Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొండా దంపతుల దారెటో?

$
0
0

వరంగల్, మే 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం ఒక వెలుగు వెలిగిన కొండా దంపతులు క్రమంగా పార్టీకి దూరం అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీయే కొండా దంపతులను దూరం పెడుతున్నట్లు ప్రచారం కూడా ఉంది. పార్టీ ముఖ్యనాయకత్వాన్ని ఎదిరించే విధంగా, ప్రశ్నించే విధంగా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొండా దంపతులకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తూ రాగా, తాజా సంఘటనలు పార్టీ ముఖ్యనాయకత్వానికి, కొండా దంపతులకు మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి. మొదటి నుంచి జిల్లాలో కొండా దంపతులకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్గీయులుగా పేరుండగా, వైఎస్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మంత్రివర్గంలో కొండా సురేఖకు స్థానం లభించడంతో కొండా వర్గీయులు జిల్లాపై పెత్తనం చెలాయించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడం, జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్‌కు కొండా దంపతులు మద్దతు ఇవ్వడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. జగన్ విషయంలో మంత్రి కొండా సురేఖ అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కేంద్ర నాయకత్వానికి లేఖలు పంపించారు. మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు ఒకదశలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ప్రశ్నించే విధంగా వ్యవహరించారు. చివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నెపంతో కొండా సురేఖపైన, కొన్ని నెలల తరువాత ఎమ్మెల్సీ, ఆమె భర్త కొండా మురళిపైన వేటు వేశారు. ఫలితంగా పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగగా, ఆ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కొండా సురేఖ టిఆర్‌ఎస్ అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉపఎన్నికల వరకు జిల్లాలోనే కాకుండా రాష్టస్థ్రాయిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యపాత్ర పోషించిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రాభవం క్రమేణా తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం కొండా దంపతులు అనుసరించిన ఏకపక్ష వైఖరి అనే ప్రచారం కూడా కొనసాగింది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, నియామకాలు తమ కనుసన్నల్లో జరగాలనే విధంగా కొండా దంపతులు వ్యవహరించడం, దీనికి పార్టీ రాష్ట్ర నాయకత్వం అంగీకరించకుండా వీరిరువురిని పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకే పరిమితం చేసి మిగతా నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేయడం కొండా దంపతులకు రుచించని విధంగా మారింది. పార్టీ రాష్ట్ర నాయకత్వ వ్యవహారశైలితో విభేదించిన కొండా దంపతులు క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గడచిన వారం రోజులుగా కొండా దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారాన్ని కొండా దంపతులు, వారి మద్దతుదారులు ఖండించకపోవడం మరింత గందరగోళానికి అవకాశం ఏర్పడింది. తాజాగా కొండా దంపతుల మద్దతుదారులుగా పేరున్న నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కొండా వర్గీయులకు పుండుమీద కారం చల్లిన విధంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకత్వం కష్టసమయాల్లో తమను వాడుకుని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు కొండా మద్దతుదారుల నుంచి మొదలయ్యాయి. వైఎస్సార్‌ను, జగన్‌ను కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేసిన సందర్భంలో వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన తమను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొండా మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం శీతకన్ను వేసిన నేపథ్యంలో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతుండగా, కాంగ్రెస్ జిల్లా నాయకత్వంలో మాత్రం కొండా దంపతులను పార్టీలో చేర్చుకునే విషయంలో కనీస స్పందన కనిపించడం లేదు. గురువారం కొండా దంపతులు బిజెపిలో చేరతారని కొన్ని చానెళ్లలో ప్రచారం జరిగింది. కానీ ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులు మాత్రం ఖండించారు. కొండా దంపతులను బిజెపిలో చేర్చుకునే విషయాన్ని పార్టీ ఇప్పటి వరకు ఆలోచించలేదని, కొండా దంపతులతో ఎవరూ సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేశారు.

భార్యా హంతకుడికి బేడీలు
జఫర్‌గడ్, మే 9: మద్యానికి బానిసై భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటనలో నిందితుడైన భర్త జోగు బాబును గురువారం అరెస్టు చేసినట్లు వర్థన్నపేట సిఐ మల్లయ్య తెలిపారు. ఈ నెల రెండవ తేదీన ఈ సంఘటన జరుగగా దానికి సంబంధించిన పూర్తి వివరాలను విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని కోనాయిచలం గ్రామానికి చెందిన జోగు బాబు (42)కు బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన ధనమ్మతో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గత కొన్నిరోజులుగా బాబు నిత్యం మాద్యానికి బానిసై భార్య ధనమ్మను డబ్బులకోసం వేధిస్తుండేవాడు. ధనమ్మ మరో వ్యక్తితో అక్రమసంబంధం నెరుపుతోందనే అనుమానం పెంచుకుని ఆమెను ఏవిధంగానైన హతమార్చాలని పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఈనెల రెండవ తేదీన ధనమ్మ రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. ధనమ్మ కేకలువేస్తూ బయటికి వచ్చింది. ఈ సంఘటనలో ధనమ్మ ఎంజిఎంలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ధనమ్మ మృతికి కారుకుడైన బాబును గురువారం అరెస్టుచేసినట్లు సిఐ మల్లయ్య తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్సై ఫణీధర్, కానిస్టేబుల్ పరుషరాములు పాల్గొన్నారు.

