Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

చేపల చెరువులను క్రమబద్ధీకరించకుంటే ధ్వంసం

ఏలూరు, మే 9 : జిల్లాలో జూన్ 15వ తేదీ లోగా క్రమబద్దీకరించుకోని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం చేపల చెరువులు, ఆధార్, రెవిన్యూ సదస్సు, భూ పంపిణీ తదితర కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలతో చేపల, రొయ్యల చెరువులుండాలని, ఆ నిబంధనల మేరకు చేపల, రొయ్యల చెరువులను ఏర్పాటు చేసి క్రమబద్దీకరణకు జూన్ 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 15వ తేదీ లోగా క్రమబద్దీకరించుకోని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అనధికార చేపల, రొయ్యల చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ప్రజలందరికీ తెలియజేసేందుకు గ్రామీణ స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతేకాక వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. మండల పరిధిలో ఎన్ని ఎకరాలలో చేపల చెరువులున్నాయి, వాటిలో నిబంధనల మేరకు ఎన్ని చెరువులున్నాయి, నిబంధనల మేరకు లేని చేపల చెరువులున్నాయన్న విషయాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 15వ తేదీ అనంతరం నిబంధనల మేరకు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ కార్డుల జారీకి ప్రతీ మండల కేంద్రంలో రెండుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన రెవిన్యూ సదస్సులలో అందిన ప్రతీ విజ్ఞప్తిని పరిష్కరించాలన్నారు. రెవిన్యూ సదస్సులలో 14 వేల దరఖాస్తులందాయని, వాటిలో ఇంకా అయిదు వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని కూడా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, మండల పరిధిలో అర్హులైన కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. ఏడవ విడత భూ పంపిణీలో పేదలకు భూమి పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూముల వివరాలను వెంటనే అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో ఎం మోహనరాజు, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, సత్యనారాయణ, సూర్యారావు, వసంతరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సలీంఖాన్, మత్స్యశాఖ ఉపసంచాలకులు కృష్ణమూర్తి, నిక్‌నెట్ అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమకు పచ్చతోరణం
*పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక*కలెక్టర్ వాణీమోహన్
ఏలూరు, మే 9 : ఎస్‌సి, ఎస్‌టిల రైతులతో పాటు నిరుపేద రైతులకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమానికి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడిసిలో గురువారం ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమంపై ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ తహశీల్దార్లు, ఎంపిడివోలు, ఐకెపి సిబ్బంది తదితరులతో వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఉద్యాన పంటలు ప్రోత్సహించేందుకు ఎస్‌సి, ఎస్‌టి రైతులతో పాటు నిరుపేద రైతులకు చెట్లు పట్టాలిచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో మే నెలాఖరులోపు గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, రహదార్లు, కాలువగట్లపైన, నీటి పారుదల శాఖకు చెందిన నిరుపయోగంగా వున్న భూములు, విద్యాసంస్థలు, అటవీ హక్కుల చట్టం కింద పంపిణీ చేసిన భూముల వివరాలను యుద్ధప్రాతిపదికపై సంబంధఙత తహశీల్దార్లు సేకరించాలన్నారు. ఈ పధకానికి సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారునకు 200 మొక్కలను అందించడం జరుగుతుందని, ఈ పధకానికి సంబంధించి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం కింద నిధులు కేటాయింపు జరుగుతుందన్నారు. ఒక్కొక్క మొక్కకు 35 రూపాయలు, నీటి వసతికి 15 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఈ పధకంలో లబ్ధిదారుల ఎంపికను గ్రామసంఘాలు చేపడతామని అయితే ఉపాధి హామీ పధకంలో జాబ్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కులాలకు చెందిన వారు, నిరుపేద రైతులు, ఉపాధి హామీ కింద 20 రోజుల పాటు ఉపాధి పనులు చేసి ఉండాలన్నారు. జిల్లాకు అవసరమైన ఉద్యాన మొక్కలను ముందస్తుగానే సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉద్యానశఋ౎ఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 1 తరువాత ఈ పధకం అమలులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమం అమలు తీరుపై సంబంధిత మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద ఫలసాయాన్నిచ్చే మొక్కలను నాటుకుని అభివృద్ధి పరుచుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల భూములకు అనుగుణంగా ఫలసాయాన్నిచ్చే మొక్కలను సరఫరా చేయవలసి వుంటుందన్నారు. జిల్లాలో గత ఏడాది పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి మూడు మొక్కలు చొప్పున ఇందిరమ్మ కాలనీలలో లక్ష మొక్కలను నాటామని, పాఠశాలల్లో 75 వేల పండ్ల మొక్కలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పది లక్షల మొక్కలు నాటామన్నారు. ఏటిగట్లపై కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
జిల్లా నిర్మల్ భారత్ అభియాన్ కింద పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పధకం కింద ఒక్కొక్క వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి పది వేల రూపాయలు అందిస్తున్నదని దీనిని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు యుద్ధప్రాతిపదికపై వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అదే విధంగా ఇందిర జలప్రభ, నిర్మల్ భారత్ అభియాన్ పధకాల తీరుపై ప్రత్యేకంగా సమీక్షిస్తానన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పధకం అమలుపై సంబంధిత అధికారులకు అవగాహన పర్చాలనే ఉద్దేశ్యంతో గురు, శుక్రవారాలలో ప్రత్యేక వర్కుషాపును నిర్వహిస్తున్నామన్నారు. ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలలో పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకంతో అనుసంధానించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచి పెద్ద ఎత్తున వనాలను అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని నిస్వార్ధంగా నిర్వహించాలన్నారు. అయిదు సంవత్సరాల కాల పరిమితితో కూడిన ఈ పధకంపై పూర్తి అవగాహన పొందాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. ఇప్పోటికే ఐకెపి భూమి వెబ్‌సైట్‌లో 26 మండలాల భూమికి సంబంధించిన వివరాలు ఉంచడం జరిగిందని మిగిలిన 20 మండలాల్లో కూడా వివరాలు సేకరించి వెబ్‌సైట్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఉత్పాదకత నిచ్చే మొక్కలను అందజేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఇ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ సి ఇవో నాగార్జునసాగర్, హౌసింగ్ పిడి సత్యనారాయణ, డి ఆర్‌డి ఎ పిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా మాలతీరాణి
ఉంగుటూరు, మే 9: రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రెండోసారి కూడా శరణాల మాలతీరాణికే అవకాశం దక్కింది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని శరణాల మాలతీరాణి తెలిపారు. గురువారం ఆమె మండల కేంద్రమైన ఉంగుటూరులో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. గతంలో మహిళా సమస్యల మీద, మహిళా కమిషన్‌కోసం మహిళా మోర్చా అనేక ఉద్యమాలు చేపట్టిందని ఈ సందర్భంగా మాలతీరాణి చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలపై లైంగిక దాడులు అరికట్టడానికి, పాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపించేందుకు కృషిచేస్తున్నట్టు మాలతీరాణి వెల్లడించారు. భ్రూణ హత్యల నివారణకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, స్కానింగ్ సెంటర్లపై నియంత్రణ ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్ట సభలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ సాధించేందుకు, చట్టాలపై మహిళలకు కనీస అవగాహన కల్పించడమే లక్ష్యంగా బిజెపి మహిళా మోర్చా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచి మహిళా సమస్యల పరిష్కారానికి కృషిచేయడం ముఖ్యోద్దేశమని మాలతీరాణి తెలిపారు.

