Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వంశధారపై సర్వే

$
0
0

శ్రీకాకుళం, మే 14: ఆంధ్రా - ఒడిశా జలవివాదం కొంత కొలిక్కివచ్చింది. నేరడి - కాట్రగడ్డ వద్ద నిర్మించనున్న బ్యారేజీ ప్రాంతంలో ఆంధ్రాలో 15 కిలోమీటర్లు ముందుకు, ఒడిశాలో 10 కిలోమీటర్లు వెనక్కి ఇరుగుపొరుగు రాష్ట్రాల ఇంజనీర్లతో సంయుక్త సర్వే నిర్వహించి, నివేదికలు పంపాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వంశధార ట్రిబ్యునల్ బృందం ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో వంశధార నదీ పరివాహక గ్రామాలతోపాటు, ఇరువైపులా బ్యారేజీ నిర్మాణం చేపట్టదలచిన ప్రాంతాలను పరిశీలించింది. తర్వాత వంశధార నదీ గమనంపై ఆంధ్రా - ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్ ఛైర్మన్ ముకుందశర్మ ఆదేశించారు. ఆ మేరకు బుధవారం నుంచి వారం రోజుల పాటు ఈ సర్వే నాలుగు బృందాలతో కేంద్ర జల సంఘం ఇంజనీర్లు ఎ.ప్రసాద్, చతపతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 1984 సంవత్సరానికి ముందు గొట్టాబ్యారేజీ నీటిమట్టం ఆధారంగా తయారు చేసిన నివేదికలు 2005లో మరల రూపొందించిన నివేదికల ఆధారంగా ఇప్పుడు వంశధార నదీ గమనంతోపాటు, ఇసుక మేటలు, వంశధార నదీ లోతు, వెడల్పు వంటి అంశాలే కాకుండా నేరడి ప్రాంతంలో నిర్మించనున్న బ్యారేజీ వల్ల ఒడిశాలో తాగు, సాగునీటి సమస్యలు కలిగేందుకు కారణాలు అనే్వషించే విధంగా కేంద్ర జల సంఘం జి.పి.ఎస్. టోటల్ స్టేషన్ అనే ప్రత్యేక యంత్రాన్ని ఢిల్లీ నుంచి రప్పించింది. దీంతో నేరడి, కాట్రగడ నుంచి షరా, బడియా వరకూ సంయుక్త సర్వే నిర్వహించి నివేదికలు ట్రిబ్యునల్‌కు అందజేస్తారు. ఈ సర్వే నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం నుంచి రెండు బృందాలు ఢిల్లీ నుంచి విచ్చేయగా, ఆంధ్రా నుంచి ఒక బృందం, ఒడిశా నుంచి మరొక బృందం పాల్గొంటాయి.