వడదెబ్బతో యువకుడు మృతి
ఆత్మకూరు, మే 9: వడదెబ్బతో యువకుడు మృతిచెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం... నీరుకుళ్ల గ్రామానికి చెందిన గొల్లపెల్లి సుభాష్ (30) గ్రామశివారులోని తన వరి పొలం వద్దకు బుధవారం వెళ్లాడు. రోజంతా అక్కడే ఉండి పొలం పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వడదెబ్బతో వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు సుభాష్‌ను చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు సిద్ధార్ధ, కుమార్తె కావ్య ఉన్నారు. మృతుడు సుభాష్ కుటుంబాన్ని గురువారం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సందర్శించి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. సుభాష్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

శాంతి భద్రతల పరిరక్షణలో
కానిస్టేబుళ్ల పాత్ర కీలకం
బాలసముద్రం, మే 9: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని వరంగల్ రూరల్ ఎస్పీ జి.పాలరాజు సిబ్బందికి తెలిపారు. జిల్లాలో అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించాలనే ఆలోచనతో వరంగల్ రూరల్ ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా నేరపరిశోధన ద్వారా వివిధ కేసులలోని నిందితులను అరెస్టు చేసి విధి నిర్వహణలో ప్రతిభ చూపిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని జిల్లా పోలీసు విభాగంలో ప్రారంభించారు. అందులో భాగంగా మరిపెడ గ్రామానికి చెందిన గుగులోతు సునీత హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మరిపెడ పోలీసు అధికారులకు, సిబ్బందికి గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పాలరాజు సఫారి సూట్‌తోపాటు నగదు బహుమతులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో కురవి సిఐ జి.రవీందర్, మరిపెడ ఎస్సై ఎస్‌కె.అబ్దుల్ రహమాన్, కానిస్టేబుళ్లు ఎం.ప్రభాకర్, కె.రామ్‌మోహన్, జి.మహేందర్ ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ వేటు
వరంగల్, మే 9: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారనే కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు జిల్లా నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మహిళా విభాగం కన్వీనర్ నునావత్ రాధ, ట్రేడ్ యూనియన్ విభాగం కన్వీనర్ తక్కళ్లపల్లి మోహన్‌రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మసూద్, ఎస్సీ సెల్ కన్వీనర్ చిలువేరు శ్రీనివాస్‌లపై పార్టీ సెంట్రల్ కమిటీ వేటు వేసింది. ఈ నలుగురు నాయకులు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న కొండా మురళి, సురేఖ మద్ధతుదారులు కావడం విశేషం. నియోజకవర్గాల కో-ఆర్డినేటర్ల నియామకాల విషయంలో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ నలుగురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పనిచేస్తున్న తమను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారిని కో-ఆర్డినేటర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించారు. వారం రోజులకిందట నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేసి మెయిన్ గేటు ముందు ధర్నా కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో నియోజకవర్గాల కో-ఆర్డినేటర్ల నియామకం విషయంలో డబ్బులు చేతులు మారినట్లు ఈ నలుగురు నాయకులు ఆరోపణలు చేశారు. పార్టీ నాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించారు. వీరి ప్రకటనలను, చర్యలను వైఎస్సార్ సిపి సెంట్రల్ కమిటీ ముఖ్యనాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాళం వేయడమేకాకుండా నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని జైలులో ఉన్న జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించడంతో వీరిపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నాయకత్వంపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ వీరి నుంచి పార్టీ సెంట్రల్ కమిటీకి ఎటువంటి వివరణ అందకపోవడంతో నలుగురు నాయకులపై గురువారం సస్పెన్షన్ వేటు ప్రకటించారు.