గుణ్ణంపల్లిలో కిష్కింధకాండ
* వానరాలు దాడి డాబాపై నుండి మహిళలకు తీవ్రగాయాలు*ఇళ్లు ధ్వంసం: భీతిల్లుతున్న చిన్నారులు
ద్వారకాతిరుమల, మే 9: వానరాలు దాడి చేయటంతో ఒక మహిళ డాబాపై నుండి కిందపడటంతో ఆమె రెండుకాళ్లూ విరిగాయి. మండలంలోని గుండంపల్లిలో గురువారం ఉదయం కేతిరెడ్డి దుర్గ అనే మహిళ డాబాపై బట్టలు ఆరేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రామంలో ప్రతి నిత్యం మహిళలు, చిన్న పిల్లలపై వానరాలు దాడి చేస్తున్నాయని, అలాగే ఇళ్లను సైతం ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. తెల్లవారుతోందంటే ఏ కోతి మూక తమపైనా, తమ ఇళ్లపైనా దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. దూబచర్ల, నల్లజర్లలోని అటవీ ప్రాంతాలు దగ్ధం కావటం, చెట్లను నరికివేయటం వంటి కారణాల వల్ల అడవుల్లో ఉండవలసిన వానరాలు ఊళ్లపై పడ్డాయి. ఈ క్రమంలో గత నెల రోజులుగా అధిక సంఖ్యలో వానరాలు గుండంపల్లి వాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా అవి జరుపుతున్న దాడులలో గ్రామానికి చెందిన బళ్లారి సన్యశ్రీ, శిల్పారెడ్డి మంగాయమ్మ, నక్కా గంగమ్మతోపాటు పలువురు చిన్నారులు గాయపడ్డారు. నక్కా గంగమ్మ వీపుపై కోతి కరవటంతో ఆసుపత్రిలో కుట్లు వేయించుకుంది. తాజాగా దుర్గ బట్టలు ఆరేస్తుండగా వానరాలు అకస్మాత్తుగా దాడిచేయటంతో ఆమె డాబాపై నుండి కిందపడింది. అక్కడే పొయ్యి రాళ్లు ఉన్నా ఆమె పక్కనే పడటంతో రెండు కాళ్లు విరిగి ఆమె ప్రాణాలు నిలిచాయి. అధికారులు స్పందించి వానరాలు అరికట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

