విజయనగరం, మే 9: త్వరలో ట్రెజరీ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్ చేయనున్నట్టు ట్రెజరీశాఖ రిటైర్డ్ డైరెక్టర్ బ్రహ్మయ్య చెప్పారు. ఇందుకోసం జిల్లాలో అధ్యయనం చేస్తున్నామని అన్నారు. 18 నెలల్లో అధ్యయనం పూర్తి చేసి ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో అధ్యయనం చేశామని, విజయనగరం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని రెండు రోజులపాటు 18 శాఖలకు సంబంధించిన ఖాతాలను పరిశీలిస్తామని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులతో మినీ కానె్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం (కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా ఎన్‌ఎపిఇఆర్‌సి సాఫ్ట్‌వేర్ నందు ప్రభుత్వ శాఖల వివరాలను నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఉద్యోగులు, పింఛనుదార్లు వారి సర్వీసు వేతనాలు, రావల్సిన బకాయిలు, పింఛను తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారాఎక్కడి నుంచైనా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా ట్రెజరీ చెల్లింపుల పద్దతి అమలైతే ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కాగితాలపై బిల్లులు రాసి ట్రెజరీలో సమర్పించే పని ఉండదన్నారు. మొత్తం డేటా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో ఇద్దరేసి చొప్పున సాంఘీక సంక్షేమం, వైద్యశాఖ, ట్రెజరీ, డ్వామా, గిరిజన సంక్షేమం, ఆడిట్, ఇంజనీరింగ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ తదితర శాఖలను సందర్శించి బడ్జెట్ విడుదల, మంజూరు తదితరవాటిపై వేర్వేరు హెడ్‌ల ద్వారా డ్రా చేసినపుడు ట్రెజరీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. ఈ బృందంలో రమణారావు, మహేష్‌కుమార్, రవికుమార్, త్యాగి, సురేంద్రనాద్ ప్రభ సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ అధ్యయనానికి వచ్చిన బృందానికి శాఖలన్ని సహకరించి వారు కోరిన సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ నూతన వ్యవస్థలో ఉద్యోగులకు సత్వర సేవలు అందగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటా సర్వే నిర్వహించండి: కలెక్టర్
విజయనగరం, మే 9: జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా జరగాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. గురువారం తన చాంబర్‌లో వివిధ మండలాల తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా సర్వే నిర్వహించి శతశాతం ఓటర్లను నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డూప్లికేషన్ లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ప్రతీ ఏటా 1.76 శాతం మంది 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసే అవకాశం ఉన్నందున జిల్లాలో సుమారు 16.17 లక్షల ఓటర్లలో మరో 30వేలు పెరిగే వీలుందన్నారు. అదే విధంగా 2 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున 36వేల ఓటర్లు తగ్గే వీలుందన్నారు. ఈ రెండు అంశాలపై బూత్ లెవెల్ అధికారులు ప్రత్యేక దృష్టిసారిచి చేర్పులు, తొలగింపులు చేపట్టాలన్నారు. అదే విధంగా స్ర్తి పురుష నిష్పత్తి 1030:1000 ఉన్నందున దానిని కూడా ఓటరు నమోదులో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వలసలు, ఓటరు నమోదు చేసుకోని వారిపై కూడా దృష్టిసారించాలన్నారు. బిఎల్‌ఓలు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంటింటా సర్వే నిర్వహించి కొత్త ఓటర్లను గుర్తించాలన్నారు. అర్హత ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు ఎన్నికల్లో కనీసం 95 శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. జనాభాలో 65 శాతం మంది ఓటర్లు ఉంటారని అంచనా ఉన్నందున ఓటరు జాబితా రూపొందించే సందర్భంలో దానిని దృష్టిలో పెట్టుకొని డూప్లికేషన్లను సరిచేసుకోవాలన్నారు. అదే విధంగా 60 శాతం కన్నా తక్కువ మంది ఓటర్లు ఉంటే ఓటర్లుగా నమోదు చేయించుకోని వారు ఉన్నట్టు గుర్తించాలన్నారు.
ఓటరు నమోదుకు కళాశాలలు, కొండ ప్రదేశాలు, ఎస్సీ కాలనీలు తదితర వాటిపై దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో జెసి శోభ, ఎజెసి హేమసుందర్, ఆర్డీవోలు రాజకుమారి, వెంకటరావు, మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.
