిషన్ రెడినెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) జరిగింది. మాజీ షార్ డైరెక్టర్ కె. నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు విచ్చేసి సుదీర్ఘంగా చర్చించారు. పిఎస్‌ఎల్‌వి-సి 22 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులన్ని వేగంగా జరుగుతున్నాయి. ఇస్రో వర్గాల సమాచారం మేరకు జూన్ 12న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరగనుంది. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ మలపాక యఘ్నేశ్వర సత్యనారాయణ ప్రసాద్, మిషన్ డైరెక్టర్, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి
నెల్లూరు, మే 9: ఎన్నికల నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా బూత్ స్థాయి అధికారుల రిజిష్టర్లు, డూప్లికేట్ జాబితాను ఓటర్ల జాబితాలోని చేర్పులు, తొలగింపుల వివరాల జాబితాను జిల్లా స్థాయిలో ప్రింటింగ్ చేసి వాటికి సంబంధించిన తుది ప్రతిని రెండురోజులో జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ నియోజవర్గ మాస్టర్ ట్రైనీస్, బూత్ స్థాయి అధికారులకు ఓటర్ల జాబితా తయారీలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటరు నమోదుకు సంబంధించిన చేర్పులు గురించి సర్వే మే 16 నుండి జూన్ 15వరకు నిర్వహించాలన్నారు. ఇక నుండి ఓటరు గుర్తింపు కార్డులు పివిపి కలర్ ఫోటోతో జారీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలలో చేర్పులు మార్పుల ప్రక్రియ సక్రమంగా నిర్వహించి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ మాట్లాడుతూ నెల్లూరు, కావలి, డివిజన్లలతో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, గూడూరు డివిజన్‌లో రెండు రోజులలో పూర్తి చేస్తామన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి తనిఖీలు మే 16నుండి ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తప్పులు లేని ఓటర్ల జాబితాలు తయారు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. నియోజక వర్గం రిటర్నింగ్ అధికారుల నియామకం, మార్పులు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే సిద్ధం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జిల్లా రెవెన్యూ అధికారి బి రామిరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ జి నివాస్, నెల్లూరు, కావలి రెవెన్యూ డివిజన్‌ల అధికారులు పాల్గొన్నారు.
‘సమాచారం అడిగితే అక్రమ కేసులు’
కోవూరు, మే 9: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వమని అడిగినందుకు తనపై అక్రమ కేసు బనాయించారని సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన కొందరు తన వద్దకు వచ్చి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి గురించి చెప్పారన్నారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలు, కార్యాలయానికి చేపట్టిన మరమ్మతులు, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల గురించి సమాచారం అడిగినందుకు తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారని తెలిపారు. కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పిడిఎస్ బియ్యం పట్టివేత
కావలి, మే 9: గుంటూరు జిల్లా మాచర్ల నుండి కావలి పట్టణానికి వాహనంలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని బుధవారం రాత్రి పోలీసులు, సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. కావలి డిఎస్పీ ఇందిరకు అందిన సమాచారం మేరకు సివిల్ డిటి మునిర్‌బాషాకు సమాచారం అందించగా ఆయన నిఘా ఉంచి వాహనాన్ని అదుపులోకి తీసుకొని రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. 44 బస్తాలు బియాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. పోలీసులు వాహనంలో ఉన్న కావలికి చెందిన వేణు, శింగరాయకొండకు చెందిన మనోహర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
జిల్లాలో 15 మంది డిటిలకు తహశీల్దార్లుగా పదోన్నతి
నెల్లూరు, మే 9: నెల్లూరు జిల్లాలో 15 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ హైదరాబాద్ సిసిఎల్‌ఎ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం వెలువడిన ఉత్తర్వులలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో అడహక్ పద్దతిలో తహశీల్దార్లుగా వ్యవహరిస్తున్న డిటిలకు కూడా పదోన్నతి కలిగింది. దీంతో వీరు రెగ్యులర్ తహశీల్దార్లుగా విధులు నిర్వహించనున్నారు.
నేటి నుండి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు
కోవూరు, మే 9:పట్టణంలో రైల్వేఫీడర్స్‌రోడ్డులో ఉన్న శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో శుక్రవారం నుండి ఈనెల 20వ తేదీ వరకు అమ్మవారి జన్మదినోత్సవాలు జరుగుతాయని ఆయల కమిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అమ్మవారికి ప్రతి రోజు ఉదయం పాలాభిషేకం, రాత్రి లలిత సహస్రనామపారాయణం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు విచ్చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు.
