Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఫ్లోరైడ్ రక్కసి

$
0
0

కందుకూరు, మే 9: గారపట్టిన పళ్లు, వంకర్లు తిరిగిన కాళ్లు, 30ఏళ్లకే ముసలితనం, ఎముకలు బిగుసుకుపోయి నడవలేక మంచం పట్టే దయనీయ జీవనం జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో గుండెలను పిండేసే దృశ్యాలివి. ఆకాశంవైపు చూడాలన్నా, నింగిలో రయ్ అని ఎగిరే విమానాన్ని వీక్షించాలన్నా, ఆరుబయట మంచంవేసుకుని దానిమీద వెల్లికిలా పండుకొని చూసే పరిస్థితి వీరికి ఉండదు. ఫ్లోరోసిస్ ప్రభావానికి మూత్రపిండాలు పాడై, కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఎందరో మృత్యువాతపడే దుస్థితి. ఒకప్పుడు ప్రకాశం జిల్లాను గడగడలాడించిన ఈసమస్యకు దశాబ్దాలు గడుస్తున్నా నేటికి తెర పడటంలేదు. జిల్లా ప్రజలను విషజ్వరాల ప్రభావం నేటికి వణికిస్తూనే ఉంది. ఇక్కడి జిల్లాలో ఫ్లోరైడ్‌తోపాటు స్టాన్సియం, బెరీలియం, ఆర్నెక్, క్రోమియం, కాడియం లాంటి ప్రమాదకర మూలకాలశాతం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈవిష జలాలు తాగి శరీరం శూక్షింమించుకుపోయి యుక్తవయస్సులోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తూ నరకం చూస్తున్నారు. ఇలాంటివారు జిల్లాలో వేలాదిమంది ఉన్నారు. ఈజలాలు తాగి మూత్రపిండాలు పాడై, కేన్సర్ బారిన పడి జిల్లా వ్యాప్తంగా గత 12ఏళ్లలో వెయ్యి మంది వరకు మృత్యువాత పడితే, 20వేలకుపైగా ప్రాణాంతక వ్యాధులతో ప్రస్తుతం బాధపడుతుండడం గమనర్హం. దంత సంబంధిత, ఫ్లోరోసిస్ దేశంలోనే తొలిసారిగా గుర్తించింది 1937లో అయితే, మన ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి, పొదిలి ప్రాంతాలలో ఫ్లోరైడ్ అప్పటి నుంచే ఉంది. అయినా ఇప్పటికి కూడా ఫ్లోరైడ్‌బూతం ఆప్రాంతాలను వదల్లేదు. దానిని పారద్రోలి ప్రజలకు రక్షిత నీటిని అందించే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉన్నారు. జిల్లాలో ఇంకా 195గ్రామాలలో ఈసమస్య కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే, అందులో 35్ఫ్లరైడ్ మండలాలుగా ప్రభుత్వమే గుర్తించింది. అలాగే 16వేల మంది ఫ్లోరైడ్ వ్యాధిబారిన పడి దంతసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, 2001మంది ఎముకల వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితితో 2వేల మంది బాధపడుతున్నారని జిల్లాలో 35మండలాల్లో ఇటీవల ఆయా మండల వైద్యులు, అక్కడి వైద్యసిబ్బంది 106్ఫ్లరైడ్ పీడిత ప్రాంతాలలో ఇంటింటి సర్వేజరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లీటరు నీటిలో 1.5మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరిన్ ఉండరాదు. కాని జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో 8నుంచి 11మిల్లీ గ్రాములు ఉండడం గమనర్హం. జిల్లాలో 25,700పైగా తాగునీటి బోర్లు ఉంటే అందులో సుమారు 4వేల బోర్లలో ఫ్లోరైడ్‌శాతం ఉంది.
పీడిత జాబితాలో 35మండలాలు
జిల్లాలో కనిగిరి, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల, పామూరు, పిసిపల్లి, కురిచేడు, త్రిపురాంతకం, దర్శి, మార్కాపురం, పెదారవీడు, గిద్దలూరు, పుల్లలచెరువు, కంభం, మార్టూరు, సంతమాగులూరు, పొన్నలూరు, దొనకొండ, యర్రగొండపాలెం, కొనకొలమెట్ల తదితర మండలాల్లో ఫ్లోరైడ్‌తోపాటు, మెగ్నీషియం, నైట్రేట్‌లు, క్యాల్షియం వంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలిసింది. అధికారుల అలసత్వం కారణంగా రక్షిత జలాలకు బదులు ఫ్లోరైడ్ నీటితో గొంతు తడుపుకుంటున్నారు. కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలు నిర్మిస్తున్నారు. వాటి నిర్మాణంలో రాజ్యమేలుతున్న అవినీతి కారణంగా కొద్దిరోజులకే మూలన పడుతున్నాయి. మరికొన్ని పథకాలు ప్రారంభమైనా నెలరోజులకే నీరు చేరక పైపులైన్లు దెబ్బతింటున్నాయి. గ్రామాలలో తాగునీటి పథకాలకు ప్రభుత్వం ఏటా సగటున కోట్లు కేటాయిస్తుంది. 2012-13లో 102కోట్లు రాగా, 80కోట్లు మంచినీటి పథకాల మరమ్మతులకే ఖర్చు చేశారు. గడచిన నాలుగేళ్లను పరిశీలిస్తే 480కోట్ల రూపాయలకు పైగా నిధులు వేర్వేరు ఖర్చుల కింద ఖర్చు చేశారు. ఇందులో 60శాతం వరకు నిర్వహణకే ఖర్చు చేశారు. అయినాగాని బూతం జిల్లాని వదిలిపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన జిల్లాలో ఫ్లోరైడ్ శాతాన్ని తరిమికొట్టాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతుంది.

ఘరానా దొంగ అరెస్టు
ఒంగోలు, మే 9: ఎటిఎంలలో డబ్బులు దొంగిలించే ఘరానా దొంగను అరెస్టు చేసి అతడి నుండి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉరుటూరు గ్రామానికి చెందిన మర్రెడ్డి రామకృష్ణారెడ్డి (24) ఎటిఎంలలో డబ్బులు దొంగిలించినట్లు సమాచారం అందిందన్నారు. దీనిపై డిఎస్‌పి ఎం రజనీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో శింగరాయకొండ సిఐ టి అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ రమణయ్య వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం 7 గంటలకు సూరారెడ్డిపాలెం జంక్షన్‌లో రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసినట్లు ఎస్‌పి తెలిపారు. టంగుటూరులోని కొండేపి రోడ్డులో ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో 2013 మార్చి 16న 16.50 లక్షలు నగదు ఎటిఎంలో నింపినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి సదరు ఎటిఎం పని చేయనట్లు, ఈక్రమంలో తమ సంస్థకు చెందిన బ్రాంచి ఇన్‌చార్జి వెళ్ళి ఎటిఎంను తనిఖీ చేసినట్లు తరువాత ఇంజనీరు వచ్చి కూడా ఎటిఎంను తనిఖీ చేయగా అప్పుడు ఆ సమయంలో ఏటిఎంలో నగదు షార్ట్‌సర్క్యూట్ వల్ల కాలిపోయినట్లు కనుగొన్నట్లు తెలిపారు. ఆ తరువాత 2013 ఏప్రిల్ 24న బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్ సర్వేయర్లు తనిఖీ చేయగా వారి తనిఖీలో అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దొంగతనమేనని తెలుసుకున్నట్లు తెలిపారు. 2013 మే 1న ఎటిఎంలో డబ్బు నింపే సంస్థ అయిన సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ప్రైవేట్ ) లిమిడెట్ ఒంగోలు బ్రాంచి ఇన్‌చార్జి ఎంకెకె దుర్గారావు, టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయన్నారు. నిందితుడు బికాం వరకు చదువుకొని సైంటిఫిక్ సెక్యూరిటీ సర్వీసెస్ నందు పని చేస్తూ ఎటిఎంలలో డబ్బు నింపుతుండేవాడని తెలిపారు. మద్దిపాడు, ఒంగోలు, టంగుటూరు ఎటిఎంలలో డబ్బు నింపేవాడని తెలిపారు. నిందితుడు తాగుడు, జూదం, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బు కోసం ఎటిఎంలలోనే దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం కలిగి టంగుటూరు ఎస్‌బిఐ ఎటిఎంనందు తనతోపాటు పనిచేసే రమణయ్య నుండి పాస్‌వర్డ్ తెలుసుకున్నాడని పేర్కొన్నారు. మార్చి 18న ఉదయం 5.30 గంటల సమయంలో టంగుటూరు ఎటిఎంకు వెళ్ళి పాస్‌వర్డ్ సహాయంతో