గూడ్స్ ఇంజన్‌లో సాంకేతిక లోపం..ఆగిన పలు రైళ్లు
కొత్తవలస, మే 9 : మండలంలోని కంటకాపల్లి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లాట్‌ఫాం నెంబర్-2లో ఆగిపోయింది. దీంతో విశాఖపట్నం నుండి విజయనగరం వైపు వెళ్లే పలు రైళ్లు సుమారు గంటన్నర సమయం ఆగిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్‌లో విశాఖ-కోరాపుట్, రాయగడ పాసింజర్, సమతా, అలాగే బెంగుళూర్ నుంచి ఎన్నికల డ్యూటీ ముగించుకుని వచ్చి ఆర్మిడ్ స్పెషల్ పోలీస్ ట్రైనులు గంట సేపు ఆగిపోయాయి. ప్రయాణీకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింహాచలం నార్త్ నుండి పవర్ ఇంజన్‌ను రప్పించి ఆగిఉన్న గూడ్స్‌ను ప్రక్క ట్రాక్‌కు మళ్లించారు. దీంతో మార్గం సుగమమైంది.
ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
పార్వతీపురం, మే 9: విజయనగరం, విశాఖ నగరంలోని వివిధ క్యాంపస్‌లలో ఎంసెట్‌కు పార్వతీపురం డిపోనుండి ఐదు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఇక్కడి ఆర్టీసీ డిపోమేనేజర్ ఎన్‌వి ఎస్ వేణుగోపాల్ తెలిపారు. విజయనగరం నుండి ఎం వి జి ఆర్ కాలేజీకి రూ.10లు చార్జీ వసూలు చేస్తామన్నారు. అలాగే జె ఎన్ టియు, తదితర ఇంజనీరింగ్ కాలేజీల నుండి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సుకు రూ.10లు కనీస చార్జీతో ఎక్స్‌ప్రెస్, డీలక్సు బస్సులలో అనుమతిస్తామన్నారు. ఈమేరకు ఆర్టీసీ ట్రాఫిక్‌వైజర్లను ఆయా ఇంజనీరింగు కాలేజిల వద్ద ఏర్పాటు చేసి, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం, బొబ్బిలి నుండి విజయనగరం ఎం వి జి ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద దిగడానికి పది రూపాయల అదనపుచార్జీతో అనుమతిస్తామన్నారు.
‘రైతు సదస్సులకు భారీ ఏర్పాట్లు చేయాలి’
విజయనగరం, మే 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించనున్న రైతు సదస్సులకు జిల్లాలో రెండు డివిజన్లలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రవాణాశాఖా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. విజయనగరం డివిజన్ పరిధిలో 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో సభ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధగా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. సభకు హాజరయ్యేవారిక ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడి లీలావతి, ఆర్టీవో మీరాకుమార్, ఎపిఎంఐపి పివో అశోక్‌కుమార్, డిపిఆర్‌ఓ గోవిందరాజులు, లీడ్‌బ్యాంక్ మేనేజర్, అటవీశాఖ, పట్టుపరిశ్రమ, సుగర్స్, ఉద్యానవనశాఖ, పశుసంవర్థకశాఖల అధికారులు పాల్గొన్నారు
వైభవంగా చందనోత్సవం
పార్వతీపురం, మే 9: పట్టణంలోని మెయిన్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి ఘనంగా చందనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ పూజారి గణపతి ప్రసాద్ పండా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ చందనోత్సవ కార్యక్రమం ఈనెల 12వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా 13 వతేదీన స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఆలయ పూజారి పండా తెలిపారు. అలాగే 14వ తేదీన స్వామివారి తిరువీధి ఉత్సవాలు పురవీధుల్లో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు భుక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదములు స్వీకరించాలని ఆలయపూజారి గణపతి ప్రసాద్ పండా కోరారు.
