Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిముషం ఆలస్యమైతే అవుట్

$
0
0

శ్రీకాకుళం , మే 9: జిల్లాలో ఇంజనీరింగు, మెడిసన్‌కు సంబంధించి అడ్మిషన్లకు గాను నిర్వహించే ప్రవేశ పరీక్ష (ఎంసెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌కు 11 కేంద్రాలు, మెడిసన్‌కు నాలుగు కేంద్రాలు కేటాయించారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు, మెడికల్‌కు సంబంధించి రెండు గంటల నుండి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రంలో విద్యార్థ్ధులకు గంట ముందుగా హాల్‌లోకి అనుమతిస్తుండగా, సరిగ్గా పదిగంటలకు గేట్లు మూసివేయనున్నామని, నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తెలియజేసారు. ప్రతి ఏడాది నిముషం నిబంధన కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులు ఆలస్యంగా రావడం, నిరాశతో వెనుదిరగడం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే గుర్తించి సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థ్ధులు కేంద్రంలో తప్పనిసరిగా ఉండలన్నారు. పరీక్ష పూర్తయిన అనంతరం ప్రశ్నపత్రాన్ని తమతో పాటు తీసుకువెళ్లవచ్చని, జవాబు పత్రంలో బ్లాక్‌పాయింట్ పెన్‌తో మాత్రమే రబ్బింగ్ చేయాలని సూచించారు. జిల్లాలో ఎంసెట్‌కు మొత్తం 6060 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్‌కు 4513, మెడిషన్‌కు 1547 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఎచ్చెర్లలోని శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఎ,బి కేంద్రాలు, శివాని ఫార్మశీ, టెక్నాలజీ కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు కేటాయించారు. పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, చైతన్య డిగ్రీ కళాశాల, సన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మునసబు పేట గాయత్రి డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ పరీక్షకు కేటాయించారు. మెడిషన్‌కు సంబంధించి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో రెండు, మహిళా డిగ్రీ కళాశాల, చైతన్య డిగ్రీ కళాశాలలో ఒక్కో కేంద్రం కేటాయించారు.

అవినీతి రాజకీయాలకు చెంపపెట్టు
శ్రీకాకుళం, మే 9: కర్ణాటక రాష్ట్రంలో అవినీతిపైన అక్కడి ప్రజలిచ్చిన తీర్పు సహేతుకమైందని, అవినీతి రాజకీయాలకు చెంపపెట్టు వంటిదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇంచార్జి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గురువారం ఇక్కడి ప్రజాసదన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అక్కడి ప్రజలు బిజెపిని ఓడించారని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందన్నారు. అవినీతిపైన అక్కడి ప్రజలిచ్చిన తీర్పు సహేతుకమైందేనని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు అవినీతిలో కూరుకుపోయిన మంత్రులకు, రాజకీయనాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ప్రజలకోసం కాకుండా, కాంగ్రెస్ నాయకులకోసమే ప్రవేశపెట్టినట్టుందని విమర్శించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో 144 కోట్లు రూపాయలు అవినీతి జరిగిందని, ఐదుగురు మంత్రులున్నప్పటికీ అవినీతికి ఆస్కారమేర్పడటం చూస్తుంటే, అవినీతి పరులను మంత్రులు ఎలా వెనుకేసుకొస్తున్నారో అర్ధవౌతుందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దోపిడీ పాలన సాగిస్తుందని, నాణ్యతలేని పనులు చేపట్టి కార్యకర్తలకు అనుకూలంగా ఉండేట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై నిర్వహించిన బంద్‌లో అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు పాల్గొనగా, పోలీసులు దౌర్జన్యంగా వామపక్షనేతలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఒకవేళ వారు ఏదైనా తప్పుచేసుంటే అది కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని తెలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీస్థాయికి మరల తీసుకువెళ్లాలంటే టిడిపి గెలుపుతోనే సాధ్యమని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జి), కలిశెట్టి అప్పలనాయుడు, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, కొర్ను ప్రతాప్, ఎస్.వి.రమణమాదిగ, అరవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు తీపికబురు