ఐదు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
* మంత్రి సారయ్య
వరంగల్, మే 9: జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యలలో భాగంగా వరంగల్ నగరంలోని ‘ఓ సిటి’లో ఐదుకోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వివిధ రకాల క్రీడలలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గురువారం నగరంలోని రంగశాయిపేటలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సారయ్య మాట్లాడుతూ ఓ సిటిలో కార్పొరేషన్‌కు చెందిన స్థలాన్ని కేటాయిస్తున్నామని, త్వరలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. నగరంలోని క్రీడాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కనీస వౌళిక సదుపాయాలు లేకపోయినా క్రీడలపై ఉన్న ఆసక్తితో కోచ్‌లు, క్రీడాకారులు క్రీడలలో ప్రగతి సాధిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. నగరంలో క్రీడల నిర్వహణకు రెండులక్షల నుండి ఐదులక్షల రూపాయల వరకు బడ్జెట్‌ను పెంచామని తెలిపారు. రంగశాయిపేటలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో రెండు హాకీ, రెండు ఖోఖో, రెండు హ్యాండ్‌బాల్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 10,11,12వ వార్డులలో జిమ్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖిలావరంగల్‌లో క్రీడా మైదానానికి కాంపౌండ్ వాల్ నిర్మించడమేకాకుండా నీటివసతి తదితర సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రంగశాయిపేటలో క్రీడాశిక్షణ పొందుతున్న వందమంది విద్యార్థులకు యూనిఫారాలు, షూస్‌ను రెండురోజులలో అందజేస్తానని హామీ ఇచ్చారు. క్రీడాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్ మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు నగరంలోని విద్యార్థులకు వివిధ క్రీడలపై శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. వరంగల్ డిఎస్పీ హైమావతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చెప్పారు. క్రీడలలో పాల్గొనే విద్యార్థులు అన్నిరంగాలలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, మాజీ కార్పొరేటర్ బొలుగొడు సారయ్య, ముప్పారపు మల్లేశం, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.

పుష్కరకాలమైనా అమలుకునోచని ‘ఉత్త’ర్వు * కేసముద్రంలో నెరవేరని బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు
జీవో బుట్టదాఖలేనా!?
కేసముద్రం, మే 9: ‘బాలిక పుట్టిందని చింతించవద్దు.. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి వారి ఉన్నతికోసం ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇక నుంచి వారి మంచి చెడ్డలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని’ రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలతో హోరెత్తిస్తుండగా.. కేసముద్రం మండల కేంద్రంలో పనె్నండేళ్ల క్రితం బాలికలకు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు అమలుకునోచుకోకుండా ఉత్త మాటగానే మిగిలిపోయింది. మండల కేంద్రంలో ప్రస్తుతం బాల, బాలికలకు కలిపి నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలను బైఫర్కేషన్ చేయడానికి విద్యాశాఖ సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 2001-2002 విద్యా సంవత్సరంలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించాలని 23-6-2001న జీవో నెం-76 ద్వారా అనుమతి ఇచ్చింది. అయితే, అప్పట్లో ఇక్కడ వౌలిక వసతులు, సరిపడా ఉపాధ్యాయుల్లేరనే సాకుతో ఆ ఏడాది బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ, స్థానిక జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు సుముఖత చూపకపోవడంతో ఉత్తర్వు కాస్త అమలుకు నోచుకోలేకపోయింది. మరుసటి ఏడాది కూడా ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడంతో ఆ ఉత్తర్వు కాస్త ఉత్తదిగా మారిపోయింది. అయితే, గత కొనే్నళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర సంఖ్య తగ్గడం.. బాలికల సంఖ్య పెరగడంతో తాజాగా ఈ పాఠశాలలో బాలికల సంఖ్య 316కు చేరగా బాలుర సంఖ్య 228 మాత్రమే. పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు నిర్వహిస్తుండగా ఒక్కో తరగతికి ఏ,బి సెక్షన్లు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతిలో బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. గడచిన విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్ధుల సంఖ్య ఇలా ఉంది. 6వ తరగతిలో 43 మంది బాలురుండగా, 66 మంది బాలికలున్నారు. అలాగే 7వ తరగతిలో 38 మంది బాలురు, 28 మంది బాలికలు, 8వ తరగతిలో 46 మంది బాలురు, 57 మంది బాలికలు, 9వ తరగతిలో 45 మంది బాలురు, 80 మంది బాలికలు, 10వ తరగతిలో 51 మంది బాలురు, 65 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాలికల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా ఇక్కడ బాలికలకు ప్రత్యేక ఉన్నత పాఠశాల ఏర్పాటులో అటు అధికారులు.. ఇటు ప్రజా ప్రతినిధులు దృష్టిసారించకపోవడంతో కేసముద్రం మండల కేంద్రంలో పుష్కరకాలం నుంచి బాలికల పాఠశాల కలగానే మిగిలిపోయంది. ఒకే తరగతి గదిలో చదువుకోవడానికి బాలికలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా, ప్రభుత్వం గత కొనే్నళ్లుగా తరగతి గదుల నిర్మాణానికి నిధులు విడుదల చేయడంతో తరగతి గదుల కొరతలేదు. అలాగే, పాఠశాలలో ప్రస్తుతం ప్రతి తరగతికి రెండేసి సెక్షన్లు ఏర్పాటు చేసింది. పాఠశాలలో ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్లు ముగ్గురు, ఫిజిక్స్ ఇద్దరు, గణితం ముగ్గురు, బయోలజీ ముగ్గురు, తెలుగు పండిట్ (1) ఇద్దరు, తెలుగు పండిట్ (2) ఒక్కరు, హిందీ పండిట్ (1) ఒక్కరు, సాంఘిక శాస్త్రం ఇద్దరేసి చొప్పున విద్యా బోధనకు ప్యానెల్‌గ్రేడ్ హెడ్మాష్టర్, ఫిజికల్ డైరెక్టర్‌తో కలిపి 19 మంది ఉపాధ్యాయులున్నారు. అలాగే, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఫలితంగా విద్యాబోధనకు అవసరమైన ఉపాధ్యాయుల కొరత కూడా లేకపోవడంతో బాలికల ఉన్నతపాఠశాల ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం లేదు. వీటికితోడుగా పాఠశాలలో రెండు పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన ఆటస్థలానికి, ఇతర వౌలిక వసుతులకు కూడా సరిపడా స్థలం ఉంది. అటు విద్యాశాఖ ఉన్నతాధికారులు.. ఇటు ప్రజాప్రతినిధులు స్పందిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తే.. బాలికల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పకతప్పదు.

రైతు సంక్షేమానికి కృషి
మహబూబాబాద్, మే 9: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను, సబ్సిడీలను ప్రవేశపెట్టిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. గురువారం స్థానిక బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ చాలా బాగున్నాయని, వీటి ద్వారా రైతులకు పంటలు, విత్తనాల మీద మంచి అవగాహన వస్తుందని అన్నారు. రైతు చైతన్య యాత్రలు రైతు సదస్సుల ద్వారా వ్యవసాయదారులకు, రైతులకు పథకాల గురించి సబ్సీడీల గురించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు రైతులు ముందస్తుగా మెళకువలు నేర్చుకొని లాభాలు గడించాలని అన్నారు. మహబూబాబాద్ ఆర్డీఓ బిక్షానాయక్ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్‌కు అమవైన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలని, వాటిని కోనుగోలు చేసుకునే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. గ్రామాల్లోని ఆదర్శ రైతులకు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీఓ అన్నారు. నూతన వ్యవసాయ విధానాలు అవలంబించడం పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడడంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎ. నాగేశ్వర్‌రావు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసోర్చ్ విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ జెడి సుధాకర్, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ శశివర్ధన్ రెడ్డి, ఎడిఎ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల ఎడిలు, ఏఓలు, శాస్తవ్రేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జూన్‌లో తెరాస బయ్యారం పాదయాత్ర
ఖానాపురం, మే 9: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బయ్యారం, గూడూరు, బీమదేవరపల్లి అటవీ ప్రాంతాల్లోని ఇనుప ఖనిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. జూన్ రెండవ వారంలో కరీంనగర్ జిల్లా బీమదేవరపల్లి నుండి ఖమ్మం జిల్లా బయ్యారానికి మహాపాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించింది. పార్టీ ఎంపి విజయశాంతితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 40 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీలోని సభ్యులంతా పాదయాత్రలో పాల్గొంటారు. ఈమేరకు గురువారం ఖానాపురం మండల కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఇనుప ఖనిజాన్ని సీమాంధ్రకు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకార పూరిత వైఖరికి నిరసనగా భూకంపం సృష్టించే ఆందోళనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. భీమదేవరపల్లి నుండి ప్రారంభమయ్యే మహాపాదయాత్ర దాదాపు ఎనిమిది నుండి పది రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి రోజు పాదయాత్ర బృందం వెంట ఐదువేల పైచిలుకు తెలంగాణవాదులు పాల్గొంటారని తెలిపారు. భీమదేవరపల్లి నుండి పరకాల, శాయంపేట, మల్లంపల్లి, నర్సంపేట, గూడూరు, మహబూబాబాద్‌ల మీదుగా బయ్యారం వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర ముగింపు రోజు లక్షమందితో భారీ బహిరంగసభ బయ్యారంలో ఉంటుందన్నారు. ఈ మేరకు కెసిఆర్ మహాపాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కమిటీని ఖరారు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, బానోతు సంగూలాల్‌లు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సిపికి గుడ్‌బై చెబుతారా? * ‘జంప్’ కాంగ్రెస్ వైపా... బిజెపి వైపా!?
english title: 
konda couple

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>