మిషన్ తెరిచి అందులో ఉన్న 16.50 లక్షలలో 13.50 లక్షలు తీసుకొని మిగిలిన మూడు లక్షలు ఎవరికీ అనుమానం రాకుండా షార్ట్‌సర్క్యూట్ జరిగినట్లు చిత్రీకరించేందుకు 3 లక్షలు తగులబెట్టినట్లు తెలిపారు. దొంగిలించిన సొమ్ముతో జల్సాలకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. మడనూరు శ్రీను దగ్గరకు వెళ్ళేందుకు సూరారెడ్డిపాలెం జంక్షన్‌లో బస్సు దిగిన రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తరువాత ఒంగోలులోని బొల్లినేని సుబ్బయ్య వద్ద గల 7 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్దనుండి మొత్తం 10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన శింగరాయకొండ సిఐ అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ వై రమణయ్య, హెడ్‌కానిస్టేబుళ్ళు అంబేద్కర్ , పి వెంకట్రావు, కానిస్టేబుళ్ళు వై చంద్రశేఖర్ , రవిరాజు, ఎం బాలచంద్ర, పూర్ణచంద్రరావు, హోంగార్డులు రమణ, సాబీద్ డ్రైవర్ శివలను జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి అభినందించారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి రజనీకాంత్‌రెడ్డి, శింగరాయకొండ సిఐ అశోక్‌వర్థన్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమప్రాంత రైతులపై అధికారుల వివక్ష
* రైతు సదస్సులో ఎమ్మెల్యే కందుల ధ్వజం
మార్కాపురం , మే 9: పశ్చిమప్రాంత రైతులపై అధికారులు వివక్ష చూపుతున్న కారణంగా ఏ ప్రభుత్వ పథకం రైతులకు సక్రమంగా అందడం లేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జడ్పి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన మార్కాపురం, కందుకూరు డివిజన్‌స్థాయి రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పశ్చిమప్రాంత రైతులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి జీవిస్తున్నారని, అధికారుల దయాదాక్షన్యాలు వీరిపై లేకపోవడంతో బిక్కచిక్కి చావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం రైతులకు 9గంటల విద్యుత్ అందిస్తామని చెప్పి 7 గంటలకు కుదించారని, తిరిగి 5గంటలు మాత్రమే అని చెబుతూ కనీసం 2గంటలు కూడా ఇవ్వకుండా రైతుల ఉసురుపోసుకుంటోందని ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే కందుల ధ్వజమెత్తారు. పశ్చిమప్రాంతంమైన మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎలాంటి ఫ్యాక్టరీలు లేవని, మార్కాపురంలో ఉన్న ఒక్కగానొక పలకల పరిశ్రమ కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడిందని, ఉన్న ఆధారం వ్యవసాయమేనని అన్నారు. ఇప్పటికే విద్యుత్ సంక్షోభం, వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాలకుగ్రామాలు వలసలు వెళ్ళాయని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప పశ్చిమప్రాంత రైతులు పచ్చగా ఉండరని, యుద్ధ ప్రాతిపదికన ఫారెస్టు క్లియరెన్స్ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక ఇన్‌చార్జి మంత్రి ఉన్నప్పటికీ పశ్చిమప్రాంత రైతుల గోడు వినేందుకు ఏ ఒక్కరూ రైతు సదస్సుకు హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంత రైతులపై వివక్ష ఎలాంటిదో అర్ధం అవుతుందన్నారు. పోరంబోకు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, కౌలురైతులకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా మార్కాపురం ఉందని, మార్కాపురం నియోజకవర్గ గ్రామాలకు సాగర్‌జలాలను నిరంతరం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న చేయూతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారిన ఆధునిక విధానాలను బట్టి వ్యవసాయాన్ని మార్చుకొని అధిక దిగుబడులతో లాభాలు గడించాలన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కృషి ఏఒక్కరిది కాదని, ఉభయ కమ్యూనిస్టుల స్ఫూర్తి, ఎన్టీఆర్ ఆశయం, వైఎస్‌ఆర్ లక్ష్యసాధనతో వెలుగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. కరెంటు కష్టాలకు చెక్ పెట్టేందుకు జిల్లాలో కోట్లాది రూపాయల ఖర్చుతో సోలార్ సబ్‌స్టేషన్లను నిర్మించడం జరుగుతుందని, తద్వారా విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే మార్గం ఉందన్నారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకొని రైతుచైతన్యయాత్రల స్ఫూర్తితో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మాట్లాడుతూ రైతులకు 7గంటల విద్యుత్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా విద్యుత్ అధిక వినియోగం కారణంగా 5గంటలకు కుదించడం జరిగిందన్నారు. నిరంతరంగా పగటిపూట రైతులకు 5గంటల పాటు కరెంటు ఇచ్చేందుకు ప్రక్రియ పూర్తి చేశామని, మరో వారంరోజుల్లో 5గంటల నిరంతర కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న కొండపోరంబోకు, ఇతరత్రా భూములను పేదలకు పట్టాలుగా ఇస్తామని హామీ ఇచ్చారు. చెట్టు-పట్టా అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా భూమి లేని పేదలకు ఆదుకుంటామన్నారు. తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారాల కోసం వీలైనంతవరకు కృషి చేస్తున్నామన్నారు. సదస్సు నిర్వాహణ ప్రాంగణంలోగల వ్యవసాయశాఖ స్టాల్స్‌ను రైతులు పరిశీలించి నూతన పరికరాల గురించి అవగాహన పెంచుకోవాలని, పంట దిగుబడి, రాబడి సూత్రాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను పండించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయశాఖ పరిశోధకులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఆహ్వాన ఆర్భాటమే తప్ప.. హాజరు నామమాత్రం
* రైతు సమస్యలపై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
మార్కాపురం, మే 9: మార్కాపురం, కందుకూరు డివిజన్ల పరిధిలో జరిగే రైతు సదస్సుకు కేంద్ర మంత్రి నుంచి జిల్లా సహకార సొసైటీ చైర్మన్ వరకు ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రాలను తయారు చేసి పంపిణీ చేశారు. అయితే గురువారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన రైతు సదస్సుకు మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు మినహా మరెవరూ రాకపోవడం విశేషం. ఈ సదస్సును చూసిన వారికెవరికైనా ప్రజాప్రతినిధులకు రైతు సమస్యలపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే అర్ధం అవుతుంది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, రాష్టమ్రంత్రులు సాకే శైలజనాథ్, మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు, ఒంగోలు ఎంపిలు, ఎంఎల్‌సిలు పోతుల రామారావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసులరెడ్డి, జూపుడి ప్రభాకరరావులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు బీరం వెంకటేశ్వరరెడ్డిలు వస్తున్నట్లు ఆహ్వానపత్రంలో ప్రకటించారు. అయితే ఈ సదస్సుకు కేవలం మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, అన్నా రాంబాబు మాత్రమే హాజరు కావడంతో సభకు వచ్చిన ప్రతి రైతు ఆహ్వానపత్రం చూసి, హాజరైన ప్రజాప్రతినిధులను చూసి ఇదేనా వారికి రైతులపై ఉన్న ప్రేమ అంటూ విమర్శలు గుప్పించారు. రైతు విమర్శలు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో ఏమి చెప్పాలో అర్ధంకాని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నందున హాజరు కాలేకపోయారని సమర్ధించుకుంటూ రైతులకు సమాధానం ఇచ్చారు . కాగా ఈ రైతు సదస్సుకు కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలోని 19 మండలాల నుంచి సుమారు 50వేల మంది హాజరవుతారని అధికారులు భావించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు కరవు పనుల దృష్ట్యా 10శాతం కూడా హాజరుకాకపోవడం విశేషం. ఇకపై అయినా అధికారులు ఆర్భాటపు ఆహ్వాన పత్రాలు వేయకుండా తగుజాగ్రత్తలు చేపట్టాలని జిల్లాలో ఏకైక ప్రతిపక్ష శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అధికారులకు హితవుపలికారు.

రైతు సదస్సులో చిటపటలు..
మార్కాపురం టౌన్, మే 9: స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మార్కాపురం, కందుకూరు డివిజన్‌స్థాయి రైతు సదస్సులో రైతులకు, అధికారులకు మధ్య కొన్ని చమత్కార, వెటకార, సందిగ్నతతో కూడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో సదస్సు ప్రాంగణం నవ్వులు విరిసి కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు ఆక్రోశ ఘటనలు చోటుచేసుకొని చిటపటలాడాయి.
* విద్యుత్‌శాఖ ఎడి రఘురాం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ అవసరార్ధం 5గంటలపాటు విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పగా ఒక రైతు లేచి మీరు ప్రయత్నిస్తూనే ఉండండి..! మేము ఇక్కడ చస్తున్నామని కేకలు వేయడంతో సభాప్రాంగణం నవ్వులతో గొల్లుమంది. ఇంతలో మరోరైతు లేచి 5గంటలపాటు విద్యుత్ ఎక్కడ..? ఎవరికి..? ఏ సబ్‌స్టేషన్ పరిధిలో ఇస్తున్నారు..? ఏ రైతు ఆ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారో..? ఇప్పుడే చెప్పాలంటూ ఎడిని నిలదీశారు. దీనితో రైతులందరూ వేదికవద్దకు దూసుకువచ్చి సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకొని నిరంతరంగా విద్యుత్ ఇవ్వాలని కోరారు.
* మత్స్యశాఖ అధికారి ప్రసంగిస్తూ చేపల పెంపకం, వాటి రకాల గురించి వివరిస్తుండగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జోక్యం చేసుకొని పశ్చిమ ప్రాంతంలో తాగేందుకే నీరు సరిగా లేదు, ఇక చేపల పెంపకం ఎక్కడా..? అని అంటూ ఉపయోగపడే మాటలు చెప్పండి అన్నారు. దీనితో సభలో మళ్ళీ నవ్వులు విరిశాయి.
* బేస్తవారపేట మండలంలో నష్టపోయిన దనియాల పంట రైతులు తమకు పరిహారం నేటికీ ఇవ్వలేదు, కారణమేమిటని జిల్లావ్యవసాయ అధికారిని ఓ రైతు ప్రశ్నించగా కార్యాలయం వద్దకు వస్తే వివరాలు చెబుతానని ఆ అధికారి సమాధానం చెప్పడంతో, మళ్ళీ సంవత్సరానికి గానీ మీరు దొరకరు విషయం ఇప్పుడే తేల్చండంటూ ముక్తకంఠంతో రైతులు పట్టుబట్టడం ఔరా..! అని పించింది.
* వడ్డీలేని పంట రుణాలకు బ్యాంకర్లు సహకరించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వేదికపైనే అధికారులతో కలెక్టర్ చర్చ జరిపి రైతులను సముదాయించడం జరిగింది.
* లైలా తుఫాన్‌లో నష్టపోయిన మిర్చి, పత్తి, బత్తాయి పంటల పరిహారం కోసం వేదిక వద్ద రైతులు ఆందోళన చేయగా పోలీసులు వారికి నచ్చచెప్పి కూర్చోపెట్టారు.
* ఓ రైతు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పొడుగుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గీతాన్ని ఆలాపించడంతో సభకు హాజరైన రైతుసోదరులు ఈలలు వేస్తూ హర్షం వ్యక్తం చేయడం సభికులను ఆశ్చర్యపరచింది.

ఘోర రోడ్డుప్రమాదం కేసులో డ్రైవర్, క్లీనర్ అరెస్టు
ఒంగోలు, మే 9: ఇటీవల శింగరాయకొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్, క్లీనర్‌లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎస్‌పి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులైన డ్రైవర్, క్లీనర్‌లను పాత్రికేయుల ముందు హాజరుపరిచి అనంతరం విలేఖర్లతో జిల్లా ఎస్‌పి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన అప్పారి శ్రీను (36) అనే డ్రైవర్, కడలి శ్రీనువాసు అనే క్లీనర్ ఇద్దరూ కలిసి మద్యం సేవించి సిమెంట్ లారీని నడుపుతుండగా శింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదానికి గురైందన్నారు. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా నలుగురు గాయపడినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటలకు అద్దంకి పట్టణంలో 13 మంది చెన్నైలో జరిగే కూటములకు సేవ చేసుకునేందుకు పాండిచ్చేరి వెళుతున్న సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఎక్కారన్నారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న లారీడ్రైవర్, క్లీనర్ తాగి ఉండడాన్ని గమనించిన ప్రయాణీకులు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని చెప్పినప్పటికీ వినకుండా వేగంగా నడపడంతో కల్కివాయి గ్రామం వద్ద లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో లారీపై నిద్రిస్తున్న పది మంది సిమెంట్ బస్తాల కింద చిక్కుకొని మరణించినట్లు తెలిపారు. ఒంగోలులో ఎక్కిన ప్రయాణికుడి మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తించలేదన్నారు. గురువారం ఉదయం లారీడ్రైవర్, క్లీనర్ శింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. సదరు నిందితులను ఒంగోలు డిఎస్‌పి అరెస్టు చేశారని ఎస్‌పి తెలిపారు.

రెండు ఆటోలు బోల్తా:
పది మందికి గాయాలు
ముండ్లమూరు, మే 9: మండల కేంద్రమైన ముండ్లమూరులో రెండు ఆటోలు బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన గురువారం జరిగింది. వెల్లంపల్లి గ్రామానికి చెందిన కూలీలు తిమ్మాయిపాలెం వద్ద గల ఇటుకబట్టీల పనికి వెళుతున్నారు. అదే క్రమంలో బట్టీలకు వెళుతుండగా ముండ్లమూరులో రెండు ఆటోలు బోల్తాకొట్టాయి. దీంతో రావూరి కుమారి, వేముల ఎర్రయ్య, కుంటా గోపయ్య, ఎడమానూరి త్రిశైలేంద్ర, జమ్ముల రమణ, పాలకోలు యువాంజలి, పాలెపోగు రాములు, యాదగిరి పున్నమ్మ, జమ్ముల ఈశ్వరమ్మకు గాయాలు అయ్యాయి. వీరిని దర్శి వైద్యశాలకు తరలించారు. వీరిలో రావూరి కుమారి, పాలెపోగు యువాంజలి , కుంటా గోపయ్యల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు.

వాగు ఆక్రమణలు అడ్డుకున్న గ్రామస్థులు
శింగరాయకొండ, మే 9: మండలంలోని కనుమళ్ల పంచాయతీలోని వాగుపోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వదలచిన రెవెన్యూ అధికారులను గురువారం కనుమళ్ల గ్రామస్థులు రాస్తారోకోతో అడ్డుకున్నారు. కనుమళ్ల చెరువుకు నీరు వచ్చే వాగు స్థలాన్ని ఆక్రమిస్తే పొలాలు ఎలా పండుతాయంటూ, మాకడుపు కొట్టొదంటూ కనుమళ్ల రైతులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ తహశీల్దార్‌కు నిరసన వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళితే శింగరాయకొండ జాతీయ రహదారికి పక్కనే ఉన్న కనుమళ్ల పంచాయతీలోని సర్వే నెంబర్ 322,324లలో ఉన్న ఆరు ఎకరాల 30సెంట్లు స్థలాన్ని ఇళ్ల స్థలాలు లేని వారికి కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారని, మరికొంత స్థలాన్ని కొండపి శాసస సభ్యుడు జివి శేషు తనయుడు రాజ్‌విమల్ నూతనంగా స్థాపించిన జివిఎస్ అండ్ జిపిఎస్ చారిటబుల్ ట్రస్ట్‌కు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో అదే సమయంలో స్థలాన్ని జెసిబిలతో శుభ్రపరుస్తుండడంతో గురువారం ఉదయం కనుమళ్ల గ్రామస్థులందరు వారి కుటుంబంతో సహా వచ్చి ఈఆక్రమణలు నిలుపుదల చేశారు. సుమారు 2గంటలకుపైగా కందుకూరు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సుమారు 10కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో కందుకూరు వెళుతున్న కొండపి టిడిపి ఇన్‌చార్జి డిబివి స్వామి ఈసంఘటన చూసి ఆక్రమణకు స్థలాలు కాజేసేందుకు కాంగ్రెస్‌పార్టీ పెట్టింది పేరు అని, వాగును ఆక్రమించి ఎమ్మెల్యే తన కుమారుడికి పట్టాలు ఎలా ఇస్తారో అని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈవిషయంపై కందుకూరు ఆర్‌డిఓను, జిల్లా కలెక్టర్‌ను సంప్రదిస్తామని, ఈధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ అంబటి వందనం సంఘటనా స్థలానికి వచ్చి ఈస్థలం పోరంబోకు స్థలం అని రైతులకు తెలిపారు. రైతులు తహశీల్దార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులకు అన్ని మార్గాల నుండి నీరు వచ్చే ప్రత్యామ్నాయాలను అడ్డుకుని ఆక్రమిస్తే పంటలు ఎలా పండించుకోవాలని తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై కలెక్టర్‌తో మాట్లాడి ఆక్రమణలను నిలుపుదల చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించడంతో సుమారు 10కిలోమీటర్ల మేర కందుకూరు వైపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అటుగా వెళుతున్న ఉలవపాడు ఎస్సై విజయ్‌చందర్, కందుకూరు సిఐ అక్కేశ్వరరావు రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.

విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి
కందుకూరు, మే 9: లింగసముద్రం మండల పరిధిలోని ఆర్‌ఆర్‌పాలెం పంచాయతీలోని యాదవపాలెంకు చెందిన బి లక్ష్మణరావు (17) అనే విద్యార్థి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈసంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విద్యార్థి తండ్రి మాలకొండయ్య తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణరావు నెల్లూరు నారాయణ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు, సెలవులకు ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ఈక్రమంలో తమ ఇంటి వద్ద ఉన్న మోటార్‌కు నీరుపోసే సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. లింగసముద్రం మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శనగ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
వాణిజ్య మంత్రికి రైతు సంఘాల వినతి
ఒంగోలు, మే 9: శనగ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు నాయకుడు యలమంచిలి శివాజీ, జిల్లాకు చెందిన రైతు ప్రతినిధులు నాగబోయిన రంగారావు, చుంచు శేషయ్య, సుబ్బారావు తదితర నాయకులు గురువారం ఢిల్లీలో వాణిజ్య శాఖ మంత్రి, ప్రభుత్వ శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావు, వ్యవసాయశాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రైతు ప్రతినిధి చుంచు శేషయ్య జిల్లాలోని పాత్రికేయులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జిల్లాలోని రైతు ప్రతినిధులు కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి సహకారంతో ఆ మేరకు కార్యదర్శి ఎస్‌ఆర్ రావును కలిసినట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు శనగ పంటను అష్టకష్టాలు పడి ఉత్పత్తిచేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. దేశంలోకి విదేశాలకు చెందిన శనగలు విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నాయని, దీంతో దేశీయ శనగలకు ధరలు తక్కువగా వస్తున్నట్లు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కోల్డ్ సొసైటీల్లో శనగలు నిల్వ ఉన్నాయని, రోజు రోజుకు నాణ్యత తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శనగ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కార్యదర్శి ఎస్‌ఆర్ రావును కోరినట్లు తెలిపారు. అలాగే పొగాకు పంటకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరామన్నారు. పొగాకు ఈ - ఆక్షన్ విధానం కూడా పొగాకు బోర్డులో సక్రమంగా లేదని తెలిపారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోతున్నారని, వీదేశీ ఆర్డర్లు పొగాకుకు తీసుకొచ్చి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. పొగాకు బోర్డు వేలం కేంద్రాల కొనుగోళ్ళల్లో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేలా చైర్మన్ కె గోపాల్‌తో మాట్లాడి మంచి ధరలు వచ్చేలా చూడాలని కార్యదర్శిని కోరామని తెలిపారు. పొగాకుకు సరైన ధరలు రాకపోతే రానున్న సంవత్సరం పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని కార్యదర్శికి వివరించినట్లు తెలిపారు. స్పందించిన కార్యదర్శి ఎస్‌ఆర్ రావు శనగ రైతులకు గిట్టుబాటు ధరల విషయంపై సంబంధిత వ్యాపారులతో మాట్లాడతామన్నారు. పొగాకు గిట్టుబాటు ధరల విషయంపై కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

వారి జీవనం దయనీయం పట్టించుకునేవారేరీ..?
english title: 
flouride

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>