విజయనగరం, మే 14: విపత్తుల నుంచి రక్షణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ జాతీయ విపత్తుల శాఖ వివిధ రక్షణ పరికరాలను సిద్ధం చేసిందన్నారు. వరదలకు సంబంధించి 120 పరికరాలు, అగ్నిమాపకశాఖకు సంబంధించి 68 పరికరాలు ఉన్నాయన్నారు. వీటిలో జిల్లాకు అవసరమైన సామగ్రిని కొనుగోలుకు అధికారులు విపత్తుల శాఖ తయారు చేసిన జాబితా నుంచి ఎంపిక చేసుకోవాలన్నారు. మత్స్యశాఖ, నీటిపారుదల శాఖ, అగ్నిమాపకశాఖ, వ్యవసాయ శాఖలకు సంబంధించి అవసరమైన పరికరాలను ఎంపిక చేయాలన్నారు. ఈ జాబితాను 17లోగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ప్రతిపాదనలు తయారు చేసినపుడు జిల్లా స్థాయిలో డిఆర్వోతో కలసి జిల్లా అగ్నిమాపక అధికారి, డివిజనల్ స్థాయిలో ఆర్డీవో లతో కలసి డివిజనల్ అగ్నిమాపక అధికారులు జాబితాలను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో హేమసుందర్, ఆర్డీవో రాజకుమారి, మత్స్యశాఖ ఎడి ఫణిప్రకాష్, జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సింహాచలం, పూసపాటిరేగ, బోగాపురం తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఉపాధి కూలీ మృతి
సీతానగరం, మే 14: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారుడు మృతిచెందిన సంఘటన మండలలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి డుమా ఎపిఒ జి.నాగలక్ష్మి, వి.ఆర్.ఒ. గౌరీలు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కోటసీతారాంపురం గ్రామానికి చెందిన గొట్టాపు పారినాయుడు(78) ఉపాధి పనులు చేసేందుకు గాను మంగళవారం తోటికూలీలతో కలిసి గ్రామంలో ఉన్న కోనేటి వద్దకు వెళ్లాడు. అయితే పనులు ప్రారంభమైన అరగంటకు పారినాయుడు కళ్లు తిరిగి కింద పడిపోవడంతో తోటి కూలీలు గమనించి మంచినీటిని అందించగా పారినాయుడు కాళ్లు చేతులు కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఉపాధి హామీ ఎ.పి.ఒ., వి.ఆర్.ఒ, గ్రామ పెద్దల సమక్షంలో ఉపాధి కూలి మృతికి సంబంధించి తోటి కూలీలు కుటుంబ సభ్యుల నుంచి తగు వివరాలు సేకరించారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎ.పి.ఒ మాట్లాడుతూ ఉపాధి కూలీలు అనారోగ్యంతో పనులకు హాజరుకారదని, ఈ విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పశువులకు వ్యాక్సినేషన్ తేదీలు ఇవే!
విజయనగరం, మే 14: జిల్లాలో అత్యధిక జనాభా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యం ఉందో అంత కంటే ఎక్కువ పశుపోషణ మీద రైతులు శ్రద్ధ చూపితే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాడి పరిశ్రమ నేడు ఒక పరిశ్రమగా మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పాడి పశువులను మనం ఎంతగా సంరక్షిస్తే వాటి నుంచి అంత ఆదాయం పొందగలము. ఇందుకు రైతులు తమ పశువులకు సకాలంలో వ్యాక్సిన్లు ఇప్పించడంతోపాటు వాటికి ఏ రోగాలు సంక్రమించినా దగ్గరలో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి. ఈ విధంగా జిల్లాలో ఏటా సంక్రమించే వ్యాధులను నిర్థారించేందుకు జిల్లా కేంద్రంలో పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఉంది. ఈ వ్యాధి నిర్థారణ కేంద్రంలో పశువులకు కొత్తగా సోకే వ్యాధులను గుర్తించడంతోపాటు సాధారణ వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తొన్నారు. ఇందుకోసం ల్యాబ్‌లో హాట్ ప్లేట్, మైక్రో సెంట్రీఫ్యూజర్, వాటర్ బాత్, ఇంక్యుబేటర్, హాట్ ఓవెన్ పరికరాలతో వివిధ పరీక్షలు జరుపుతున్నారు.
కాగా, పశువులకు ముందస్తు జాగ్రత్తగా వ్యాధులు సోకకుండా ఉండేందుకు ఈ ఏడాది విడుదల చేసిన వ్యాక్సిన్ క్యాలెండర్ వివరాలను తెలియజేశారు. ఈ ఏడాది మే 10 నుంచి 25 వరకు గొర్రెలకు చిటుక వ్యాధి నివారణకు టీకాలు వేస్తారు. అలాగే జూన్ 1 నుంచి 13 వరకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధికి, అలాగే జూన్ 15 నుంచి 30 వరకు గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు టీకాలు వేస్తామని డాక్టర్ బి.జానకిరామయ్య తెలిపారు. అలాగే ఆగస్టు 1 నుంచి పశువులకు పారుడు వ్యాధి, ఆగస్టు 16 నుంచి 31 వరకు గాలికుంటు వ్యాధికి టీకాలు వేయనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 20వరకు ఆడ దూడల్లో బ్రూసిల్లోసిస్ వ్యాధి నివారణకు టీకాలు వేస్తారు. నవంబర్ 11 నుంచి 16 వరకు గొంతువాపు రాకుండా టీకాలను వేస్తారు.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 వరకు గొర్రెలు, మేకలకు మశూచి నివారణకు వ్యాక్సిన్ వేస్తామని డాక్టర్ జానకిరామయ్య చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 22 వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ, డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకు కోళ్లలో కొక్కెర తెగులు, జనవరి 16 నుంచి 30 వరకు గొర్రెలు, మేకల్లో పిపిఆర్ టీకాలు, ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తామని ఆయన తెలియజేశారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘పచ్చతోరణం’తో ఎస్సీ, ఎస్టీలకు మేలు
బాడంగి, మే 14: ఇందిరమ్మ పచ్చతోరణాలు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఉపాధి హామీ పిడి శ్రీరాములునాయుడు అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఐదేళ్ళలో సుమారు 5లక్షల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఒక్కొక్క కుటుంబానికి 200 మొక్కలు చొప్పున పెంపకానికి అందజేస్తామన్నారు. మొక్కల పెంపకానికి ఆర్థిక ఆసరాను ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సమకూరుస్తామన్నారు. జిల్లాలో ప్రతి రోజూ 3లక్షల 47వేల మంది కూలీలు పనిచేస్తున్నారన్నారు. మే 7వ తేదీ వరకు బకాయి ఉన్న కూలీల వేతనాలు విడుదల చేశామని చెప్పారు. ఇందుకు సంబంధించి 72కోట్ల రూపాయలను వేతనం కింద విడుదల చేశామన్నారు. ఇప్పటికే 37 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయన్నారు. ఇప్పటి నుంచి ప్రతి వారం వేతనం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికంగా కూలీలు పనిచేసే చోట క్షేత్ర సహాయకులకు అదనంగా మేట్‌లు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 150 మేట్‌లను క్షేత్రసహాయకులు సహాయకులుగా నియమించామన్నారు. పనులను సక్రమంగాజరిగే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందు కోసం ఏడు విజిలెన్స్ టీంలను నియమించామని చెప్పారు. జూన్ 30వ తేదీ వరకు కూలీలు అవసరమైన పనులను గుర్తించామన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పట్టణాభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్సీ
విజయనగరం , మే 14: విమర్శలు చేయడం కంటే పట్టణాభివృద్ధికి సహకరిస్తే బాగుంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రతిపక్షనేతలకు సలహా ఇచ్చారు. పట్టణంలో 29, 33 వార్డుల్లో రెండుకోట్ల అభివృద్ధిపనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేతకాని తనం వల్ల పట్టణాభివృద్ధి కుంటుపడిందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిధులు లేవని ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెళుతున్నారని తెలిపారు. తెలుగుదేశంపార్టీనేతల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పట్టణంలో 29వ వార్డులో బ్యాంకు ఆఫ్ బరోడా రోడ్డు, 33వ వార్డులో పుత్సలవీధిరోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల కష్టాలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ పి.వెంకటరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్, మాజీ కౌన్సిలర్లు ఎస్.వి.వి.రాజేశ్వరరావు, ఆశపువేణు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దొంగల ముఠా
విజయనగరం , మే 14: వివిధ నేరాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు తెలిపారు. నిందితుల నుంచి ఒక నాటు తుపాకీ సహా 9 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎ.ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఆరు చోట్ల చోరీలకు పాల్పడిన ఖుర్ధాకు చెందిన చిక్కాల రవి, ఇక్కడి కాళ్లనాయుడు మందిరానికి చెందిన సున్నపు ఉదయకుమార్,మున్నూరు రవి, రాయఘడకు చెందిన గుడ్ల బాల, ఒక ముఠాగా ఏర్పడి పట్టణంలో బంగారు దుకాణాలు, పప్పుల మిల్లులు, బార్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలను చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు. నిందితులను సోమవారం కాళ్లనాయుడు మందిరం సమీపంలో సోమవారం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆరు కేసులకు సంబంధించి 14 తులాల బంగారు నగలకు గాను 9 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో గడ్ల బాల ఖుర్ధా, రాయఘడ ప్రాంతాల్లో 50 లక్షల రూపాయల బ్యాంకు దోపిడీ చేయడంతోపాటు వివిధ నేరాలకు పాల్పడినందుకు ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. బాల ఖుర్దాలో 2500 రూపాయలకు నాటు తుపాకీ కొనుగోలు చేసి, ఒక రౌండ్‌తో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఖుర్ధా, రాయఘడ తదితర ప్రాంతాల్లో నిందితుల నేర చరిత్రను పరిశీలిస్తామని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్న రెండవ పట్టణ ఎస్సై ఎస్.వై కృష్ణ కిశోర్‌తోపాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ కృష్ణప్రసన్న పాల్గొన్నారు.