సిబిఐ కాంగ్రెస్ జేబు సంస్థ
ముత్తుకూరు, మే 9: సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అనే అర్ధం మారి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌గా మారిపోయిందని వైఎస్‌ఆర్‌సి సిఇసి సభ్యులు కాకాణి గోవర్దనరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం ముసునూరువారిపాళెంలో ప్రజాదీవెన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తును పరిశీలిస్తే 85వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణంలో సోనియా, మన్మోహన్ ప్రభుత్వాలు పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కుంభకోణంలో దుర్వినియోగమైన నిధుల్ని ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్‌గా రూపొందించుకోవచ్చన్నారు. బొగ్గు కుంభకోణ నివేదికను సిబిఐ సుప్రీమ్‌కోర్టుకు సమర్పించే ముందు యూపిఏ సర్కార్‌కు సమర్పించడం వల్ల వారికి నచ్చేవిధంగా మార్చుకున్నట్లు ఆరోపించారు. దీనినిబట్టి చూస్తే సిబిఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిందన్నారు. జగన్‌ను జైల్ నుంచి బయటకు రానీయకుండా రాజకీయ కుట్ర కొనసాగుతోందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సి నాయకులు పేర్నాట శ్యాంప్రసాద్‌రెడ్డి, మునుకూరు జనార్దనరెడ్డి, మునుకూరు రమణారెడ్డి, దువ్వూరు విజయభాస్కరరెడ్డి, వేనాటి శశిధరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాకాణికి ఈ సందర్భంగా ముసునూరువారిపాళెంలో ఘనస్వాగతం లభించింది.
డక్కిలి అటవీ ప్రాంతంలో
ఎర్రచందనం స్వాధీనం
వెంకటగిరి, మే 9: వెంకటగిరి అటవీశాఖ పరిధిలోని డక్కిలి మండలం కమ్మపల్లి సమీపంలో మినీలారీలో అక్రమంగా తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలను డక్కిలి నార్త్ డీఆర్‌వో వెంకటేశ్వరరావు గురువారం తెల్లవారుఝామున స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు గస్తీలో ఉన్న అటవీశాఖ సిబ్బందికి కమ్మ సమీపంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడ దాడులు నిర్వహించారు. అటవీశాఖ దాడులను గమనించిన స్మగ్లర్లు మినీలారీని వదలి పరారైనట్లు తెలిపారు. దీందో లారీని పరిశీలించగా అందులో 50 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి లారీని వెంకటగిరి రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో ఎఫ్‌బివో వెంకటేశ్వరరావు, ఏబివో శ్రీరామరాజు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు ఒకరు మృతి
చిల్లకూరు, మే 9: మండలంలోని బూధనం గ్రామానికి చెందిన పాలిచర్ల బాలయ్య (51) బుధవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. బాలయ్య తోటలో పనిచేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గూడురులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం గురువారం తమ గ్రామానికి తరలించగా అక్కడ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యుదాఘాతానికి గురై
కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు
బిట్రగుంట, మే 9: విజయవాడ డివిజన్ పరిధిలో బిట్రగుంట-అల్లూరు స్టేషన్ల మధ్య సిగ్నల్ వ్యవస్థ ఆధునీకరణ పనులు జరుగుతుండగా గురువారం ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 204/5 కిలోమీటరు వద్ద సిగ్నల్ పోల్ ఏర్పాటుచేస్తుండగా కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే 108కి సమాచారం అందచేయగా సిబ్బంది కావలి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడినవారు తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నక్కా అప్పన్న, భుషయ్య, లవరాజు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలకు చెందిన ఐనంపూడి శ్రీను, తలకాయల రామమూర్తిగా గుర్తించారు.
గిరిజన కాలనీలో తాగునీరు సరాఫరా
బిట్రగుంట, మే 9: మండల కేంద్రమైన బోగోలు పంచాయతీలో చెంచులక్ష్మీపురం గిరిజన కాలనీలో గురువారం రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ట్రస్టు సహకారంతో గిరిజనులకు తాగునీరు సరాఫరా జరగ్గా స్థానికులు ట్రస్టు అధినేత రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ప్రజాదీవెన కార్యక్రమంలో ఆయన పర్యటించగా సమస్యను మేకల శ్రీనివాసులు ఆయన దృష్టికి తీసుకురాగా స్థానికంగా వాడుకలో లేని బోరుకు మోటారు ఏర్పాటుచేయించారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు తూపిరి పెంచలయ్య, మేకల శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విఎల్‌ఎస్‌ఐ పాత్ర కీలకం
గూడూరు, మే 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విఎల్‌ఎస్‌ఐ కీలక పాత్ర పోషిస్తున్నదని గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్ అన్నారు. గురువారం కళాశాలలో ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో విఎల్‌ఎస్‌ఐ సర్య్కూట్ డిజైన్ యూజింగ్ క్యాడెన్స్ డిజైన్ టూల్స్ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్ బెంగళూరుకు చెందిన క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ సంస్థ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ క్యాడెన్ టూల్స్‌లో పరిశోధన చేసే వారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆనలాగ్ సర్య్కూట్ డిజైన్‌లో వివిధ సూచనలు, సలహాలను రిసోర్స్‌పర్సన్‌గా విచ్చేసిన దేబాషిష్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇతర ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో పాటు ఆదిశంకర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ ప్రిన్సిపాల్ ఆర్‌కె జ్ఞానమూర్తి, కె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
బిసిలకూ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలి
బిసి సంక్షేమ సంఘం డిమాండ్
గూడూరు, మే 9: రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టినట్టు, బిసిలకు కూడా సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం గమళ్లపాలెంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కందనూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బిసిలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో పురోగమించాలంటే ప్రత్యేక నిధులు ఎంతైనా అవసరమని, అందుకోసం బిసిలకు కూడా సబ్ ప్లాన్ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ చల్లా రమణయ్య మాట్లాడుతూ బిసిలకు సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభకు జిల్లాలోని బిసిలందరూ వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీ ఎంపిక కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు సంక్రాంతి జువ్వయ్య, ఉడతా శరత్ యాదవ్, గరిటి నారాయణ, ఓరేపల్లి అనిల్‌కుమార్, ఎల్‌వి సుబ్బయ్య, ఎంట్రపాటి మురార్జీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఏనోటా విన్నా కర్నాటక ఫలితాలపైనే చర్చ
గూడూరు, మే 9: కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బుధవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ఇక్కడ ఏ నోటా విన్నా, నలుగురు కూడిన చోటల్లా ఈ ఫలితాలపై ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడి ప్రభావం కర్నాటకలో చూపి ఈ ఎన్నికల్లో కూడా బిజెపి కర్నాటకలో అధికారంలోకి వస్తుందని ఆశించాం, కానీ ఇలా జరిగిందేమిటబ్బా అంటూ పలువురు ఆసక్తికరంగా చర్చించుకొంటున్నారు. కర్నాటకలో బిజెపి ఓడి పోవడానికి యడ్యూరప్ప కారణమని పలువురు రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానించుకొనడం జరిగింది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని గట్టి నమ్మకంతో ఉన్నాం, అయినా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పొరుగురాష్టమ్రైన మన రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలను ప్రవేశవ పెడుతూ పేద ప్రజల గుండెల్లో దూసుకొని పోతున్నాడని, ఈ తరుణంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ఢోకా ఉండదని వ్యాఖ్యానాలు చేసుకొన్నారు.
మహిళలపై దాడుల నివారణే లక్ష్యం : సిఐ
గూడూరు, మే 9: మహిళలు ఆపదలో ఉన్న సమయంలో వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసినట్టయితే సదరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సత్వర న్యాయం చేస్తారని, ప్రతి మహిళ 100 నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు టౌన్ సిఐ ఉప్పాల సత్యనారాయణ మహిళలకు సూచించారు. గురువారం స్థానిక సునీతా సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో మహిళలపై ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులు జరిగినపుడు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి విషయం తెలియచేస్తే ఆ ప్రదేశానికి సత్వరం తమ పోలీసులు చేరుకొని వారికి న్యాయం చేస్తారన్నారు. అలాగే ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. దేశంలోనే ప్రప్రధమంగా మన రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఈ పద్ధతిని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందని, మహిళలు మొదట తమపై జరిగే దాడులు, వేధింపులను ఎదుర్కొని తిప్పికొట్టగలమనే మానసికంగా సిద్ధపడాలని, ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు తెలియపరిస్తే చుట్టుపక్కల వారుకూడా కలసి దుండగులను శిక్షించే అవకాశం ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఎక్కడ అరాచకం కాని, ఈవ్‌టీజింగ్ జరుగుతున్నట్టు ఫోన్ ద్వారా తెలియచేసినట్టయితే అక్కడకు వచ్చి దుండగుల భరతం పడతానన్నారు. సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు, సారంగ సులక్ష్మి, ఎం వెంకటరమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత’
