Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అందరి నేస్తం... భారత్

$
0
0

విశాఖపట్నం, మే 9: పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని మన దేశం నిరంతరం ఆకాంక్షిస్తుందని రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. భారత కోస్ట్ గార్డ్ కోసం విశాఖలోని హిందుస్తాన్ షిప్ యార్డు తయారు చేసిన ఐసిజిఎస్ రాణి అవంతిబాయి నౌకను మంత్రి జితేంద్ర సింగ్ గురువారం జల ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా హిందుస్తాన్ షిప్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొరుగు దేశాలతో సత్ సంబంధాలు కొనసాగించేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ కృషి చేయాలని సూచించారు. ముంబై దాడుల తరువాత తీర ప్రాంత భద్రతను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. కోస్ట్‌గార్డ్ ద్వారా నిఘాను పటిష్ఠం చేశామని ఆయన తెలియచేశారు. ముఖ్యంగా మత్స్యకారులు తీర ప్రాంత భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతున్నారని ఆయన అన్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది కూడా మత్స్యకార గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. భారత నౌకా దళానికి అవసరమైన యుద్ధ విమానాలు, నౌకలను అనుకున్న లక్ష్యానికి ముందుగానే తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భారత వైమానిక దళంలో అత్యాధునిక జెట్ ఇంజన్లను వినియోగిస్తున్నామని మంత్రి జితేంద్ర సింగ్ తెలియచేశారు. ప్రపంచంలోని ఏడు, ఎనిమిది దేశాలు మాత్రమే ఈ ఇంజన్లను వినియోగిస్తున్నాయని ఆయన తెలియచేశారు. భారత నౌకాదళంలోని అత్యాధునిక, అతి భారీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య త్వరలోనే రానున్నదని ఆయన చెప్పారు. గత కొంత కాలంగా దీని నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, త్వరలోనే ఈ నౌకను జల ప్రవేశం చేయిస్తామని ఆయన చెప్పారు. ఇక లడక్‌లోని పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన వివరించారు. హిందుస్తాన్ షిప్‌యార్డు దేశంలోని ఇతర షిప్ యార్డుల నుంచి పోటీని తట్టుకుని, అత్యాధునిక నౌకలను తయారు చేయాలని అన్నారు.
ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపలియాల్ మాట్లాడుతూ భారత తీర ప్రాంత భద్రతా దళం కొత్త తరహా పెట్రోలింగ్ వెసల్స్‌ను సమకూర్చుకుంటోందని అన్నారు. గురువారం జలప్రవేశం చేసిన రాణి అవంతిబాయి నౌక బహుళ ప్రయోజనాలు కలిగి ఉంటుందని అన్నారు. సముద్రపు దొంగలను తుదముట్టించడంతో పాటు ఆపదలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు నౌకలో ఉన్నాయని అన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ 43 యుద్ధ నౌకలు, 26 బోట్స్,రి 60 ఎయిర్ క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోందని అన్నారు. 2009లో 22 కోస్ట్ గార్డ్ కేంద్రాలు మాత్రమే భారత సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవని, తాజాగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సంవత్సరాంతానికి 42 కొత్త కోస్ట్‌గార్డ్ కేంద్రాలు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు. కోల్‌కత్తాలో ఒక ప్రాంతీయ కోస్ట్‌గార్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తపలియాల్ తెలియచేశారు. అలాగే 46 రాడార్ కేంద్రాలను మొదటి దశలో ఏర్పాటు చేస్తున్నామని, రెండో దశలో 38 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియచేశారు.
నౌక విశేషాలు
ఐసిజిఎస్ రాణి అవంతిబాయి (ఇన్ షోర్ పెట్రోల్ వెసల్) 50 మీటర్ల పొడవు, 300 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది 30 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. భారత, ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తయారు చేశారు. ఇందులో 30 మంది సిబ్బంది, ఐదుగురు అధికారలు ఉంటారు. ఈ నౌక విశాఖలోని కోస్ట్‌గార్డ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ నౌకకు కమాండింగ్ ఆఫీసర్‌గా కమాండెంట్ ఆశిష్ సిన్హా వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమంలో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ ఆర్‌కె మాధూర్, చీఫ్ నేవల్ స్టాప్ విమల్ కుమార్ శర్మ, హిందుస్తాన్ షిప్ యార్డు మేనేజింగ్ డైరక్టర్ ఎన్‌కె మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎస్‌ఎల్‌కు మంత్రి కితాబు
ఇదిలా ఉండగా హిందుస్తాన్ షిప్‌యార్డుకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రర సింగ్ కితాబునిచ్చారు. దేశంలో అతి పెద్ద నౌకా నిర్మాణ కేంద్రాల్లో హెచ్‌ఎస్‌ఎల్ ఒకటని అన్నారు. ఇక్కడ యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేశంలో వివిధ నౌకా నిర్మాణ కేంద్రాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిర్ణీత సమయం కన్నా, ముందుగానే నౌకలను తయారు చేసి ఇవ్వాలని ఆయన సూచించారు. హిందుస్తాన్ నౌకా నిర్మాణ కేంద్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేశారు. డిఫెన్స్ ప్రొడక్షన్స్ సెక్రటరీ మధూర్ మాట్లాడుతూ షిప్ యార్డు అభివృద్ధికి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే షిప్ యార్డుకు భారీ ఆర్డర్స్ ఇస్తామని అన్నారు.