‘వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నించొద్దు’
విజయనగరం , మే 9: పట్టణంలో పలు అభివృద్ధిపనులకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేయ్యెద్దని స్థానిక ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజుకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సలహా ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమాధానాలు ఇప్పించారు. మున్సిపాలిటీలో నిధులు మురిగిపోయాయని, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని కొద్దిరోజుల క్రితం కోలగట్ల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయానికి అశోక్ వెళ్లి నిధుల విషయమై ఆరా చేశారు. మున్సిపాలిటీలో నిధులు మురిగిపోతే తాను ప్రతిపాదించిన 127 పనులను ఎందుకు చేపట్టలేదని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామిని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ సమాధానం చెబుతూ మున్సిపాలిటీలో నిధులు మురిగిపోలేదన్నారు. ఈ వ్యవహారంలో అశోక్ స్పందిస్తూ కోలగట్లపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కోలగట్ల వచ్చి ఏయే పథకాల ద్వారా ఎంతెంతమేరకు నిధులు వచ్చాయో అకౌంటెంట్ లక్ష్మీనారాయణ బిసోయి ద్వారా సమాధానం ఇప్పించారు. తాను ఎమ్మెల్సీగా నియమితులైన రెండునెలల్లోనే 1.8 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధిపనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్‌తోపాటు పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
డెంకాడ, మే 9 : వేసవి కాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇక్కడి పిహెచ్‌సి వైద్యాధికారి నాగరాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో కనీస జాగ్రత్తలను పాటించాలని కాచివడపోని నీరు తాగాలని వడదెబ్బకు గురి కాకుండా ఎక్కువ నీరు తాగాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన గ్రామ సందర్శనలలో 70 వైద్య శిబిరాలు నిర్వహించామని, క్షయ వ్యాధిగ్రస్తులు 33 మంది ఉన్నారని, వారికి సక్రమంగా మందులు అందేలా చర్యల చేపడుతున్నామని, ప్రస్తుతం డయేరియా వంటి కేసులు ఏమీ లేవని, సంక్షేమ శస్త్ర చికిత్సలు మార్చి నాటికి 262 చేశామని నెలకు సుమారు 22 కేసులు చేస్తామని, ఓపి కూడా నెలకు 1400 నుంచి 1600 వరకు ఉంటుందని మందులు సక్రమంగా అందుతున్నాయని అలాగే ఆరోగ్య కేంద్రంలో ఎపిఓఎంఒ పోస్టు ఖాళీగా ఉందని పిహెచ్‌సి పరిధిలోని ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని అందులో అక్కివరం గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం తప్ప సింగవరం పెదతాడివాడ గ్రామాల్లో ఉన్న వాటికి పక్కా భవనాల లేవని, 104 ద్వారా గ్రామాల్లో సక్రమంగా వైద్య సేవలు అందిస్తామని నెలలో మొదటి సోమవారం గంట్లాం, తమ్మాపురం, రెండవ సోమవారం గునుపూర్‌పేట, బెతనాపల్లి, రెండవ మంగళవారం బంటుపల్లి, గోడ్డుపాలెం, మూడవ మంగళవారం అక్కివరం గంట్లాం, రెండవ గురువారం డి.కొల్లాం, చోల్లంగిపేట, మూడవ గురువారం సింగవరాంల్లో పర్యటించి వైద్య సేవలు అందచేస్తున్నామని ఆయన తెలిపారు.
విమర్శలకు వేదికగా మారిన మున్సిపల్ కార్యాలయం
విజయనగరం , మే 9: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో రాజకీయపార్టీల నాయకులు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూ పత్రికలకెక్కారు. అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ హడావిడి సృష్టిస్తుండటం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో పలు అభివృద్ధిపనులకు సంబంధించి గత కొన్నిరోజులుగా మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సమీక్షలు జరుపుతున్నారు. నెలరోజులపాటు ప్రతిరోజు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వారం వారం బోరుబావిని ఏర్పాటుచేసేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు నిర్లక్ష్యం వల్లే మున్సిపాలిటీలో నిధులు మురికిపోయాయని, పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్టణాభివృద్ధి గురించి దృష్టిసారించానని, నిల్వ ఉన్న నిధుల ద్వారా అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. దీనిలోభాగంగా గత కొన్నిరోజులుగా రోడ్డు, కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే అశోక్‌గజపతిరాజుపై ఎమ్మెల్సీ కోలగట్ల చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తెలుగుదేశం నాయకులు స్పందించారు. ఎమ్మెల్సీ ఆరోపణలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో అశోక్‌గజపతిరాజు, ఇతర నాయకులు బుధవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మురిగిపోయిన నిధుల గురించి ఆరా తీశారు. ఎంతమేరకు నిధులు మురికిపోయ్యే చెప్పాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామిని కోరారు. నిధులు మురిగిపోలేదని, నిల్వ ఉన్నాయని కమిషనర్ సమాధానం చెప్పారు. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని వేదికగా చేసుకోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండుపార్టీల నాయకులతీరు వల్ల అధికారులు ఇరకాటంలో పడుతున్నారు.