గూడూరు, మే 9: భూమిమీద జీవించే అన్ని జాతులు, జంతువులను, మొక్కలను పరిరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని గూడూరు లయోలా కళాశాల ప్రిన్సిపాల్ పంటా సురేష్‌రెడ్డి అన్నారు. గురువారం కళాశాలలో జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమం- కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ప్రాంతీయ వనరుల కేంద్రం స్నాప్ సహకారంతో ప్రజా అభ్యుదయ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు ఆధ్వర్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ జీవరాశులను కాపాడాలని కోరారు. ప్రజాభ్యుదయ సేవా సమితి కోఆర్డినేటర్ డి వంశీకృష్ణ మాట్లాడుతూ కళాశాలలు, పాఠశాలల్లో మొక్కలు నాటి ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. జీవారణ్యంలో ఏదైనా ఒక జాతి అంతరిస్తే దానిపై ఆధారపడిన మరో జాతి అంతరిస్తుందన్నారు. యునైటెడ్ హ్యాండ్స్ కార్యదర్శి యు శరత్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అడవులను నరికి వేయడం వలన కలిగే నష్టాలను తెలియచేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వి రాజా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుందన్నారు. మార్గదర్శి సేవా సంస్థ కార్యదర్శి ఎం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు, కళాశాల లెక్చరర్ కృష్ణప్రసాద్, కనుపూరు రాజా, దాసరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
మనుబోలు, మే 9: మండల పరిధిలోని ఉపాధి హామీ పనులపై ఆ పథకం జిల్లా పరిశీలకులు భక్తవత్సలం జట్లకొండూరు, చెర్లోపల్లి గ్రామాల్లో గురువారం సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, అవకతవకలకు చోటులేకుండా చూడాలన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఉపాధి హామీ కూలీలు తమకు 2012 డిసెంబర్‌లో చేసిన పనులకు కూలీలు చెల్లించలేదని అధికారులను నిలదీశారు. స్మార్ట్‌కార్టు కోఆర్డినేటర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినందున చెల్లించలేదని, దానిపై విచారణ నిర్వహిస్తున్నామని, అందువల్ల నిధులు చెల్లించలేదని ఎండివో హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌టి చంద్రశేఖర్, నరసింహులు, శ్రీనివాసులు, ఉమాదేవి, కార్యదర్శులు శ్రీనివాసులు, వేణుగోపాల నాయుడులు పాల్గొన్నారు.
తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ
‘అమ్మహస్తం’ వర్తింప చేయాలి
ఎమ్మెల్యే బల్లి డిమాండ్
వాకాడు, మే 9: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం తెల్లరేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదారులందరికీ వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన పంచాయతీ కార్యాలయంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి మండలంలో ఒక్కో చౌక దుకాణం ద్వారా కేవలం 50 మందికే ఆ పథకంలోని 9 రకాల వస్తువులను పంపిణీ చేయడం విచారకరమన్నారు. చౌక దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి అర్హత కలిగిన వారందరికీ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాకాడు మండలంలో 11458 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉండగా 1500మందికే ఆ పథకం వర్తింప చేయడం ఏమిటని తహశీల్దార్ వెంకటసునీల్‌ను ప్రశ్నించారు. లబ్ధిదారులకు అవసరమైన వస్తువులనే అందచేసే విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండివో వెంకటేశ్వర్లు, డిటి వెంకటేశ్వర్లురెడ్డి, విఆర్‌ఓ జనార్ధన్, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, టిడిపి నాయకులు మదురెడ్డి, కృష్ణమూర్తి, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ధ్యాన, యోగా శిక్షణా శిబిరం
గూడూరు, మే 9: గూడూరు రెండో పట్టణ పరిదిలోని మాళవ్యానగర్ మహలక్ష్మమ్మ గుడి ఎదురుగా గల రాజాస్ యోగా జిమ్ సెంటర్‌లో ఉచిత యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. యోగాతో పాటు సాయంత్రం కరాటే, స్కేటింగ్, మిమిక్రీ తరగతులను ఆసక్తి గల వారికి ఉచితంగా వేసవి సెలవుల దృష్ట్యా అందిస్తున్నట్టు నిర్వాహకులు, యోగా మాస్టర్ కట్టా మురళీకృష్ణ తెలిపారు. యోగా వలన వత్తిడి తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా వికాసం కలుగుతుందని, ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించుకొని యోగా, వ్యాయామం వంటివి చేస్తే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు.
అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పరిశీలన
గూడూరు, మే 9: గూడూరులో నిర్మించనున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. రెండో పట్టణంలోని ఎస్‌కెఆర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 50 సెంట్ల భూమిని ఇందుకోసం కేటాయించేందుకు పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూళ్లూరుపేటకు వచ్చిన సమయంలో గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్య ఇక్కడ అంబేద్కర్ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయమని కోరగా, వెంటనే సిఎం ఇక్కడ భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జెసి స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట మండల తహశీల్దార్ వై మైత్రేయ, విఆర్‌ఓ రమణయ్య తదితరులు ఉన్నారు.