మావో నేత వెంకటరమణ అరెస్ట్
అనకాపల్లి టౌన్, మే 9: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నక్సల్స్ దళాల సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యుడు మార్పు వెంకటరమణ అలియాస్ జగదీష్‌ను అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకందిన సమాచారం మేరకు ఈస్ట్‌కోస్ట్ రైల్‌లో రాత్రి 9 గంటల తర్వాత అనకాపల్లి స్టేషన్ నుండి దిగి జగషీద్ వెళ్తుండగా ముందస్తు సమాచారం ప్రకారం అప్పటికే పహారా కాసిన అనకాపల్లి పట్టణ పోలీసులు జగదీష్‌తో పాటు మరో ముగ్గురు కొరియర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ కాలికి తీవ్ర గాయమై కుంటుతూ నడుస్తుండగా అతన్ని, అతని అనుచరులను అనకాపల్లి డిఎస్పీ విఎస్‌ఆర్ మూర్తి, టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు అరెస్టు చేశారు. జగదీష్‌పై ప్రభుత్వం 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. గత నాలుగేళ్ళ కాలంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో వివిధ నక్సల్స్ దాడుల్లో జగదీష్ ప్రధాన పాత్ర వహించారు. శ్రీకాకుళం జిల్లా మందసకు చెందిన జగదీష్‌ను పట్టణ పోలీసులు మరింత సమగ్ర సమాచారం కోసం విచారిస్తున్నారు. స్థానిక వంద పడకల ఆస్పత్రిలో వైద్యచికిత్సలు జరిపి కోర్టుకు హాజరు పర్చారు. నక్సల్స్ దళ నాయకుడు అనకాపల్లిలో అరెస్టు కావడం పెద్ద సంచలనం కలిగించింది.

బిపిఎల్ కొళాయి కనెక్షన్ ఇక ఫ్రీ
* దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు ఊరట
* నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

విశాఖపట్నం, మే 9: దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు ప్రభుత్వ ప్రకటన ఊరట కలిగించింది. మండు వేసవిలో చల్లటి నిర్ణయాన్ని ప్రకటించింది. నగర పరిధిలో కొళాయి మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకున్న బిపిఎల్ వర్గాలకు ఉచితంగానే కనెక్షన్ మంజూరు చేసేందుకు జివిఎంసి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2.35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వర్గాలకు 1200 రూపాయలకే కొళాయి కనెక్షన్ జివిఎంసి మంజూరు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా వీటి మంజూరును నిలిపివేశారు. ఇప్పటి వరకూ జివిఎంసి వద్ద బిపిఎల్ కింద కనెక్షన్ కోరుతూ 12 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ఉచితంగా కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలంటే 1.44 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 12వేల కనెక్షన్లను మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు.

బెంగుళూరుకు మరో ఎసి బస్
విశాఖపట్నం, మే 9: ప్రయాణీకుల నుంచి వచ్చిన స్పందనతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగుళూరుకు మరో ఎసి బస్‌ను నడిపేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఇంద్ర సర్వీసును ప్రతి రోజు నడుపుతున్న ఆర్టీసీ మరో సర్వీసును నడిపేందుకు నిర్ణయించారు. అలాగే బెంగుళూరులో జరిగే కెసెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఒక ఎసి సర్వీసును నడపనున్న ఆర్టీసీ రద్దీ దృష్ట్యా మరో గరుడ సర్వీసును నడపనున్నట్టు ఆర్టీసీ డిసిటిఎం జీవన్ ప్రసాద్ తెలిపారు.

హిందూస్థాన్ షిప్‌యార్డుకు
పాతికవేల కోట్ల ఆర్డర్లు
* రక్షణశాఖమంత్రి హామీపట్ల టిఎస్సార్ హర్షం
విశాఖపట్నం, మే 9: హిందుస్థాన్ షిప్‌యార్డు సంస్థకు రూ.25 వేల కోట్ల మేర ఆర్డర్లు లభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి హామీనిచ్చారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌తోపాటు టిఎస్సార్ షిప్‌యార్డులో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హామీనివ్వడంపట్ల సుబ్బరామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రూ. 25వేల కోట్ల ఆర్డరర్లు హెచ్‌ఎఫ్‌ఎల్‌కు దక్కడం ద్వారా సంస్థకు పూర్వ వైభవం రాగలదని టిస్సార్ పేర్కొన్నారు. దీంతో సంస్థ కష్టాల నుంచి బయటపడగలదన్నారు. ఆర్డర్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న టిఎస్సార్‌ని ఇంటక్ నాయకులు గడసాల అప్పారావు అభినందించారు.

దారుణం
గోపాలపట్నం, మే 9 : ఆర్థిక బాధలు, భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలతో ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరాసా వద్ద గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నగరంలోని రైలేస్టేషన్‌లో బాక్స్‌బాయ్‌గా పని చేస్తున్న వెల్లంకి నాగేశ్వరరావు, భార్య నాగిని (30), ఇద్దరు కుమారులు మోహనకృష్ణ (11), తిరుమలరావు (9) రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. నాగిని చుట్టుపక్కల వారితో కలసి చిట్లు వేస్తుంటుందని, చిట్లు పాటిన వారు సమయానికి సొమ్ము చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని తెలిసింది. చిట్ పాడిన వారికి సొమ్ము చెల్లించకపోవడంతో వారి ఒత్తిడి పెరగడంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండేవారని తెలిసింది. బుధవారం ఉదయం భార్యాభర్తలు తగవు పడ్డారని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగిని తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుండి బయటికి వెళ్లిందని బంధువులు తెలిపారు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని భర్త నాగేశ్వరరావు భావించాడు. కానీ ఉదయం కరాసా వద్ద రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న నాగిని, ఇద్దరు పిల్లల శవాలను చూసిన వ్యక్తుల ద్వారా నాగేశ్వరరావు తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారడు. రైల్వేపోలీస్ డిఎస్పీ, భీమారావు, సిఐ పార్థసారథి, ఎస్‌ఐ బి.వి. రమణ సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం, మే 9: నగరంలోని మర్రిపాలెం ప్రధాన రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన ఓ యువతి మార్గ మధ్యలో, మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసి బస్సును డీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ విషాదకరమైన సంఘటన వివరాలివి.
జిల్లాలోని దేవరాపల్లి మండలం, పెదనందిపాలెం గ్రామానికి చెందిన కోట్ల నాయుడు(23), స్నేహితుడు యాసల ఎర్రినాయుడు(23)తో కలిసి గురువారం ఉదయం మోటారుబైక్‌పై నగరానికి చేరుకున్నారు. ఇక్కడ న్యూకాలనీలో ఉంటున్న దేవరాపల్లికి చెందిన కిల్లిదేవి(22) స్థానికంగా ఉన్న ఇళ్ళలో ఇంటి పనులు చేస్తూ కుటుంబం గడవడానికి సహాయ పడుతుంది. ఈమె తండ్రి వాచ్‌మ్యాన్‌గా పని చేస్తుండగా, తల్లి ఇళ్ళ పనులు చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ తరుణంలో బైక్‌పై దేవరాపల్లి నుండి వచ్చిన కోట్లనాయుడు, ఎర్రినాయుడు న్యూకాలనీలో దేవిని కలిశారు. అనంతరం వీరు ముగ్గురు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మర్రిపాలెం మీదుగా కరాసా వైపు వెళ్తుండగా బైక్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేకు చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో మోటారుబైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూరిపోగా బైక్‌ను నడుపుతున్న కోట్లనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాయుడుతో పాటు బైక్‌పై ఉన్న ఎర్రినాయుడు, కిల్లి దేవి తీవ్రగాయాలై అపస్మారకస్థితిలో కిందపడి ఉన్నారు. సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఎర్రినాయుడు, దేవిలను ఆటోలో స్థానికులు కెజిహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలో దేవి మృతి చెందగా, ఎర్రినాయుడు కెజిహెచ్‌లో చేర్చారు. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎర్రినాయుడు రాత్రి 8గంటల సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు కెజిహెచ్ మార్చురీకి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేశామని, రెండో కుమార్తె అయిన దేవిని పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుదామని ఆనుకున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రులు మార్చురీ వద్ద పెద్ద ఎత్తున విలపించారు. పోస్టుమార్టం సమయం దాటి పోవడంతో మూడు మృతదేహాలకు శుక్రవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. ట్రాఫిక్ ఎస్సై సూర్యనారాయణ నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

షిప్‌యార్డు కార్మిక నేతలతో జితేంద్ర సింగ్ సమావేశం
విశాఖపట్నం, మే 9: దీర్ఘకాలిక సమస్యలతో కొనసాగుతున్న హిందుస్తాన్ షిప్‌యార్డును గాడిలో పెట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నడుం బిగించారు. ఇప్పటికి వరకూ హెచ్‌ఎస్‌ఎల్ సమస్యలను ఢిల్లీలోనే కూర్చుని చర్చించేవారు. షిప్ యార్డులో కూర్చుని, కార్మిక సంఘాల నాయకులతో చర్చించడం ఇదే ప్రథమం. షిప్‌యార్డులో పనిచేస్తున్న కార్మికులకు జీత భత్యాలు తప్ప, బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. షిప్‌యార్డు యాజమాన్యం కూడా వీరికి న్యాయం చేయలేని దుస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి జితేంద్ర సింగ్ గురువారం కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

నేడు ఎంసెట్
విశాఖపట్నం, మే 9: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్‌లో ప్రవేశాలకు గాను ఎంసెట్ 13 పరీక్ష శుక్రవారం నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్షల నిర్వాహణకు సర్వం సిద్ధంచేశారు. జిల్లా వ్యాప్తంగా 24,212 మంది ఎంసెట్ పరీక్ష రాయనున్నారు. వీరిలో 18,491 మంది ఇంజనీరింగ్, 5721 మంది అగ్రికల్చర్, మెడిసిన్ ఎంట్రెన్స్ రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మెడిసిన్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. పరీక్షల నిర్వాహణుకు గాను జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు. పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టిన అభ్యర్ధిని గడువు ముగిసేంత వరకూ బయటకు పంపరు. పరీక్షకు బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఆన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ వెంట అప్లికేషన్ తీసుకురావాలి. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అలాగే ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు తమ వెంట కులధృవీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది.
ఎంసెట్‌కు ఆర్టీసీ 150 బస్‌లు
ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్టర్రోడ్డురవాణా సంస్థ 150 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. రూరల్ జిల్లాతో పాటు నగరంలోని అన్ని సిటీ డిపోల నుంచి బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ అధికారులు వారికి కేటాయించిన రూట్లలో ఎంసెట్ స్పెషల్ సర్వీసులను పర్యవేక్షిస్తారని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ తెలిపారు. అన్ని ప్రాంతాలను నుంచి ఎంసెట్ స్పెషల్ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాల్సిందే
విశాఖపట్నం, మే 9: రైల్వే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం రోజురోజకీ తీవ్రరూపం దాలుస్తోంది. తొలగించిన కార్మికులందరికీ కొత్త కాంట్రాక్టర్ పరిధిలోకి తీసుకుని కొనసాగించాలని కోరుతూ రైల్వే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గత పది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక రూపాల్లో చేపడుతున్న ఉద్యమాలకు రైల్వే అధికారులు, మరోపక్క కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో రోడ్డెక్కిన ఆందోళనకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దీనికి సిఐటియు సంపూర్ణ మద్ధతునిస్తోంది. దీనిలోభాగంగా గురువారం సిపిఎం లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ బాసుదేవ్ ఆచార్య డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న 261మంది స్వీపర్లు, క్వీనర్లు కాంట్రాక్ట్ కార్మికులను కొత్తగా వచ్చిన హర్యానా కాంట్రాక్టర్ గత నెల 29వ తేదీ నుండి పనుల నుండి తొలగించారన్నారు. కార్మికులు తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్ళ నుండి పనిచేస్తున్న పాత కార్మికులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డిఆర్‌ఎంను సిఐటియు నాయకులు విఎస్ పద్మనాభరాజు, పి.వెంకటరెడ్డి, ఎస్.జ్యోతీశ్వరరావు, ఎస్.కుమార్ కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. గతంలో సేవానగర్‌లో నివశించే వీరందర్నీ కాలనీ నుంచి ఖాళీ చేయించి కొమ్మాది, మధురవాడ ప్రాంతాలకు తరలించారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తరలించడంతో అక్కడ నుంచి ఉద్యోగాల కోసం రావడం ఖర్చుతో కూడుకున్నదని ఆనాడే విన్నవించుకోవడం జరిగిందని, అయితే మునిసిపల్ అధికారులు, రైల్వే అధికారులు ఆ నాటికి కాంట్రాక్ట్ కార్మికులుగా రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న వారికి ఉపాధికి ఆటంకం లేకుండా చూస్తామని హామీనిచ్చి మరీ సేవానగర్ నుంచి ఖాళీ చేయించారన్నారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ 261మందికి ఇంత వరకు చేస్తున్న వీరి ఉపాధిని కొనసాగించేలా సానుభూతితో చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు బకాయి ఉన్న రెండు మాసాల జీతాన్ని కూడా చెల్లించాలని కోరారు. దీనికి స్పందించిన డిఆర్‌ఎం బకాయిలను చెల్లించే విదంగా తీసుకుంటామని హామీనిచ్చారు.

ఆశ కార్యకర్తల కలెక్టరేట్ ముట్టడి
విశాఖపట్నం, మే 9: ఆశలకు కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (ఆశ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా చేతికందిన వారిని అందినట్టుగానే వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ విధంగా వందకు పైగా యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆశలకు కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని, సిహెచ్‌డబ్ల్యులకు గౌరవ వేతనం 400 నుండి రెండు వేలకు పెంచాలని, 104 వాహనాల డ్యూటీల 17 మాసాల బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు. నాసిరకం యూనిఫారం బదులు 400లు చెల్లించాలని, జిల్లాలో యూనిఫారం కొనుగోళ్ళు, అదనపు వసూళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు. సర్క్యులర్ 134 ప్రకారం పెరిగిన పారితోషకాలు అమలు చేయాలని, ఆశపై అధికారులు, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వి.సుబ్బాలమ్మ మాట్లాడుతూ జిల్లాలో ఆశ వర్కర్లగా గత ఏడేళ్ళుగా, కమ్యునిటీ హెల్త్ వర్కర్లగా 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారన్నారు. వీరికి ఎటువంటి వేతనం ప్రభుత్వం చెల్లించడంలేదని, వీరితో అనేక పనులు చేయించుకుంటుందన్నారు. పెంచిన పారితోషకాలు అమలయ్యే పరిస్థితి లేదన్నారు. సిహెచ్‌డబ్ల్యూల యూనియన్ జిల్లా నాయకులు మంగమ్మ మాట్లాడుతూ కమ్యునిటీ హెల్త్ వర్కర్స్‌కు పల్స్‌పోలియో రోజుకు 225రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆశలకు, కమ్యునిటి హెల్త్ వర్కర్లకు నెలకు కనీసం 500 రూపాయలు కూడా పారితోషికాలు రావడంలేదన్నారు. ఇచ్చిన పారిషోషకాలు రవాణా చార్జీలకే సరిపోతుందన్నారు. కేరళ రాష్ట్రంలో అయిదు వందలు గౌరవ వేతనం, పండుగ అలవెన్స్ 500 రూపాయలు ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా అలాగే ఇవ్వాలని, ఆశల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు
* భారీ విధ్వంసాలకు మావోలు వ్యూహరచన
* అప్రమత్తమైన పోలీసులు
కొయ్యూరు, మే 9: ఎ. ఓ.బి.లో భారీ విధ్వంసాలకు మావోయిస్టులు వ్యూహరచన చేస్తూ భారీగా తరలివచ్చారనే నిఘా వర్గాల సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గత కొన్ని నెలలుగా విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు అంతంతమాత్రంగా ఉండడంతో మన్య వాసులు శాంతియుత జీవనం సాగిస్తున్నారు. అయితే గత ఆదివారం రాత్రి మంపలోనూ, సోమవారం రాత్రి గూడెం మండలం పెదవలసలోనూ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఇది మావోయిస్టుల పనా, లేక మిలీషియా సభ్యుల పనా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఎ. ఓ.బి. వదిలివెళ్ళిన మావోయిస్టు దళాలు తిరిగి విశాఖ ఏజన్సీకి చేరినట్లుగా నిఘా వర్గాల సమాచారం. కొయ్యూరు, గూడెం, చింతపల్లి మండలాల అటవీ ప్రాంతాలకు మావోయిస్టులు చేరి భారీ విధ్వంసాలకు వ్యూహరచన చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రికిరాత్రే గ్రేహౌండ్స్, సి. ఆర్.పి. ఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు దింపి గాలింపు చర్యలు ఉదృతం చేసారు. దీంతో మన్యంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి గిరిజనం బెంబేలెత్తుతున్నారు.

* పోలీసుల అదుపులో మార్పు వెంకటరమణ?
ఈస్ట్ డివిజన్ కమిటీ మాజీ కార్యదర్శి, మావోయిస్టు సీనియర్ నేత మార్పు వెంకరటమణ అలియాస్ లెంజో, అలియాస్ జగదీష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 2001 నుండి 2006 వరకు గాలికొండ ఏరియా కమిటీని బలపరిచి విశాఖ ఏజన్సీలో పోలీసులకు సింహాస్వప్నంగా మారిన జగదీష్ అనంతరం ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2008లో జరిగిన గునుకురాయి ఎన్‌కౌంటర్‌లో జగదీష్ కాలికి గాయం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కాలి గాయానికి భువనేశ్వర్‌లో వైద్య సేవలు పొందుతుండగా పసిగట్టిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వారి కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఈనేపధ్యంలో కోరాపుట్, రాయగడల మధ్యలో మావోయిస్టుల శిక్షణా శిబిరానికి జగదీష్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేలా పార్టీ నియమించినట్లు సమాచారం. ఇతనిపై భారత ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈశిక్షణా శిబిరంలోనే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జగదీష్ పోలీసులకు చిక్కినట్లు, ప్రస్తుతం ఆయనను విశాఖకు తరలించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జగన్‌కు బెయిల్ నిరాకరణకు నిరసనగా
వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో

మునగపాక, మే 9: వైఎస్సార్ సిపి నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డికి బెయిల్ రానందుకు నిరసనగా మునగపాకలో గురువారం అనకాపల్లి - పూడిమడక మెయిన్‌రోడ్డులో మండల పార్టీ నేతల ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, సిబిఐ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మం డల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చింనాయుడు మాట్లాడు తూ ప్రజానీకమంతా జగన్‌మోహన రెడ్డికి బెయిల్ వస్తుందని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ, సిబిఐ, తెలుగుదేశం పా ర్టీలు కుట్రలు పన్ని బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించా రు. జగన్‌మోహనరెడ్డికి రాష్ట్రంలో ప్రజ ల నుండి లభిస్తున్న ఆదరణకు తట్టుకోలేకే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలాంటి నీచమైన కుట్రలు పన్నుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ సిబిఐను తన జేబుసంస్థగా వాడుకుని జగన్‌మోహనరెడ్డిని ఇబ్బందులకుగురిచేస్తుందని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా విజయమ్మకు మద్ధతుగా వైఎస్సార్ సిపి అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సిపి విజయకేతనం సాధించేందుకు కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సిపి నేతలు మళ్ల నాగసన్యాశిరావు, కాండ్రేగుల నూకరాజు, సింగర్ రాజు, శరగడం జగన్నాథరావు, కర్రి భాస్కరరావు, నరాలశెట్టిసూర్యనారాయణ, పల్లి నాయుడు, టెక్కలి కొండలరావు, భీశెట్టి ధనశ్రీను, బొడ్డేడ త్రినాథరావు పాల్గొన్నారు.

ఉన్నత ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
* మంత్రి బాలరాజు
చింతపల్లి, మే 9: రాష్టవ్య్రాప్తంగా ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ పొందేందుకు 80 కోట్ల రూపాయలతో 28 శిక్షణ కేంద్రాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. గురువారం చింతపల్లి వచ్చి న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కొక్క శిక్షణ కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తారన్నారు. విశాఖలో నిర్మించనున్న భవనానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. జిల్లాలో పాడేరు, పెదబయలు, చింతపల్లిలో ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని కేంద్రాల్లో గ్రూప్ -1 నుండి గ్రూప్-4 వరకు వివిధ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 జాతీయ బ్యాంకులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో డుంబ్రిగుడలో బ్యాంకు ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జి.కె.వీధిలో కూడా బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే వందకుపైగా వసతి గృహాలు మంజూరు చేశారన్నారు. వంద మంది విద్యార్థులుఉన్నచోట్ల వసతి గృహం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు 46 సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గడిచిన ఏడాది వెయ్యి కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టామన్నారు.
వడదెబ్బకు వృద్ధుడి మృతి
మునగపాక, మే 9: మండలంలో గల గణపర్తి గ్రామానికి చెందిన కోరిబిల్లి సోమునాయుడు(60) వడదెబ్బ తట్టుకోలేక గురువారం మృతి చెందాడు. సోమునాయుడు పొలంలో పనులు ముగించుకుని భోజనానికి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఎండ వేడిమికి తట్టుకోలేక పడిపోయాడని స్దానికులు చెబుతున్నారు. పడిపోయిన సోమునాయుడును సమీపంలో ఉన్న వ్యక్తులు అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలిస్తుండగా మరణించారని బంధువులు చెబుతున్నారు. ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు భార్య ఉ న్నా రు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘దాడి’ స్వాగతానికి ఏర్పాట్లు
అనకాపల్లి టౌన్, మే 9: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరి మొదటిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేస్తున్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్సార్ సిపి విశాఖ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ తెలిపారు. స్థానిక మళ్లా ప్లాజాలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు రూరల్ జిల్లా గ్రామాల నుండి మాజీమంత్రి దాడీ వీరభద్రరావుకు ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్టు నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనకాపల్లిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల వేణుకుమార్, కొత్తా గోపాలకృష్ణ, దాడి భానోజిరావు, మళ్ల రాజా, ఎస్‌విజి రమణాజీ గుప్తా, మద్దాల రమణబాబు, రాపేటి తాతారావు, కోరుకొండ రాఘవ పాల్గొన్నారు.
‘బోగస్ సంస్థల పట్ల అప్రమత్తం’