ఎచ్చెర్లకు మహర్దశ
ఎచ్చెర్ల, మే 14: జిల్లాకు ఏ ప్రాజెక్టు మంజూరైనా అధికారులకు అండగా ఎచ్చెర్లే నిలుస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా జిల్లాలోని ఇంజనీరింగ్, సాంకేతిక విద్య పూర్తిచేసిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో కేంద్ర ఐటి సహాయ శాఖామంత్రి కిల్లి కృపారాణి, ఐ.టి.హబ్‌ను ఏర్పాటు చేసేందుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై జిల్లాయంత్రాంగం ఉరుకులు,పరుగులు పెడుతూ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సర్వే నంబర్ 112లో ఐటి హబ్ నిర్మాణానికి స్థలాన్ని సేకరించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు సమాయత్తమవుతున్నట్టు వినికిడి. శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్ పర్యవేక్షణలో సర్వేను పూర్తిచేసి నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కొండ ప్రాంతంలో 50 ఎకరాల స్థలంలో 21వ శతాబ్ధపు గురుకులభవనాలు 15 కోట్లతో నిర్మించినా కొన్నాళ్ల పాటు వృథాగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాజీవ్ యువకిరణాల పేరిట ఈ భవనాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణాకార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే దీనికి ఆనుకుని వంద ఎకరాల స్థలాన్ని సేకరించి అప్పటి సి.ఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పేరిట మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలని అనమిత్ర ప్రాజెక్టును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్మాణాలు నత్తనడకన సాగడం దరఖాస్తుదారులకు ఇప్పటికీ ఇళ్లు కేటాయించకపోవడంతో స్వగృహ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం కూడా అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించలేక చేతులెత్తేసింది. దీనికి ఆనుకునే 20 ఎకరాల స్థలాన్ని ఐటి హబ్ కోసం కేటాయించినట్టు అధికారులు చర్చించుకుంటున్నారు. జిల్లాలో తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ప్రతీ ఏటా వేలాది మంది సాంకేతిక విద్యను అభ్యశించి దేశంలో వివిధ పట్టణాలకు ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ఐటి హబ్ ఏర్పాటు చేసినట్లయితే ఇంజనీరింగ్, డిప్లమో పూర్తిచేసిన కొంతమందికి ప్లేస్‌మెంట్ కల్పించేందుకు వీలుంటుందన్న సంకల్పంతో కేంద్ర మంత్రి కృపారాణి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీతోపాటు సమీపంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులతో ఇప్పటికే ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ కారిడార్‌గా ఫరిడిల్లుతోంది. ఐటిహబ్ కార్యరూపం దాల్చినట్లయితే ఉపాధి ఉద్యోగఫలాలు మరింత మెరుగవుతాయని యువత ఆశాభావం వ్యక్తంచేస్తోంది.

టిడిపి, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ
సంతకవిటి, మే 14: మండలంలోని శ్రీ హరినాయుడు పేట గ్రామంలో మంగళవారం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో టిడిపికి చెందిన టి తవిటయ్య, జి లక్ష్మునాయుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.కామయ్య, టి ఆదియ్యలకు గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పాటు భయాందోళనలు చోటుచేసుకున్నాయి. క్షతగాత్రులను స్థానికులు 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సంతకవిటి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొన్నాళ్లుగా గ్రామం రేషన్ దుకాణం బాధ్యతల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని రేషన్ డిపో డీలరు విజిలెన్స్ దాడిలో పట్టుబడటంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో మండలంలోని గోళ్ళవలస డీలరు కొన్ని నెలలు పాటు లబ్ధిదారులకు రేషన్ సరకులు పంపిణీ చేశారు. అయితే అతడిని కూడా తప్పించి, కొండగూడెం డీలరు రామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. అయితే మే నెలకు సంబంధించి సరుకులు పంపిణీ ప్రైవేటు గృహంలో సంబంధిత డీలరు అమ్మకాలు జరపడంతో టిడిపి వర్గీయులు వ్యతిరేకించారు. రామమందిరం వద్ద ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులు అడ్డుచెప్పడంతో ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ఎల్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నీలిట్ శిక్షణా తరగతులతో యువతకు సాంకేతిక పరిజ్ఞానం
శ్రీకాకుళం, మే 14: వెనుకబడిన జిల్లా అయిన సిక్కోలులోని యువతకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) శిక్షణాతరగతులను మంజూరుచేశామని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. స్థానిక విజేత హోటల్‌లో మంగళవారం నీలిట్ శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీటికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయుటకు ఏడాది కాలం పడుతుందని, అందుకే శిక్షణ తరగతులను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 800 మంది ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన యువతకు శిక్షణ లభిస్తుందని చెప్పారు. భవనాలు సమకూరితే ఏడాదికి 2,400 మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక్కో విద్యార్థికి మూడువేలు మంజూరు చేస్తామన్నారు. మిగిలిన ప్రదేశాల్లో ఇది కేవలం రెండువేలు మాత్రమేనని తెలిపారు. పది రకాల కోర్సులు ఇందులో ఉంటాయని, తాత్కాలికంగా శిక్షణ అందిస్తున్న డేటాప్రో సంస్థ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్.ఐ.ఇ.ఎల్.ఐ.టి(నీలిట్) బ్రోచర్‌ను మంత్రి విడుదల చేశారు. సభకు అధ్యక్షత వహించిన అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ మాట్లాడుతూ అత్యంత ప్రామాణికతతో కూడిన ఈ శిక్షణను చక్కగా పూర్తిచేసుకోవాలని కోరారు. నీలిట్ డైరెక్టర్ పిళ్లై మాట్లాడుతూ దేశంలో 17 కేంద్రాలను నిర్వహిస్తున్నామని, పరిశ్రమలకు అవసరమగు విజ్ఞానాన్ని అభ్యర్థులకు అందించేందుకు మంచి కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీలిట్ ఉపసంచాలకులు ఆర్.కె.ఆస్తాన, డిఆర్వో నూర్‌భాషాఖాసీం, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, పట్టణ ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ మునుకోటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు కెవిపిఎస్ జిల్లా మహాసభ
శ్రీకాకుళం, మే 14: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రెండవ జిల్లా మహాసభ ఈ నెల 15న ఉదయం పది గంటలకు ఎన్‌జిఒ హోమ్‌లో ప్రారంభమవుతుందని కె.వి.పి.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలనే లక్ష్యాలుగా 1998, అక్టోబర్ రెండవ తేదీన ఈ సంఘం ఆవిర్భవించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నోడల్ ఏజన్సీలకు కేటాయించాలని, చట్టబద్ధత కల్పించాలని చేసిన పోరాటాలు ఫలించాయన్నారు. నరసన్నపేట మండలం జమ్ములో దళిత స్ర్తిని వివస్త్ర చేసిన సంఘటన నుండి లక్ష్మీపేట ఘటన వరకు దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, ఆటో యాత్రలు నిర్వహించి సామాజిక సమస్యలు వెలుగులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర మహాసభలను 22, 23వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

