నిజామాబాద్, మే 9: ముఖ్యమంత్రి పర్యటన విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బోధన్ నియోజకవర్గ కేంద్రంలోనే సిఎం టూర్ ఖరారయ్యేలా పావులు కదపడంలో కృతకృత్యులయ్యారు. ఈ నెల 13వ తేదీన బోధన్‌లో నిర్వహించనున్న రైతు సదస్సులో పాల్గొనేందుకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నట్టు ముఖ్యమంత్రి పేషీ నుండి అధికారికంగా సమాచారం అందడంతో అధికార యంత్రాంగం యావత్తు ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమైంది. ఇప్పటికే కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఆయా శాఖల అధికారులతో సమావేశమై సిఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గురువారం ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బోధన్‌ను సందర్శించి సిఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం ఆయా శాఖల అధికారులు, తన ముఖ్య అనుచరులతో సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తవానికి గత ఏప్రిల్ మాసంలోనే ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల మూడు పర్యాయాలు సిఎం పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. ఇందిరమ్మ కలలు సదస్సులో పాల్గొనేందుకు ఏప్రిల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభలో పాల్గొంటారని జిల్లా యంత్రాంగానికి సిఎం పేషీ నుండి సమాచారం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని బోధన్‌లో నిర్వహించాలని చివరి నిమిషంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి తలపోశారు. అమాత్యుల వారి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికారులు సైతం బోధన్‌లో సిఎం పర్యటించేలా ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సిఎం పర్యటన వాయిదాపడినట్టు చివరి నిమిషంలో సమాచారం అందడం ఉసూరుమన్పించింది. అనంతరం అమ్మహస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా సిఎంకు జిల్లా నేతల నుండి పోటాపోటీగా ఆహ్వానాలు వెళ్లాయి. ఓ వైపు మంత్రి సుదర్శన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని కోరగా, మరోవైపు ప్రముఖ మైనార్టీ నేత, ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన మహ్మద్ షబ్బీర్‌అలీ కూడా కామారెడ్డిలో పర్యటించాలని ఒత్తిడి తెచ్చారు. సందట్లో సడేమియా అన్న చందంగా ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో కానీ, పక్కనే ఉన్న ఆర్మూర్ సెగ్మెంట్‌లో పర్యటించాలని కోరారు. ఇలా నేతలు ఎవరికివారు సిఎం పర్యటన తమ ప్రాంతంలోనే జరగాలని పట్టుబట్టడంతో వరుసగా మూడు పర్యాయాలు వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంలో సఫలీకృతులయ్యారు. బోధన్‌లో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న రైతు సదస్సులో సిఎం పాల్గొనేలా పర్యటనను అధికారికంగా ఖరారు చేయించారు. నిజానికి ఈ రైతు సదస్సులను రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించాల్సి ఉండడంతో ఇదివరకే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 9వ తేదీన నిజామాబాద్‌లో, 11వ తేదీన బోధన్‌లో, 13వ తేదీన కామారెడ్డిలో రైతు సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే బోధన్‌లో పర్యటించేందుకు సిఎం సుముఖత వ్యక్తం చేయడంతో రైతు సదస్సుల ప్రణాళికలో మార్పులు చేర్పులు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల వారీగా నిర్వహించాల్సిన సదస్సులను సైతం బోధన్‌కే పరిమితం చేస్తూ 13వ తేదీన ఒకేచోట అట్టహాసంగా రైతు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో రైతులను సమీకరించేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. దాదాపు 10 వేల మంది రైతులను తరలించేందుకు వీలుగా ఆయా మండలాలకు వాహనాలను సమకూరుస్తున్నారు. సిఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంత్రి సుదర్శన్‌రెడ్డి స్థానికంగానే మకాం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రైతు చైతన్య సదస్సుకు ఇరవై వేల మంది
మంత్రి సుదర్శన్‌రెడ్డి
బోధన్, మే 9: బోధన్‌లో ఈ నెల 13న జరుగనున్న రైతు చైతన్య సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇరిగేషన్ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ముఖ్యమంత్రి రైతులతో గడుపుతారని అన్నారు. రైతుల సమస్యలు అడిగి తెల్సుకోవడమే కాకుండా యంత్రలక్ష్మి పథకం క్రింద రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందచేస్తారని పేర్కొన్నారు. ఇక్కడ నలభై ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఇందులో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఉద్యాన వనశాఖలకు సంబంధించిన ప్రదర్శనలు ఇందులో ఉంటాయన్నారు. అలాగే మహిళలకు బ్యాంకు లింకేజీలకు సంబంధించి 24 కోట్ల చెక్కులను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. డివిజన్ నుండి ఇరవై వేల మంది రైతులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బాన్సువాడ, బిచ్కుంద రోడ్డు అభివృద్ధి కోసం ఇరవై కోట్లు మంజూరు చేశారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సభలో స్పష్టం చేస్తారని చెప్పారు. అలాగే బోధన్ నియోజకవర్గానికి రూరల్ వాటర్ సప్లయ్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వీటి ద్వారా చేపట్టబోయే పనులు కూడా ముఖ్యమంత్రి సభలో ప్రకటిస్తామన్నారు. ముఖ్యమంత్రి సభకు పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీత లక్ష్మారెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మినారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ముఖేష్‌గౌడ్ హాజరు కానున్నారని మంత్రి వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ గంగాశంకర్, సిడిసి చైర్మన్ పోతారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేందర్‌రెడ్డి, గణపతిరెడ్డి, గౌసోద్దీన్, గుణప్రసాద్, సత్యం, దామోదర్, ఆదినారాయణ, నక్కలింగారెడ్డి పాల్గొన్నారు.