ఎచ్చెర్ల, మే 9: గత ఏడాది సంభవించిన నీలం తుఫాన్ నష్టాలకు పరిహారాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. బాధిత రైతాంగం ఇన్‌పుట్ సబ్సిడీ కోసం కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించారు. ఇటీవలి నిర్వహించిన రైతు చైతన్యయాత్రలో అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. జిల్లాలో 2406.3 హెక్టార్లలో పంటనష్టపోయిన 17,561 మంది రైతులకు 25.13 కోట్ల రూపాయలు పరిహారం అందించేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇదే తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 1100 హెక్టార్లు ఉద్యానవన పంటలకు పరిహారంగా కోటి రూపాయలు అందించనున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలరోజులు సమయం పడుతుందని వ్యవసాయ శాఖాధికారులే స్పష్టంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో వ్యవసాయ మదుపుల కోసం ఇన్‌పుట్ సబ్సిడీ ఎంతగానో దోహదపడుతుందని ఆ కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. విత్తనాలు, ఎరువులకొనుగోలుకు పరిహారం మరింత ఊతమిస్తుందని అన్నదాతలంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు పంట రుణాలు కూడా అందించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా రుణాలు పొందిన ఖాతాదారులకు కూడా ఖరీఫ్‌లో రుణం ఇచ్చేందుకు మీసేవ ద్వారా అడంగల్ కాపీ జతచేయాలని నిబంధనలు విధించడంతో రైతులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మీసేవ కేంద్రాల్లో పూర్తిసమాచారం లేకపోవడం ఆన్‌లైన్ కష్టాలు, కరెంటుకోతలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటరుణాలు ఈ ఖరీఫ్‌లో అందిపుచ్చుకోవడం కత్తిమీద సామేనంటూ రైతులంతా నిట్టూరుస్తున్నారు.

కూర ‘గాయాలు’
శ్రీకాకుళం, మే 9: కూరగాయలకు వడదెబ్బ తగిలింది. మండే ఎండల్లో కూరగాయల దిగుబడి బాగా తగ్గింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉద్యానవన శాఖాధికారులు కూరగాయల విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు కూడా కూరగాయల సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. రైతులకు రాయితీపై విత్తనాలను అందించిన దాఖలాలు కూడా కానరావడం లేదు. గతంలో రైతుబజారులోనే విత్తనాలను రాయితీపై సరఫరా చేసేవారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చొరవ చూపకపోవడంతో నేడు విత్తనాలు పంపిణీ చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ ప్రణాళిక సమావేశాల్లో రాయితీపై విత్తనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ అధికారులకు సూచించినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కూరగాయల కొరతతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. అల్లం ధర కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆకాశనంటింది. రాష్ట్రంలో అల్లం దిగుబడి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో అల్లం ధర విపరీతంగా పెరిగింది. కేజీ అల్లం 110 రూపాయల నుంచి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలాగే కిలో టమాటా 25 రూపాయలు, వంకాయలు 20, క్యారెట్ 15 రూపాయలు, గోల్కొండచిక్కుడు 20 రూపాయలుగా విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే బెండకాయలు కేజీ 25, దొండకాయలు 14, బీరకాయలు 30 రూపాయలు, ఆనప పది, క్యారెట్ 15 రూపాయలు, పచ్చిమిర్చి 30 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు, మార్కెట్‌కమిటీ సమన్వయంతో కూరగాయలు పండించే రైతులకు రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

మంచినీటి పథకం అవినీతిపై విచారణకు రంగంలోకి సిఐడి
శ్రీకాకుళం, మే 9: ఏ పథకమైతే గుక్కెడు మంచినీటిని అందిస్తుందని ప్రజానీకం ఆశపడిందో అదే పథకం నిండా ముంచేసింది! గుత్తేదారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పట్టడంతోపాటు అధికారుల పర్యవేక్షణాలోపాలను కళ్ళకు కట్టింది. కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టి, లక్షలాది మంది గొంతెండేలా చేసే 24 గంటలు నిరంతర మంచినీటి పథకం పనిచేయకుండా పోయింది. ఈ పథకం వైఫల్యం వెనుక ఎన్నో నిజాలు వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పర్యవేక్షణా ఇంజనీర్లు కారణంగా కోట్లాది రూపాయల విలువ చేసే రిజర్వాయర్లు పనికిరాకుండా పోయాయి. ఎ.ఎస్.ఎన్.కాలనీ, అరసవిల్లి ప్రాంతాల్లో నిర్మించిన 800, 1200 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కుప్పకూలిపోయాయి. దీనిపై దివంగతనేత కింజరాపు ఎర్రన్నాయుడు 2009లో కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పటి ఫిర్యాదుకు ఇప్పుడు సర్కార్‌లో స్పందన కన్పించింది. కుప్పకూలిన రిజర్వార్లపై నివేదికలు, సంబంధిత అధికారుల పర్యవేక్షణాలోపం, నిర్మించిన ఐ.హెచ్.సి. కాంట్రాక్టర్లపై చర్యలు వంటి అంశాలన్నీ సిఐడి అధికారులు దర్యాప్తు చేసి నివేదించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు ఆ ఉత్తర్వులు గురువారం సిఐడి అధికారులకు ఫ్యాక్స్ ద్వారా అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే అంశంపై అప్పట్లో దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడు విజిలెన్స్‌శాఖకు దర్యాప్తు చేయాలంటూ సంబంధిత డాక్యుమెంట్లుతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపితే..అందుకు సంబంధించిన గుత్తేదారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, కూలిపోయిన రిజర్వాయర్లకు 40 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం గాని, మరల ఆ రిజర్వాయర్లు నిర్మించడంగాని చేయాలంటూ హుకుం జారీ చేసింది. కుప్పకూలిపోయిన రిజర్వాయర్లకు బాధ్యులను చేస్తూ ముగ్గురు ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. రాజకీయ ఒత్తిళ్లతో నిలిచిపోయిన విజిలెన్స్ అధికారుల చర్యలకు చెక్ చెప్పేలా ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసి నివేదికలు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇలా విజిలెన్స్‌శాఖ నివేదించిన నివేదికల తర్వాత మరల సిఐడి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడం జిల్లాలో రెండోది. మొదటిది 50 కోట్ల రూపాయల విలువైన వంశధార షట్టర్ల కుంభకోణమైతే.. రెండోది 21.50 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎస్.ఎస్.ఎం.టి. స్కీమ్‌కు చెందిన నిరంతర మంచినీటి ప్రాజెక్టు! పెరుగుతున్న శ్రీకాకుళం జనాభా దృష్ట్యా 2036 సంవత్సరానికి (మున్సిపాలిటీకి కలుపుబోవు పంచాయతీలు పెద్దపాడు, కిల్లిపాలెం, చాపురం, ఖాజీపేట, పాత్రునివలస) 2,38,000 జనాభాను దృష్టిలో ఉంచుకొని 27.13 ఎం.ఎల్.డి. అవసరం ఉంది. అందుకుగాను నీటిసరఫరా నాగావళి నది, ఆదివారంపేట వద్ద నాలుగు బావులు, 735 మీటర్లు పొడవు గల గ్యాలరీ ద్వారా 27.31 ఎం.ఎల్.డి. సరఫరా చేయుటకు ఆంధ్రా యూనివర్సిటీ సర్వే రిపోర్టు సమర్పించారు. దాని ద్వారా పట్టణానికి 11 బ్లాకులుగా విభజించి, 7 జోన్స్‌లో 7 రిజర్వాయర్‌లను గ్రావిటీ మెయిన్ ద్వారా కలుపుతూ 20 శాతం నీటిసరఫరా లేని నెట్‌వర్క్ కలుపుతూ నివేదికలను 21.50 కోట్ల రూపాయలతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం కేంద్ర ప్రభుత్వానికి 2007లో సమర్పించింది. యు.ఐ.డి.ఎస్.ఎస్.ఎం.టి. స్కీమ్ ద్వారా సిక్కోల్ ప్రజలకు నీటిసరఫరాకు గ్రాంటు విడుదల చేస్తూ 80 శాతం నిధులు కేంద్రప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం నిధులు మున్సిపాలిటీ నిధులతో మొత్తం 21.50 కోట్ల రూపాయలతో ఈ నిరంతర నీటిసరఫరా పథకాన్ని ఆమోదించడమైంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ఏజెన్సీగా పేర్కొంటూ 2007లో పనులను ఆరంభించింది. 2009లో నాలుగు బావులు 4 మీటర్లు డయాతో 12 మీటర్లు లోతుతో నిర్మించారు. గ్యాలరీ నిర్మాణానికి నాగావళినదిలో ఆదివారంపేట వద్ద 735 మీటర్ల పొడవున 600 మిల్లీ మీటర్లు ఆర్.సి.సి.ఎన్.పి. మూడు పైపు తొమ్మిది మీటర్ల లోతులో నిర్మాణం, కలక్షన్ వెల్స్ రెండు, నాలుగు మీటర్లు డయాతో, 60 కె.డబ్ల్యూ పంపుసెట్టును అమర్చారు. ఈ ప్రాజెక్టుకు అతిముఖ్యమైన రిజర్వార్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే 1200 కె.ఎల్ సామార్థ్యంతో బొందిలీపురం వద్ద రిజర్వాయర్ నిర్మించారు. అలాగే 1200 కె.ఎల్. రిజర్వాయర్లు బాకర్‌సాహెబ్‌పేట, అరసవిల్లి, కంపోస్టు కాలనీ, గుజరాతీపేటలలో నిర్మించారు. దమ్మలవీధిలో 400 కె.ఎల్., పాత హెచ్.బి.కాలనీ, ఎ.ఎస్.ఎన్.కాలనీలో 800 కె.ఎల్. సామార్థ్యం కలిగిన ఐదు రిజర్వార్లు నిర్మించారు. అందులో ఎ.ఎస్.ఎన్.కాలనీ, అరసవిల్లి ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లు కుప్పకూలిపోయాయి. వాటి నికర ఖర్చు 40 లక్షల రూపాయలు. ఐ.హెచ్.సి. గుత్తేదార్లు నిర్మించిన రిజర్వాయర్లు కూలిపోయిన వెంటనే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి మరల వారిచేతే నిర్మించినట్టు చెబుతున్నప్పటికీ, ఎర్రన్నాయుడు నిరంతర నీటి సరఫరా పథకంలో అవకతవకలు, వాటి ద్వారా 5.62 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని కేంద్ర పట్టణ,గ్రామీణాభివృద్ధిశాఖకు ఫిర్యాదు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు సిక్కోలు నిరంతర నీటిసరఫరా పథకం నిర్మాణ పనులు, నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయమంటూ సిఐడికి ఆదేశాలు ఇచ్చిన కేంద్రానికి మరో మూడు వారాల్లో దర్యాప్తు ముగించి నివేదికలు అందించేందుకు రంగం సిద్ధం అవుతోంది.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
* సిఇఒ కైలాసగిరీశ్వర్
జలుమూరు, మే 9: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిరుపేద ప్రజలకు మంజూరుచేసిన అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఒ కైలాల గిరీశ్వర్ అన్నారు. మండలం అచ్యుతాపురం గ్రామంలో గురువారం జరిగిన పల్లెకుపోదాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నంతకాలం అభివృద్ధి జరుగదని, మీరంతా అక్షరాస్యులుగా కావాలని కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు లోపించడం వల్ల గ్రామాల్లో అనేకరోగాలు వ్యాపిస్తాయని, ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ప్రభావతి, తహశీల్దార్ శ్రీనివాసరావు, పలు శాఖాధికారులు, మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల కళాశాలకు మరమ్మతులు
* ఎజెసి రాజ్‌కుమార్
నరసన్నపేట, మే 9: మండలంలో తామరాపల్లి వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల మహిళా జూనియర్ కళాశాలకు మరమ్మతులు చేపట్టిన అనంతరం పునఃప్రారంభించనున్నామని ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్ స్పష్టంచేశారు. గురువారం ఆయన జూనియర్ కళాశాలను ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలో మరమ్మతులకు గురైన తరగతి గదులను, డార్మెంటరీ, డైనింగ్‌హాల్, వసతి గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో నాల్గవ తరగతిగదిలో స్లాబు పైపెచ్చు ఊడిపడడంతో విద్యార్థినులు, సిబ్బంది భయాందోళనకు గురవ్వడంతో గురుకుల కళాశాలను జిల్లా కేంద్రంలోని పెద్దపాడుకు మార్చామన్నారు. అయితే పలు సంఘాలు, రాజకీయ పార్టీలు జిల్లా కలెక్టర్‌కు ఈ సమస్యను తీసుకురావడంతో వీటిని పరిశీలించేందుకు వచ్చామన్నారు.ఒక్క నాల్గవ తరగతి గది తప్ప మిగిలిన గదులన్నీ బాగానే ఉన్నాయని ఇంజనీరింగ్ అధికారులు ఎజెసి దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టిన తరువాతే ఈ కళాశాలను పునఃప్రారంభించాలని ఎజెసి పేర్కొన్నారు.

భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్‌దే
* ఎమ్మెల్యే కృష్ణదాస్
శ్రీకాకుళం, మే 9: భవిష్యతంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని నరసన్నపేట ఎమ్మెల్యే, శాసనసభ ఉపనేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పట్టణంలోని పదవ వార్డులో మహ్మద్‌షిరాదుద్దీన్ ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించిన అనంతరం దశలవారీగా పార్టీ బలోపేతమైందన్నారు. వైఎస్సార్‌సీపీకి పెద్దఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రారంభంలో కొత్తపార్టీకి నైరాశ్యం కనిపిస్తోందని, ఎన్నికల అనంతరం పార్టీ బలం తెలుస్తుందని స్పష్టంచేశారు. కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని కండువాలతో ఆహ్వానించారు. ముందుగా పదోవార్డులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబు, అంధవరపు సూరిబాబు, ధర్మాన ఉదయ్‌భాస్కర్, మార్పు ధర్మారావు, కోరాడ రమేష్, ఎన్ని ధనుంజయ్‌రావు, జె.ఎం.శ్రీనివాస్, నక్క రామకృష్ణ, ఎన్.శ్రీనివాస్, విఆర్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

కాలువ పనులు చేపట్టాలని ఆర్డీవోను ముట్టడించిన రైతులు
ఆమదాలవలస, మే 9: తమ గ్రామాలకు సంబంధించిన 4 ఆర్, 6 ఆర్ పిల్లకాలువలకు పనులు ఒకేసారి చేపట్టాలని ఆరు గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. గురువారం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కాలువ పరిస్థితులను తెలుసుకునేందుకు విచ్చేసిన ఆర్డీఒ గణేష్‌కుమార్‌ను వారు చుట్టుముట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిపేట, కంచరాపువానిపేట, నాదానపురం, బొమ్మిడాలపేట, సీపానచంద్రయ్యపేట, నందగిరిపేటలకు చెందిన కాలువ పనులు 2007లో ప్రారంభమయ్యాయని, నీటిపారుదల, రెవెన్యూ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ అవి పూర్తికాలేదని ఆరోపించారు. 2004 నాటి పాతసర్వే రిపోర్టు ఆధారంగా పనులు చేపట్టాలని రైతులు కోరారు. కొందరు రైతులు వారి పొలాలు పోతాయనే ఉద్దేశ్యంతోను, మరికొందరు దిగువ గ్రామాలకు సాగునీరు అందకుండా ఉండేందుకు కాలువ పనులను అడ్డగిస్తున్నారన్నారు. ఈ కాలువ పనులు పూర్తవ్వకపోవడంతో సుమారు 800 ఎకరాలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతోందని ఆవేదనవ్యక్తం చేశారు. దీని వల్ల దిగువ రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఎంతోకాలం నుండి అసంపూర్తిగా ఉన్న 4 ఆర్, 6 ఆర్ పిల్లకాలువల పనులను వెంటనే పూర్తిచేసి ఈ ప్రాంత రైతులందరికీ న్యాయం చేయాలని టిడిపి నాయకుడు పాతిన రమణ డిమాండ్ చేశారు. ఆనాటి రాష్టమ్రంత్రి తమ్మినేని సీతారాం పాలనలో ఈ కాలువ పనులకు అంకురార్పణం జరిగిందని, ఈ పనుల కోసం 108 కోట్ల రూపాయలు కేటాయించి డిజైన్ చేశారని గుర్తుచేశారు. ఆ తరువాత ప్రభుత్వాలు పాలకులు దీనిని పట్టించుకోలేదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు నాయకులు సువ్వారి రాజులు, సువ్వారి ఆదినారాయణ, పాతిన అర్జున్, సీపాన లోకనాధం, రుప్ప అప్పన్న, చల్లా రవి, నారాయణరావు తదితరులు వంశధార, రెవెన్యూ అధికారులను నిలదీశారు.

పట్టణంలో జెసి సుడిగాలి పర్యటన
శ్రీకాకుళం , మే 9: పట్టణంలో గురువారం ఉదయం ఆరుగంటలకు జాయింట్ కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి హోదాలో పట్టణంలోని పలువార్డులను పర్యటించి, వార్డుల్లోని సమస్యలు గుర్తించి, పరిష్కారానికై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముందుగా పుణ్యపువీధిలో కాలువల నిర్మాణాలను పరిశీలించి, కాలువల్లో ఉన్న చెత్తను చూసి పారిశుద్ధ్య నిర్వహణపట్ల అజాగ్రత్త తగదని మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించారు. అక్కడ నుండి గుజరాతీపేట చేరుకొని వీధిలో నడుచుకుంటూ ప్రతి ఇంటిముందు కాలువను పరిశీలించారు. వీధిలోని చిన్నచిన్న దుకాణదారుల ఇంటిముందు చెత్తకు బకెట్లు పెట్టుకోవాలని, మున్సిపల్ వాహనం వచ్చినపుడు చెత్తను ఆవాహనంలో వేయాలని సూచించారు. అనంతరం పి.యన్.కాలనీలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీని పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో కలసి వెళ్తుండగా ఇసుక బండ్లను చూసి వాటి యజమానులను పిలిచి మాట్లాడారు. బండ్లద్వారా ఇసుకను ఎక్కడకు తరలిస్తున్నారంటూ వారినుండి వివరాలు సేకరించారు. అనంతరం హయాతినగరం వద్ద నాగావళి నదినుండి ఇసుకను తెస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ట్రాక్టర్ టైర్ల అచ్చులు ఉండటాన్ని పరిశీలించి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువెళ్తున్నారా? అంటూ స్థానికులను అడిగారు. వారు స్థానిక నాయకుడొకరు వారి సొంత ట్రాక్టర్లుతో ఇసుకను తీసుకువెళ్తున్నారని, అవే కాకుండా వేరే ట్రాక్టర్లవద్ద డబ్బులు వసూలుచేస్తూ ఇసుకను తరలిస్తున్నారని చెప్పగా, వెంటనే స్పందించిన జెసి అతనికి నోటీసు ఇచ్చి పిలిపించాలని అధికారులను ఆదేశించారు. చెత్తపై సమరం కార్యక్రమంలో బాగంగా ప్రతీరోజూ వార్డులన్నీ పరిశీలించి రోడ్లుపైన, కాలువల్లోనూ చెత్తలేకుండా చూసుకోవాలని, వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని ఎంహెచ్‌వోను ఆదేశించి వెళ్లిపోయారు. పర్యటనలో అతని వెంట మున్సిపల్ డి.ఇ సుగుణాకరరావు, ప్రణాళిక విభాగపు సూపర్‌వైజర్ వై.ఉమామహేశ్వరరావు, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ఇంజనీరింగు, మెడిసన్‌కు సంబంధించి అడ్మిషన్లకు
english title: 
skl

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>