జిల్లాలో అటవీ హక్కుల చట్టం కింద
2715 ఎకరాలు పంపిణీ
ఏలూరు, మే 9 : జిల్లాలో అటవీ హక్కుల చట్టం కింద 1241 మందికి 2715 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు చెప్పారు. ఏలూరులో గురువారం అటవీ హక్కుల చట్టం అమలుతీరుపై జంగారెడ్డిగూడెం ఆర్డీవోతో ఆయన చర్చించారు. ఎన్నో దశాబ్ధాల నుండి అటవీ భూములను నమ్ముకుని సేద్యం చేస్తున్న పేదలను గుర్తించి ప్రభుత్వం తొలి దశగా 1189 మందికి 2645 ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా జారీ చేయడం జరిగిందని, 52 మందికి కమ్యూనిటీ పరంగా 70 ఎకరాల భూమిని అందించినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 12 మండలాల్లో 116 గ్రామ పంచాయితీల పరిధిలో అటవీ శాఖ ప్రాబల్యంలో భూములు ఉన్నాయని, వాటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఎన్నో దశాబ్ధాల నుండి అటవీ భూములను నమ్ముకున్న గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యేక అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తోందని చెప్పారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో అటవీ హక్కుల చట్టం క్రింద ఆదివాసులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. బుట్టాయిగూడెం మండలం రాజానగరం (మిగతా 6వ పేజీలో)
గ్రామ పంచాయితీ రెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన 83 మంది ఆదివాసులకు 156 ఎకరాల భూమి కేటాయించాలని దరఖాస్తు చేయగా వాటిని డివిజనల్ స్థాయి కమిటీ తిరస్కరించడంపై జిల్లా కమిటీకి ఆదివాసీ గిరిజనుల తరఫు న్యాయవాది పి త్రినాధరావు అప్పీలు చేసారని దాన్ని జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని జెసి చెప్పారు. ఆదివాసీల హక్కులను హరిస్తే తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని ఆదివాసీల తరఫు న్యాయవాది త్రినాధరావు స్పష్టం చేశారు. కొండరెడ్డిలకు సంబంధించి 83 దరఖాస్తులు గ్రామ సభ సిఫార్స్ చేసి డివిజన్ కమిటీకి పంపించిందని అయితే వారికి పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము న్యాయపరంగా పోరాడి ఆదివాసులకు అటవీ భూములు అందేలా చూస్తామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో నాన్‌రాజు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరాటంకు మంత్రి వసంత్ పరామర్శ
జంగారెడ్డిగూడెం, మే 9: డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబును గురువారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ పరామర్శించారు. రాంబాబు సోదరుడు కరాటం మురళి మృతి చెందిన వైనం విదితమే. పట్టణంలోని కరాటం మురళి ఇంటికి వచ్చిన మంత్రి వట్టి వసంతకుమార్ మురళితో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మురళి కుటుంబ సభ్యులను, కుమారుడు కార్తీక్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. మురళి సోదరులు కరాటం రాంబాబు, వెంకటరెడ్డి నాయుడు, ఉమామహేశ్వరరావులకు సానుభూతి తెలిపారు. మురళి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కరాటం కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) కూడా ఉన్నారు. కాగా, గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎం.రమేష్ కరాటం మురళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరాటం రాంబాబు, ఆయన సోదరులు వెంకటరెడ్డి నాయుడు, ఉమామహేశ్వరరావులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఎస్పీ వెంట స్థానిక డియ్యస్పీ టి.రామకృష్ణారావు, సి.ఐ పి.మురళీరామకృష్ణ ఉన్నారు.