‘అమ్మహస్తం’కు తప్పని బాలారిష్టాలు!
గజపతినగరం, మే 9 : అర్హులైన లభ్ధిదారులందరికీ ప్రభుత్వం తొమ్మిది రకాల సరకులు సబ్సిడీపై అందించాలన్ని ఉద్దేశ్యంతో ప్రారంభించిన అమ్మహస్తం ఇంకా బాలరిష్టాలు దాటలేదు. ఇటీవల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించారు. చౌక డిపోల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రారంభం నెలలోనే కొన్ని సమస్యలు ఉన్నాయని వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామని హామీలు గుప్పించారు. అరకిలో పంచదార, కందిపప్పు కిలో, లీటరు పామోలిన్ ఆయిల్, చింతపండు అరకిలో, కారం పావుకిలో, పసుపు 100 గ్రాములు, గోదుపిండి, గోధుమలు కిలో వంతున, ఉప్పు కిలో పంపిణీ చేపడుతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత జిల్లాలో 27 శాతం మంది లభ్ధిదారులకే పూర్తి సరకులు పంపిణీ చేశారు. ప్రతినెల పంచదార, పామోలిన్, కంది పప్పు, గోధుమలు, దుకాణాల ద్వారా పంపిణీ చేయగా పధకంలో అదనంగా మరో ఐదు రకాల వస్తువులు చేరినప్పటికి పంపిణీ చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారు. మండలంలో 16,140 తెలుపు కార్డులు ఉండగా అందులో అంత్యోదయ 1280, అన్నపూర్ణ 29 కార్డులు ఉన్నాయి. ఈనెల పౌరసరఫరాల గిడ్డంగికి తొమ్మిది సరకులకు గాను గోధుమలు, ఉప్పు రాలేదు. అంటే ఈనెలకు ఏడు రకాల సరకులు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల నాలుగు రకాల వస్తువులు వినహాయిస్తే ఈ పథకం ద్వారా మూడు రకాల సరకులనే ఇచ్చినట్లు అవుతుంది. గిడ్డంగికి గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు కలిపి పంచదార 220 క్వింటాళ్లు, కంది పప్పు 100 క్వింటాళ్లు, పామోలిన్ 25 వేల ప్యాకెట్లు, చింతపండు 10 వేల ప్యాకెట్లు, కారంపొడి 21 వేల ప్యాకెట్లు, పసుపు 3 వేల ప్యాకెట్లు గోధుమ పిండి 9 వేల ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈనెల కూడా 50 శాతం లబ్ధిదారులకు కూడా సరుకులు రాలేదు. వచ్చిన ఏడు రకాల సరకుల్లో కూడా సగానికిపైగా లబ్ధిదారులకు రాకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు.‘
ఓటరు నమోదు క్లయిమ్‌లు త్వరగా పరిష్కరించాలి
విజయనగరం, మే 9: ఓటరు నమోదు కోసం వచ్చిన కైయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. గురువారం రాత్రి ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ప్రతి ఓటరు ఇంటి నంబరు నమోదై ఉండాలన్నారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించి ఓటర్లు లేనట్టయితే వాటిని తొలగించాలని, ఇందుకు సంబంధిత బిఎల్‌ఒలు తనిఖీలు చేసి పేర్లను తొలగించాలని సిఇఒ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 2.20 లక్షలు ఓటర్లను సవరించడం ఇంకా మిగిలిన దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేపట్టడం జరుగుతుందని, బిఎల్‌ఒలకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే ఎపిక్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ పోలింగ్ నమోదవుతున్న కేంద్రాల్లో దానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. జెసి శోభ, ఎజెసి హేమసుందర్ పాల్గొన్నారు.