సిఎం జిల్లా పర్యటన షెడ్యూల్
నిజామాబాద్, మే 9: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు సిఎం కార్యాలయం నుండి కలెక్టర్‌కు గురువారం సమాచారం అందించారు. దీంతో అధికారులు సిఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో సిఎం పర్యటన ఖరారు అయినప్పటికీ పలు మార్లు వాయిదా పడిన విషయం విధితమే. ఇందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన జరుగాల్సిన సిఎం పర్యటన పలు అనుమానాలకు దారి తీసింది. గతంలో మాదిరిగా ఈ పర్యటన సైతం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సర్వత్రా భావించారు. కానీ సిఎం పర్యటన షెడ్యూల్ ఖరారు చేస్తూ అధికారికంగా వెల్లడి కావడంతో అనుమానాలకు తెర తొలగిపొయినట్లే. సిఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీ ఉదయం 10గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయం నుండి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారులో బయల్దేరుతారు. అక్కడి నుండి 10.15నిమిషాలకు హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 11గంటలకు బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడే జిల్లా అధికారులు, అనధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 11.15నిమిషాలకు కళాశాల నుండి రోడ్డు గుండా బయల్దేరి బోధన్‌లోని విజయమేరి ఉన్నత పాఠశాలకు చేరుకుని అక్కడ రైతు సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2.40 నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకుని 2.45 నిమిషాలకు హైదరాబాద్ బయల్ధేరి వెళ్తారు. ఈ మేరకు బోధన్‌లో సభా వేదికకు అవసరమైన స్థలాన్ని మంత్రి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పరిశీలించారు.
ధాన్యం సేకరణలో ప్రైవేటు వ్యాపారులదే హవా
వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్, మే 9: ప్రస్తుత రబీ సీజన్‌లో వరి పంట సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ధాన్యం సేకరణలో ప్రైవేట్ వ్యాపారులదే పై చేయిగా నిలుస్తోంది. ఇదివరకు ఐకెపి, సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో జిల్లాలో విరివిగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పేవారు. అయితే ప్రస్తుతం వరి విస్తీర్ణం తగ్గడం, అకాల వర్షాలు కురిసి దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట దెబ్బతినడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని కేవలం సొసైటీల ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఐకెపి సంఘాలకు మినహాయింపు కల్పించారు. మొదటి విడతలో 26 సొసైటీల ఆధ్వర్యంలో 35 కొనుగోలు కేంద్రాలను, రెండవ విడతగా మరో 31 సహకార సంఘాల ద్వారా 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తం 67 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. గతేడాది ఇదే సీజన్‌లో దాదాపు వంద వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే రైతులు కూడా అనేక కారణాల వల్ల కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించకుండా, తమ పంట ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారులు, రైస్‌మిల్లర్లకు విక్రయించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, సరైన గిట్టుబాటు ధర పొందాలని ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఎన్ని రకాలుగా సూచనలు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ, ఇంతవరకు వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం సేకరించలేదని తెలుస్తోంది. ఈసారి రబీలో జిల్లాలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అందులో సింహభాగం ఇప్పటికే వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సేకరించడంతో కొనుగోలు కేంద్రాలకు అంతంతమాత్రంగానే ధాన్యం నిల్వలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడు ధాన్యానికి 1280 రూపాయలు, సాధారణ రకానికి 1250 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా కోతలు ప్రారంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వ్యాపారులు మాత్రం అంతకుముందే గ్రామాల్లో పంట పొలాల్లోనే తూకం వేసి నేరుగా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే పనులకు శ్రీకారం చుట్టారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైన తర్వాత కూడా ప్రైవేట్ కొనుగోళ్ల ప్రక్రియ ధాటిగానే కొనసాగినట్టు స్పష్టమవుతోంది. పైగా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను కూడా రైతులు పొందలేకపోయారన్నది బహిరంగ రహస్యం. బయటి మార్కెట్‌లో వ్యాపారులు రైతులకు చెల్లించింది క్వింటాలుకు 1050 మొదలుకుని 1100 రూపాయలు మాత్రమే. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తర్వాత ఆ ధరను 1150 రూపాయల వరకు పెంచారు. అది కూడా ధాన్యం రకాన్ని బట్టి మాత్రమే చెల్లించారు. సరాసరిగా పరిశీలిస్తే క్వింటాలుకు రైతులకు అందింది 1100 రూపాయలు మాత్రమే. ఈ లెక్కన ఒక్క క్వింటాలుకు 150 రూపాయల వరకు రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష నిబంధనలు ఉండడం, తేమ శాతం పేరిట ఇబ్బందులకు గురి చేస్తుండడం వల్ల తాము ధాన్యాన్ని నేరుగా వ్యాపారులకు అమ్ముతున్నామని, కొనుగోలు కేంద్రాలు కోరినట్లుగా ఆరబెట్టి అమ్మినా, ధాన్యం బరువు తగ్గి వ్యాపారులు ఇచ్చిన ధరలే తమ చేతికి అందుతాయని రైతులు చెబుతున్నారు.