షర్మిల పాదయాత్ర విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మద్దాల
జంగారెడ్డిగూడెం, మే 9: చింతలపూడి నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీ నుండి జరగనున్న మరో వైఎస్‌ఆర్‌సి పార్టీ నేత షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మండల స్థాయి వైఎస్‌ఆర్‌సి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 9 జిల్లాల్లో పూర్తి చేసుకుని 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా నుండి పశ్చిమగోదావరి జిల్లాలో గురుభట్లగూడెంలో ప్రవేశిస్తుందని తెలిపారు. గురుభట్లగూడెంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని కోరారు. 12వ తేదీ రాత్రి లింగగూడెం దాటిన తరువాత షర్మిల బస ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 13వ తేదీ ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలవుతుందని రాఘవాపురం, డి.ఎన్.రావుపేట, పోతునూరు, మల్లాయగూడెం, సమ్మిటవారిగూడెంలలో పాదయాత్ర జరుగుతుందని, చింతలపూడికి దగ్గరలో రాత్రి బస ఉంటుందని తెలిపారు. 14వ తేదీన చింతలపూడి, తీగలవంచ, టి.నరసాపురం చేరుకుంటుందని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో 14, 15వ తేదీలలో టి.నరసాపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు పాదయాత్ర కామవరపుకోట మండలం రావికంపాడు చేరుకుంటుందని తెలిపారు. అక్కడికి షర్మిల పాదయాత్రకు 150 రోజులు పూర్తవుతాయని, రెండు వేల కిలోమీటర్లు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త మొవ్వా ఆనంద్ శ్రీనివాసరావు, చింతలపూడి నియోకవర్గ సమన్వయ కర్త డాక్టర్ కర్రా రాజారావు, పార్టీ నేతలు పోల్నాటి బాబ్జి, పాశం రామకృష్ణ, నులకాని వీరాస్వామినాయుడు, చనమాల శ్రీనివాసరావు, దల్లి తుకారంరెడ్డి, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు పాల్గొన్నారు.

హాకీకి పూర్వవైభవానికి యువ క్రీడాకారులు కృషి చేయాలి
భీమవరం, మే 9: హాకీ భవిష్యత్తు క్రీడాకారులపై ఉందని, హాకీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు యువ క్రీడాకారులు కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం స్థానిక భారతీయ విద్యాభవన్స్‌లో జరుగుతున్న మల్లినీడి సత్యనారాయణమూర్తి మెమోరియల్ మూడవ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇందులో చిత్తూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. కడప - చిత్తూరు మధ్య జరిగిన 3-2 స్కోరుతో చిత్తూరు జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో నిజామాబాద్, నాల్గవ స్థానంలో విశాఖపట్నం జట్లు నిలిచాయి. ద్వితీయ స్థానం పొందిన కడప జట్టుకు ఎసిబి డిఎస్పీ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య దాత మల్లినీడి సుధాకర్ మాట్లాడుతూ తన తండ్రి పేరుమీద ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తానన్నారు. ఎక్సైజ్ ఆఫీర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు భారతదేశ కీర్తిప్రతిష్టలు పెంచిన జాతీయ క్రీడ హాకీ అన్నారు. దీనిని మరింత వృద్ధిచేయాల్సిన బాధ్యత క్రీడాకారులపై ఉందన్నారు. జిల్లా హాకీ కార్యదర్శి జి సతీష్‌బాబు, గోపన్నపాలెం వ్యాయామ కళాశాల పిడి శ్యామల, ఆరేటి ప్రకాష్, ఆదిరెడ్డి సత్యనారాయణ, భవన్స్ డైరెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