అటవీ భూముల ఆక్రమణదారుల అరెస్టు
నరసన్నపేట, మే 14: నియోజకవర్గంలో పోలాకి మండల పరిధిలో అటవీ భూములను ఆక్రమణ చేసుకున్నవారిపై చర్యలు తీసుకున్నామని టెక్కలి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సి.హెచ్.శాంతిస్వరూప్ తెలిపారు. మంగళవారం అటవీ భూములపై తనిఖీలు నిర్వహించిన ఆయన పలువురు అటవీభూములను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా కోనేటి మోహనరావు, పరపతి దానయ్యరెడ్డి, పరపతి మల్లేశ్వరరెడ్డి, భద్రాచలం త్రినాధరావు, దానయ్యరెడ్డిలను అరెస్టు చేశామన్నారు. పలువురు ఆక్రమణదారులకు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. ఈ దాడుల్లో భాగంగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, అయితే వారు స్వాధీనం చేసుకున్న భూములను ఫారెస్టుకు అప్పగిస్తామని లిఖితపూర్వకంగా తెలియజేయడంతో వారిని వదిలివేశామని, మిగిలిన ఐదుగురిని అరెస్టు చేశామని స్పష్టంచేశారు. ఈ దాడుల్లో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు ఎన్.వెంకట్రావు, రామలింగేశ్వర్, తిరుపతినాయుడు, భాస్కరరెడ్డి, దుర్గాదేవి, కె.వెంకట్రావులు ఉన్నారు.