చోడవరం, మే 9: బోగస్ ఆర్థిక సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎంటి ప్రసాద్ సూచించారు. గురువారం మండలంలోని గోవాడ గ్రామంలో ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత, రుణ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అధిక వడ్డీలు ఆశచూపుతున్న బోగస్ ఆర్థిక సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి సంస్థల బారినపడి మోసపోవద్దని ఆయన అన్నారు. ఆర్‌బిఐ ధ్రువపత్రాలు కలిగిన ఆర్థిక సంస్థల్లోనే పొదుపు చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా ఇళ్లలో నగలు, ధనం ఉంచుకునే కన్నా బ్యాంకు లాకర్లలో దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. 500, వెయ్యిరూపాయల నకిలీ నోట్లు గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి అవుతున్న దృష్ట్యా ప్రజలు జాగరూకతతో వ్యవహరించి అటువంటి నో ట్లను గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బిఐ డివిజనల్ మేనేజర్ డి.జయబా ల, టి. చంద్రమోహన్, కౌన్సిలర్ పివిరమణమూర్తి, ఎస్‌బిఐ బ్రాంచి మేనేజర్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు కల్యాణి మండపం సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
అనకాపల్లి టౌన్, మే 9: స్థానిక రింగురోడ్డులో గల కల్యాణి మండపం గత కొనే్నళ్లుగా వివాదాల్లో నెలకొని ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీమంత్రి దాడి వీరభద్రరావు కల్యాణి మండప నిర్మాణానికి సహకరించి అక్కడి స్థానికులకు తోడ్పాటునందించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక కల్యాణి మండపంలో ఫ్యాషన్ టెక్నాలజీ మహిళలకు నేర్పిస్తామని స్థానికుల వద్ద నుండి మున్సిపల్ అధికారులు అడిగి తీసుకోవడం జరిగింది. శిక్షణ కాలం పూర్తయిన అనంతరం ఈ కల్యాణి మండపాన్ని మీకు అప్పగించడం జరుగుతుందని అక్కడి స్థానికులకు, కమిటీ సభ్యులకు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్నదొకటి అయినదొకటి ఇక్కడ జరిగింది. మున్సిపల్ అధికారులు కల్యాణి మండపం మాకే చెందుతుందని వారు స్వాధీనం చేసుకున్నారు. కల్యాణి మండపం కమిటీ సభ్యులైన ట్రస్టీ కన్వీనర్ కాశీరావు, ఏడువాకల సూరిబాబులు కోర్టులో పిటీషన్ వేయగా కోర్టు వీరికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు కల్యాణి మండపం అప్పగింఛడం జరిగింది. కమిటీ సభ్యులు, స్థానికులు గత నెల శ్రీరామనవమికి కల్యాణి మండపాన్ని ముస్తాబుచేసి శ్రీరామకళ్యాణం ఘనంగా నిర్వహించారు. అప్పటి నుండి కల్యాణి మండపం నిర్వహణ కమిటీ సభ్యులే నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు గురువారం కల్యాణి మండపం తమకు స్వాధీనం చేయాలంటూ రావడంతో కమిటీ సభ్యులు, అక్కడి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చి దౌర్జన్యంగా కల్యాణి మండపానికి తాళాలు పగులగొట్టి వారితాళాలు వేయడం జరిగింది. అలాగే దానికి కోర్టు నోటీసు కూడా అంటించడం జరిగింది. దీంతో కమిటీ సభ్యులు, స్థానికులు ఆగ్రహించి కమీషనర్ డౌన్‌డౌన్, గంటా శ్రీనివాసరావు డౌన్‌డౌన్ అంటూ నినాదాలుచేసారు. ఒక దశలోకమీషనర్‌తో వాగ్వివాదం చేసి కమీషనర్ బయటకువెళ్లకుండా అడ్డుకోవడంజరిగింది. కోర్టు ఉత్తర్వులు ఉంటే చూపించడంటూ 1997కోర్టు ఉత్తర్వులను చూపిస్తున్నారని, కొత్తగా వచ్చిన మా ఉత్తర్వులను మీకైమైనా వచ్చివుంటే అవి చూపించడంటూ వారు నిలదీయడం జరిగింది. ఈ కల్యాణి మండప స్థలం అనకాపల్లి అప్పన్న అనే వ్యక్తికి చెందినవని ఆయన కుమారుడు ట్రస్టీగా వ్యవహరిస్తున్నాడని, స్థలం మున్సిపాల్టీది కాకాపోయినా అధికారులు దౌర్జన్యంగా కల్యాణి మండపాన్ని స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమంటూ వారు నిలదీసారు.

పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు
english title: 
bharat

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>