డిసిసిబి బ్రాంచిల కంప్యూటరీకరణతో ఉత్తమ సేవలు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు రత్నం
దేవరపల్లి, మే 9: జిల్లాలో అన్ని డిసిసిబి బ్రాంచిలను కంప్యూటరీకరించి రైతులకు, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) వెల్లడించారు. గోపాలపురంలో గురువారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పోతుల రామతిరుపతిరెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ నాబార్డు ఆదేశాల మేరకు జిల్లాలో 25 సొసైటీలను ఎంపికచేసి మోడల్ సొసైటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన సొసైటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధి చేయనున్నట్టు రత్నం చెప్పారు. సహకార రంగంలోగల లోటుపాట్లను అధ్యయనం చేయడానికి, ఇతర పరిస్థితులను తెలుసుకోడానికి తాను ఇటీవల సిక్కిం, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించినట్టు ఆయన తెలిపారు. సిక్కింలో అధిక శాతం గిరిజన జనాభా ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవడం వల్ల సహకార రుణాలను వారు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. అదేవిధంగా బంగారంపై తక్కువ శాతం రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎంపిక చేసిన సొసైటీల్లో మంచి ఫలితాలు వచ్చినట్టయితే జిల్లాలో అన్ని సొసైటీలను మోడల్ సొసైటీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గోపాలపురం డిసిసిబి బ్రాంచిలో సంవత్సరంన్నర క్రితం బంగారు రుణాలపై అవినీతి జరిగిందని, మరో 15 రోజుల్లో ఈ అవినీతిని పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రత్నం స్పష్టం చేశారు. అంతకుముందు పోతుల రామతిరుపతిరెడ్డి మాతృమూర్తి సీతారాజేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉండవల్లి సుభాష్‌చంద్రబోస్, అడ్డూరి రామారావు, కురుకూరి నాగేశ్వరరావు, జ్యేష్ఠ సతీష్, కాసగాని గోపాలకృష్ణ గోఖలే, మద్దిశెట్టి అన్నవరం, మాకిరెడ్డి జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమలపై అమావాస్య ప్రభావం
ద్వారకాతిరుమల, మే 9: చిన వెంకన్న క్షేత్రంపై అమావాస్య తన ప్రభావాన్ని చూపింది. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే శ్రీవారి క్షేత్రం గురువారం వెలవెలబోయింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం, తిథి ప్రభావ కారణంగా ఆలయంలోని అన్ని విభాగాలు దాదాపు ఖాళీగా కనిపించాయి. శ్రీవారి దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల టిక్కెట్ల కౌంటర్లు, కేశ ఖండన శాల విభాగాలలో భక్తులు కానరాలేదు. భక్తులు లేని కారణంగా ఆలయ పరిసరాలలోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఖాళీగా కనిపించాయి. భక్తుల రద్దీతో నిత్యం కళకళలాడే బస్టాండ్ సైతం జనాల్లేక నిర్మానుష్యంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతోపాటు వైశాఖ మాసం ఆరంభం రోజైన శుక్ర, శనివారాల నుండి భక్తుల రద్దీ పెరగవచ్చునని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

20 నుండి శ్రీవారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు
ద్వారకాతిరుమల, మే 9: శ్రీవారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఈ నెల 20నుండి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు. ఉత్సవాలు ప్రారంభం రోజైన 20వ తేదీన స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగానూ ముస్తాబు చేస్తారు. 21న ధ్వజారోహణ, 23న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ రాత్రి 9గంటలకు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగనుంది. 25న రథోత్సవం, 26న శ్రీచక్రవారుయుత్సవం, ధ్వజారోహణ, 27న జరిగే శ్రీ పుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. శ్రీవారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 20నుండి 27వ తేదీ వరకూ ఆలయం నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దుచేస్తున్నట్లు ఇఒ త్రినాధరావు తెలిపారు.

కలెక్టర్ స్పష్టీకరణ
english title: 
collector

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles