Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇదేనా మీ మార్కు పాలన!

$
0
0

చింతలపూడి, మే 14: రాష్ట్రంలో ఏ రంగాన్నీ వదలకుండా పన్నులు, చార్జీల పెంపు భారం మోపడమే మీ మార్కు పాలనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. ఎరువుల ధరలు, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచిన ముఖ్యమంత్రి చివరకు విద్యార్థుల బస్ పాసులను కూడా వదిలిపెట్టలేదని ఎద్దేవాచేశారు. జిల్లాలో మరో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్న షర్మిల మూడో రోజైన మంగళవారం చింతలపూడిలో రచ్చబండ నిర్వహించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలపై ఏ భారం పడకుండా చూశారన్నారు. చివరకు కేంద్రం వంట గ్యాస్ ధర పెంచినా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి, ప్రజలపై భారం లేకుండా చేసిందన్నారు. నేడు వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం దిక్కులు చూస్తోందన్నారు. వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని పెంచడం, కొత్తవి మంజూరుచేయడం మాట అటుంచి, పెన్షన్ల కోసం వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని వారి ప్రాణాలను బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్త గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకం నుండి 133 వ్యాధులను తొలగించి, నామమాత్రంగా కొనసాగిస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. 108, 104 సర్వీసులను భ్రష్టుపట్టించారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై వైఎస్ మొట్టమొదటి సంతకం చేస్తే, నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో కనీసం రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ రాక రైతులు ఉసూరుమంటున్నారన్నారు. ప్రజలపై భారం మోపడం, సౌకర్యాలను తొలగించడం తదితరాలతో కిరణ్ మళ్లీ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాటి కాలానికి తీసుకుపోతున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తన తండ్రి వై ఎస్ ఆర్ పాటు పడితే రైతుల కోసం ఏం చేస్తున్నారని, కనీసం ఉచిత కరెంటు కూడా మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని, గ్రామాల్లో పగలు కరెంటునే మర్చిపోయారని, కరెంటు బిల్లులు మాత్రం భరించలేని విధంగా వస్తున్నాయని, ఇదేమి పరిపాలన అని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఈ కాంగ్రెస్ పాలన మరో సారి చంద్రబాబు పాలనను గుర్తు చేస్తున్నదని ఆమె అన్నారు. పరిశ్రమలు మూతపడి, 20 లక్షల మంది కార్మికులను రోడ్డు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు తగిన బుద్ధి చెప్పాలని, రాజన్న రాజ్యం కోసం జగన్‌ను బలపర్చాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పక్కా ఇళ్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి వై ఎస్ ఆర్ ప్రవేశపెట్టిన అన్ని పధకాలు అమలు చేస్తారని, అన్ని ప్రజా సమస్యలు పరిష్కారవౌతాయని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో భారీగా హాజరైన మహిళలు తమ సమస్యలను తమ గ్రామాల సమస్యలను షర్మిల ఎదుట ఏకరువు పెట్టారు. మంగళవారం పాత చింతలపూడి నుండి చింతలపూడి, తీగలవంచ మీదుగా కృష్ణనగర్ వరకు సుమారు 12 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా ప్రజలు ముఖ్యంగా మహిళలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. షర్మిల మహిళలను, పిల్లలను, వృద్ధులను పరామర్శిస్తూ ముందుకు నడిచారు. ఈ కార్యక్రమాలలో చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్‌కుమార్, పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు, పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్రా రాజారావు తదితరులు పాల్గొన్నారు. షర్మిల పాదయాత్రకు చింతలపూడిలో అపూర్వ స్పందన లభించింది.

వేటు పడింది
*అభయారణ్యంలో చేపల చెరువులు
*నిడమర్రు తహసీల్దార్‌కు ఛార్జిమెమో
*ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్
*్ఫషరీస్ డిడికి మెమో
ఏలూరు, మే 14 : కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా అక్రమ చేపల చెరువుల వ్యవహారంపై రేగుతున్న ఆందోళనపై చర్యలు ప్రారంభమయ్యాయి. చెరువులు అక్రమంగా తవ్వేస్తున్నారంటూ అటు పార్టీలు, ఇటు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే. చివరకు అభయారణ్యాన్ని కూడా వదలకుండా తమ అక్రమాలకు వేదికలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వున్నవే. నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నిడమర్రు తహసీల్దార్‌కు ఛార్జీమెమో జారీ చేసి బాధ్యులైన నిడమర్రు ఆర్ ఐ, ఇద్దరు వి ఆర్‌వోలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ప్రభుత్వం ఇటీవలే చేపల చెరువుల తవ్వకాల విషయంలో నూతన జీవోను విడుదల చేసింది. దానికి అనుగుణంగా చేపల చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా తవ్విన చెరువులను క్రమబద్ధీకరణ చేసే అంశం కూడా వుంది. జూన్ 15 లోగా చెరువులన్నింటికి అనుమతులు తప్పనిసరి అని కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడ్డాయి. అయితే చాలా చోట్ల దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమ చేపల చెరువులకు రంగం సిద్ధం చేశారు. కొన్ని ప్రాంతాల్లోనైతే గుట్టుచప్పుడు కాకుండా చెరువులు రోజుల వ్యవధిలో తవ్వి వాటిని క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ప్రధానంగా కొల్లేరు పరిసర మండలాల్లో ఇటువంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్న అనుమానాలున్నాయి. దీనికి తగ్గట్టుగానే అటు కమ్యూనిస్టు పార్టీలు, మరికొన్ని చోట్ల స్థానిక గ్రామస్తులు కూడా ఈ పరిణామాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వచ్చారు. కొంతమంది కలెక్టరేట్ వద్ద ధర్నాలకు కూడా దిగారు. ఈ నేపధ్యంలోనే నిడమర్రు మండలం కొల్లేరు అభయారణ్యం పరిధిలోనే అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నా నిర్లక్ష్యం వహించిన అభియోగంపై ఆ మండల తహశీల్దార్ ఎ గాంధీకి ఛార్జిమెమో జారీ చేశారు. అలాగే నిర్లక్ష్యానికి ప్రధాన బాధ్యులైన నిడమర్రు ఆర్‌ఐ ఎం సూర్యప్రకాశరావు, నిడమర్రు వి ఆర్‌వోలు వివివి ప్రసాద్, జి దుర్గారావులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలా ఉంటే మత్స్యశాఖ డిడి కృష్ణమూర్తికి కూడా మెమో జారీ చేశారు. వాస్తవానికి జిల్లాస్థాయి మత్స్యశాఖ కమిటీ సమావేశంలో ఆయా ప్రాంతాల్లో చేపల చెరువులకు అనుమతులిస్తూ ఇచ్చిన ఆదేశాలను దరఖాస్తుదారులకు సకాలంలో అందించనందుకు డిడికి మెమో జారీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

పోలవరం నిర్వాసిత గ్రామాలకు తరలివెళ్లేలా...
గిరిజనులను చైతన్యపరచాలి
-ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీదేవి
ఏలూరు, మే 14: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు తరలి వెళ్లి గిరిజనులను చైతన్యపరిచి కొత్త కాలనీల్లో నూతన జీవితాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ టికె శ్రీదేవి అధికార్లకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో మంగళవారం పోలవరం ప్రాజెక్టు జిల్లాస్థాయి మోనటరింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఆమె సమగ్రంగా సమీక్షించారు. గత అయిదేళ్ల నుండి నిర్వాశిత గ్రామాలలో నష్టపోయిన చెట్ల పరిహారం అందకపోబట్టే గిరిజనులు కొత్త కాలనీల్లోకి రావడం లేదని కుంటి సాకులు చెబుతున్నారని, అది సరైన పద్దతి కాదని చెప్పారు. ఎన్నో దశాబ్ధాల నుండి పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి వెళ్లడానికి ఎవరికైనా బెంగ ఉంటుందని అయితే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు ఎంతో అవసరమని ఇటువంటి స్థితిలో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు మరోచోటకు వెళ్లకతప్పదని చెప్పారు. గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చి నూతన కాలనీల్లో మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ముంపు ప్రాంతాలకు సంబంధించి సమస్యలను విభజించాలని దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించాలే తప్ప చెట్ల పరిహారం సమస్య చాలా చిన్నదని దాన్ని బూచిగా చూపించి కొత్త కాలనీలలోకి రావడం లేదని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జాప్యం అయితే అంచనా వ్యయం రోజురోజుకూ పెరిగిపోతున్నదని, కావున నిర్వాశితుల వద్దకు వెళ్లి వారి సాధక బాధకాలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించి కొత్త కాలనీల్లో నూతన జీవితాన్ని ప్రారంభిస్తే భవిష్యత్తు కూడా బంగారు బాట కాగలదని గిరిజనులకు భరోసా కల్పించాలని చెప్పారు. ఎక్కడైనా రెండు సార్లు పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని అయినా సరే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ త్వరలోనే ముంపు ప్రాంతాలలోని నిర్వాశితుల చెట్లకు పరిహారం చెల్లించే విషయంలో తగు నిర్ణయం వెలువడగలదని ఈ లోగా నిర్వాశితులను కలిసి కొత్త కాలనీల్లో ప్రవేశించే విధంగా చైతన్యపరచాలని సూచించారు. చాలా గ్రామాలలో ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆనాడు ఇళ్లు మంజూరు అయినా ఇంకా నిర్మాణ పనులు చేపట్టని ఇళ్లకు ప్రభుత్వ సహాయాన్ని పెంచిందని దీన్ని బట్టి ఒక్కొక్క ఇంటికి లక్షా 5 వేల రూపాయల వరకూ మంజూరు అయ్యే పరిస్థితి ఉన్న దృష్ట్యా యుద్ధప్రాతిపదికపై ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాశితులకు అందుబాటులో సేద్యపు భూములు ఉండాలే తప్ప కొన్ని ప్రాంతాలలో ఇళ్ల నుండి 20 నుండి 76 కిలోమీటర్లు దూరంలో పంట భూములు వారికి కేటాయిస్తే నిత్యం ఎలా వెళ్లి సేద్యం చేస్తారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులను సరిదిద్ది గిరిజనులకు అందుబాటులో సేద్యపు భూములు కేటాయించేలా చూడాలని ఆయన చెప్పారు. కొత్త కాలనీల్లో విద్యుత్తు సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన దృష్ట్యా పాత ఇళ్లల్లోని విద్యుత్ సర్వీసులను తొలగించాలని లేకపోతే కొత్త కాలనీల్లో విద్యుత్తు చార్జీలను వృథాగా చెల్లించడం అవుతుందని ఈ భారం ప్రభుత్వం ఎందుకు మోయాలని శ్రీదేవి ప్రశ్నించారు. తొలి దశగా పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురి అయ్యే ఏడు గ్రామాలలో నిర్వాశితులు కొత్త కాపురాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఏడు కాలనీల్లో రోడ్లు, తాగునీరు, వీధి లైట్లు, ఇతర వౌలిక సౌకర్యాలు విధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశాలు నిర్వహించినప్పుడల్లా ఏవో కధలు చెప్పి అసలు పనులు చేయడం లేదని ఒక పనికి మరో పని లింకు పెట్టే విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. తాను పూర్తిస్థాయిలో అవగాహనతోనే సమగ్రంగా సమీక్షిస్తున్నానని, ఇకపై కధలు చెబితే సహించబోనని పోలవరం తహశీల్దారు, జంగారెడ్డిగూడెం ఆర్‌డివోలపై శ్రీదేవి మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఆర్‌డివో నిర్లక్ష్య వైఖరి వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్వాశితుల పునరావాస కార్యక్రమాల అమలులో జాప్యానికి కారణమని ఇటువంటి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేయగలుగుతుందని స్పష్టం చేశారు. ముంపునకు గురి అయ్యే ఏడు గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయంగా కొత్త కాలనీలు ఏర్పాటు చేసే విషయంలో సరైన నిర్ణయాలు చేపట్టలేదని 60 మందికో కాలనీ, 30 మందికో కాలనీ అంటే ఎలా సాధ్యమవుతుందని, అన్ని సౌకర్యాలు ప్రతీ కాలనీలో కల్పించడం సాధ్యపడుతుందా. కనీసం వంద కుటుంబాలకు ఒక కాలనీ ఏర్పాటు చేయాలే తప్ప ఈ విధంగా సరైన ముందుచూపులేని నిర్ణయాలు తీసుకోవడం వల్లే నిర్వాశితులు ముందుకు రాలేకపోతున్నారని ఇప్పటికైనా అధికారులంతా గిరిజన గ్రామాలకు తరలి వెళ్లి వారిలో ఒక నమ్మకాన్ని ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాబోయే మూడు నెలల కాలంలో నిర్వాశితులంతా నిర్ణయించిన కొత్త కాలనీల్లో ప్రవేశించేలా చూడాలని శ్రీదేవి చెప్పారు. జిల్లా కలెక్టరు డాక్టర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ గతంలో ప్రతీ వారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షించానని, జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు గిరిజన గ్రామాలలో పల్లెనిద్ర చేసి వారిలో మమేకమై కొంతవరకూ చైతన్యం కలిగించారని త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇతర ప్రాజెక్టుల పనులకు కూడా 20 వేల ఎకరాల భూమిని సేకరించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతో ముఖ్యమైనవని ఆ పనుల నిర్వహణకు ప్రత్యేక షెడ్యూలును రూపొందించుకుని ముందుకు వెళ్లవలసి వుందన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్, డిఆర్‌వో ఎం మోహనరాజు, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, ఆర్ అండ్ బిఎస్‌ఇ శ్రీమన్నారాయణ, ట్రాన్స్‌కో డిఇ ఆదినారాయణ, ఐటిడిఎ పివో సూర్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీరవాసరంలో నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు
షిర్డీ ప్రయాణీకులకు సౌకర్యం - పచ్చ జండా ఊపిన ఎంపి బాపిరాజు - మధ్యాహ్నం రిజర్వేషన్‌కు ఎడిఆర్‌ఎం ఓకె
వీరవాసరం, మే 14: కోట్లాది మంది ప్రజల ఆరాధ్యదైవం షిరిడీ సాయినాథుని చెంతకు వెళ్లే నర్సాపూర్ - నాగర్‌సోల్ రైలును వీరవాసరం స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగడానికి అనుమతినిచ్చిన రైల్వే అధికారులకు ఎంతో రుణపడి ఉంటానని నర్సాపురం ఎంపి, టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. నర్సాపూర్ నుండి నాగర్‌సోల్ వెళ్లే రైలును వీరవాసరంలో మంగళవారం నుండి హాల్ట్‌కు సంబంధిత శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుండి వచ్చిన రైలును ఎడిఎంఆర్‌ఎం సుబ్బారావు, ఎంపి బాపిరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎంపి బాపిరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులుకు వీరవాసరం మండల రైల్వే ప్రయాణీకుల సంఘం కన్వీనర్ వలవల రామకృష్ణ, వీరవాసరం నాటక కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మద్దాల అప్పారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపి బాపిరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులును పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రైల్వే ప్ల్లాట్‌ఫారంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీరవాసరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ వీరవాసరం రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం కలుగజేయాలని కోరారు. దీనిపై ఎంపి బాపిరాజు మాట్లాడుతూ షిరిడీ ఎక్స్‌ప్రెస్ వీరవాసరంలో ఆపాలన్న గ్రామస్థులు కోరిక మేరకు హాల్ట్ వచ్చేలా చేశామన్నారు. రిజర్వేషన్ సౌకర్యంపై ఎడిఆర్‌ఎం సుబ్బారావుతో ఎంపి బాపిరాజు చర్చించారు. బుధవారం నుండి ఉదయం 9 నుండి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి 5 గంటలవరకు రిజర్వేషన్ సౌకర్యం కలుగజేయమని రైల్వే స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ పేరరెడ్డికి అధికారులు సూచించారు. అక్కడికక్కడే సమస్య పరిష్కారం కావటంతో ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. వలవల రామకృష్ణ, గుండా రామకృష్ణ, కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై విద్యుత్ దీపాలు , మరుగుదొడ్లు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను ఎంపి బాపిరాజు రైల్వే ఎడిఎఆర్‌ఎం సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకోసం నిధులు మంజూరు చేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో ఎంపి బాపిరాజు, ఎమ్మెల్యే రామాంజనేయలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటొకటిగా నెరవేరుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు. దేశంలోనే ఎప్పడూ లేని విధంగా విజయవాడ నుండి నిడదవోలు వరకు రైల్వే డబుల్ లైన్ విస్తరణ పనులను ప్రారంభించినట్టు చెప్పారు. ఒకేసారి టెండర్లు పిలవడం, పనులు మొదలుపెట్టడం మన ప్రాంతంలోనే తొలిసారిగా జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో భీమవరం ఎఎంసి ఛైర్మన్ ఎఎస్ రాజు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ పోలిశెట్టి సత్యనారాయణ, వీరవాసరం సొసైటీ అధ్యక్షుడు నూకల కేశవరమేష్, అప్పాజీరావు, వలవల రామకృష్ణ, గుండా రామకృష్ణ, వీరవల్లి రామకృష్ణ, ఎ నాగభూషణశర్మ, చిక్కాల రాజు, మద్దాల అప్పారావు, దొంగ జగన్నాధం, మోపుదేవి విశే్వశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అక్విడెక్టు పునర్నిర్మాణం హుళక్కే!
అదనపు ఖానాల నిర్మాణంతోనే సరి
ఉండి, మే 14: ఉండి వద్ద బొండాడ డ్రెయిన్, ఉండి కాలువలపై ఉన్న అక్విడెక్టు పునర్నిర్మాణం హుళక్కే అని స్పష్టమయ్యింది. దీనికి బదులు అక్కడ రెండు ఖానాలు అదనంగా నిర్మించేందుకు ఇరిగేషన్‌శాఖ నిర్ణయాలు తీసుకోవటం, టెండర్లు ఖరారు కావటం చకచకా జరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఉండి అక్విడెక్టు బ్రిటిష్ కాలంలో నిర్మాణం జరిగింది. సుమారు 150 సంవత్సరాల క్రితం జరిగిన నిర్మాణం గనుక, దీనిని పునర్‌నిర్మించాలని దశాబ్దకాలంగా రైతులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయటం అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించటం జరిగింది. ఫలితంగా ఆధికవర్షాల సమయంలో నీరు క్రిందకు లాగక వరిచేలు మునకకు గురౌతున్నాయి. వేలాది ఎకరాల చేలు రోజుల తరబడి నీటిలో నానుతున్నాయి. కొన్నిసార్లు అయితే డ్రెయిన్‌లో నీరు తిరిగి చేలల్లోకి చేరుతోంది. అందువలన ఇప్పుడున్న మూడు ఖానాలు స్థానే ఐదు ఖానాలకు పెంచి దీనిని పునర్ నిర్మాణం చేయాలని రైతుల డిమాండ్. అందువలన నూతన నిర్మాణం అయితే బాగుంటుందని భావించారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను స్వయంగా ఉండి తీసుకొచ్చి ఇక్కడ నూతన అక్విడెక్ట్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఇందుకు నిధులు కూడా మంజూరు చేయించారు. అయితే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీని మూలంగా రెండు అదనపు ఖానాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చి డిజైన్లు రూపొందించి ఆమోదించారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉండి అక్విడెక్టుపై బరువైన వాహనాలు అనుమతించటం లేదు. ఉండి ఆక్విడెక్టు ఎన్‌ఆర్‌పి అగ్రహారం ప్రజలకు రవాణాకు ఉపయోగపడే విధంగా ఉండేది. ఆ గ్రామానికి వెళ్ళేందుకు మరో వంతెన కూడా లేదు. ఫలితంగా ఆ గ్రామానికి భారీ వాహనాలు వెళ్ళక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అక్విడెక్ట్ నిర్మాణం జరిగితే, తిరిగి తమ గ్రామానికి రవాణా సౌకర్యం కూడా వస్తుందని అగ్రహారం ప్రజలు భావించారు. ఇప్పుడు తాజా నిర్ణయం కారణంగా ఆ గ్రామానికి శాశ్వతంగా రవాణా సదుపాయం కరువవుతుంది. మరోపక్క రెండు అదనపుఖానాల వలన ఇరిగేషన్ కార్యాలయంలో కొంత భాగం బొండాడ మేజర్ డ్రెయిన్‌లో కలుస్తోంది. పురాతన కాలం నుండి ఉన్న ఉండి డిఇ క్వార్టరు పూర్తిగా కనుమరుగు కానుంది. ఇదే సందర్భంలో కొందరు ఇంజనీరింగ్ నిపుణులు 150 సంవత్సరాల నాటి పురాతన కట్టడాన్ని పునర్ నిర్మిస్తేనే రైతులకు ఎక్కువ లాభంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అధికారులు మాత్రం రెండు అదనపు ఖానాల నిర్మాణానికి టెండర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. ఎన్‌ఆర్‌పి అగ్రహారం ప్రజలు రవాణాకు ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సిందే!

జాలువారని బాలు గానామృతం!
-వాయిదా పడిన కార్యక్రమం - అభిమానుల నిరాశ-
ఏలూరు, మే 14 : విఖ్యాత గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గానామృతం అనుకోని రీతిలో వాయిదా పడటం నగర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతటి గాయకుడు నగరానికి వస్తున్నారన్న ఆశతో ఎంతో మంది టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రోగ్రాం కోసం ఎదురుతెన్నులు చూశారు. అయితే మంగళవారం సాయంత్రం జరగాల్సి వున్న ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు నిర్వాహకులు ప్రకటించడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్న టిక్కెట్లు ఏం చేయాలో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. అయితే నిర్వాహకుల నుంచి మాత్రం ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని, తదుపరి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని, అప్పుడు ఈ టిక్కెట్లు వినియోగించవచ్చునని మాత్రమే సమాచారం రావడంతో ఆ కార్యక్రమం ఎప్పుడు జరిగేనో, ఎప్పుడు బాలు గానామృతం వినగలుగుతామో అన్న ఆందోళనలో చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మెగా ప్రాజెక్టుగానే నిర్వాహకులు వ్యవహరిస్తూ వచ్చారు. దాదాపు రెండు నెలల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ముమ్మర ప్రచారాలు నిర్వహిస్తూ వచ్చారు. నగరం మొత్తం బాలు గానామృతం ఫ్లెక్సీలతో నింపేశారు. పలు గ్రామాల్లోనూ ఈ ప్రచారం జోరుగా సాగింది. ఇక టిక్కెట్ల విక్రయానికి నగరంలోనే దాదాపు 20 వరకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ విక్రయాలు భారీగానే సాగాయి. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, అధికారులకు, సిబ్బందికి భారీగానే వీటిని విక్రయించారు. అయితే చివరి నిమిషంలో ఈ మొత్తం కార్యక్రమం వాయిదా పడటంతో టిక్కెట్లు కొన్నవారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే మొత్తాన్ని అనాథ పిల్లలకు, హెచ్‌ఐవి సోకిన పిల్లలకు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే విక్రయం అయిన టిక్కెట్లకు అయ్యే ఖర్చుకు పొంతన లేకపోవడంతో సేవ చేసే అవకాశం కూడా లభించకపోవచ్చునని భావించడం వల్లే కార్యక్రమాన్ని వాయిదా వేశామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే వారికి ఆయా ప్రాంతాల్లో ఏ స్థాయి కార్యక్రమాలు అనువుగా వుంటాయి. ఎటువంటివి సజావుగా సాగుతాయి అన్న అంశంపై అవగాహన లేకపోయిందా లేక దీన్ని ఆసరాగా మార్చుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా టిక్కెట్లు కొన్నవారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతూ నిర్వాహకులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.

టిటిడి కల్యాణ మండపం అదనపు అంతస్తుకు శంకుస్థాపన
వీరవాసరం, మే 14: తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడానికి తీవ్రంగా కృషి చేస్తోందని నర్సాపురం ఎంపి, టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. మంగళవారం వీరవాసరంలో గల టిటిడి కల్యాణ మండపంలో రూ.50 లక్షల వ్యయంతో ప్రస్తుత భవనంపై నిర్మించనున్న నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపి బాపిరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ముందుగా వీరికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపి బాపిరాజు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన మండపాల పర్యవేక్షణ కష్టతరంగా ఉంటుందని, అందువల్ల ఈ కల్యాణ మండపాలను స్థానికంగా ఉన్న దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో గల దేవాలయాలకు బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ మండపాల్లో వివాహాలు చేసుకోవడం వల్ల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో వివాహం జరిగినట్లేనని ఆయన పేర్కొన్నారు. వీరవాసరంలో తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో నిర్మించిన ఈ కళ్యాణ మండపానికి కోట్ల రూపాయల విలువచేసే ఒక ఎకరం భూమిని స్వర్గీయ మద్దాల శ్రీ రంగనాయకులు వితరణగా ఇవ్వడం ఆయన దానగుణానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ శంకుస్థాపన అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ ఎఎస్ రాజు, భీమవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ళ నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ పోలిశెట్టి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు నూకల కేశవ రమేష్ అప్పాజీరావు, టిటిడి ఇఇ శ్రీహరి, డిప్యూటీ ఇఇ రామకృష్ణారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణ, వీరవల్లి రామకృష్ణ, గుండా రామకృష్ణ, మద్దాల అప్పారావు, అమిరపు నాగభూషణ శర్మ, మద్దాల సత్యనారాయణమూర్తి, కందుల శ్రీనివాస్, చిక్కాల రాజు, కొత్తల రామ్మోహన్‌రావు, ఏలూరు చిట్టిబాబు, కోడూరి వెంకటకుమార్, పిల్లి వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల బస్ పాసులపైనా భారం:చింతలపూడి రచ్చబండలో సిఎం కిరణ్‌పై షర్మిల ధ్వజం
english title: 
is this your mark

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>