ఐస్‌బాక్సుల పంపిణీలో అన్యాయం
* గంగపుత్రుల ఆరోపణ
ఎచ్చెర్ల, మే 14: చేపలను నిల్వ చేసేందుకు ఐస్‌బాక్సుల పంపిణీలో పారదర్శకత పాటించకుండా అధికార పార్టీ సిఫార్సులకు కేటాయింపులు జరిపి లబ్ధిదారులకు అన్యాయం చేశారని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అలుపెల్లి రాంబాబు, లక్ష్మణరావు, కాకి మహందాత, సత్యం తదితరులు ఆరోపించారు. మంగళవారం వీరంతా విలేఖరులతో మాట్లాడుతూ చేపల నిల్వల నిమిత్తం ఐస్‌బాక్సులు మంజూరు చేయాలని గత ఏడాది మే 10న జిల్లా కలెక్టర్‌కు వినతి అందించగా ఫిషరీస్ అధికారులను ఆదేశించారని వివరించారు. 3,400 రూపాయలు విలువ చేసే ఐస్‌బాక్సును 50 శాతం రాయితీపై అందించేందుకు గ్రామసభ తీర్మానాన్ని కూడా అధికారుల ఆదేశాల మేరకు నివేదించారని చెప్పారు. బడ్జెట్ కొరత కారణంగా తొలుత 50 బాక్సులు, తరువాత 30 బాక్సులు, చివరకు 25 బాక్సులను సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. దీంతో లబ్ధిదారులంతా డీడీలు చెల్లించి కార్యాలయానికి అందించినప్పటికీ మత్స్యశాఖ అధికారి, కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తమకు అన్యాయం చేశారని వారంతా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

లారీని ఢీకొన్న ఆటో
* ఏడుగురికి గాయాలు* ముగ్గురి పరిస్థితి విషమం
నరసన్నపేట, మే 14: మండలంలో గుండివిల్లిపేట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం మండలం పాతృనివలస నుండి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు జలుమూరు మండలం లింగాలవలసలో జరిగే శుభకార్యానికి ఆటోలో బయలుదేరి వెళ్తుండగా ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తంగి సూరిబాబుతోపాటు పల్లి సూర్యకుమారి, కావ్య, కొయ్యాన రమణమ్మలకు గాయాలు కాగా, కర్రి శ్రీదేవి, రాజశేఖర్, పి.శ్రీదేవిల పరిస్థితి విషమించడంతో ఎన్‌హెచ్ 5 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించాగా, అక్కడి నుంచి కె.జి.హెచ్.కు తరలించారని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. శుభకార్యానికి బయలుదేరి ఇలా ప్రమాదంలో గాయపడడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆరు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు
ఎచ్చెర్ల, మే 14: జిల్లాలో వివిధ మండలాల్లో ఆరు డిగ్రీ కళాశాలల నూతనంగా ఏర్పాటుకు దరఖాస్తులు అందినట్టు అంబేద్కర్ యూనివర్శిటీ సిడిసి డీన్ జి.తులసీరావు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ దరఖాస్తుల మేరకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా కమిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిందని వివరించారు. జనవరి నెలలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేస్తూ వంగర, బూర్జ, ఆమదాలవలస, గార, పలాస, సంతబొమ్మాళి మండలాల్లో నూతనంగా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించినట్టు తెలిపారు. అయితే ఆమదాలవలస మినహా మిగిలిన మండలాల నుంచి ఆరు కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలు ఆవశ్యకత ఉందా, లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, టెక్కలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగేశ్వరరావులను ఓ కమిటీగా ఉన్నత విద్యామండలి నియమించిందన్నారు. ఈ కమిటీ రెండురోజుల పాటు ఆ ప్రాంతాలను సందర్శించి అక్కడ విద్యాపరమైన అంశాలపై కూడిన నివేదికను అంబేద్కర్ వర్శిటీకి నివేదిస్తుందని పేర్కొన్నారు. కమిటీ సూచించిన అంశాలతో కూడిన నివేదికను ఉన్నత విద్యామండలికి సమర్పించనున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వర్శిటీల వారీగా డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ జీవోను జారీ చేస్తుందని సిడిసి డీన్ వివరించారు.

మహిళలే కుటుంబానికి నాయకత్వం వహించాలి
శ్రీకాకుళం, మే 14: కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో మహిళలే సమర్ధులని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మహిళలు విభిన్న సామర్ధ్యాలు కలిగినవారని, వారు కుటుంబ నాయకత్వాన్ని చేపట్టడం వలన కుటుంబాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయన్నారు. పట్టణ ఇందిరక్రాంతి పథం ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిర్‌లో మంగళవారం వడ్డీరాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు పావలావడ్డీ ఉండేదని, కూడా తొలగించి పూర్తిగా వడ్డీలేని రుణాలను మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తీసుకున్న రుణాలను మంచి పెట్టుబడులుగా పెట్టాలని, తద్వారా మంచి ఆదాయం రావాలన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లింపులు చేసి బ్యాంకులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలు అత్యంత బలోపేతంగా ఉన్నాయని చెప్పారు. బ్యాంకుల నుండి రుణాలను పొందడంలో ముందంజలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా 20.48 లక్షల రూపాయల వడ్డీరాయితీ మొత్తాన్ని మహిళా సంఘాలకు అందించారు. పురపాలక సంఘ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ మాట్లాడుతూ 2012-13 ఆర్థిక సంవత్సరంలో 361 సంఘాలకు 11 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ లక్ష్యం కాగా 551 సంఘాలకు 14 కోట్లనుఅందించి లక్ష్యాలను అధిగమించామని చెప్పారు. వారం రోజుల కిందట వడ్డీలేని రుణాలరాయితీలుగా 51 లక్షలను మహిళా సంఘాలకు అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, మాజీ ఉపాధ్యక్షులు చల్లా అలివేలుమంగ తదితరులు ప్రసంగిస్తూ మంత్రి చేసిన కృషిని తెలిపారు. కంపోస్టుయార్డు తరలింపు, నిరంతర నీటిసరఫరా పథకం 40 కోట్లతో ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఒ గణేష్‌కుమార్, పట్టణ ఐకెపి పి.డి మునుకోటి సత్యనారాయణ, డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్ర, శిమ్మ రాజశేఖర్, టి.మోహిని తదితరులు పాల్గొన్నారు.

తుదిశ్వాస వరకు ప్రజల కోసమే జీవిస్తా
పాలకొండ, మే 14: సమస్యలు నుండి తాను పారిపోనని తుదిశ్వాశ వరకు ప్రజల కోసమే జీవిస్తానని అటవీశాఖమంత్రి శత్రుచర్ల విజయరామరాజు వెల్లడించారు. మంగళవారం స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన డివిజన్ స్థాయి రైతు చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పంటను పండించి విక్రయాలు చేస్తున్న రైతును వ్యాపారి అనరని లాభం కోసమే వ్యవసాయం చేస్తే కోటీశ్వరుడు కూడా అన్నం తినలేడని ఆయన అన్నారు. తోటపల్లి కుడి, ఎడమ కాలువలు ఆధునీకరించేందుకు మొదట రూ.90 కోట్లతో రెండవ సారి రూ. 139 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగినప్పటికీ హైపర్ కమిటీ నిర్ణయంతో పనులు నిలిచాయని వెల్లడించారు. ఈ ఏడాది తోటపల్లి పనులు ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ఈ సమస్య నుండి రైతులను రక్షించేందుకు ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులు ఎటువంటి నిరాశ చెందవలసిన అవసరం లేదని చెప్పారు.
రెండే నిముషాలు సాగిన ప్రసంగం
అప్పటికే గందరగోళంగా ఉన్న సదస్సులో ప్రసంగించేందుకు మంత్రి నిలబడేసరికి రైతుల నుండి చప్పట్లు కేరింతలు వచ్చాయి. రైతులను ఉద్దేశించి రెండే నిమిషాలు ఉద్వేగభరితంగా ఆయన చేసిన ప్రసంగం హర్షధ్వనుల మధ్య సాగింది. ఆయన ప్రసంగం కోసం వేచి ఉన్న రైతులకు మంత్రి ఇచ్చిన హామీలు తోటపల్లి ఆధునీకరణ, వడ్డీలేని బ్యాంకు రుణాల పై పర్యవేక్షణ సంతృప్తిని చ్చాయి. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని భామిని మండలంతో పాటు అన్ని మండలాల రైతులకు నీలం తుఫాను ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైందన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతావివరాలు వ్యవసాయశాఖ అధికారులకు అందజేస్తే నేరుగా బ్యాంకులో జమ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ అద్యక్షులు కోండ్రు కృష్ణమూర్తి, పాలకొండ, పాతపట్నం ఎఎంసి చైర్మన్‌లు సామంతుల దామోదరరావు, జనార్థనరావు, ఆర్డీఒ బలివాడ దయానిధి, తహశీల్దార్ జె భానోజీరావు, ఎంపిడిఒ బివిరమణ ఎడి సిహెచ్ వెంకటరావు, పాలకొండ, వీరఘట్టం ఎఒలు డి మహేష్‌నాయుడు, స్వర్ణవత తదితరులు ఉన్నారు.