ఇంకా అందని చెక్కులు
ఇదిలాఉండగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఇప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. గతంలో అమ్మకాలు ముగిసిన పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సంబంధిత సొసైటీలకు చెక్కుల రూపంలో డబ్బులను విడుదల చేసేది. నేరుగా సొసైటీ ద్వారా రైతులకు డబ్బులు అందేవి. ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి చెబుతూ, రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బిల్లులను నేరుగా ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సొసైటీలు రైతులకు సంబంధించిన ఖాతాల వివరాలను ఒక్కో రైతు వారీగా ప్రభుత్వానికి పంపించేందుకు అపసోపాలు పడుతున్నారు. దీనివల్ల బ్యాంకులు తాము చెల్లించాల్సిన బకాయిలను ఎక్కడ మినహాయించుకుంటాయోనని బెంగపెట్టుకున్న పలువురు రైతులు, బ్యాంకులో తమకు ఖాతాలు లేవంటూ వివరాలు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి జానారెడ్డి
కామారెడ్డి, సదాశివనగర్, మే 9: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని మర్కల్ గ్రామ శివారులో గల మల్లన్న గుట్ట ఆవరణలో డా.బి.ఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పథకం చేపడుతున్న గోదావరి జలాల పనులను ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విఫ్ ఈరవత్రి అనిల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాగునీటికి సంబంధించి ఫిల్టర్ బెడ్ నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తి అయితే జిల్లాలోని 211గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా అవుతోందన్నారు. షబ్బీర్‌అలీకి ఎమ్మెల్సీ పదవి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. 1.40 కోట్ల రూపాయలు ఈ పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అదనంగా 60 కోట్లు నిధులు మంజూరు చేయడం జరుగుతోందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, కామారెడ్డి డివిజన్ ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసని, ఈ ప్రాంత ప్రజల కోసం గోదావరి జలాల పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. సదాశివనగర్, మాచారెడ్డి, తాడ్వాయి, కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు మండలాలకు గోదావరి జలాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ జిల్లాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, విఫ్ ఈరవత్రి అనిల్‌ను కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులు శాలువలు కప్పి పూలమాలలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చక్రపాణి, సిఇ బాబురావు, ఎస్‌ఐ ఇంద్రసేన, ఇఇ మూర్తి, డిఇ వెంకట్‌రావు, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనెజర్ శ్రీనివాస్, డిసిసిబి వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల రాజిరెడ్డి, కైలాస్ శ్రీనివాస్‌రావు, జమునరాథోడ్, పండ్ల రాజు, బద్దెం శ్రీనివాస్‌రెడ్డి, నల్లవెళ్లి అశోక్, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పథకాలు
* ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్
నందిపేట, మే 9: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ముందుకు కొనసాగుతాయని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత అర్గుల్ రాజారాం విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో 5లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ధాన్యం గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ సమైక్యత, అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి పదవులను చేపట్టి గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెదులుకున్నాడని, రాజారాం తన రాజకీయ గురువని, ఆయనను స్ఫూర్తిగా తీసుకునే రాజకీయాల్లో రాష్టస్థ్రాయికి ఎదిగానని అన్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డితో పాటు తనను ప్రజలు ఓడించినప్పటికీ, వారికి సేవ చేయడం మరిచిపోలేమని, ప్రజా సేవయే తమ జీవిత లక్ష్యమన్నారు. 2004ఎన్నికల్లో సోనియాగాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగానే నేడు ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, టిడిపి హయాంలో నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాను 20ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా తాగు, సాగునీరు, రోడ్ల వంటి వౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, సురేష్‌రెడ్డిలకు చిందు కళాకారులు నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ గంగాధర్‌రావుపట్వారీ, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, నాయకులు నరాల రత్నాకర్, సుదర్శన్, హరిదాస్, హన్మాండ్లు, నర్సాగౌడ్, జగత్‌రెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.
ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు
* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి
బోధన్ రూరల్, మే 9: ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. గురువారం బోధన్‌లో యువమోర్చా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజులలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతుందన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత ఒక్క బిజెపికే దక్కుతుందన్నారు. ఆ రాష్ట్రాలలో ఎటువంటి ఆత్మహత్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల అభీష్టం మేరకు ఆర్టికల్ మూడు ప్రకారం తమ సర్కారు ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వైయస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీల వైఖరుల వల్లనే తెలంగాణలో అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఆ పార్టీలకు జతకట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మరోమారు మోసం చేసేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. బిజెపి కార్యకర్తలు గ్రామ గ్రామాన తమ పార్టీ సిద్దాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలలో బిజెపి అధికారంలోనికి వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నర్సింహారెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్, సుభాష్, పట్టణాద్యక్షుడు రామరాజు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌చారి, వెంకటక్రిష్ణ, హరికృష్ణ, గోపికిషన్, దామోదర్, వెన్న శంకర్, జనార్ధన్‌చారి, దిగంబర్, హన్మాండ్లు చారి, శివరాజ్, ధర్మపురి, కోటేశ్వర్‌రావ్, మల్లారం దత్తు పాల్గొన్నారు.
తాగునీటి కోసం రాస్తారోకో
బాన్సువాడ, మే 9: బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను నివారించాలని మహిళలు గురువారం బాన్సువాడ - కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గత ఏప్రిల్ మాసం నుండి బోర్లంక్యాంప్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీకి, నాయకులకు సంబంధం లేకుండా రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన చాటారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో సుమారు రెండు మాసాలుగా తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోర్లంక్యాంప్‌లో నెలక్నొ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్లంక్యాంప్ మహిళలు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 9: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం చింతకుంట మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలీసు శాఖలో చిరు ఉద్యోగి అయిన చింతకుంట మోహన్ యువత ఉత్సాహాన్ని గుర్తించి క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు పలు సేవా కార్యాక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాలకు సంబంధించిన 32జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, వారం రోజుల పాటు క్రికెట్ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్‌లో గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ సిఐ ప్రకాష్‌యాదవ్, పట్టణ సిఐ భాస్కర్, టిఆర్‌ఎస్ నాయకులు వై.కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, కొత్తకొండ భాస్కర్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులు సమాజాన్ని అధ్యయనం చేయాలి
ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.డి వలీ ఉల్లాఖాద్రీ
కామారెడ్డి , మే 9: ప్రస్తుత పరిస్థితులో విద్యార్థులు సమాజంలోని అసమానతలను, పరిస్థితులను మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.డి వలీ ఉల్లాఖాద్రి పిలుపు నిచ్చారు. గురువారం మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌లో జరిగిన ఎఐఎస్‌ఎఫ్ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకుల వైపు పరుగులు తీస్తు మానసిక ఒత్తిడికి గురవుతూ మానసిక ఉల్లాసాన్ని కొల్పోతూ, చిన్న విషయాలలో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అందువలన దేశంలోని విద్యార్థులు, యువకుల ఆలోచన శక్తి అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో ఎఐఎస్‌ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టిటిఎఫ్ జిల్లా కార్యదర్శి దానయ్య మాట్లాడుతూ,విద్యారంగం కొరకు ఎన్ని కమిషన్‌లు వేసిన ఇంకా విద్యారంగం మారలేదన్నారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యానికేతన్ కరస్పాండెంట్ ఆనంద్‌రావు, సిపిఐ డివిజన్ కార్యదర్శి బాల్‌రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వి.ఎల్ నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.