వర్షాలతో అపరాలకు నష్టం
విజయనగరం, మే 14: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నువ్వులు, అపరాల పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యవసాయశాఖ జెడి లీలావతి చెప్పారు. మంగళవారం బొబ్బిలి, సీతానగరంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలైన మక్కువ, పాచిపెంట, గుమ్మలక్ష్మిపురం ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసాయి. ఈ వర్షాలకు 246 హెక్టార్లలో వేసిన నువ్వులు, 60 హెక్టార్లులో వేసిన చెరకు పంటలపై నష్టం చూపిందని ప్రాథమిక అంచనా వేశారు. అక్కడక్కడా అరటి పంట కూడా ధ్వంసం అయినట్లు తెలియవచ్చిందని వివరించారు. నష్టాన్ని అంచనా వేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఈ వర్షాలు పెసలు, మినుముల పంటలకు దోహదపడతాయని ఆమె తెలిపారు.
‘కళంకిత మంత్రులపై చర్యలు చేపట్టాలి’
లక్కవరపుకోట, మే 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గల కళంకిత మంత్రులను పదవుల నుండి తొలగించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ సమాజానికి ఆదర్శ ప్రాయంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకు పోవడం దౌర్భాగ్యమన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు తమ పాలనలో అవినీతి ఆరోపణలకు తావివ్వలేదన్నారు. ఏస్థాయి నాయకుడినైనా తక్షణం పదవి నుండి తొలగించేవారని గుర్తుచేశారు. హైదరాబాదుకు చెందిన కృష్ణయాదవ్‌ను పదవి నుంచి తొలగించడంతోపాటు, పార్టీ నుంచి బహిష్కరించారన్నారు.తెలుగుదేశం నాయకులు ఎన్నో ఏళ్లు పదవులలో కొనసాగినప్పుటికీ, ఆర్ధికంగా సామాన్య స్థాయిలోనే ఉన్నారని, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఎమ్మెల్యే అయి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓబుళాపురం, బయ్యారం, జగన్ అక్రమ ఆస్థులు, వంటి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆసంపదను ప్రజలకు పంచాలని డిమాండ్ చేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది మంత్రులకు ప్రభుత్వం అండగా నిలవడం, న్యాయసాయమందించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కెబి ఎం.రాంప్రసాద్, శ్రీనాధపెదబాబు, రెడ్డి వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.
రూ. 9.75 కోట్లతో పిటిజి ప్రణాళిక అమలుకు సర్వే
పార్వతీపురం, మే 14: పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లోని 25 గ్రామాల్లో పిజిటి ఏక్షన్ ప్లాన్ కింద రూ.9.75కోట్లతో వివిధ అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సర్వే నిర్వహించి నివేదికలు పంపనున్నట్టు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో పీవో చాంబర్‌లో సబ్‌ప్లాన్ పరిధిలోని ఎడీవోలు, డి ఇ ఇలు, ఎ ఇ లు తదితర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీవో మాట్లాడుతూ పిటిజి ఏక్షన్‌ప్లాన్ అమలుచేయడానికి పార్వతీపురం మండలంలోని ఒకటి, పాచిపెంట మండలంలోని మూడు, సాలూరు మండలంలోని నాలుగు, మక్కువ మండలంలోని ఒకటి, గుమ్మలక్ష్మీపురం మండలంలోని నాలుగు,కురుపాం మండలంలోని ఎనిమిది, జియ్యమ్మవలస మండలంలోని మూడు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన ఈ గ్రామాల్లో ఎక్కువగా సవర, గదబ కుటుంబాలున్నాయన్నారు. అయితే ఒక్కొక్క గ్రామానికి రూ.40లక్షల వంతున వ్యయం చేసి రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాలు తదితర అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అందువల్ల ఈమేరకు ఆయా గ్రామాల్లో ఏయే అవసరాలు గిరిజనులకు ఉన్నాయో గుర్తించి వాటికి అయ్యే అంచనావ్యయం నివేదికలు తయారు చేసి బుధవారం నాటికి అందించాలని పీవో అధికారులను ఆదేశించారు. గ్రామాల వారిగా అధికారులు టీములుగా ఏర్పడి త్వరిత గతిన నివేదికలు అందించాలన్నారు. ఈనివేదికలు గురువారం నాటికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు పంపించనున్నట్టు పీవో తెలిపారు. అయితే ఈనిధులు మంజూరు కాగానే ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పీవో అంబేద్కర్ తెలిపారు. ఈకార్యక్రమంలో సబ్‌ప్లాన్ పరిధిలోని వివిధశాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
‘ఖరీఫ్ పంట రుణాల
లక్ష్యం రూ. 140 కోట్లు’
విజయనగరం , మే 14: జిల్లాలో రైతాంగానికి ఈ ఖరీఫ్‌సీజన్‌లో 140 కోట్ల రూపాయల పంటరుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ వెల్లడించారు. ఖరీఫ్ పంటరుణాలపై మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాల ద్వారా గ్రామస్థాయిలో రైతాంగానికి ఖరీఫ్ పంటరుణాలను అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకుఆదేశాలు జారీ చేశామన్నారు. పంటరుణాల మంజూరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ఖరీఫ్‌సీజన్‌లో రికార్డుస్థాయిలో పంటరుణాలను బట్వాడా చేశామన్నారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో కూడా రైతాంగానికి సకాలంలో రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖరీఫ్‌రుణాలను సెప్టెంబర్‌నెలాఖరునాటికీ అందించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని శివశంకర ప్రసాద్ తెలిపారు. ఎరువులకు విక్రయించే సహకార సంఘాలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఒసి) కింద ఒక్కొక్క సంఘానికి అయిదు లక్షల నుంచి 20లక్షల రూపాయల వరకు బ్యాంకు గ్యారంటీ ఇస్తామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ జనరల్‌మేనేజర్లు సిహెచ్.ఉమామహేశ్వరరావు, కంది చంద్రరావు, మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘ సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తా’
బాడంగి, మే 14: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లు సక్రమంగా విధులను నిర్వహించకపోతే సస్పెండ్ చేస్తామని పిడి హెచ్చరించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర సహాయకులు, మేట్‌లు కూలీలకు సరైన అవగాహన కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు 150 రూపాయల కూలి లభ్యమయ్యేవిధంగా కొలతలను చూపడం లేదన్నారు. కూలీలకు సరైన అవగాహన లేకపోవడంతో పైపైనే మట్టిని తీయడంతో వారికి ఆశించిన స్థాయిలో కూలి లభ్యం కావడం లేదన్నారు. రెండు గ్రూపుల మస్తర్లను పరిశీలించగా హాజరుకు, పనిచేసిన కూలీలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో మేట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాన్ని నేర్చుకోవాలన్నారు. చదువురానివారిని పనుల్లోకి రానివ్వమన్నారు. 60 ఏళ్ల పైబడి వృద్దులను పనుల్లోకి రానివ్వదన్నారు.
తెర్లాంలో
తెర్లాం:మండలం నందిగాం గ్రామంలో జరుగుతున్న మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రెడ్డి శ్రీనివాసులనాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వేతనదారులతో మాట్లాడుతూ టెంట్లు, మందులను పనిచేసిన చోట విధిగా ఉన్నాయా? లేదా? అని అడిగితెలుసుకున్నారు. మూడు చోట్ల ఒకేసారి పనులు జరగడం వలన టెంట్లు చాలడం లేదని, అదనంగా మంజూరుచేయాలని వేతనదారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో పనులు చేయకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయాలని వేతనదారులకు సూచించారు.
సకాలంలో వేతనాలు అందుతున్నాయా అని అడిగితెలుసుకున్నారు. పనిలో ఉన్న వేతనదారులను మస్తర్లులో ఉన్న పేర్లను పరిశీలించగా సక్రమంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ఎపిఒ జి.రామారావు, ఇంజనీరింగ్ కన్సల్‌టెంట్ వి.జగన్మోహనరావు, టెక్నికల్ అసిస్టెంట్ రెడ్డిశంకరరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.