‘సంచారభారతి’ సేవలు వినియోగించుకోవాలి
ఎచ్చెర్ల, మే 14: కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రయోగాత్మకంగా మూడు ప్రాంతాల్లోనే సంచార భారతి సేవలను ప్రారంభించిందని, దీనిని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఐటి సహాయ శాఖామంత్రి కిల్లి కృపారాణి సూచించారు. స్థానిక టిటిడిసిలో సంచార భారతి సేవలను ఆమె మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. మహారాష్టల్రో పూణె, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించామని వివరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన మూడు మండలాల్లో గ్రామైక్య సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 76 మందిని గుర్తించినట్టు తెలిపారు. గుర్తించిన మహిళా సంఘాల ప్రతినిధుల మొబైళ్లకు సంచార భారతి కార్యక్రమంలో సందేశాలను అందించనున్నట్లు వివరించారు. 76 గంటల ముందే వాతావరణ అంశాలు, ధరలు, మార్కెట్ స్థితిగతులు, పంటలసాగు, ఆరోగ్యం, పోషకవిలువలు, ప్రభుత్వ పథకాల వివరాలను సందేశాల్లో అందిస్తున్నామని చెప్పారు. మూడు నెలలపాటు ఈ పైలెట్ ప్రాజెక్టు సేవలను విశే్లషించి భారత ప్రభుత్వానికి నివేదిస్తామని, సత్ఫలితాలు సాధించినట్లయితే జిల్లా అంతటా విస్తరిస్తామని ఆమె వివరించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ మహిళా రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానంపై అవగాహన పెంపొందించుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించగలుగుతారన్నారు. ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయిస్తున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్‌సెల్ కన్వీనర్ కిల్లి రామ్మోహన్‌రావు, కేంద్ర మంత్రి ఒఎస్‌డి ప్రవీణ్‌ప్రకాష్, శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, మెప్మా పి.డి మునుకోటి సత్యనారాయణ, టెలికాం జాయింట్ డైరెక్టర్ కోహ్లి, డిపిఎం చింతాడ రామ్మోహన్‌రావు, తహశీల్దార్ మోహనరావు, ఎంపిడిఒ శైలజ, మాజీ జెడ్పీటిసి సనపల నారాయణరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జరుగుళ్ల శంకర్రావు, ఎస్.ఎం.పురం పిఎసిఎస్ అధ్యక్షుడు బోర సాయిరాం, మాజీ సర్పంచు ఎం.మురళీధర్‌బాబా తదితరులున్నారు.

ఆంధ్రా - ఒడిశా జలవివాదం కొంత కొలిక్కివచ్చింది
english title: 
vamsadhara

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles